శ్రీలంకలో బంగాళాదుంప కిలో రూ. 200 ఎందుకు... దేశం దివాలా తీయడం అంటే ఏంటి, భారత్‌కు కూడా ఆ పరిస్థితి వచ్చిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లాటిన్ అమెరికా దేశం అర్జెంటీనా 2000 నుంచి 2020 మధ్య కాలంలో రెండుసార్లు రుణాల వాయిదాలు చెల్లించడంలో విఫలమైంది. అలాగే, 1998లో రష్యా, 2001లో ఈక్వెడార్, 2003లో ఉరుగ్వే, 2005లో డొమినికన్ రిపబ్లిక్, 2012లో గ్రీస్ దేశాలు కూడా డీఫాల్టర్లు అయ్యాయి.
ఇప్పుడు శ్రీలంక కూడా డీఫాల్టర్‌గా మారుతుందేమోనని భయాలు ఏర్పడ్డాయి. మరోవైపు పాకిస్తాన్‌పై ఏర్పడ్డ సంక్షోభ మేఘాలు అలాగే ఉన్నాయి.
ఒక వ్యక్తి, బిల్లు చెల్లింపులు ఆపేసినప్పుడు ఏం జరుగుతుంది? అవతలివైపు నుంచి ఫోన్ కాల్స్‌లో వేధింపులు, బెదిరింపు ఉత్తర్వులు పంపడం జరుగుతుంది. అంతేకాకుండా, ఆ వ్యక్తికున్న ఇతర ఆస్తులు జప్తు చేసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. చివరకు దివాలాతో ఈ తంతు ముగుస్తుంది. సకాలంలో రుణాలు చెల్లించని వ్యక్తులను డీఫాల్టర్లుగా పిలుస్తారు.
దేశాల విషయంలోనూ ఇలాగే జరుగుతుందా?
అమెరికా మీడియా సంస్థ ఎన్‌పీఆర్‌కు చెందిన 'ఆల్ థింగ్స్ కన్సిడర్డ్' అనే కార్యక్రమ వ్యాఖ్యాత రాబర్ట్ స్మిత్‌తో అమెరికా ఆర్థికవేత్త కెనెథ్ రోగాఫ్, 9 అక్టోబర్ 2011న మాట్లాడుతూ, ''ఏ దేశానికైనా డీఫాల్టర్‌గా మారడం అనేది సాధారణ విషయమే. ఇలా వందలసార్లు జరుగుతుంది'' అని అన్నారు.
''చాలా దేశాలు దివాలా తీశాయి. ఈ సంగతి వాటికి కూడా తెలియదు. ఆ దేశాల చరిత్ర పుస్తకాల్లో కూడా ఈ విషయ ప్రస్తావన ఉండదు. చాలా దేశాలు కనీసం ఒకటి లేదా రెండుసార్లు దివాలా తీశాయి. అయినప్పటికీ రుణదాత, సదరు దేశంతో వ్యాపారం చేయడం మాత్రం ఆపదు. అప్పు పెరుగుతూ పోతున్నప్పటికీ ఆ దేశం, ఇతర వ్యక్తుల మాదిరిగా వ్యాపారాన్ని నిలిపేయదు. ఏదో ఒకటి చెల్లిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది'' అని రోగాఫ్ వివరించారు.
''డీఫాల్టర్ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒక దేశం దగ్గర అనేక మార్గాలు ఉంటాయి. ఒక దేశం డిఫాల్టర్‌గా మారినప్పుడు, తమ వద్ద అప్పులు తిరిగి చెల్లించేందుకు డబ్బులు లేవని ఆయా దేశాల ఆర్థిక మంత్రులు ప్రకటిస్తారు. డిఫాల్టర్ పరిస్థితిని అంతకంటే వివరంగా ఏ ఆర్థిక మంత్రి కూడా చెప్పలేరు. ఒక్కోసారి తమను తామే డీఫాల్టర్‌గా ప్రకటించుకోవాల్సిన దుస్థితి దేశాలకు ఏర్పడుతుంది. వారి వద్ద అంతకుమించి మరో మార్గం ఉండదు. చాలా సార్లు ఇలా జరుగుతుంది'' అని రోగాఫ్ చెప్పారు.
