యుక్రెయిన్ సంక్షోభం: రష్యా సమాచార యుద్ధం చేస్తోందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేలీన్ డెవ్లిన్, ఓల్గా రాబిన్సన్
- హోదా, బీబీసీ మానిటరింగ్ & రియాలిటీ చెక్
యుక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్న రష్యా.. మీడియా కథనాలను నియంత్రించే ప్రయత్నం కూడా చేస్తోంది. అది ఏ సమాచారాన్ని వక్రీకరించి చూపిస్తోంది?
క్రెమ్లిన్ అనుకూల మీడియా సంస్థలు రాస్తున్న రాతలు, అనుసరిస్తున్న విధానాలు కొన్నింటిని పరిశీలించి అందిస్తున్న కథనం ఇది.
నిజానిజాలు తేల్చకుండానే వార్తా కథనాల ప్రసారం
యుక్రెయిన్ పట్ల దురభిప్రాయాన్ని కలిగించే విధంగా భావోద్వేగాలు ప్రేరేపించే సమాచారాన్ని, సందేహాస్పద సమాచారాన్ని ప్రోత్సహించే చరిత్ర రష్యన్ మీడియాకు ఉంది.
ఒకసారి 2014లో ఏం జరిగిందో చూద్దాం. రష్యా మీడియా వ్యవహార సరళి గురించి ఈ విషయాన్నే చాలా మంది ప్రస్తావిస్తుంటారు.
అప్పుడు రష్యా అధికారిక టీవీ ఓ మహిళా శరణార్థిని పదే పదే చూపించింది. యుక్రెయిన్ సైనికులు ఓ మూడేళ్ల బాలుడిని చంపేశారని ఆ శరణార్థి చెప్పడం రష్యా టీవీ ద్వారా బాగా ప్రచారమైంది.
అయితే, ఆమె చెప్పిన మాట నిజమేనని నిరూపించే ఆధారాలు వేటినీ ఆ టీవీ చూపించలేదు. తరువాత వారు ఆ వార్తను వదిలేశారు. 'పసిబాలుడి బలిదానం' పేరున ఆ కథనం బాగా వ్యాప్తిలోకి వచ్చింది.

తాజాగా, రష్యా ప్రభుత్వ అనుకూల మీడియో యుక్రెయిన్ దళాలు వలసపోతున్న వారిని కాల్చి చంపుతున్నట్లుగా ఆరోపిస్తూ ఓ వీడియోను ప్రసారం చేసింది. బెలారస్ సరిహద్దున జరిగినట్లు చెబుతున్న ఆ వీడియోలోని దృశ్యాలు వాస్తవమా కాదా అన్నది ఎవరూ నిర్ధరించలేదు.
ఇన్‌ఫ్రారెడ్ కెమేరాతో తీసిన ఆ వీడియో క్లిప్ స్పష్టంగా లేదు. దాన్ని డిసెంబర్ మొదట్లో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాన్ని రష్యా మీడియా సంస్థలు 'స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం' అంటూ ప్రసారం చేశాయి. యుక్రెయిన్ సైనికులు శరణార్థులను కాల్చి చంపుతున్నారని వ్యాఖ్యానించాయి.
అయితే, మొట్టమొదట ఎవరి ఫేస్‌బుక్ అకౌంట్లో అయితే ఆ వీడియో పోస్ట్ అయిందో ఆ అకౌంటు కలిగిన సైనికుడు తన ఎఫ్.బి అకౌంట్ హ్యాక్ అయిందని ప్రకటించారు.
అంతేకాదు, ఈ వీడియో కథనాలను ప్రసారం చేసిన ఓ స్థానిక న్యూస్ వెబ్ సైట్, మరొక ప్రభుత్వేతర సంస్థ కూడా తమ వెబ్ సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపాయి. ఈ ప్రకటనల్లో నిజమెంత అన్నది బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేకపోయింది.

