శ్రీలంకలో ఏం జరుగుతోంది, పెట్రోలు బంకుల దగ్గర ఆర్మీని కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?

సైన్యం పహారా మధ్య పెట్రోలు బంకులో పని చేస్తున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సైన్యం పహారా మధ్య పెట్రోలు బంకులో పని చేస్తున్న సిబ్బంది

శ్రీలంకలో సైన్యం ఇప్పుడు మరో ప్రత్యేక విధులు నిర్వర్తిస్తోంది. అది దేశ సరిహద్దుల్లోనో, లేక రాజధాని నగరంలోనో కాదు. పెట్రోలు బంకుల దగ్గర. దేశంలో పెట్రోలు, డీజిల్‌ కొరత తీవ్రంగా ఉండటంతో బంకుల దగ్గర జనం బారులు తీరుతున్నారు. వారిని అదుపు చేయడానికి ప్రభుత్వం మంగళవారం సైన్యాన్ని మోహరించింది.

బంకుల దగ్గర జనం గొడవ పడకుండా, తొక్కిసలాటలు జరక్కుండా ఆర్మీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

శ్రీలంక ప్రస్తుతం భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. పెట్రోలు, డీజిల్‌ దిగుమతి కష్టంగా మారుతోంది. ద్రవ్యోల్బణం కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలో ఆహార ధాన్యాలు, పంచదార, కూరగాయలు, మందుల కొరత ఉంది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల ఖర్చు నాలుగు రెట్లు పెరిగింది.

విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో పొరుగు దేశాల నుంచి వీటిని కొనుగోలు చేయలేక పోతోంది శ్రీలంక. దేశంలోని పాఠశాల విద్యార్థుల పరీక్షా పత్రాలను ప్రింట్ చేయడానికి పేపర్, ఇంక్‌ కు కూడా డబ్బులు లేక పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఆహార ధాన్యాలు, చమురు, మందుల కొనుగోలు కోసం శ్రీలంక రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవల, భారతదేశం 1 బిలియన్ డాలర్ల ( రూ. 76,44,00,00,000 కోట్ల) రుణం ఇస్తానని హామీ ఇచ్చింది. చైనా కూడా 2.5 బిలియన్ డాలర్ల (రూ. 1,91,09,68,75,000 కోట్ల) రుణమిస్తానని తెలిపింది.

వీడియో క్యాప్షన్, బుద్ధుడి దంతాన్ని తీసుకువచ్చే ఏనుగు మరణించింది

శ్రీలంకకు చైనా ఇప్పటికే చాలా అప్పులు ఇచ్చింది. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీలంకలో ఇది అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.

''పెట్రోల్ పంపుల దగ్గర ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఆర్మీని రంగంలోకి దించాలని నిర్ణయించాం. కొందరు పెద్ద ఎత్తున పెట్రోలు కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. అందరికీ పెట్రోలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది'' అని శ్రీలంక ఇంధనశాఖ మంత్రి గామిని లుకోగే అన్నట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఎల్‌పీజీ కోసం కూడా ప్రజలు ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి లైన్‌లో నిల్చున్న దృశ్యాలు కనిపించాయి. పెట్రోల్, కిరోసిన్ కోసం లైన్లలో నిలబడి నలుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు వృద్ధులు. లైన్‌లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు కత్తిపోట్లతో మృతి చెందారు.

పెట్రోలు బంకుల దగ్గర బారులు తీరిన శ్రీలంక ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెట్రోలు బంకుల దగ్గర బారులు తీరిన శ్రీలంక ప్రజలు

తరిగిన ఫారెక్స్ నిల్వలు

శ్రీలంక భారీ విద్యుత్ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది. మార్చి ప్రారంభంలో, శ్రీలంకలో ఏడున్నర గంటల వరకు విద్యుత్ కోతను ప్రకటించింది. ఫిబ్రవరిలో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన డేటా ప్రకారం, జనవరి 2022లో దేశ విదేశీ మారక నిల్వలు 24.8 శాతం తగ్గి 2.36 బిలియన్ డాలర్ల (1,80,39,84,00,000 కోట్ల)కు చేరుకున్నాయి.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీలంక నుంచి తేయాకును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం రష్యా.

రష్యా, యుక్రెయిల్‌ల నుంచి శ్రీలంకకు పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తుంటారు. రూబుల్ ధర పడిపోవడం, యుద్ధం కారణంగా రష్యా, యుక్రెయిన్‌లు తేయాకు కొనుగోళ్లు తగ్గించడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది.

శ్రీలంక

ఫొటో సోర్స్, ISHRA S. KODIKARA/GETTY IMAGES

శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉంది?

శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగం దాని పర్యాటక పరిశ్రమ. దేశ జీడీపీలో దీని వాటా దాదాపు పది శాతానికి చేరువలో ఉంది. అయితే కోవిడ్ కారణంగా శ్రీలంక కు పర్యాటకుల రాక పూర్తిగా నిలిచిపోయింది. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో, కెనడా వంటి అనేక దేశాలు శ్రీలంకలో పెట్టుబడులను ప్రస్తుతానికి నిలిపేశాయి.

కోవిడ్ నుండి పర్యాటక రంగానికి ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో శ్రీలంక ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్లు ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీశాయి. 2019లో ఎన్నికైన రాజపక్స ప్రభుత్వం, ప్రజలు ఖర్చు పెట్టే సామర్థ్యాన్ని పెంచేందుకు పన్నులను తగ్గించింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లింది.

