యుక్రెయిన్‌లో దొంగిలిస్తున్న ఆహార ధాన్యాలను రష్యా ఎక్కడికి తీసుకెళ్తోంది?

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Planet

    • రచయిత, నిక్ బీక్, మారియా కొరెన్యుక్
    • హోదా, రియాలిటీ చెక్

యుక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా పెద్దయెత్తున ఆహార ధాన్యాలను దొంగతనం చేస్తున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది. పొద్దుతిరుగుడు గింజలతోపాటు ఎరువులు, వ్యవసాయ పరికరాలను కూడా దొంగచాటుగా తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఆక్రమిత ప్రాంతాల్లోని రైతులతో బీబీసీ మాట్లాడింది. ఉపగ్రహ చిత్రాలను కూడా పరిశీలించింది. దొంగచాటుగా తరలిస్తున్న ఆహార ధాన్యాలను ఎక్కడికి తీసుకెళుతున్నారన్నదానిపై ఆధారాలను కూడా సేకరించింది.

రష్యాకు సరిహద్దుల నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి యుక్రెయిన్ భూభాగంలోకి వెళ్తే అక్కడ దిమిత్రో(అసలు పేరు మార్చాం) పొలం కనిపిస్తుంది. తాను 25ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న వ్యాపారం రష్యా దాడి వల్ల ఎలా నాశనమైందో దిమిత్రో వివరించారు.

దిమిత్రో పొలాలకు చుట్టుపక్కల ఉండే 200 మందికిపైగా రైతులతో బీబీసీ మాట్లాడింది. రష్యా ప్రస్తుతం ఆక్రమించిన భూభాగంలో వీళ్లంతా గతంలో వ్యసాయం చేసేవారు.

‘‘వారు మా ఆహార ధాన్యాలను దోచుకున్నారు. మా ఇళ్లు, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేశారు’’అని దిమిత్రో అన్నారు.

వేల ఎకరాల్లోని తమ పంట భూముల్లో 80 శాతం ఇప్పుడు రష్యా చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. భారీ స్థాయిలో వాటి నుంచి ఆహార ధాన్యాలను దొంగతనం చేస్తున్నారని వివరించారు.

యుక్రెయిన్

ఆయన కంపెనీకి చెందిన ఒక పరిశ్రమలో సీసీటీవీ ఫుటేజీలో రష్యా బలగాలు వస్తున్నట్లు కనిపించాయి. దిమిత్రో ఇంటిని గుర్తుపట్టకుండా ఆ దృశ్యాలను మేం బ్లర్ చేశాం.

ఆ ఫుటేజీ చివర్లో కెమెరాను ఒక రష్యా సైనికుడు షూట్ చేస్తున్నట్లు కనిపించింది. అయితే, ఆ బులెట్.. కెమెరాకు తగల్లేదు.

ఈ ఫుటేజీ ఆధారంగా వారు ఎక్కడికి వెళ్తున్నారో మేం విశ్లేషించాం. దీంతో ఈ ఆహార ధాన్యాలను మొదట రష్యా ఆక్రమిత క్రైమియా భూభాగానికి తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి రష్యాకు పంపిస్తున్నారు.

జీపీఎస్ డేటాను పరిశీలిస్తే, ఈ ట్రక్కులన్నీ క్రైమియాలో ఒక్టియాబ్రిస్క్ నగరం దిశగా వెళ్తున్నట్లు తేలింది.

జూన్ 14న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఇక్కడి రోడ్డుపై వరుసగా ట్రక్కులు కనిపిస్తున్నాయి.

ఈ సమీపంలోనే ఆహార ధాన్యాలను నిల్వచేసే సదుపాయాలు ఉన్నాయి. ఆ పక్కనే రైలు మార్గం కూడా ఉంది. ఇక్కడి నుంచి రష్యాకు లేదా దక్షిణ క్రైమియాలోని ఇతర ప్రాంతాలకు ఆహార ధాన్యాలను తరలిస్తూ ఉండొచ్చు.

యుక్రెయిన్

సరిహద్దుల్లో వరుసగా..