నిజానికి డీఫాల్టర్‌గా ప్రకటించుకోవడానికి, దాన్నుంచి బయటపడటానికి మధ్య స్వల్ప తేడానే ఉంటుందని రోగాఫ్ పేర్కొన్నారు. ఉదాహరణకు, గతేడాది నవంబర్‌లో దిగుమతుల చెల్లింపులు చేసేందుకు శ్రీలంక వద్ద మూడు వారాల పాటు కేవలం ఒక డాలర్ మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ, ఎగవేతదారుగా మారడం నుంచి శ్రీలంక బయటపడింది. పాకిస్తాన్‌కు కూడా ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే... చైనా, సౌదీ అరేబియా దేశాలు ఆర్థిక సహాయం అందించి దాన్ని కాపాడతాయి'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పులు తీసుకున్నవారికి తిరిగి చెల్లించేందుకు 2001లో అర్జెంటీనా నిరాకరించింది. ఆ సమయంలో అర్జెంటీనా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. నిరుద్యోగం కారణంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి హింసాత్మక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు అర్జెంటీనాలో జరిగిన సంఘటనలు, ప్రపంచవ్యాప్తంగా రుణదాతలకు పీడకలగా మారాయి.
డీఫాల్టర్‌గా మారడం కంటే చాలా కాలం ముందే అర్జెంటీనాలో సంక్షోభం ప్రారంభమైంది. అర్జెంటీనా తమ కరెన్సీ పెసో విలువను డాలర్‌కు సమానంగా మార్చింది. అంటే ఒక పెసో విలువ, ఒక డాలర్‌తో సమానం. కానీ, అమెరికా ఆర్థిక వృద్ధి రేటు ముందు, అర్జెంటీనా ఏ దిశలోనూ సరితూగలేకపోయింది.
అర్జెంటీనా తమ కరెన్సీ విలువను తగ్గించలేదు. కొత్త నోట్లను కూడా ముద్రించలేదు. పెరుగుతున్న అప్పులను చూసి పెట్టుబడిదారులు పారిపోకూడదనే భయంతో ప్రభుత్వం ఎక్కువ వ్యయం కూడా చేయలేదు. దీంతో ప్రభుత్వం పూర్తిగా స్తంభించిపోయింది.
అర్జెంటీనా అప్పటి అధ్యక్షుడు అడోల్ఫో రోడ్రిగ్స్... రుణదాతలకు అప్పులు చెల్లించడం నిలిపేశారు. మొదట దేశంలోని అంతర్గత అవసరాలపైనే దృష్టి సారిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత అందరూ అర్జెంటీనాకు రుణాలు ఇవ్వడం మానేశారు. అర్జెంటీనా కరెన్సీ పెసో విలువ కూడా పడిపోయింది.
''మీరు అర్జెంటీనాలో పనిచేస్తే, జీతం పెసోల్లో అందుకుంటారు. కానీ చెల్లింపులు డాలర్లలో చేయాల్సి వస్తే మీరు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని అమెరికా రచయిత పాల్ బ్లస్టీన్ 'అండ్ ద మనీ కెప్ట్ రోలింగ్ ఇన్' అనే పుస్తకంలో రాశారు.
దేశం సర్వనాశనమైంది. రోడ్లపై హింస భయంకరంగా మారింది. బ్యాంకులు మూతపడ్డాయి. దేశంలోని బ్యాంకుల్లో వేల డాలర్లు డిపాజిట్ చేసిన వారు ఒక్కసారిగా చిల్లిగవ్వ లేకుండా మారిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
1991లో భారత్
1991 జూన్‌లో, భారత్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువే మిగిలాయి. వాటితో కేవలం 20 రోజుల పాటు చమురు, ఆహార బిల్లుల చెల్లింపులు మాత్రమే జరపొచ్చు.
