కార్గిల్‌ వార్‌లో పాక్‌కి చిక్కిన పైలట్‌ నచికేత ఎలా విడుదలయ్యారంటే.. : ప్రెస్‌ రివ్యూ

నచికేత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాక్ చెర నుంచి ఫైటర్ పైలట్ నచికేత విడుదలైన తర్వాత నాటి ప్రధాని వాజపేయి, రక్షిణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను కలిశారు

పాకిస్తాన్‌కు బందీగా చిక్కిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ యోగక్షేమాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌ చేతికి మన వాయుసేన అధికారి యుద్ధ ఖైదీగా చిక్కడం ఇదే తొలిసారి కాదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ కంభంపాటి నచికేత కూడా ఇలాగే దాయాది దేశానికి చిక్కారంటూ ఈనాడు ఒక కథనంలో వెల్లడిచింది.

ఉత్కంఠ పరిస్థితుల నడుమ ఆయన పాక్‌ చెరను వీడి స్వదేశానికి తిరిగొచ్చారు. 1999 మేలో కార్గిల్‌ యుద్ధం జరుగుతున్న రోజులవి. వాయుసేన స్క్వాడ్రన్‌ నంబర్‌-9లో 26 ఏళ్ల నచికేత ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నారు. ఆ నెల 27న పాక్‌ స్థావరాలపై దాడి చేసేందుకుగాను నచికేత మిగ్‌-27 యుద్ధ విమానంలో పైకెగిరారు. 17 వేల అడుగుల ఎత్తు నుంచి శత్రువులపై భీకరంగా 80 ఎంఎం ఫిరంగుల వర్షం కురిపించారు. అయితే, దురదృష్టం వెంటాడింది. సాంకేతిక సమస్య కారణంగా విమానం ఇంజిన్‌ ఆగిపోయింది. తిరిగి ప్రారంభించేందుకు నచికేత ప్రయత్నించారు. ఫలించలేదు. అప్రమత్తమైన ఆయన.. ప్రాణాలు దక్కించుకునేందుకుగాను విమానం నుంచి బయటకు దూకారు. దురదృష్టవశాత్తూ పాక్‌ భూభాగంలో దిగారు. ఆయన్ను పాక్‌ సైనికులు చుట్టుముట్టారు.

నచికేత బెదరలేదు. లొంగలేదు. వారిపైకి కాల్పులు ప్రారంభించారు. కానీ, ఏకే-56 రైఫిళ్లతో వచ్చిన పాక్‌ సైనికులు పైచేయి సాధించారు. నచికేతను బంధించారు. బందీగా చేసుకున్న తర్వాత నచికేతను తొలి 3-4 రోజులు చిత్రహింసలకు గురిచేశారు. నాటి చిత్రహింసల కంటే మరణమే మేలని తాను భావించినట్లు ఓ ఇంటర్వ్యూలో నచికేత చెప్పారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. నచికేతతో తమ సైనికులు వ్యవహరిస్తున్న తీరు పాక్‌ సైన్యాధికారి ఒకరికి నచ్చలేదు. యుద్ధ ఖైదీని చిత్రహింసలకు గురిచేయొద్దని వారిని ఆయన వారించారు.

నచికేత విడుదల కోసం భారత్‌ ముమ్మర ప్రయత్నాలు చేసింది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పావులు కదిపింది. చర్చలు జరిపింది. నాడు ఇస్లామాబాద్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న జి.పార్థసారథి ఆ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. మరోవైపు, అంతర్జాతీయ మీడియా ఈ వ్యవహారంపై దృష్టిసారించడం, ఐరాస కూడా ఒత్తిడి చేయడంతో పాక్‌ తలొగ్గింది. 8 రోజుల కస్టడీ అనంతరం నచికేతను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. ఇప్పటికీ నచికేత భారత వాయుసేన విమానాలు నడుపుతుండటం గమనార్హమని ఈనాడు తెలిపింది.

