అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు పాకిస్తాన్ వెళ్లారా, అక్కడి స్టార్ హోటళ్లలోని విదేశీ సైనికులెవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షాజాద్ మాలిక్, షహీద్ అస్లాం
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
‘‘ఈ హోటల్‌లో ఎంతమంది నాటో, అమెరికన్ సైనికులు, అధికారులు ఉంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మీ హోటల్‌లోకి విదేశీయుల తాకిడి పెరిగిందా?''
ఈ ప్రశ్నలు అడగడంతో ఇస్లామాబాద్‌లోని ఓ పెద్ద హోటల్ సెక్యూరిటీ ఇంచార్జికి చిర్రెత్తుకొచ్చింది.
''మీరు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మీరు విలేఖరా, ఇంకెవరా అనేది మాకు తెలియదు కదా, నేనెందుకు ఈ డాటా అంతా చెక్ చేయాలి'' అని కోపంతో సదరు హోటల్ సెక్యూరిటీ అధికారి జర్నలిస్ట్‌తో అన్నారు.
మేం సోమవారం ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌కు చేరుకున్నప్పుడు ఆ హోటల్ మేనేజ్‌మెంట్ మాకు ఈ మాటలతో స్వాగతం పలికింది.
కాబుల్ పేలుళ్ల తరువాత, అఫ్గానిస్తాన్ నుంచి తరలించిన విదేశీయులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి అన్ని ప్రైవేట్ హోటళ్లలో ఇతరులు బుకింగ్ చేయకుండా ఇస్లామాబాద్ జిల్లా అధికారులు నిషేధం విధించారు.
విదేశీ సైనికులు హోటల్‌లో బస చేయడంతో మునుపటితో పోలిస్తే భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు లాబీ, కారిడార్‌లలో సోఫాల దగ్గర కనిపిస్తున్నారు.
'ఒక్క అమెరికా సైనికుడు కూడా పాకిస్తాన్‌కు రాలేదు'
తనకు తెలిసినంత వరకు ఒక్క అమెరికా సైనికుడు కూడా అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు రాలేదని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నారు.
కానీ, ఇస్లామాబాద్‌లో సుమారు మూడున్నర వేల మంది విదేశీయులు ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన ధ్రువీకరించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 100 మందికి పైగా నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయ్యారు. కానీ, వారు పౌరులా, సైనికులా అనేది ఆయన చెప్పలేదు.

ఫొటో సోర్స్, MARCUS YAM / LOS ANGELES TIMES
గత కొన్ని రోజులుగా ఇస్లామాబాద్ విమానాశ్రయం, హోటల్‌లలో విదేశీ సైనికుల ఉనికికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సైనికుల యూనిఫామ్‌లు అమెరికన్ సైనికుల యూనిఫామ్‌ల కంటే భిన్నంగా ఉన్నాయని, వారు అమెరికా సైనికులు కాకపోవచ్చని మరికొందరు యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఎఫ్ఐఏ ఇమ్మిగ్రేషన్ రికార్డుల ప్రకారం, ఇప్పటివరకు 1,627 మంది అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్తాన్ వచ్చారని షేక్ రషీద్ అహ్మద్ చెప్పారు.
ఇస్లామాబాద్ విమానాశ్రయం లోపల ప్రస్తుతం 700 మంది విదేశీయులు ఉన్నారన్నారు. వారు తమ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదని తెలిపారు.
''అమెరికా సైనికులు పాకిస్తాన్‌కు వచ్చి ఉంటే, అమెరికా రాయబార కార్యాలయ అధికారులు విదేశాంగ శాఖను సంప్రదించవచ్చు . భద్రతా చర్యల గురించి విదేశాంగ శాఖ అధికారులు హోం శాఖ కార్యాలయానికి తెలియజేసేవారు" అని షేక్ రషీద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'ప్రతిచోటా విదేశీ సైనికులు ఉన్నారు'
కానీ, మంత్రి చెప్పిన దానికి విరుద్ధంగా సెరెనా హోటల్ ప్రధాన ద్వారం నుంచి లోనికి వెళ్తే అక్కడ లాబీ రద్దీగా కనిపిస్తోంది.. విదేశీ సైనిక సిబ్బంది యూనిఫాంలో కనిపిస్తున్నారు.