మిగతా ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసేందుకు కూడా సరిపడా విదేశీ మారక ద్రవ్యం లేదు. భారత్ అప్పు 72 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో బ్రెజిల్, మెక్సికో తర్వాత మూడో అతిపెద్ద రుణగ్రహీత దేశంగా భారత్ నిలిచింది. దేశ ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోవడం ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం, రెవెన్యూలోటు, కరెంటు అకౌంట్ లోటు రెండంకెలకు చేరుకుంది.
1990లో భారత ఆర్థిక సంక్షోభానికి అంతర్జాతీయ కారణాలు కూడా ఉన్నాయి. 1990లో ప్రారంభమైన గల్ఫ్ యుద్ధం భారత్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధర పెరగడంతో దాని ప్రభావం భారత్‌పై కూడా పడింది. 1990-91 కాలంలో పెట్రోలియం దిగుమతి బిల్లు 2 బిలియన్ డాలర్ల నుంచి 5.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. చమురు ధరలు పెరగడం, దిగుమతుల పరిమాణం పెరగడం భారత్‌లో సంక్షోభానికి కారణమయ్యాయి.
భారతదేశ వాణిజ్య సమతుల్యతపై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోన్న భారతీయుల సంపాదనను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనివల్ల విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్ తగ్గింది. అదే సమయంలో భారతదేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. 1990 నుంచి 1991 వరకు రాజకీయ అస్థిరత గరిష్ట స్థాయికి చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
1989 సార్వత్రిక ఎన్నికల్లో, రాజీవ్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించింది. దాని ఫలితంగా, కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ అయిన జనతా దళ్... విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కులమతాల మధ్య ఘర్షణల్లో ఈ సంకీర్ణ ప్రభుత్వం చిక్కుకుంది. దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దీంతో 1990 డిసెంబర్‌లో వీపీ సింగ్ ప్రధానిగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 1991లో సాధారణ ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటైంది. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత మధ్యే, 21 మే 1991న రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. ఎన్‌ఆర్‌ఐలు తమ డబ్బులు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో భారత ప్రభుత్వం, బిల్లులు చెల్లించలేదేమోనని ఎగుమతిదారులు భావించారు. ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరింది. చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. దిగుమతులు ఆగిపోయాయి. ప్రభుత్వ వ్యయం కూడా తగ్గిపోయింది. రూపాయి విలువ 20 శాతం క్షీణించింది. బ్యాంకులు, వడ్డీరేట్లను పెంచాయి.
భారతదేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) 1.27 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. కానీ దీనివల్ల పరిస్థితి మెరుగుపడలేదు. 1991 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి, చంద్రశేఖర్ ప్రభుత్వం 20 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తెలెత్తింది.
21 జూన్ 1991న పీవీ నరసింహారావు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి... సకాలంలో రుణాలు చెల్లించలేక, భారత్, డీఫాల్టర్‌గా మారుతుందనే పరిస్థితుల్లో ఉందనిపించింది. కానీ, పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో కలిసి అనేక సంస్కరణలు చేపట్టారు. ఈ ద్వయం, భారత ఆర్థిక వ్యవస్థలో నిర్ణయాత్మక మార్పులు చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు శ్రీలంక వంతు
1991లో భారత్ ఎదుర్కొన్న పరిస్థితుల్నే తాజాగా శ్రీలంక అనుభవిస్తోంది. అక్కడ 100 గ్రాములు పచ్చిమిర్చి ధర 71 రూపాయలు (శ్రీలంక రూపాయి)గా ఉంది. బంగాళదుంప కిలో ధర రూ. 200 కాగా... ప్రజలు కొనేందుకు వీలుగా కిలోగ్రామ్ పాల పొడి ప్యాకెట్‌ను 100 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. కేవలం ఒక నెలలోనే ఆహార పదార్థాల ధరలు 15 శాతం పెరిగాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
2019 చివరి నాటికి శ్రీలంక విదేశీ మారక నిల్వలు 7.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మొత్తం, 2020లో ఐదు నెలల దిగుబడులకు మాత్రమే సరిపోతుంది. ఇప్పటికీ, విదేశీ రుణాలు, విదేశీ మారకపు చెల్లింపులతో పోలిస్తే ఈ మెత్తం చాలా తక్కువగానే ఉంది.
