శ్రీలంకలో ఎమర్జెన్సీ... ప్రజల భద్రత కోసమేనన్న అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష

శ్రీలంక రాజధాని కొలంబోలో శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంక రాజధాని కొలంబోలో శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనలు
    • రచయిత, అయేషియా పెరీరా
    • హోదా, బీబీసీ న్యూస్

శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష శుక్రవారం అర్థరాత్రి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారు.

అధ్యక్ష భవనం ఎదుట గురువారం రాత్రి నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ మరునాడే ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే, శ్రీలంక ప్రభుత్వం పశ్చిమ రాష్ట్రంలో ఆరు గంటల కర్ఫ్యూ విధించింది. "అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది" అని పోలీసు శాఖ ప్రతినిధి ప్రకటించారని డెయిలీ మిర్రర్ వెల్లడించింది.

శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది. విదేశీ మారక ద్రవ్యం కొరతతో చమురు దిగుమతులకు చెల్లింపులు జరపలేని పరిస్థితుల మధ్య జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.

దీంతో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కొందరు నిరసనకారులు గురువారం రాత్రి అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు.

శ్రీలంకలో ప్రజాగ్రహం

ఫొటో సోర్స్, EPA

అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు

శ్రీలంక అధ్యక్ష భవనం బయట గురువారం రాత్రి ప్రజల నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు.

బారికేడ్లను తోసుకుంటూ వచ్చిన ఆందోళనకారుల సమూహం, గురువారం రాత్రి ఒక బస్సును తగులబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.

అధ్యక్షుడు గొటాబయ రాజపక్స, ఈ సంఘటనలను ''ఉగ్రవాద చర్యలు'' అని నిందించారు.

శ్రీలంకలో విదేశీ మారక సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.

అక్కడి ప్రజలు ఏకబిగిన 13 గంటల పాటు విద్యుత్ కోతను ఎదుర్కొన్నారు. చమురు, కనీస అవసరాలైన ఆహారం, మందులు కొరత కారణంగా ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తారా స్థాయికి చేరింది.

అధ్యక్ష భవనం ఎదుట నిరసన కార్యక్రమాలు శాంతియుతంగానే మొదలయ్యాయి. కానీ, పోలీసులు వాటర్ కేనన్స్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో పాటు అక్కడున్న వారిని కొట్టారని నిరసనల్లో పాల్గొన్న వారు చెప్పారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం రాజపక్స పాపులారిటీలో వచ్చిన మార్పుకు ఈ నిదర్శనలు సంకేతం. దేశ పాలనలో స్థిరత్వం తెస్తానంటూ వాగ్దానాలు చేసిన రాజపక్స 2019లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు.

శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్స, ప్రధానమంత్రి మహిందా రాజపక్స

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష , ప్రధానమంత్రి మహిందా రాజపక్ష

శ్రీలంక ప్రస్తుత గడ్డు పరిస్థితికి ప్రధానమైన కారణాల్లో ఒకటిగా ప్రభుత్వంలోని అవినీతి, బంధుప్రీతిని విమర్శకులు ఎత్తి చూపిస్తున్నారు. రాజపక్ష మంత్రివర్గంలోని అనేక కీలక శాఖలు ఆయన సోదరులు, మేనల్లుడు వద్ద ఉన్నాయి.

అధ్యక్షునితో పాటు మంత్రులు విద్యుత్ కోతల నుంచి తప్పించుకోవడం, ఆయన కుటుంబ సభ్యులు సంపదను ప్రదర్శించుకోవడం మూలంగానే ప్రజల్లో కోపం పెరిగిపోయిందని వార్తా నివేదికలు తెలుపుతున్నాయి.

పర్యటక రంగంపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావమే ప్రస్తుత సంక్షోభానికి కారణమంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 2019లో ఈస్టర్ సండే సందర్భంగా చర్చిలపై వరుస దాడులతో విదేశీ పర్యటకుల రాక బాగా తగ్గిపోయిందని పేర్కొంటోంది. ద్వీప దేశమైన శ్రీలంకలో విదేశీ ఆదాయానికి ప్రధాన వనరు పర్యటకమే.

శ్రీలంకలో ప్రజాగ్రహం

ఫొటో సోర్స్, Reuters

అయితే, ఈ సంక్షోభం ఏర్పడి చాలా కాలం అయిందని నిపుణులు అంటున్నారు.