యుక్రెయిన్‌ను నాజీ అనుకూల దేశంగా చూపించే ప్రయత్నం
యుక్రెయిన్ ఒక నాజీ అనుకూల దేశమని సూచించే విధంగా వార్తలు ప్రసారం చేయడమన్నది రష్యా మీడియాలో క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది.
ఉదాహరణకు, నాజీయిజాన్ని కీర్తించడాన్ని వ్యతిరేకిస్తూ రష్యా మద్దతుతో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి యుక్రెయిన్, అమెరికా దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయని రష్యా విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నిజమే, ఆ రెండు దేశాలూ ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకించాయి. కానీ, ఆ దేశాలు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాయన్నది రష్యా విదేశాంగ మంత్రి తన పోస్టులలో వివరించలేదు. ఉద్దేశపూర్వక ప్రచార లక్ష్యాలతో ఆ తీర్మానాన్ని చేశారని, అందుకే దాన్ని సమర్థించడం లేదని యుక్రెయిన్ తెలిపింది.
'రష్యా చేస్తున్న దుష్ప్రచార కార్యక్రమాన్ని చట్టబద్ధం చేసే బలహీన ప్రయత్నం' అని ఆరోపిస్తూ అమెరికా కూడా దానికి దూరంగా నిలిచింది.
ఓటింగ్ తరువాత అమెరికా, యుక్రెయిన్ దేశాలు రెండూ కూడా నాజీయిజాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇక, యుక్రెయిన్ మితవాద గ్రూపులకు, నియో నాజీలకు మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా, జాతీయవాద అజోవ్ బెటాలియన్ యుక్రెయిన్ సంక్షోభం సమయంలో బలంగా తెర ముందుకు వచ్చింది. అది ఇప్పుడు దేశ సైన్యంలో ఒక యూనిట్‌గా మారింది.
ఏది ఏమైనా, మితవాదుల సమూహం దేశంలో అతి చిన్న మైనారిటీ కూటమిగా మిగిలిపోయింది. 2019 ఎన్నికల్లో సంప్రదాయ మితవాద సంస్థలైన స్వోబోడా వంటివి పార్లమెంటులోకి అడుగుపెట్టడానికి కావలసిన 5 శాతం కనీసం ఓట్లను కూడా పొందలేకపోయాయి.
గత నవంబర్ నెల నుంచి యుక్రెయిన్‌కు నాజీవాదంతో ముడిపెట్టి చూపించే ప్రయత్నాలు పెరిగిపోయాయని లాజికల్లీ అనే టెక్నాలజీ కంపెనీ తెలిపింది. ఈ సంస్థ క్రెమ్లిన్ అనుకూలంగా పని చేస్తున్న వందలాది సోషల్ మీడియా అకౌంట్లను నిరంతరం గమనించే పనిలో ఉంది.
'కీలక సందర్భాల్లో' ఇలాంటి కథనాలను రష్యా-అనుకూల మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారని లాజికల్లీ సంస్థకు చెందిన బ్రయాన్ మర్ఫీ అన్నారు.
"రష్యా దౌత్య ప్రయత్నాలకు వ్యతిరేకంగానో లేదంటే ప్రపంచంలో ఏదైనా ముఖ్యమైన ఘటన జరుగుతున్నప్పుడో ఇలాంటి సమాచార వితరణలో స్పైక్ కనిపిస్తుంది" అని ఆయన చెప్పారు.
రష్యా తన బాధితులు, యూరప్‌లోని వ్యతిరేకుల మీద నాజీలనే ముద్ర వేయడంలో ఏమాత్రం ఆలస్యం చేయదు" అని రష్యా సమాచార యుద్ధం మీద నాటో రిపోర్ట్ తయారు చేసిన కియర్ గైల్స్ వ్యాఖ్యానించారు.
"ఇది ఒక్క యుక్రెయిన్‌లోనే కాదు, రష్యా విషం చిమ్మే బాల్టిక్ రాష్ట్రాలలో కూడా కనిపిస్తుంది" అని ఆయన అన్నారు.