2020 ప్రారంభం నుంచే శ్రీలంక రూపాయి చాలా ఒడిదుడుకులకు లోనైంది. 2020 చివరి నాటికి శ్రీలంక విదేశీ మారక నిల్వలు 5.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కానీ 2021 నవంబర్‌కు వచ్చేసరికి ఇవి 1.6 బిలియన్ డాలర్లకు క్షీణించాయి.
శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ డబ్ల్యూఏ విజేవర్ధన ప్రకారం... 1.6 బిలియన్ డాలర్ల నిల్వలు అంటే శ్రీలంక మూడు వారాల దిగుమతుల బిల్లుకు సరితూగుతాయి. అంతకంటే ఎక్కువ అయితే కాదు. అమెరికా రేటింగ్ సంస్థ 'ఫిచ్', శ్రీలంకకు 'సిసిసి' రేటింగ్ ఇచ్చింది. డీఫాల్టర్ పరిస్థితికి ముందు ఈ రేటింగ్‌ను ఇస్తారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
శ్రీలంక, ఈ ఏడాది 4.5 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాల్సి ఉందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. జనవరి 18వ తేదీ నుంచే ఈ చెల్లింపులు చేయడం ప్రారంభం అవుతుంది. ఇంటర్నేషనల్ సావరీన్ బాండ్‌కు 500 మిలియన్ డాలర్లను జనవరి 18వ తేదీనే చెల్లించాలి. ఒకవేళ ఈ మొత్తాన్ని శ్రీలంక చెల్లించలేకపోతే, అది డీఫాల్టర్‌గా మారుతుంది.
1991లో భారత్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి? దీన్ని దివాలాగా పిలవొచ్చా? అసలు దివాలా అంటే ఏంటి?
దివాలా తీయడం అంటే ఏంటి?
దివాలా గురించి జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అరుణ్ కుమార్ మాట్లాడారు. ''దివాలా అంటే, క్రెడిట్ రేటింగ్ నిరంతరంగా క్షీణించడం. అంటే, ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్నట్లుగా జరగడం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆ దేశంపై విశ్వాసాన్ని కోల్పోతాయి. రుణాలు ఇచ్చినవారు, అప్పులు తిరిగే చెల్లించేందుకు గడువును కూడా పొడగించరు. క్రెడిట్ రేటింగ్ పడిపోతే, అప్పులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు.''
''విదేశీ అప్పుల మొత్తం కంటే తక్కువ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కలిగి ఉండటాన్ని దివాలాగా పరిగణించరు. ఇప్పుడు భారత్ వద్ద విదేశీ మారక ద్రవ్యం, విదేశీ రుణం కంటే ఎక్కువగా ఉంది. కానీ ప్రతీసారి ఇలాగే ఉండదు. ఇప్పుడు భారత్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలతో ఒక సంవత్సరం పాటు దిగుమతుల బిల్లులు చెల్లించవచ్చు. అంటే ఇది మంచి స్థితి. ప్రపంచంలోని అన్ని దేశాలకు విదేశీ రుణాలు ఉంటాయి. అమెరికా, చైనా, జపాన్ ఇలా అన్ని దేశాలపై విదేశీ రుణాలు ఉంటాయి. ఇక్కడ అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమేంటంటే... మీ క్రెడిట్ రేటింగ్ ఎలా ఉందనేది చూసుకోవాలి.''
