యుక్రెయిన్ సంక్షోభం: 'మాకూ ఇరాన్, ఉత్తరకొరియా పరిస్థితి వస్తుందేమో'.. రష్యన్లలో ఆందోళన

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఎనాస్తాసియా స్గోనెయి(మాస్కో), సైమన్ ఫ్రేజర్(లండన్)
- హోదా, బీబీసీ ప్రతినిధులు
"నేను ఇప్పటికిప్పుడు రష్యా వదిలి వెళ్లాలంటే వెళ్లిపోవచ్చు, కానీ నేను నా ఉద్యోగం వదులుకోలేను" అన్నారు ఆండ్రూ.
రష్యాలో వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఆండ్రూ ఇప్పుడు తన ఇంటి ఈఎంఐ కట్టలేకపోతున్నారు. ఆయనలాగే కొన్ని లక్షలమంది రష్యన్లు ఇప్పుడు పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలకు విలవిల్లాడిపోతున్నారు.
యుక్రెయిన్ మీద దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలనే ఉద్దేశంతో పశ్చిమ దేశాలు ఈ ఆంక్షలు విధించాయి.
"నేను వీలైనంత త్వరగా రష్యా బయట నా కోసం కస్టమర్లను చూసుకోవాలనుకుంటున్నాను. కస్టమర్లు దొరికితే నేను నా ఇంటి ఈఎంఐ కట్టడానికి సేవ్ చేసి ఉంచిన డబ్బు తీసుకుని రష్యా వదిలి వెళ్లిపోవాలి. నాకిక్కడ భయమేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన చాలా మందిని అరెస్ట్ చేశారు. నాకు నిజంగా సిగ్గుగా ఉంది. నేను అధికార పార్టీకి ఓటు కూడా వేయలేదు" అని 31 ఏళ్ల ఇంజనీర్ ఆండ్రూ చెప్పారు.
భద్రతా కారణాల వల్ల మేం మాతో మాట్లాడిన వారి పేర్లు ఈ కథనంలో రాయలేకపోతున్నాం, వారి ముఖాలు చూపించలేకపోతున్నాం. కొన్ని పేర్లు కూడా మార్చాల్సి వచ్చింది.
రష్యాపై విధించిన ఆంక్షలను ఇప్పుడు ఆర్థిక యుద్ధంగా వర్ణిస్తున్నారు. రష్యాను ఏకాకిని చేసే ఈ యుద్ధం, దానిని ఒక భయానక ఆర్థిక మాంద్యంలో పడేస్తుంది. తాము చేపట్టిన అనూహ్య చర్యలు రష్యా ఆలోచనల్లో మార్పు తీసుకొస్తాయని పశ్చిమ దేశాల నేతలు భావిస్తున్నారు.
కానీ, దేశంలో సామాన్యుల డబ్బు మాత్రం చూస్తుండగానే మాయమైపోతోంది. ఈ ఆంక్షలు వారి జీవితాలపై దారుణంగా ప్రభావం చూపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
ఫోన్‌తో పేమెంట్ చేయలేకపోతున్నా
కొన్ని రష్యా బ్యాంకులకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంతో ఆ బ్యాంకుల వినియోగదారులు తమ వీసా, మాస్టర్ కార్డులు వాడలేకపోతున్నారు. దాంతో యాపిల్, గూగుల్ లాంటి సేవలు కూడా ఈ బ్యాంకు వినియోగదారులకు అందుబాటులో లేకుండాపోయాయి.
35 ఏళ్ల డారియా మాస్కోలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మెట్రో కార్డ్ కూడా రీచార్జ్ చేసుకోలేక ఆమె మెట్రోలో ప్రయాణించలేకపోయారు.
"నేనెప్పుడూ నా ఫోన్‌తోనే పేమెంట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అది పనిచేయడం లేదు. నాలాంటివారు చాలా మంది ఉన్నారు. నిజానికి మెట్రోలో ఎంట్రీని వీటీబీ బ్యాంక్ ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాంక్‌పై ఆంక్షలు విధించడంతో గూగుల్ పే, యాపిల్‌లో ఆ సేవలు పనిచేయడం లేదు. దాంతో నేను మెట్రో కార్డ్ కొనాల్సొచ్చింది. అంతేకాదు, షాపుల్లో ఏవైనా కొన్నా నేను నా ఫోన్ ద్వారా పేమెంట్స్ చేయలేకపోతున్నా" అన్నారు.