దేశంలో రసాయన ఎరువులతో వ్యవసాయాన్ని నిలిపివేయాలని ఆదేశించడం కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది పంటల ఉత్పత్తిలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది.

శ్రీలంక ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడానికి పెరుగుతున్న అప్పులు కూడా కారణమే. చైనా నుంచి 5 బిలియన్ డాలర్ల ( సుమారు రూ. 3,82,20,00,00,000 కోట్లు) అప్పు తీసుకుంది. భారత్‌, జపాన్‌ల నుంచి కూడా చాలా రుణాలు తీసుకుంది. దిగుమతుల కోసం శ్రీలంక ఖరీదైన డాలర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. శ్రీలంక తన కరెన్సీ విలువను కూడా తగ్గించింది.

శ్రీలంక

ఫొటో సోర్స్, EPA/CHAMILA KARUNARATHNE

గత నెలలో బ్యాంక్ ఆఫ్ సిలోన్ 40వేల టన్నుల పెట్రోల్‌ను ఆర్డర్ చేయడానికి 35.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 27,13,62,00,00,000 కోట్ల)ను విడుదల చేసింది. వాస్తవానికి కొలంబో పోర్ట్‌లో నాలుగు రోజులుగా పెట్రోల్ షిప్‌మెంట్ వేచి ఉంది. చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. చివరికి బ్యాంక్ ఆఫ్ సిలోన్ ఆ డబ్బును చెల్లించాల్సి వచ్చింది.

ఫిబ్రవరిలో శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన డేటా ప్రకారం, జనవరి 2022లో దేశపు విదేశీ మారక నిల్వలు 24.8 శాతం క్షీణించి 2.36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. శ్రీలంక 2022లో 7 బిలియన్ డాలర్ల( రూ.5,35,08,00,00,000 కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక డిఫాల్టింగ్ ప్రమాదంలో ఉంది. పరిస్థితి మెరుగుపడకపోతే, రుణం కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)కు కూడా వెళ్లాల్సి ఉంటుంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరిలో ఆసియా దేశాలన్నింటిలో అత్యధికంగా శ్రీలంకలోనే ద్రవ్యోల్బణం పెరిగింది. ఫిబ్రవరి 2021తో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 15.1 శాతం పెరిగింది.

శ్రీలంక అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంక అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి

అప్పుల కుప్ప

శ్రీలంక తన దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చైనా నుండి చాలా అప్పులు తీసుకుంది. ఏప్రిల్ 2021 నాటికి, శ్రీలంక $ 35 బిలియన్ల(రూ.2,67,54,00,000 కోట్లు) రుణాలున్నాయి. ఇందులో చైనాకు పది శాతం వాటా ఉంది. శ్రీలంక కంపెనీలకు, దాని సెంట్రల్ బ్యాంక్‌కు ఇచ్చిన చైనా రుణాలను కూడా కలుపుకుంటే, అది ఇంకా ఎక్కువ కావచ్చు.

శ్రీలంక రుణాలు తీసుకున్న కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దక్షిణ శ్రీలంకలోని హంబన్‌టోట వద్ద ఓడరేవును నిర్మించేందుకు శ్రీలంక చైనా నుంచి 1.4 బిలియన్ డాలర్ల(రూ. 1,07,01,60,00,000 కోట్లు) రుణం తీసుకుంది. కానీ అప్పు తీర్చలేకపోయింది.

చివరకు 2017లో ఆ ప్రాజెక్టును 99 ఏళ్ల లీజుకు చైనా కంపెనీకి అప్పగించింది. చైనా నుండి సులువుగా రుణాలు దొరకడం కూడా సమస్యగా మారింది. చైనా రుణం తీర్చేంత శక్తి శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు లేదు. ఇప్పుడు మళ్లీ చైనా నుంచి 2.5 బిలియన్ డాలర్ల( రూ.1,91,10,00,00,000 కోట్లు) రుణం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

శ్రీలంక ప్రస్తుతం భారత్, చైనా, బంగ్లాదేశ్‌ల పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆహార పదార్థాల నుంచి విదేశీ మారక ద్రవ్య నిల్వలను బలోపేతం చేయడం వరకు ఈ మూడు దేశాల నుంచి శ్రీలంక కు పెద్ద ఎత్తున సాయం అవసరం.

వీడియో క్యాప్షన్, కేజీ చికెన్ రూ.1000, పెట్రోల్ రూ.254. ఎక్కడ? ఎందుకు?

గత కొన్నేళ్లుగా శ్రీలంకలో చైనా కార్యకలాపాల పెరుగుదల కారణంగా భారత్‌ తో దాని సంబంధాలు ఒడిదొడుకులకు లోనయ్యాయి. కానీ చైనా దగ్గర చేసిన అప్పులు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాల వ్యవహారంలో ఇబ్బందుల కారణంగా భారత్ తో సంబంధాలను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేస్తోంది శ్రీలంక.

గత నెలలో శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల పెట్రో ఉత్పత్తులను పంపింది. జనవరిలో, భారతదేశం శ్రీలంకకు $ 400 మిలియన్ల (రూ.30,57,60,00,000 కోట్లు) క్రెడిట్ స్వాప్ ఇచ్చింది. ఫిబ్రవరిలో, పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారతదేశం మరోసారి $ 500 మిలియన్ల( రూ.38,22,00,00,000 కోట్లు) రుణాన్ని ఇచ్చింది.

ఈ నెలలో, శ్రీలంకకు 1 బిలియన్ డాలర్ల (రూ.76,44,00,00,000 కోట్లు) రుణం ఇచ్చే ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. గత ఏడాది నుంచి శ్రీలంక ఈ రుణం కోసం ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)