''డీఫాల్టర్ అంటే, గడువులోగా రుణం చెల్లించకపోవడం. ఇది దివాలాకు నాంది'' అని అరుణ్ కుమార్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక దివాలా తీసిందా?
శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ డబ్ల్యూఏ విజేవర్ధన్, ఈ నెల 3వ తేదీన శ్రీలంక ఆర్థిక వార్తా పత్రిక 'డైలీ ఫైనాన్షియల్ టైమ్స్'లో ఒక కథనాన్ని రాశారు. శ్రీలంక దేశీయ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదని ఆయన ఆ ఆర్టికల్‌లో రాసుకొచ్చారు. కానీ విదేశీ రంగంలో ఈ పరిస్థితి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.
''చాలామంది శ్రీలంకను దివాలా దేశంగా పిలుస్తున్నారు. కానీ ఈ వ్యాఖ్య, శ్రీలంక విదేశీ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే వర్తిస్తుంది. సరిగ్గా చూస్తే శ్రీలంక దేశీయ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు. ప్రభుత్వం దివాలా తీసినప్పుడు మాత్రమే శ్రీలంక దేశీయ ఆర్థిక వ్యవస్థను దివాలాగా పరిగణించాలి. ఆదాయం రావడం ఆగిపోయినప్పుడు ప్రభుత్వం దివాలా తీస్తుంది. ప్రజలు పన్నులు కట్టడం మానేస్తారు. అప్పుడు కొత్త నోట్లను ముద్రించడంలో కూడా ప్రయోజనం ఉండదు. తదుపరి దశ ఏంటంటే... ప్రతీ నిమిషానికి కరెన్సీ విలువ పడిపోతుండటంతో ప్రజలు కూడా తమ దేశ కరెన్సీని అంగీకరించలేకపోతారు.''
''కానీ శ్రీలంక ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో లేదు. శ్రీలంకలో పన్నుల ద్వారా లభించే ఆదాయం, చరిత్రాత్మకంగా తక్కువ స్థాయిలో నమోదవుతున్నప్పటికీ, అది దేశ జీడీపీలో 9 శాతంగా ఉంది. ప్రజలు, తమ నగదు లావాదేవీలను నిలిపేయలేదు. ఇలాంటి స్థితిలో, శ్రీలంక ప్రభుత్వం మరో 12 నెలల పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థను నడపగలదని మేం భావిస్తున్నాం. ప్రభుత్వం దివాలా తీయనంతకాలం, దేశం కూడా దివాలా పరిస్థితుల్లోకి వెళ్లదు'' అని ఆర్టికల్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''శ్రీలంక బాహ్య ఆర్థిక వ్యవస్థ, దేశీయ ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. విదేశీ రంగంలో ప్రతిదీ సాధారణంగా ఉందంటే మనదగ్గర తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయని అర్థం. ఇది పొదుపు ఖాతాలాంటిది. కరెంటు ఖాతా (ప్రస్తుత ఆదాయం)లో ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు అవరసరమైన వస్తువులు కొనడానికి ఈ పొదుపు ఖాతా ఉపయోగపడుతుంది.''
''ఉదాహరణకు మీ ప్రస్తుత ఆదాయం రూ. 100 అనుకుందాం. మీరు రూ. 150 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో పొదుపు ఖాతా నుంచి రూ. 50 తీసుకుంటాం. ఒకవేళ పొదుపు ఖాతా ఖాళీగా ఉంటే, వేరొకరి వద్ద నుంచి అప్పు తీసుకోవాలి. మీకు అప్పు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేకపోతే, మీరు అప్పు తిరిగి చెల్లిస్తారనే ఎవరూ నమ్మకపోతే అప్పుడు మీ పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇదే. ''
విజేవర్ధన్ ప్రకారం, విదేశీ మారక నిధులు నిలిచిపోవడంతో శ్రీలంక విదేశీ వాణిజ్యం ఆగిపోయింది. ''సెంట్రల్ బ్యాంకు డాలరు విలువను రూ. 203 వద్ద కృత్తిమంగా నిర్ణయించింది. విదేశీ ద్రవ్యం కొరత కారణంగా, రూ. 203 అనేది నిజ విలువ కాదు. ఈ రేటుకు బ్యాంకుల్లో డాలర్లు అందుబాటులో లేవు.