ఒక్కో ట్రక్కు ఎక్కడికి వెళ్తోందో గుర్తుపట్టడం చాలా కష్టం. అయితే, చాలా వరకు ఈ ట్రక్కులు మొదటా క్రైమియాకు వెళ్తున్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఛోన్హర్, అర్మియాన్సెక్‌ ప్రాంతాల్లో ఈ ట్రక్కులు వరుసగా ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. జూన్ 17న అయితే, ఛోన్హర్‌లో దాదాపు 5 కి.మీ. పొడవున ఈ ట్రక్కులు కనిపించాయి.

క్రైమియాలో ఇంత భారీ స్థాయిలో రోడ్డుపై ట్రాఫిక్ కనిపించడం అసాధారణం. ఎందుకంటే రష్యా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత యుక్రెయిన్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఇక్కడి నుంచే వేరే ప్రాంతాలకు రష్యా ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తోంది.

ఈ ట్రక్కుల్లో కొన్ని ఖాళీగా ఉన్నవి కూడా ఉండొచ్చు. బహుశా యుక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న, పోరాడుతున్న సైనికులకు ఇవి ఆహార సరఫరాలు కూడా తీసుకెళ్తూ ఉండొచ్చు. అయితే, చాలా ట్రక్కుల్లో మాత్రం యుక్రెయిన్ రైతుల నుంచి దొంగిలించిన ఆహార ధాన్యాలను తరలిస్తున్నారు.

క్రైమియాలోని ఝన్‌కోయి పట్టణంలో ఓ గోడౌన్ లోపలకు వెళ్లేందుకు పెద్దయెత్తున ట్రక్కులు వరుసలో నిలబడినట్లు ఓ ఉపగ్రహ చిత్రంలో కనిపిస్తోంది. ఈ గోడౌన్‌ పరిసరాల్లోని ఓ రైల్వే స్టేషన్‌తో అనుసంధానమై ఉంది.

మరోవైపు ఆహార ధాన్యాలను తరలించేందుకు ఉపయోగించే పెట్టెలను తీసుకెళ్తున్న రైళ్లు కూడా పరిసరాల్లో కనిపిస్తున్నాయి.

ఝన్‌కోయి నుంచి సెవాస్టోపోల్, కెర్చ్ లాంటి నౌకాశ్రయాలకు ఈ రైలు మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. అక్కడి నుంచి రష్యా లేదా ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గంలో ఆహార ధాన్యాలను తరలించొచ్చు.

యుక్రెయిన్

క్రైమియా నుంచి ఎక్కడికి?

‘‘మొదట ఆహార ధాన్యాలను వారు క్రైమియాకు తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి కెర్చ్ లేదా సెవాస్టోపోల్ నౌకాశ్రయాలకు తరలిస్తున్నారు. అక్కడ రష్యా నౌకల్లోకి ఈ ఆహార ధాన్యాలను ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి కెర్చ్ జల సంధి గుండా ఈ నౌకలు వెళ్తున్నాయి’’అని కీయెవ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్లాక్ సీ స్ట్రాటజిక్ స్టడీస్‌కు చెందిన నిపుణుడు ఆండ్రేయి క్లిమెంకో చెప్పారు. క్రైమియా చుట్టుపక్కల ప్రాంతాల్లో నౌకల కదలికలను ఆయన తరచూ పర్యవేక్షిస్తుంటారు.

‘‘కెర్చ్ జలసంధి పరిసరాల్లో యుక్రెయిన్ ఆహార ధాన్యాలను చిన్నచిన్న పడవల్లోకి ఎక్కిస్తున్నారు. ఆ తర్వాత రష్యా నుంచి వచ్చే ఆహార ధాన్యాల్లో వాటిని కలిపేస్తున్నారు. దీంతో ఇవి మొత్తంగా రష్యా నుంచి వచ్చినట్లే చూపిస్తున్నారు’’అని ఆయన అన్నారు.

చివరగా ఈ ఆహార ధాన్యాలకు రష్యన్ సర్టిఫికేట్లు తయారుచేస్తున్నారు. దీంతో ఇవి రష్యా ఆహార ధాన్యాలని ప్రజలు నమ్మేలా చేస్తున్నారు.