డాలర్ వర్సెస్ రూబుల్
రష్యా ప్రభుత్వం సోమవారం దేశంలో వడ్డీ రేట్లను దాదాపు రెట్టింపుగా అంటే 20 శాతం చేసింది. షేర్ల అమ్మకాలు భారీగా జరుగుతాయనే భయంతో షేర్ మార్కెట్ కూడా మూసేశారు.
ఈ ఆంక్షలను ఎదుర్కోడానికి తమకు తగిన వనరులు ఉన్నాయని రష్యా ప్రభుత్వం చెబుతోంది. కానీ దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది.
వినియోగదారులు ఒకేసారి తమ అకౌంట్ల నుంచి భారీగా డబ్బులు తీసే ప్రయత్నం చేయవచ్చనే భయంతో రష్యా సెంట్రల్ బ్యాంక్ గత వారం వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నాలు చేసింది. ఆంక్షల వల్ల బ్యాంకులపై అదనపు ఒత్తిడి పడుతోంది.
"బ్యాంకుల్లో డాలర్లు లేవు, రూబుల్స్ ఉన్నాయి. కానీ మాకవి అవసరం లేదు. ఇప్పుడేం చేయాలో నాకర్థం కావడం లేదు. మా పరిస్థితి కూడా ఇరాన్, ఉత్తర కొరియాలా అవుతుందేమోనని నాకు అనిపిస్తోంది" అని మాస్కోలో ఒక ఏటీఎం బయట క్యూలో నిలబడిన ఎంటోన్(పేరు మార్చాం) అన్నారు.
రష్యాలో విదేశీ కరెన్సీ మారకపు రేటు గతవారంతో పోలిస్తే 50 శాతం పెరిగింది. అంత పెడుతున్నా అవి దొరకడం కూడా కష్టంగా ఉంది.
2022 ప్రారంభంలో ఒక అమెరికా డాలర్‌కు 75 రూబుల్స్, ఒక యూరోకు 80 రూబుల్స్ వచ్చేవి. కానీ యుక్రెయిన్ మీద దాడులతో కొత్త రికార్డులు నమోదయ్యాయి. సోమవారం ఒక సమయంలో ఒక డాలర్ విలువ 113 రూబుళ్ల వరకూ చేరింది.

ఫొటో సోర్స్, Reuters
డాలర్, యూరోలు తీసుకోవడానికి పరుగులు
దేశంలో రూబుల్-డాలర్ మారకం రేటు గురించి రష్యన్లలో చాలా కాలంగా ఆందోళన ఉంది.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత 1990వ దశకంలో రష్యన్లు డాలర్లను పొదుపు రూపంలో తమ దగ్గరే దాచుకున్నారు.
1998లో అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించలేక చేతులెత్తేసినపుడు డాలర్ల రూపంలో డబ్బు దాచుకున్న వాళ్లందరూ తాము సురక్షితంగా ఉన్నట్లు భావించారు.
అయితే, తర్వాత దశాబ్దాల్లో చేపట్టిన బ్యాంకింగ్ చర్యలు రూబుల్ గురించి రష్యన్లకు ఒక భరోసాను ఇచ్చాయి. తర్వాత రష్యా కరెన్సీలో ప్రజల డిపాజిట్లు పెరగడంతోపాటూ రష్యా కంపెనీలు షేర్లలో కూడా పెట్టుబడులు పెట్టాయి.
కానీ, ఇప్పటికీ ఆ దేశంలో ఎప్పుడైనా ఏదైనా అనిశ్చితి వాతావరణం ఏర్పడితే జనం హడావుడిగా తమ డబ్బును డాలర్లుగా మార్చుకోవడానికి పరుగులు తీస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ మీద దాడితో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి.