''దిగుమతి దారులు, విదేశీ ఎక్చ్చేంజ్‌లలో పనిచేసే వారు డాలర్ల కోసం బ్యాంకుల ముందు బారులు తీరారు. ఈ నేపథ్యంలో, శ్రీలంకలో డాలర్లకు బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. సాధారణ పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్‌లో డాలర్ల కోసం నిర్ధిష్ట ధర కంటే రెండు రూపాయలు అధికంగా ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏకంగా 50 నుంచి 60 రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.
శ్రీలంక వాణిజ్య లోటు కూడా భయంకరంగా ఉంది. ఉదాహరణకు చైనా, శ్రీలంక మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తీసుకుంటే... చైనాకు ఎగుమతి చేయడంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే కూడా శ్రీలంక వెనుకబడి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక సంక్షోభంలో దక్షిణాసియా
''శ్రీలంక మాత్రమే కాదు, దక్షిణాసియాలో బంగ్లాదేశ్ మినహాయించి ఏ దేశం పరిస్థితి కూడా సరిగా లేదని'' ఏఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ (పాట్నా) ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్ డీఎం దివాకర్ అన్నారు.
''భారత్‌లో నమోదవుతోన్న అభివృద్ధి, పేదరికాన్ని అంతం చేయడం లేదు. అసమానతలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో భారత్, పాకిస్తాన్ కంటే కూడా వెనకుంది. దీనర్థం, భారత ఆర్థికాభివృద్ధి ఫలాలు కొంతమందికే అందుతున్నాయి. ఈ ప్రభావం అందరిపై ఉంటే, భారత్ ఆకలి సూచిలో పాకిస్తాన్ కంటే కూడా దీనమైన స్థితిలో ఉండకపోయేది'' అని దివాకర్ అభిప్రాయపడ్డారు.
''ఒక దేశంగా భారత్ దివాలా తీయలేదు. కానీ భారతదేశ జనాభాలో చాలామంది వ్యక్తిగతంగా దివాలా తీశారు. వీరంతా రేపు ఏం తింటారో, ఎక్కడ పడుకుంటారో కూడా తెలియదు. పాకిస్తాన్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఎంచుకున్న అభివృద్ధి నమూనా స్థిరమైనది కాదు.''
''చైనా కూడా ఇదే అభివృద్ధి నమూనాను అవలంభించింది. కానీ ఇది పెట్టుబడిదారీ రాజ్య నియంత్రణలో ఉంది. చైనా ప్రభుత్వం, జాక్ మా పై కూడా కఠిన నిబంధనలు విధిస్తుంది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన వారు విదేశాల్లో తలదాచుకునేందుకు భారత్ అనుమతిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, 80 శాతం ప్రైవేటు చేతుల్లోనే ఉంది. అందువల్ల దాని ప్రయోజనాలు దేశంలోని సామాన్య ప్రజలకు అందడం లేదు.''
''చైనా శక్తిమంతంగా మారిన తర్వాత, దివాలా కోరల్లో చిక్కుకున్న ఏ దేశం కూడా అమెరికా అనుకూల సంస్థలైన ఐఎంఎఫ్ లేదా ప్రపంచ బ్యాంకులపై ఆధారపడట్లేదు. చైనా లేకుంటే ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక దివాలా ప్రకటించి ఉండేవి'' అని దివాకర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ మారకం ఎందుకు అవసరం?
