ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచే అమలు, మీ కరెంట్ బిల్లు ఎంత పెరగొచ్చంటే...

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అందుకు ఆమోదం తెలిపింది. విద్యుత్ పంపిణీ సంస్థలు చేసిన ప్రతిపాదనలను సవరించి ఏపీఈఆర్సీ కొత్త టారిఫ్‌ని ప్రకటించింది.
దాంతో గృహ విద్యుత్ వినియోగదారులు అందరికీ ఈ పెంపు వర్తించబోతోంది. ఏప్రిల్ 1 నుంచే పెంచిన ధరలు అమల్లోకి రాబోతున్నాయి.
యూనిట్‌కు కనిష్టంగా 45 పైసలు నుంచి గరిష్టంగా రూ. 1.57 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
యూనిట్ల వినియోగంతో సంబంధం లేకుండా అందరికీ వర్తించేలా ఛార్జీలు పెంచారు.
విద్యుత్ ఛార్జీల పెంపుదలను విపక్షాలు నిరసిస్తున్నాయి. ధరల పెంపుదల ప్రకటన వచ్చిన వెంటనే బుధవారం సాయంత్రమే కొన్నిచోట్ల సీపీఎం శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు టీడీపీ సహా వివిధ పార్టీలు పిలుపునిచ్చాయి.
ఎవరికి ఎంత పెరుగుతుంది?
విజయవాడ కృష్ణలంకలోని వంగవీటి శ్రీనివాసరావు వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. టూవీలర్లను సర్వీసింగ్ చేసే శ్రీనివాసరావు ఇంటికి సగటున 150 యూనిట్ల వరకు వాడుతారు. ఇప్పటి వరకు ఆయన యూనిట్‌కు రూ. 4.43 పైసలు చొప్పున చెల్లించారు. సగటు బిల్లు రూ. 650 నుంచి రూ. 800 వరకు వచ్చేది.
ఇప్పుడు పెంచిన ధరల ప్రకారం ఆయన యూనిట్‌కి రూ. 6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఆయన బిల్లు వెయ్యి రూపాయలు దాటిపోతుంది. అంటే కనీసం రూ. 200 వరకు ఆ కుటుంబంపై భారం పడబోతోంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఎల్. భాను ప్రకాశ్ అనే ప్రైవేటు ఉద్యోగి నెలకు సగటున 250 యూనిట్ల వరకు వాడుతారు. ఇప్పటి వరకు ఆయన యూనిట్‌కి రూ. 7.59 పైసలు చెల్లించేవారు. ఇకపై దానిని రూ. 8.75 చొప్పున కట్టాలి.
దాంతో ఆయనకు రూ. 1300 వరకు ఉండే కరెంట్ బిల్లు రూ. 1600 దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటువంటి మధ్యతరగతి కుటుంబాలకు కనీసం నెలకు రూ. 300పైనే కరెంట్ బిల్లుల భారం ఉంటుంది.
రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో నివసిస్తూ ఇంటిపని చేసుకుని జీవించే పార్వతమ్మ కుటుంబానికి ప్రస్తుతం సగటున రూ. 300 వరకు కరెంట్ బిల్లు వస్తోంది. ఇప్పటి వరకు తాను వినియోగిస్తున్న విద్యుత్ యూనిట్‌కి రూ. 3.10 చెల్లించేది. ఇకపై ఆమె కుటుంబం రూ. 4.50 చొప్పున ఒక్కో యూనిట్‌కి చెల్లించాలి. దాంతో ఆమె బిల్లు కనీసం రూ. 450 దాటేందుకు అవకాశం ఉంది. రూ. 150లు ఆమె అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

30 యూనిట్ల వరకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.1.45 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది రూ.1.90కి పెరగనుంది.
31 నుంచి 75 యూనిట్ల వరకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.2.09 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది రూ.3కి పెరగనుంది.
76 నుంచి 125 యూనిట్ల వరకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.3.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది రూ.4.50కి పెరగనుంది.
126 నుంచి 225 యూనిట్ల వరకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.4.43 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది రూ.6కి పెరగనుంది.
226 నుంచి 400 యూనిట్ల వరకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.7.59 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది రూ.8.75కి పెరగనుంది.
రూ.400 యూనిట్లకుపైబడితే ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.9.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది రూ.9.75కి పెరగనుంది.