రష్యా గతవారం యుక్రెయిన్ మీద దాడులు మొదలవగానే, గతంలో ఇలాంటి ఎన్నో పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకున్న రష్యన్లు దేశంలోని క్యాష్ పాయింట్ల దగ్గర క్యూకట్టడం మొదలయ్యింది.
దాదాపు 30 ఏళ్లున్న ఇల్యా(పేరు మార్చాం) ఇటీవలే మాస్కోలో తన రుణం తీర్చేశారు. అయితే ప్రస్తుతానికి అక్కడ నుంచి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి స్థిరపడే స్థోమత తనకు లేదంటున్నారు.
"డాన్‌బాస్‌లో ఆపరేషన్ మొదలైనప్పుడు నేను నా సేవింగ్స్ తీసేద్దామని ఏటీఎంకు వెళ్లాను. వాటిని స్పెర్‌బ్యాంక్‌లో డాలర్లుగా ఉంచాను. ఇప్పుడు వాటిని నిజంగానే నా దిండు కింద దాచుకుంటున్నాను. మిగతా సేవింగ్స్ ఇంకా బ్యాంకులోనే ఉన్నాయి. వాటిలో సగం డాలర్లలో మిగతా రూబుల్‌లో ఉన్నాయి. పరిస్థితులు మరింత దిగజారితే నేను మరింత డబ్బు తీయాల్సుంటుంది. భారీగా లూటీలు జరుగుతాయని కూడా నాకు భయమేస్తోంది" అంటారాయన.

ఫొటో సోర్స్, EPA
జీవితం మరింత దుర్భరం అవుతుంది
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫొటోల్లో రష్యాలో ఏటీఎంలు, కరెన్సీ ఎక్ఛేంజీల ముందు పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. చాలా మంది తమ బ్యాంకుల కార్యకలాపాలు ఆగిపోతాయేమోనని భయపడుతున్నారు. ఒక వ్యక్తి ఎంత నగదు తీయచ్చు అనే పరిమితులు కూడా పెడతారేమోనని ఆందోళనలో ఉన్నారు.
యుక్రెయిన్ మీద దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే బ్యాంకుల్లో డాలర్లు, యూరోలు నిండుకోవడం మొదలయ్యింది. తర్వాత నుంచి ఆ కరెన్సీ చాలా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంది. ఒకరు ఎన్ని రూబుల్స్ తీయవచ్చు అనేదానికి కూడా ఒక పరిమితి విధించారు.
అప్పు తీర్చడానికి డబ్బులు తీయాలనుకుంటున్నట్లు మాస్కోలో ఒక ఏటీఎం దగ్గర క్యూలో ఉన్న 45 ఏళ్ల ఇవ్గెనీ(పేరు మార్చాం) చెప్పారు.
"ప్రతి ఒక్కరూ ఆందోళనలో ఉన్నారని నాకు తెలుసు. ఈ ఒత్తిడి అందరిలో ఉంది. ఇక జీవితం మరింత దుర్భరం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యుద్ధం భయానకంగా ఉంది. దేశాలన్నీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని నాకు అనిపిస్తోంది. ఎవరెంత బలవంతులో చూడ్డానికి పెద్ద దేశాలు ఇప్పుడు పరస్పరం తమ బలాబలాలు కొలుచుకుంటున్నాయి. దానికి సామాన్యులు మూల్యం చెల్లిస్తున్నారు" అన్నారు.
"నేను డబ్బులు తీయాలని ఈరోజే మొదటిసారి అనుకున్నాను. నాకు ఏ సమస్యా ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. అయితే, నేను రూబుల్స్ తీశాను. నాకు అంచనా వేయడం పెద్దగా తెలీదు. కానీ దీనివల్ల మా జీవితాలు ఘోరంగా మారుతాయేమో అనే సందేహాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయి. కానీ, అది కాలమే చెబుతుంది" అని 35 ఏళ్ల మార్టర్ అన్నారు.