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

‘బీర్‌ వద్దు.. లిక్కర్‌నే సరఫరా చేయండి’

ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత పెరుగుతోంది. కాస్తంతా చల్లని బీరు పట్టిద్దామనుకుంటున్నారా? అది కుదరదు. బీరు తాగకండి. కావాలంటే మద్యం తాగండి అంటూ హుకుం జారీ చేస్తోంది తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ అని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

నిజానికి దేశంలోనే బీరు ఎక్కువ వినియోగం ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడి మందుబాబులు బీరే ఎక్కువ ఇష్టపడతారు. ఎండాకాలంలో బీరు విక్రయాలు జోరుగా ఉంటాయి. కానీ ఎక్సైజ్‌ శాఖ ఈ బీరు విక్రయాలకు అడ్డుకట్ట వేస్తూ మద్యం అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది. ఇందులో మర్మం లేకపోలేదు. బీరుపై ఎక్సైజ్‌ డ్యూటీ తక్కువగా ఉండగా, మద్యంపై ఎక్కువగా ఉంది. అందుకే మద్యాన్ని విక్రయిస్తే ఖజానాకు ఎక్కువ కాసులు రాలుతాయన్నది ఆ శాఖ ఉద్దేశం. కానీ ఎక్సైజ్‌ శాఖ వింత పోకడతో వైన్‌ షాపులు, బార్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.

లైసెన్సు ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తుంటే తమపై అసమంజసమైన నిబంధనలు పెడుతూ నష్టాలకు కారణమవుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బుధవారం ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారుల నుంచి అన్ని మద్యం డిపోలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. వైన్‌ షాపులు, బార్లు, క్లబ్బులవారికి బీరు విక్రయించరాదని, కేవలం మద్యం మాత్రమే సరఫరా చేయాలన్నది ఆ ఆదేశాల సారాంశం.

దాంతో రాష్ట్రంలోని 19 డిపోల మేనేజర్లు బుధవారం ఎవరికీ బీరును సరఫరా చేయలేదు. కేవలం మద్యంను లిఫ్ట్‌ చేయాలనుకున్న వారికి మాత్రమే సరఫరా చేశారు. ఒక్క బీరు సీసా కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. అదేమని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాలంటూ డిపో మేనేజర్లు సమాధానమిచ్చారని వైన్‌ షాపుల యజమానులు చెప్పారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

wedding

ఫొటో సోర్స్, SAM PANTHAKY

ఇక గ్రామాల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్

వివాహ రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి వేచి చూడకుండా.. కార్యాలయాల చుట్టూ తిరుగకుండా వెసులుబాటు కల్పించడంతోపాటు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుల తరబడి తిరిగి, టోకెన్లు ఇచ్చి, కేటాయించిన రోజునాడే రావాలనే నిబంధనలతో ఇబ్బందులుండేవి. దీంతో విదేశాలకు వెళ్లేవారు మినహా.. మిగిలిన వారు పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్లకు ఆసక్తి చూపట్లేదు. అయితే గ్రామంలో జరిగే ప్రతి వివాహాన్ని రిజిస్టర్‌చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొనడంతోపాటు పకడ్బందీగా అమలుకు మార్గదర్శకాలు కూడా జారీచేసింది.

ఇదే విషయంలో మరోసారి మార్గదర్శకాలు జారీచేసింది. వివాహాలను రిజిస్టర్‌చేసే బాధ్యతను గ్రామ కార్యదర్శులకు అప్పగించింది. గ్రామాల్లో బాల్య వివాహాలను తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. గ్రామాల్లో జరిగే ప్రతి వివాహం నమోదు కావాలని, రికార్డుల్లో ఉండాలని నిర్ణయం తీసుకుంది.

వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు మూడు పద్ధతులను పాటించాలని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. నూతన విధానంలో వధూవరులకు వివాహ మెమొరాండం అందించి, పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదుచేయాలని సూచించారు. ఇందుకోసం ఆధార్‌కార్డు, వివాహ శుభలేఖ, పెండ్లి ఫొటోలు, గ్రామానికి చెందిన ముగ్గురు సాక్షుల సంతకాలు తీసుకుని వారికి వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. వివాహ సమయంలో పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించవచ్చు. దీనిపై పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. వివాహం తర్వాత ఒక్కరోజులోనే ధ్రువీకరణ పత్రం జారీచేయనున్నారు. మార్చి నుంచే దీన్ని అమలుచేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