వినియోగదారులకు ఇప్పటి వరకు తాము వినియోగిస్తున్న విద్యుత్‌లో ఎటువంటి మార్పులు లేకపోయినా చెల్లించాల్సిన బిల్లు మొత్తం మారుతుంది. దానికి భిన్నంగా విద్యుత్ వినియోగం ఏమాత్రం పెరిగినా టారిఫ్ మారుతుంది. టారిఫ్ మారితే భారం మరింత ఎక్కువ అవుతుంది.
టెలిస్కోపిక్ విధానంలో ఈ ధరలను నిర్ణయించారు. దాని ప్రకారం శ్లాబులు మారితే పెరిగిన యూనిట్ల మేరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
దానికి భిన్నంగా నాన్ టెలిస్కోప్ విధానమైతే... ఉదాహరణకు 76 నుంచి 125 యూనిట్ల వరకు ఉన్న శ్లాబులోని వినియోగదారుడు ఒక నెలలో 130 యూనిట్ల విద్యుత్ వాడితే మొత్తం అన్ని యూనిట్లకు ప్రస్తుతం ఉన్న టారిఫ్ ప్రకారం రూ. 4.43 చొప్పున చెల్లించాల్సి ఉండేది.
కానీ ప్రస్తుతం టెలిస్కోప్ విధానమంటూ ఏపీఈఆర్సీ ప్రకటించిన మూలంగా 125 యూనిట్ల వరకూ రూ. 3.10 చొప్పున చెల్లించి, ఆ పైన యూనిట్లకు మాత్రమే రూ. 4.43 చెల్లించాల్సి ఉంటుంది.
పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. మీరు ఎన్ని యూనిట్లు వాడతారన్న దాన్ని బట్టి మీ కరెంట్ బిల్లు ఉంటుంది. పై పట్టిక ఆధారంగా మీకెంత కరెంట్ బిల్లు రావొచ్చో అంచనా వేసుకోవచ్చు.

అయితే ప్రకటనలకు భిన్నంగా ఆచరణ ఉంటోందని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ చిగురుపాటి బాబూరావు అంటున్నారు.
"ఈఆర్సీ ప్రకటనకు విరుద్ధంగా ఆచరణ ఉంటోంది. పెరిగిన విద్యుత్ ఛార్జీల భారం ప్రజలు మోయలేనిది. ఇప్పటికే మార్కెట్లో పెట్రోల్ సహా అన్ని ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుదల సామాన్యుడు మోయలేని రీతిలో ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలకు అసలు కారణాలు వదిలేసి జనాల జేబుల నుంచి కాజేయాలని చూస్తున్నారు. దీనిని అందరూ వ్యతిరేకించాలి" అని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఛార్జీలు ఎందుకు పెంచారు?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఇంత భారీ స్థాయిలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. కానీ సర్దుబాటు ఛార్జీలు సహా వివిధ పేర్లతో అదనంగా వసూళ్లు మాత్రం సాగించారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో కూడా తొలుత ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రతీ ఒక్క గృహ విద్యుత్ వినియోగదారుల బిల్లులోనూ అదనపు మొత్తం వసూలు చేశారు. వాటిపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
2014-19 కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు వినియోగదారుల నుంచి వసూళ్లు చేస్తామనడాన్ని అనేక మంది తప్పుబట్టారు. దాంతో నాలుగు నెలల తర్వాత ఈ సర్దుబాటు ఛార్జీల వసూళ్ల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మూడు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ జరుగుతోంది.
ఈ విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా సరఫరా అవుతున్న విద్యుత్‌కి రూ. 45,398.66 కోట్లు ఆదాయం రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అమలులో ఉన్న ధరల కారణంగా అందులో రూ. 10,933 కోట్ల లోటు ఏర్పడుతుంది. గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్ సవరించడం ద్వారా ఈ లోటు కొంతమేరకు భర్తీ అవుతుందని డిస్కమ్‌లు చెబుతున్నాయి.
ఏపీలో మొత్తం 1.91 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో గృహ విద్యుత్ కనెక్షన్లు 70 శాతం ఉంటాయి. టారిఫ్ సవరించడం, ఛార్జీలు పెంచడం మూలంగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్న వారికి అదనపు భారం పడబోతోంది.