బ్యాంకులోకి వెళ్లి ఫామ్‌పై సంతకం చేయాలి
నగదు సమస్య కేవలం మాస్కో వరకే పరిమితం కాలేదని, డాలర్లు లేదా యూరోల కోసం జనం పెర్మ్, కొస్త్రోమా, బెల్‌గ్రాడ్, ఇతర ప్రాంతీయ నగరాలకు కూడా పరుగులు తీస్తున్నట్లు బీబీసీ రష్యా చెప్పింది.
ఒక ఐటీ నిపుణుడు ప్రైవేట్ బ్యాంక్ టింకాఫ్ ఏటీఎంలలో యూరోలు, డాలర్లు ఉన్నాయా లేదా అనే సమాచారం అందించే ఒక టెలిగ్రామ్ బాట్ కూడా తయారుచేశారు. అది తమ సబ్‌స్క్రైబర్లకు ఏటీఎం లొకేషన్ గురించి చెబుతుంది.
చాలామంది తన బ్యాంకింగ్ యాప్ ద్వారా ప్రీ-క్యాష్-ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది రష్యా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ఒక అధునాతన సౌకర్యం.
ఆదివారం సాయంత్రం రష్యా సెంట్రల్ బ్యాంక్ మీద ఆంక్షలు ప్రకటించిన సమయానికి ఆ యాప్ ద్వారా 140 రూబుళ్ల విలువైన డాలర్లు, 150 రూబుళ్ల వరకూ యూరోలను ఆర్డర్ చేయవచ్చని చెప్పారు.
కానీ, సోమవారం ఆ యాప్ ద్వారా క్యాష్ ఆర్డర్ చేయడం కుదరదని రష్యాలోని స్బెర్‌బ్యాంక్ బీబీసీ రష్యాకు చెప్పింది. క్యాష్ కోసం ఇప్పుడు తమ బ్రాంచ్‌కు వెళ్లి ఒక ఫాం నింపాల్సి ఉంటుదని తెలిపింది.
అయోమయంలో ప్రజలు
అయితే బ్యాంక్‌లో నగదు కొరత ఉందనే విషయాన్ని మాత్రం అది నిరాకరిస్తోంది. ముందు ముందు ఏటీఎంలలో క్యాష్ కొరత లేకుండా చూసుకోడానికి, ఎలాంటి సమస్యలు లేకుండా బ్యాంక్ నడిపించడానికే అది అలా చెబుతోందని నిపుణులు అంటున్నారు.
ఈ ఆంక్షలు ఎదుర్కోడానికి రష్యా మొదటి నుంచీ సిద్ధంగా ఉందని క్రెమ్లిన్ చెప్పింది. అయితే కరోనా మహమ్మారి సమయంలో చేసినట్లే, వ్యాపారాలకు కాస్త అదనపు సాయం అందిస్తారా లేదా అనేది మాత్రం అది చెప్పలేదు.
రాజధాని మాస్కోలో ప్రజలు ఇప్పటికే ఆహార పదార్థాల షాపుల ముందు క్యూలు కట్టినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ముందు ముందు వాటి సరఫరా తగ్గుతుందని, ఆంక్షలతో ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వాళ్లంతా భయపడుతున్నారు. వీలైనంత ఎక్కువ సరుకులు నిల్వ చేసుకోవాలనుకుంటున్నారు.
ఆంక్షల వల్ల రష్యా కంపెనీల ఉత్పత్తిలో కూడా కోత కనిపించవచ్చు. అవి మూత కూడా పడే అవకాశం ఉంది. దాంతో ప్రజల నిల్వలు కూడా తగ్గిపోతాయి. పశ్చిమ దేశాలతో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇప్పటి పరిస్థితులు రష్యన్లకు ఆరేళ్ల క్రితం 2014లో క్రైమియాపై ఆక్రమణ జరిగినప్పటి విషయాలను గుర్తుకు తెస్తున్నాయి. అప్పుడు కూడా జనాలు ఏటీఎంల బయట గంటలు గంటలు క్యూలో నిలబడిన దృశ్యాలు కనిపించాయి.
అప్పట్లో ఒక డాలర్ విలువ సాధారణంగా ఇప్పుడు ఊహకు కూడా అందనంతగా 30 నుంచి 35 రూబుళ్లు ఉండేది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













