పాక్‌పై వైమానిక దాడులు చేసిన పైలట్లు వీరేనా: Fact Check

- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
పాకిస్తాన్ భూభాగంలో మంగళవారం భారత్ నిర్వహించిన వైమానిక దాడుల్లో పాలుపంచుకున్న భారత వాయుసేనకు చెందిన ఫైటర్ పైలట్లు వీరే అంటూ ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
ఈ ఫొటోలను వివిధ సోషల్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో వేలమంది పంచుకున్నారు, చూశారు.
బుధవారం నాడు.. రెండు ఐఏఎఫ్ జెట్లను కూల్చివేశామంటూ పాకిస్తాన్ ప్రకటించింది.
పాకిస్తాన్ భూభాగంలో ఓ విమానం పడిందని, దానిలోని పైలట్‌ను అరెస్టు చేశామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు భారత్ కూడా తమ పైలట్ ఒకరు గల్లంతయ్యారని ధ్రువీకరించింది.
ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడిలో 40కి పైగా జవాన్ల మరణించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
దీంతో, ఫైటర్ పైలట్లు అని చెబుతున్న ఈ ఫొటోలను ఎందరో భారతీయ సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.
అయితే, ఈ ఫొటోల్లో ఉన్న వ్యక్తులకు, ప్రస్తుతం జరిగిన వైమానిక దాడులకు ఎలాంటి సంబంధం లేదు.

ఈ ఫొటోలో ఉన్నది అనితా శర్మ కాదు
పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ నిర్వహించిన వైమానిక దాడుల్లో పాల్గొన్న ఏకైక మహిళా పైలట్ ఈమె అంటూ హెల్మెట్ చేత్తో పట్టుకున్న ఓ మహిళ ఫొటో విపరీతంగా షేర్ అవుతోంది. ఆమె పేరు అనితా శర్మ అని కూడా కొందరు రాస్తున్నారు.
"పాకిస్తాన్‌లోని 300మంది ఉగ్రవాదులను చంపిన ఏకైక మహిళా పైలట్ #AnitaSharma ధైర్య సాహసాలకు అభినందనలు" అంటూ ఆ పోస్టులో ఉంది.
ఈ ఆపరేషన్ ఎలా జరిగిందో సైన్యం గానీ, వైమానిక దళం గానీ ఇంతవరకూ ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్‌లలో పాల్గొన్న అధికారుల పేర్లు, ఇతర వివరాలు బయటకు వెల్లడించరు.
ఇప్పుడు షేర్ అవుతున్న ఈ ఫొటోలోని మహిళ పేరు అవని చతుర్వేది. ఈమె భారత తొలి మహిళా యుద్ధ పైలట్లలో ఒకరు. మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం, అవని ఒంటరిగా యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి మహిళా పైలట్ కూడా.

ఇలాంటిదే మరో ఫొటో
ఇలాంటి వ్యాఖ్యలతోనే షేర్ అవుతున్న మరో ఫొటోలో ఉన్న మహిళ స్క్వాడ్రన్ లీడర్ స్నేహ షెకావత్. ఈమె 2012 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఐఏఎఫ్ కంటింజెంట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా ఫైటర్ పైలట్.
కానీ, ఈ మహిళ పేరు ఊర్వశి జరీవాలా అని, ఈమె సూరత్‌లోని భూల్కా భవన్ స్కూలు విద్యార్థి అనీ సోషల్ వేదికలపై షేర్ అవుతున్న చాలా పోస్టుల్లో తప్పుగా రాస్తున్నారు.
2007లో ఎన్డీఏకు ఎంపికైన స్నేహ షెకావత్ ఉత్తమ మహిళా పైలట్‌గా హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ అవార్డును అందుకున్నారు. స్నేహ రాజస్థాన్‌లోని షెకావత్ ప్రాంతానికి చెందినవారు.

ఈ 12 మంది పైలట్లు ఎవరు?
పుల్వామా దాడికి ప్రతీకారంగా జరిగిన వైమానిక దాడుల్లో పాల్గొన్న 12మంది ఫైటర్ పైలట్లు వీరే అంటూ కొన్ని ఫొటోలు షేర్ అవుతున్నాయి. కానీ ఇవన్నీ గతంలో.. పదిరోజుల పాటు ఎక్సర్‌సైజ్ ఇంధ్రధనుష్-4, 2015 పేరుతో ది రాయల్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాల సందర్భంగా తీసినవి.
ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి.
- వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ నుంచి భారత్ ఎలా తీసుకురావచ్చు
- నన్ను పాకిస్తాన్ సైన్యం బాగా చూసుకుంటోంది: పాక్ అదుపులో ఉన్న పైలట్
- కార్గిల్‌కు ముందు... ఆ తరువాత కశ్మీర్లో భారత్-పాక్‌ల దాడుల చరిత్ర
- క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- BBC Special: విశాఖ రైల్వే జోన్ వస్తుందా, రాదా? వస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