పాఠకుల కామెంట్లే ప్రజాభిప్రాయంగా...
ఇటీవలి వారాల్లో రష్యా మీడియా సంస్థలు యుక్రెయిన్‌కు లభిస్తున్న అంతర్జాతీయ మద్దతు గురించి కూడా పాక్షిక కథనాలు ప్రసారం చేశాయి. కేవలం పాశ్చాత్య మీడియా సైట్లలోని పాఠకుల కామెంట్లే దీనికి ఆధారం.
జనవరి చివరలో రష్యా అధికార వార్తా సంస్థ 'ఆర్ఐఏ నోవోస్తీ' వెబ్‌సైట్ ప్రచురించిన ఓ కథనంలో, 'రష్యాకు ఈ ప్రాంతంలో నాటోకి మించిన బలగాలు ఉన్నాయి కాబట్టి యుక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకూడదని 'డెయిలీ ఎక్స్‌ప్రెస్' బ్రిటిష్ పాఠకులు అభిప్రాయపడ్డార'ని రాశారు.
యుక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని చూసి పాఠకులు నవ్వుతున్నారని మరో కథనంలో పేర్కొన్నారు.

రష్యా ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడం కోసం బ్రిటన్ తదితర దేశాల మీడియా సైట్లను టార్గెట్ చేస్తూ క్రెమ్లిన్ అనుకూల ఫేక్ అకౌంట్లు ట్రోలింగ్ పాల్పడుతున్నాయనే ఆందోళనలూ వినిపిస్తున్నాయి.
కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన క్రైమ్ సెక్యూరిటీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ చేసిన పరిశోధనలో, క్రెమ్లిన్ అనుకూల ట్రోలర్లు డెయిలీ ఎక్స్‌ప్రెస్ సహా 32 ప్రధాన స్రవంతి వార్తా సంస్థల కామెంట్ సెక్షన్లను టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. పాశ్చాత్య-వ్యతిరేక, రష్యా-అనుకూల కామెంట్లను ఆ తరువాత రష్యా భాషా మీడియాలో కథనాలకు ఆధారం చేసుకున్నట్లు కూడా ఆ పరిశోధన తేల్చి చెప్పింది.
రష్యాకు మద్దతు కోసం పాశ్చాత్య స్వరాలను అతిగా చేసి చూపించడం
గత ఏడాది నవంబర్ నెలలో రష్యా అనుకూల ప్రచారం నాటకీయంగా ఊపందుకుందని అసత్య ప్రచారాలను ఎదుర్కొనే మైథోస్ ల్యాబ్స్ తెలిపింది.
ఆ నెలలో రష్యా అనుకూల అకౌంట్లు యుక్రెయిన్ గురించి సగటున రోజుకు 213 సార్లు ట్వీట్స్ చేశాయి.
రష్యాకు అనుకూలంగా ఉన్న రష్యాయేతరుల మాటలు, అభిప్రాయాలను తీసుకుని ప్రచారం చేయడం ఒక వ్యూహంగా మారిందని ఆ పరిశోధకులు తెలిపారు.

ఫొటో సోర్స్, TWITTER
అలా షేర్ చేసిన అభిప్రాయాల్లో ఆస్ట్రేలియా జర్నలిస్ట్ జాన్ పిల్గర్ వ్యాఖ్య ఒకటి. జాన్ తన తాజా ట్వీట్‌లో అమెరికా 2014లో యుక్రెయిన్‌లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిందని ఆరోపించారు.
ఆయన ట్వీట్లను 87 అకౌంట్లు రీట్వీట్ చేశాయి. ఆ అకౌంట్లన్నీ యుక్రెయిన్ విషయంలో రష్యా-అనుకూల భావజాలాన్ని ప్రసారం చేస్తున్నవేనని పరిశోధకులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