ఇక్కడి నుంచి నౌకలు తరచూ సిరియా లేదా టర్కీలకు వెళ్తున్నాయి.

యుక్రెయిన్ ఆహార ధాన్యాలను దొంగచాటుగా తమ దేశానికి ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలపై తాము విచారణ చేపడుతున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి మేవ్లట్ చెవుసోగ్లు చెప్పారు. అయితే, ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఆయన అన్నారు.

‘‘మేం ఈ నౌకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడకు వెళ్తున్నాయి? లాంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

యుక్రెయిన్

సెవాస్టోపోల్‌లో భారీగా

పశ్చిమ క్రైమియా సెవాస్టోపోల్‌లోని అవ్లిటా టెర్మినల్‌లో చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. ఇక్కడ పసుపు రంగులో కనిపిస్తున్న ఆహార ధాన్యాలను నౌకల్లోకి ఎక్కిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఇక్కడి పరిసరాలో జరుగుతున్న కార్యకలాపాలను తాము పరిశీలిస్తున్నాని, ఇవి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఎందుకంటే క్రైమియాలో ఇంత స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉండదు’’అని కీయెవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన వ్యవసాయ నిపుణురాలు మారియా బోగోనోస్ చెప్పారు.

మరోవైపు రష్యా తమ సొంత వ్యవసాయ ఎగుమతులను సెవాస్టోపోల్‌ నౌకాశ్రయం గుండా ఎగుమతి చేసే అవకాశమూ ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని ఆమె అన్నారు.

‘‘యుద్ధం వల్ల యుక్రెయిన్‌లో చాలా వ్యవసాయ దిగుబడి అలానే ఉండిపోయింది. దీన్ని ప్రస్తుతం రష్యా తరలిస్తూ ఉండొచ్చు’’అని యుక్రెయిన్, రష్యాలలో పనిచేసిన గ్రీన్ స్క్వేర్ ఆగ్రో వ్యవసాయ నిపుణుడు మైక్ లీ చెప్పారు. ‘‘క్రైమియా.. రష్యా ఆధీనంలో ఉంది. అయితే, ఇక్కడి ఆహార సరఫరా ఎప్పుడో అస్తవ్యవస్తమైంది. ఇన్ని ట్రక్కుల్లో తీసుకెళ్లే దిగుబడి ఇక్కడ లేదు’’అని ఆయన అన్నారు.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ట్రాక్ చేస్తే..

క్రైమియా నుంచి వస్తున్న తొమ్మిది నౌకలను అమెరికా, యుక్రెయిన్ అధికారులు ట్రాక్ చేశారు. ఇలా ట్రాక్ చేసిన లియోడ్ సంస్థ డేటాను బీబీసీ పరిశీలించింది. దీంతో ఈ నౌకలు ఏప్రిల్ నెలలో క్రైమియా నుంచి టర్కీ, సిరియాలకు వెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది.

అయితే, నల్ల సముద్రంలోకి ప్రవేశించిన వెంటనే ఈ నౌకల్లో ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేస్తున్నట్లు లియోడ్ నిపుణులు వెల్లడించారు.

మళ్లీ ట్రాక్ వ్యవస్థలు ఆన్‌ చేసేటప్పటికి వారే ప్రాంతాల్లో ఈ నౌకలు కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్‌అవుట్‌లో వీటిలో ఆహార ధాన్యాలను నింపేస్తూ ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మాట్రోస్ పోజినిచ్, సోర్మోవ్‌స్కీ48, ఫినికియా అనే రెండు నౌకల ప్రయాణాన్ని బీబీసీ పరిశీలించింది. వీటిపై ఈ నౌకల రష్యా యజమానులతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

ట్రాక్ వ్యవస్థలు ఆఫ్ చేసినప్పటికీ, ఈ నౌకలు ఎక్కడికి వెళ్తున్నాయో, ఏం చేస్తున్నాయో ఉపగ్రహాల సాయంతో తెలుసుకోవచ్చు.