గ్రామాల్లో వివాహాలకు రిజిస్ట్రేషన్ వర్తించేలా 2002లో ఉమ్మడి రాష్ట్రంలో వివాహనమోదు చట్టాన్ని తీసుకువచ్చారు. దీన్ని 2006 నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ప్రతి వివాహాన్ని నమోదుచేయాల్సి ఉంటుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్, నగర పంచాయతీలు, పురపాలక సంస్థల్లో కమిషనర్లు, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు వివాహాన్ని నమోదుచేసే అధికారాలుంటాయని చట్టంలో పేర్కొన్నారు. దీనికి జిల్లా సంక్షేమ అధికారి అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. వివాహ నమోదుకు అవకాశం కల్పించినా దీనిపై పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోయారు.

వివాహాల సీజన్లలో వందల సంఖ్యలో పెండ్లిళ్లు జరుగుతున్నా.. పదుల సంఖ్యలో కూడా వివాహాలు నమోదు కావడం లేదు. దీనిపై అప్పటి ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించాయి. కానీ ప్రస్తుతం వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వివాహాలకు చట్టబద్ధత కల్పించడంతోపాటు ప్రేమ పేరిట మోసాలు, రహస్య పెండ్లిళ్లు, రుజువు లేని రెండో వివాహాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇక నుంచి వివాహ నమోదు తప్పనిసరి చేసిందని నమస్తే తెలంగాణ వెల్లడిచింది.

దక్షిణ మధ్య రైల్వే

ఫొటో సోర్స్, ScR/FB

దక్షిణ మధ్య రైల్వేకు ఇక 3 డివిజన్లే

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రం చేసిన ప్రకటన దక్షిణ మధ్య రైల్వేపై గట్టి ప్రభావం చూపనుందని ఈనాడు తెలిపింది.

సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న ద.మ.రైల్వేలో ఇప్పటివరకు ఆరు డివిజన్లు ఉన్నాయి. విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటుతో మూడు డివిజన్లే మిగలనున్నాయి. ఆ రకంగా ఆదాయపరంగా ద.మ.రైల్వేకి భారీ దెబ్బ తగులుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో అతి పెద్ద రైల్వేజోన్లలో ఇది ముఖ్యమైనది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల్లో విస్తరించి ఉంది. ఆదాయం కూడా భారీగా వస్తోంది. ఇప్పటివరకు ఉన్న ప్రాధాన్యత జోన్‌ విభజనతో తగ్గిపోనుంది. ప్రస్తుతం జోన్‌ ఆదాయం ఏటా రూ.11 వేల కోట్ల వరకు ఉంది. విభజనతో దీనిలో రూ.5 వేల కోట్ల వరకు కోల్పోనుందని అంచనా. ఇందులో ఒక్క విజయవాడ డివిజన్‌తోనే రూ.3 వేల కోట్ల ఆదాయం కోల్పోనుంది.

జోన్లు వేరైనప్పటికీ అంతిమంగా ఆదాయం భారతీయ రైల్వేకు వెళుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. తెలంగాణలో రెండు రైల్వే డివిజన్లు ఉన్నప్పటికీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లు రాజధానిలోనే ఉన్నాయి. ఖాజీపేట కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దాదాపుగా నాందేడ్‌ డివిజన్‌ అంతా మహారాష్ట్ర పరిధిలో ఉంది. విభజన నేపథ్యంలో ద.మ.రైల్వేలో ఉద్యోగుల పంపకాలు కూడా జోన్‌, డివిజన్‌ స్థాయిలో జరగనున్నాయి. జోన్ల పరిధి, ఉద్యోగుల విభజనకు ప్రత్యేక కమిటీలు వేయనున్నట్లు సమాచారం.

దక్షిణమధ్య రైల్వే మొత్తం పరిధి ప్రస్తుతం 6228 రూట్‌ కిలోమీటర్లు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేసే కొత్త జోన్‌లో కలపనుండటం వల్ల ద.మ.రైల్వే 3,040 రూట్‌ కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను కోల్పోనుందని ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)