ఏ ఆర్థిక వ్యవస్థకైనా తగినంత విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఉండటం చాలా ముఖ్యమైనది. విదేశీ మారకం అంటే యూఎస్ డాలర్. అమెరికా కరెన్సీ 'డాలర్' అనేది ప్రపంచవ్యాప్తంగా కరెన్సీకి హాల్‌మార్క్‌గా స్థిరపడింది. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్, యూరో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల్లో 64 శాతం అమెరికా డాలర్లే. ఈ నేపథ్యంలో డాలర్‌ను గ్లోబల్ కరెన్సీగా పరిగణిస్తున్నారు. డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీ. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలానికి చిహ్నం.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ జాబితా ప్రకారం, ప్రపంచం మొత్తమ్మీద 185 రకాలు కరెన్సీలు మనుగడలో ఉన్నాయి. అయితే, వీటిని ఆయా దేశాలు, తమ సొంతదేశంలోనే ఉపయోగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ కరెన్సీ ఎంతమేరకు ప్రబలంగా ఉందనేది ఆ దేశ ఆర్థికవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని మొత్తం వ్యాపారంలో 85 శాతం వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది. అంతర్జాతీయ రుణాలు కూడా డాలర్లలోనే మంజూరు చేస్తారు. అందుకే అంతర్జాతీయ వ్యాపారాల కోసం విదేశీ బ్యాంకులకు డాలర్లు అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
ఒక దేశపు జాతీయ కరెన్సీ ఎంత ప్రబలంగా ఉందో డాలర్‌తో పోల్చి చెబుతుంటారు. ఆ దేశంలో ఉన్న విదేశీ మారకపు ద్రవ్యం నిల్వల్లో ఎన్ని అమెరికా డాలర్లు ఉన్నాయనేదానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. మారకపు రేటును అదుపులో ఉంచుకోవడానికి విదేశీ మారక నిల్వలను సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఒక దేశపు కరెన్సీ విలువ తగ్గడం ప్రారంభిస్తే, మారకపు రేటులో పెద్దగా తేడాలు రాకుండా ఉండేందుకు విదేశీ మారకపు నిల్వల నుంచి డాలర్లను తీసి మార్కెట్‌లో చలామణీ చేస్తారు.
విదేశీ మారక ద్రవ్యం లేకపోతే, ఏ దేశం కూడా అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోలేదు. ఉదాహరణకు భారత్ వద్ద డాలర్లు లేకపోతే, చమురును దిగుమతి చేసుకోవడం చాలా కష్టం అవుతుంది.
భారత ఆర్థికవ్యవస్థలో 80శాతం ఇంధనం ,దిగుమతులపైనే ఆధారపడి ఉంది. డాలర్లు లేకుంటే చమురు ఇవ్వడానిక గల్ఫ్ దేశాలు నిరాకరిస్తాయి. అలా జరిగితే దేశంలో ఉత్పత్తి దెబ్బతింటుంది. ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆదాయం కూడా తక్కువగానే వస్తుంది. ఇది నేరుగా ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- దళిత్ పాంథర్: ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఎందుకు ముక్కలైంది, దళితుల పోరాటాల్లో దాని పాత్ర ఏంటి?
- ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన యూపీ డిప్యూటీ సీఎం, ఏ ప్రశ్న అడిగితే ఆయనకు కోపం వచ్చిందంటే..
- రెండేళ్ల తర్వాత కూడా కోవిడ్ గురించి మనకు తెలియని 3 కీలక విషయాలు
- సుధా భరద్వాజ్: ప్రముఖ సామాజిక కార్యకర్త జైలు జీవితం ఎలా గడిచిందంటే..
- సంక్రాంతి పండుగకు తెలుగువారు చేసే స్పెషల్ వంటకాల కథ
- పవన్ కల్యాణ్: 'ఎవరి మైండ్ గేమ్‌లోనూ పావులు కావద్దు' - ప్రెస్ రివ్యూ
- రామగుండం: ఇండియాలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