రాయితీలు కొనసాగుతాయి
గృహ విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు పెంచినప్పటికీ వివిధ కేటగిరీల్లో ఇస్తోన్న రాయితీలు కొనసాగుతాయని ఏపీఈఆర్సీ ప్రకటించింది. గోశాలలకు, ఆక్వా సాగుదారులకు రాయితీ ధరలకే విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని ఏపీఈఆర్సీ నివేదికలో పేర్కొంది. గోశాలలతో పాటుగా మతపరమైన సబ్ కేటగిరీలను కలిపేసి యూనిట్‌కి రూ. 4.80గా ఉన్న ధరను రూ. 3.85కే తగ్గించినట్టు తెలిపారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని తెలిపారు.
రైస్ మిల్లులు, పల్వనైజింగ్ పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమకు కూడా 150 హెచ్‌పీ లోపున ఉండే వారికి విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉండదని వివరించారు.
పరిశ్రమలకు టైమ్ ఆఫ్ డే రాయితీలు వర్తిస్తాయని వెల్లడించారు. అంటే పగటి పూట పనిచేసే పరిశ్రమలకు ప్రయోజనం వర్తిస్తుందని వెల్లడించారు.
ఏడు సార్లు ధరలు పెంచారు: చంద్రబాబు
"వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుసార్లు ప్రజలపై కరెంటు ఛార్జీల భారం మోపారు. ఇది అసమర్థతకు నిదర్శనం. విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ప్రజలను మోసం చేశారు. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణం. బొగ్గు సరఫరా చేసే సంస్థలకు జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిపడటంతో, వారు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి మోకాలడ్డారు.
బయట నుంచి జగన్ ప్రభుత్వం ఎంత ధరకు విద్యుత్ కొంటుందో చెప్పాలి. గతంలో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,829 కోట్లు ఆదా అయ్యాయని చెప్పిన జగన్ ఇప్పుడు ప్రజలపై ఎందుకు భారం వేస్తున్నారో చెప్పాలి. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమిస్తాం'' అని ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు అన్నారు.
బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విద్యుత్ ఛార్జీల పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకించారు. జగనన్న విద్యుత్ ఛార్జీల వడ్డన అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎద్దేవా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీఈఆర్సీ వాదన ఏంటంటే..
"పెట్రో ధరల వంటి వాటితో పోలిస్తే విద్యుత్ ఛార్జీల పెంపుదల తక్కువే ఉంది. వినియోగదారుల మీద ఎక్కువ భారం పడకుండానే డిస్కమ్‌లను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాం. ప్రజాభిప్రాయం తీసుకుని దానికి అనుగుణంగా టారిఫ్ నిర్ణయించాం. డిస్కమ్‌లకి కూడా ఆర్థికంగా భరోసా కల్పించాల్సి ఉంది. అందుకే అనేక మినహాయింపులు ఇచ్చాం.
మిగిలిన పెట్రోల్ వంటి ఉత్పత్తుల ధరల నిర్ణయాలకు ఎలాంటి ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోరు. ఇప్పుడు పెరిగేది కూడా నథింగ్. అంతా కలిపి రూ. 1400 కోట్ల నుంచి రూ 1500 కోట్లు ఉంటుందంతే" అని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి వ్యాఖ్యానించారు.
బుధవారం తిరుపతిలో ఈఆర్సీ నిర్ణయాన్ని వెల్లడించే సందర్భంలో మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదల నథింగ్ అనడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. పైగా ధరల పెరుగుదల అందరికీ ఆమోదయోగ్యమేనంటూ వ్యాఖ్యానించడం విశేషం.
విద్యుత్ ఛార్జీల పెరుగుదల అనివార్యంగా మారిందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో చెప్పారు. విద్యుత్ ఒప్పందాల్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమంటూ ఆయన మండిపడ్డారు.
తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే తక్కువగా ధరలు పెరిగాయంటూ ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రతిపక్షానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలో సైన్యం ఎటు వైపు?
- యుక్రెయిన్ మీద యుద్ధానికి రష్యాకు ఎంత ఖర్చవుతోంది?
- లేపాక్షి ఆలయాన్ని కట్టించిన వ్యక్తి కళ్లను విజయనగర రాజు పొడిపించేశారా?
- చైనా: పగలంతా ఆఫీసులో పని.. రాత్రి అక్కడే స్లీపింగ్ బ్యాగ్‌లో నిద్ర
- ఒక అనాథ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