హోటల్ వర్గాల సమాచారం ప్రకారం, సైనిక సిబ్బంది కోసం వివిధ రాయబార కార్యాలయాలు దాదాపు 150 గదులను బుక్ చేసుకున్నాయి. విమానాశ్రయం నుంచి హోటల్‌కు విదేశీ సైనికులను తీసుకెళ్లడానికి కనీసం మూడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. వీటిని వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేశాయి.
హోటల్‌లో ఉన్న జర్నలిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి హోటల్ మేనేజ్‌మెంట్ తన గదిని మార్చుతున్నట్లు చెప్పారన్నారు. సోమవారం విదేశీ ప్రతినిధి బృందం వస్తోంది, వీరి కోసం హోటల్ మొత్తం ఫ్లోర్ బుక్ చేశామని చెప్పినట్టు తెలిపారు.
హోటల్ నుంచి షాపింగ్ కోసం కొంతమంది విదేశీ సైనికులు బయటకు వెళ్తున్నారని హోటల్ వర్గాలు తెలిపాయి. కొంతమంది హోటల్‌లోని మసాజ్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలను కూడా ఉపయోగించుకున్నారని వారు చెప్పారు.
కొందరు బిర్యానీని ఆస్వాదిస్తుంటే మరికొందరు చేపల వేపుడును ఇష్టపడుతున్నారు. అదేవిధంగా భోజన సమయంలో, ఈ సైనికులు గుంపుగా కనిపిస్తున్నారు. అక్కడ కొందరు లస్సీని ఆస్వాదిస్తుంటే, మరికొందరు ఇతర పానీయాలను తాగుతున్నారు.
హోటల్‌లో విదేశీ సైనికులు ఉంటున్న సమయంలో, చాలా తక్కువ మంది స్థానిక ప్రజలు భోజనం చేస్తూ కనిపించారు. అదేవిధంగా, విదేశీ సైనికులు ఏ పౌరుడితో కబుర్లు చెప్పడం లేదా సెల్ఫీలు తీసుకోవడం కనిపించలేదు.
ఒక జర్నలిస్ట్ ఒక విదేశీ సైనికుడిని సెల్ఫీ తీసుకోమని అడిగినప్పుడు, ఆయన మొదట అంగీకరించాడు. కానీ, తరువాత ఓ సీనియర్ అధికారి ఆదేశం మేరకు, సైనికులు సెల్ఫీ తీసుకోవడానికి నిరాకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సైనికులంతా ఎవరు?
నాటో సైన్యంలోని బ్రిటిష్, జపనీస్, అరబ్, అనేక యూరోపియన్ దేశాల సైనికులు మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్ చేరుకున్నారని పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
వారితో పాటు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కూడా హోటళ్లలో బస చేస్తున్నారని తెలిపాయి. వారు అఫ్గానిస్తాన్‌లో విదేశీ దళాలు వెనక్కు వెళ్లిన తర్వాత ఇస్లామాబాద్ చేరుకున్నారు. వీరి సంఖ్య సుమారు 400గా ఉంది. వీరి రాకపై జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సమాచారం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
నాటో సైనికులకు పాకిస్తాన్ వీసాలు జారీ చేశారు. వారు వారి హోటల్ బస, ఆహారం, ప్రయాణం, వీసా సహా అన్ని ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
రావల్పిండి పరిపాలన అధికారుల ఆదేశాల మేరకు ఓ పెద్ద హోటల్లో వందకు పైగా గదులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, యాభైకి పైగా బస్సులు అక్కడ ఉన్నాయని సమాచారం.
సంబంధిత అధికారుల నుంచి తమకు అందిన సూచనల ప్రకారం ట్రాన్సిట్ వీసాలు, ఇమ్మిగ్రేషన్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ హోటళ్లలో ఉండటానికి అనుమతిస్తామని జిల్లా పరిపాలన అధికారి బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- ‘కోవిడ్ ప్రపంచాన్నంతా వణికించిందిగానీ, నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు’
- అఫ్గానిస్తాన్: 'ఓటమి ఎరుగని' పంజ్‌షీర్ లోయ కథ
- ఇందిరా పార్క్: 'పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు' అనే నిర్ణయంపై వివాదం, మహిళా సంఘాల ఆగ్రహం
- తాలిబాన్లు జిహాద్‌పై అమెరికా వదిలిన బాణమా... - ఇస్లామిక్ స్టేట్ ఎందుకలా ప్రచారం చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