''గత 20 ఏళ్లలో జరిగిన పర్యవసానాల ఫలితమే ఈ తాజా సంక్షోభం. అయితే, ఎప్పటిలాగే దీనికి బాధ్యత వహించేవారే లేరు. వాస్తవానికి 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంక్షోభాన్ని ఉద్దేశపూర్వకంగానే అలక్ష్యం చేసిన ప్రస్తుత ప్రభుతమే దీనికి నేరుగా బాధ్యత వహించాలి'' అని బీబీసీతో రాజకీయ శాస్త్రవేత్త, వ్యాఖ్యాత జయదేవ ఉయాంగోడ అన్నారు.

శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ మాజీ గవర్నర్ డబ్ల్యూఏ విజేవర్ధన ప్రస్తుత పరిస్థితి గురించి బీబీసీతో మాట్లాడారు.

''2009లో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత గ్లోబల్ ఎకానమీతో కలవకుండా శ్రీలంక పొరపాటు చేసింది. అప్పుడు శ్రీలంక ఎకానమీ దాదాపు 9 శాతం వృద్ధిని నమోదు చేసింది.''

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఏం జరిగింది?

''2000 ఏడాదిలో జీడీపీలో 33 శాతంగా ఉన్న ఎగుమతులు, ప్రస్తుతం 12 శాతానికి పడిపోయాయి. అదే స్థాయిలో కొనసాగుతున్నాయి'' అని ఆయన చెప్పారు.

శ్రీలంక రూపాయి విలువ తగ్గించడానికి ప్రభుత్వం నిరాకరించడం కూడా దేశంలో విదేశీ నిల్వలు తగ్గడానికి కారణమైంది.

2019 చివరి నాటికి 7.6 బిలియన్ డాలర్లు (రూ. 57,787 కోట్లు)గా ఉన్న శ్రీలంక విదేశీ నిల్వలు ఇప్పుడు 2.3 బిలియన్ డాలర్ల (రూ. 17,488 కోట్లు)కు పడిపోయాయి. వీటిలో వినియోగానికి అవసరమయ్యేవి 300 మిలియన్ డాలర్ల (రూ. 2,281 కోట్లు)కు పడిపోయాయి.

పరిస్థితులు కుదుటపడే కంటే ముందు మరింత దుర్భరంగా మారతాయని విజేవర్ధన భావిస్తున్నారు. అత్యధికంగా దిగుమతులపై ఆధారపడే దేశమైన శ్రీలంకలో స్థిరమైన విదేశీ మారక ప్రవాహం లేనందున పరిస్థితులు దిగజారతాయని ఆయన వివరించారు.

అత్యవసర వస్తువులైన చమురు, విద్యుత్ వంటి వాటిని కొనడానికి కూడా శ్రీలంక వద్ద సరిపడినన్ని డాలర్లు లేవు.

గురువారం నాటి నిరసనల్లో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్లపై మంటలు వేశారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గురువారం నాటి నిరసనల్లో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్లపై మంటలు వేశారు

దీని ఫలితంగానే దేశంలోని విద్యుత్ బోర్డులు కోతలు విధిస్తున్నాయి. రాన్రాను ఈ కోతల సమయం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే గురువారం అక్కడ 13 గంటల పాటు విద్యుత్ కోతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఇది 16 గంటలకు పెరిగే అవకాశం ఉంది.

విద్యుత్ కోతల కారణంగా లక్షలాది మంది ప్రజల దైనందిన వ్యవహారాలు, వ్యాపారాలు, చదువు ప్రభావితం అయ్యాయి.

పెట్రోల్ బంకుల బయట, వంటగ్యాసు సిలిండర్ల కోసం గంటల పాటు ఎండలో ప్రజలు క్యూలల్లో బారులు తీరుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

గత కొన్ని వారాల్లో క్యూలోనే కుప్పకూలిపోయి పెద్ద వయస్కులైన అయిదుగురు వ్యక్తులు మరణించారు.

దేశ వ్యాప్తంగా ఆహార పదార్థాల కొరత, అత్యవసర మందుల కొరత ఏర్పడింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: 'గ్యాస్ లేదు, కరెంటు లేదు... బిడ్డకు పాలు కూడా కొనే పరిస్థితి లేదు'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)