వీడియో క్యాప్షన్, తూర్పు యుక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతంపైన మరింత పట్టు బిగించిన రష్యా

మాక్సర్ సంస్థ నుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాలను మేం పరిశీలించాం. దీంతో మే నెలలో క్రైమియాలోని సెవాస్టోపోల్‌లో మాట్రోస్ పోజినిచ్ నౌక కనిపించింది. అక్కడి నుంచి కెర్చ్ జల సంధి గుండా ఈ నౌక వెళ్లింది. తర్వాత ఐదు రోజులపాటు బ్లాక్‌అవుట్ అయింది. ఆ తర్వాత దక్షిణ నల్ల సముద్రంలో ఈ నౌక మళ్లీ కనిపించింది. చివరగా సిరియా నౌకాశ్రయం లటకియాలో ఇది కనిపించింది.

ఐక్యరాజ్యసమితి సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ (ఎస్‌వోఎల్ఏఎస్) నిబంధనల ప్రకారం.. నౌకలు ఎప్పుడూ తమ ట్రాక్ వ్యవస్థలను ఆన్‌లోనే ఉంచాలి. పైరసీ లేదా ప్రాణాలకు ముప్పు లాంటి సందర్భాల్లో మాత్రం వీటిని ఆఫ్ చేయొచ్చు.

అయితే, క్రైమియా లేదా సిరియా తీరాల్లో ట్రాక్ వ్యవస్థలను ఎందుకు ఆఫ్ చేస్తున్నారో తేలిగ్గానే అంచనా వేయొచ్చని లియోడ్ మార్కెట్ ఎడిటర్ మైఖెల్ వీస్ బోక్‌మన్ అన్నారు.

‘‘దీని వెనుక పైరసీ ముప్పు లేదని కచ్చితంగా చెప్పొచ్చు. మరి ఎందుకు ట్రాకింగ్ వ్యవస్థలను ఆఫ్ చేస్తున్నారు?’’అని ఆయన ప్రశ్నించారు.

రష్యా వ్యూహాలు..

ఆక్రమిత ప్రాంతాల్లోని ఆహార ధాన్యాలను ఎలా తీసుకుంటున్నారో వివరించే పత్రాలనూ బీబీసీ పరిశీలించింది.

కొన్నిసార్లు మార్కెట్ ధరల కంటే అతి తక్కువకే ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేలా యుక్రెయిన్ రైతులపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు బీబీసీ రష్యా, బీబీసీ యుక్రెయిన్ పరిశీలనలో తేలింది.

మొదట్లో పూర్తిగా దొంగతనం చేసినప్పటికీ, తర్వాత కొంత మొత్తాన్ని చెల్లించి ఆహార ధాన్యాలను తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది. ఎందుకంటే అసలు చెల్లించకపోతే తర్వాత పంట చేతికిరాదని వారు భావిస్తున్నారు. మరోవైపు యుక్రెయిన్ రైతులకు కూడా ప్రత్యామ్నాయం దొరకడం లేదు.

ఆక్రమిత ప్రాంతాల్లో రష్యా చర్యలు జెనీవా కన్వెన్షన్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఇంటర్నేషనల్ లా బారిస్టర్ ఎమిలీ పొట్లీ అన్నారు.

ఈ ఆరోపణలపై స్పందించాలని రష్యా అధికారులను మేం సంప్రదించాం. కానీ, వార్త రాసే సమయానికి మాకు ఎలాంటి స్పందనా రాలేదు. అయితే, యుక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో పనిచేస్తున్న రష్యా అధికారులు మాత్రం ఆహార ధాన్యాలను తరలిస్తున్నామని అంగీకరిస్తున్నారు.

(ఈ కథనానికి హన్నా సీబా, సీరా థీరిజ్, హన్నా కోర్నస్, డేనియెల్ పాలుంబో, జోష్ చీథమ్, జేక్ హార్టన్, ఏర్వన్ రివాల్ట్, ఆండ్రేయి జఖారోవ్ సాయం అందించారు.)

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు బ్రిటన్ సైనికుల మృతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)