Atmakur: ఉప ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చిన సానుభూతి - డిపాజిట్ కోల్పోయిన బీజేపీ

ఫొటో సోర్స్, YSRCP
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే జనాదరణ దక్కింది. ఆ పార్టీ తరుపున బరిలో దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
ఈ అసెంబ్లీ స్థానంలో వైసీపీకి హ్యాట్రిక్ విజయం దక్కింది. 2019 సాధారణ ఎన్నికల కన్నా నాలుగు రెట్లు అధికంగా వైసీపీ అభ్యర్థికి మెజార్టీ దక్కింది.
20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత వైసీపీ అభ్యర్థికి 1,02,074 ఓట్లు లభించాయి. బీజేపీకి 19,332 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
మూడో స్థానంలో బీఎస్పీ నిలిచింది. ఆపార్టీకి 4,897 ఓట్లు వచ్చాయి. నోటాకి 4,197 ఓట్లు రావడం విశేషం.
వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి 82,742 భారీ తేడాతో విజయం దక్కించుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
ఆత్మకూరు నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఉప ఎన్నికలు జరిగాయి.
2019లో గెలిచిన తర్వాత ఆయన ఏపీ ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన అనూహ్యంగా మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగారు.
మృతుడి కుటుంబీకులు బరిలో దిగడంతో సంప్రదాయం పేరుతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉంది.
బీజేపీ , బీఎస్పీతో పాటుగా 11 మంది ఇండిపెండెంట్లు రంగంలో దిగారు. ఈ నెల 23న పోలింగ్ జరిగింది. 64.14 శాతం పోలింగ్ జరిగింది. 1,37,038 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో లక్షకి పైగా ఓట్లు వైసీపీకి దక్కాయి. 80 శాతం ఓటర్లు అధికార పార్టీకి ఓటు వేశారు.
మేకపాటి కుటుంబం పట్ల సానుభూతి అంశం బాగా కలిసి వచ్చిందని రాజకీయ పరిశీలకుడు తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు.
సహజంగా ఉప ఎన్నికల్లో లభించే ఫలితాలు ఇదే రీతిలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బద్వేలు అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికల్లోనూ ఇదే రీతిలో భారీ విజయాలు దక్కించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
2019 ఎన్నికల్లో ఆత్మకూరులో పోల్ అయిన 1,74 ,509 ఓట్లలో మేకపాటి గౌతమ్ రెడ్డి కి 92 ,758 ఓట్లు (53 శాతం ) రాగా... ఇప్పుడు ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో పోల్ అయిన 1,37,081 ఓట్లలో మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు (75 శాతం ) వచ్చాయి. గతం కంటే 22 శాతం ఓట్లు పెరిగాయి
గతంలో సీఎం ప్రాతినిధ్యం వహించారు..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఈ ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. రాజకీయంగా ఇది కీలక స్థానం.
అనేకమంది ఉద్దండులైన నేతలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాలరెడ్డి ఇక్కడి నుంచే గెలిచారు.
ఆ తర్వాత ఆయన గవర్నర్ గానూ పనిచేశారు. ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు 9 సార్లు, టీడీపీ తరుపున రెండు ఎన్నికల్లోనూ అభ్యర్థులు గెలిచారు.
వైసీపీకి ప్రస్తుత విజయంతో కలిపి మూడు ఎన్నికల్లో విజయం దక్కగా మేకపాటి అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించినట్టయింది.

ఫొటో సోర్స్, Mekapati gautam reddy
మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆదరణ
వరుసగా 2014,19 ఎన్నికల్లో బరిలో దిగిన రెండు సార్లు గౌతమ్ రెడ్డికి ఆత్మకూరులో ఆదరణ దక్కింది.
అంతకుముందు తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పటికీ గౌతమ్ రెడ్డి మాత్రం వ్యాపార వ్యవహారాలకే పరిమితమయ్యారు.
కానీ వైసీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసి రెండు సార్లు గెలవడమే కాకుండా జగన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా 2019 తర్వాత క్యాబినెట్ లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు.
వివాదాలకు దూరంగా ఉంటూ తన శాఖ వ్యవహారాల్లో ఆయన చురుగ్గా వ్యవహరించారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యుల్లో ఎవరు బరిలో ఉంటారనే చర్చ సాగినప్పటికీ చివరకు సోదరుడు విక్రమ్ రెడ్డి తెరమీదకు వచ్చారు.
విక్రమ్ రెడ్డి గతంలో రాజకీయంగా ప్రత్యక్షంగా కనిపించలేదు. అన్న మరణంతో తొలిసారిగా తెరమీదకు వచ్చి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
మేకపాటి కుటుంబం నుంచి వారసుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

ఫొటో సోర్స్, facebook
విక్రమ్ రెడ్డి నేపథ్యం ఇదే..
మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి దంపతులకు నెల్లూరు జిల్లా మర్పిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించిన విక్రమ్ రెడ్డి నిర్మాణ రంగంలో పట్టభద్రుడు.
ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ చెన్నైలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత అమెరికాలో స్పెషలైజ్డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్ కూడా పూర్తి చేశారు.
తమ సొంత సంస్థ అయిన 'కేఎంసీ'కి చాలాకాలంగా మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గౌతమ్ రెడ్డి రాజకీయ వారసత్వంతో ఇటీవల రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన తొలి ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకున్నారు.
తనను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
"నన్ను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు. మేకపాటి కుటుంబానికి వెన్నంటి నిలిచి వారందరికీ రుణపడి ఉంటాను. గౌతమ్ రెడ్డి అడుగుజాడల్లో ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తాను. ఆయన పేరుని నిలబెడతాను" అంటూ తన విజయం తర్వాత అభిమానులతో అన్నారు.
బీజేపీకి మళ్లీ దక్కలేదు..
ఏపీలో వరుసగా మూడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి పరాభవం తప్పలేదు. బద్వేలు, తిరుపతి ఉప ఎన్నికల తరహాలోనే ఆత్మకూరులో కూడా ఆపార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు.
ఆత్మకూరులో ఆపార్టీ తరుపున భరత్ కుమార్ యాదవ్ బరిలో దిగారు. ఆత్మకూరులో రెడ్డి, కమ్మ కులస్తుల తర్వాత యాదువల ప్రభావం ఉంటుంది.
దాంతో బీసీ కులం కార్డు ఉపయోగపడుతుందని బీజేపీ ఆశించింది. అయితే ఓటర్లు మాత్రం భిన్నంగా ఆలోచించారు. బీజేపీ డిపాజిట్ మార్క్ కి చేరువ కాలేకపోయింది.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకపోవడంతో బద్వేలు మాదిరిగా కొంత టీడీపీ ఓటింగ్ బీజేపీకి మళ్లుతుందని ఆశించారు. కానీ ఆశించిన స్థాయిలో అది జరగలేదని ఫలితాలు చెబుతున్నాయి.
బీఎస్పీ అభ్యర్థికి కూడా టీడీపీ సానుభూతిపరులు ఓట్లు వేసినట్టుగా నెల్లూరు కి చెందిన జర్నలిస్ట్ దేవానంద్ అభిప్రాయపడ్డారు.
"బీఎస్పీ తరుపున బరిలో ఉన్న అభ్యర్థి ఓబులేసుకి టీడీపీ ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. దాంతో సహజంగానే వైసీపీ వ్యతిరేక ఓటర్లు కొందరు బీజేపీకి ఓటు వేయగా, బీఎస్పీకి కూడా కొన్ని ఓట్లు పడ్డట్టుగా కనిపిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










