జార్జి ఫ్లాయిడ్‌: ‘ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా.. గోతిలో పడింది’ - అమెరికాలో నిరసనలతో ఆ దేశాలు కసి తీర్చుకుంటున్నాయా?

అమెరికా నిరసనలు

ఫొటో సోర్స్, AFP

ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాను విమర్శించడానికి ఆఫ్రో-అమెరికన్‌ జార్జిఫ్లాయిడ్‌ హత్య ఉదంతం ఆయా దేశాలకు మంచి అవకాశాన్నిచ్చింది.

అమెరికాలో యాంటి రేసిస్ట్‌ ఆందోళనలను ఇరాన్‌, రష్యా, చైనా, టర్కీలలో మీడియా విస్తృతంగా కవర్‌ చేసింది. అమెరికా వ్యాప్తంగా నిరసనకారులు వీధుల్లో ఆందోళన చేస్తుండగా, పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి అణచి వేసే ప్రయత్నం చేస్తున్నారు.

అధ్యక్షుడు ట్రంప్‌ సైన్యాన్ని రంగంలోకి దింపుతానని ప్రకటించారు. ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యతో ఈ అశాంతి రగులుకుంది. చివరకు కరోనాపై ప్రపంచ మీడియా కవరేజ్‌ను కూడా ఈ అంశం పక్కనబెట్టేలా చేసింది.

ప్రజాస్వామ్యం గురించి అమెరికా నుంచి విమర్శలు ఎదుర్కొన్న దేశాలలో మీడియా సంస్థల చేతికి ఇప్పుడు మంచి పని దొరికింది.

హాంగ్ కాంగ్‌లో 2014 నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాంగ్ కాంగ్‌లో నిరసనల విషయంలో చైనాను అమెరికా చాలా కాలంగా విమర్శిస్తోంది

చైనా

హాంకాంగ్‌లో జరగుతున్న ఆందోళనలకు, అమెరికా అమెరికాలో జరుగుతున్న నిరసనలకు లింకు పెడుతూ చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తనదైన శైలిలో కవరేజ్ ఇచ్చింది. గతంలో అమెరికా హాంకాంగ్‌ను 'ప్రజాస్వామ్యానికి ఒక అందమైన నిలయం'గా పేర్కొన్న విషయాన్ని ఆ పత్రిక పాఠకులకు గుర్తు చేసింది.

''హాంకాంగ్‌లో ఏడాది పాటు ఆందోళనలు నడిచినా అక్కడ సైన్యాన్ని దించలేదు. కానీ అమెరికాలో మిన్నెసోటా ఆందోళనలు మొదలై మూడు రోజులు గడవక ముందే అధ్యక్షుడు ట్రంప్‌ మిలిటరీని దింపుతానంటూ బెదిరించారు'' అని గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ హు జిజిన్‌ తన కాలమ్‌లో రాశారు.

హాంకాంగ్‌లో ఆందోళనకారులకు రోడ్లను ఎలా బ్లాక్‌ చేయాలో, పోలీసులను ఎలా ఎదుర్కోవాలో అమెరికా నుంచి ఆన్‌లైన్‌ శిక్షణ నడిచినట్లు తెలిపే ట్విటర్‌ స్క్రీన్‌షాట్లను ఆ పత్రిక వెబ్‌సైట్లో ప్రచురించింది. ''కోడి పిల్లలు ఇప్పుడు అమెరికా గూటికి చేరుకున్నట్లున్నాయి'' అని గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక కామెంట్ చేసింది.

అమెరికా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనల సమయంలో అమెరికా అధ్యక్షుడు బంకర్‌లో దాక్కోవటం పట్ల.. చైనా సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి

హాంకాంగ్‌ విషయంలో అమెరికా చైనాను అనేకసార్లు విమర్శించింది. 2014 నుంచి కొనసాగుతున్న ఆందోళనలకు అమెరికా మొదటి నుంచి మద్దతు తెలుపుతూ వచ్చింది. తాజాగా రక్షణ బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్‌ మొదలైన ఆందోళనలకు కూడా అమెరికా మద్దతిచ్చింది.

అయితే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న నిరసనలపై చైనా సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ట్విటర్‌పై చైనాలో నిషేధంలో ఉండగా, అదే తరహాలో ప్రభుత్వ కనుసన్నలలో నడిచే 'వీబో' సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లో అమెరికా మీద జోకులు పేలుతున్నాయి.

ట్రంప్‌ ఇటీవల వైట్‌హౌస్‌ బంకర్‌లో దాక్కున్నారంటూ వచ్చిన వార్తలపై 'వీబో'లో విపరీతమైన కామెంట్లు నడుస్తున్నాయి. ''మీరు ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షులు. మీ ప్రజలకే మీరు ఎందుకు భయపడుతున్నారు'' అన్న కామెంట్లకు 85,000 లైక్‌లు వచ్చాయి.

''హాంకాంగ్‌లో కనిపించిన దృశ్యాలే మీ దేశంలోనూ కనిపిస్తున్నాయి'' అని ఇంకో యూజర్‌ కామెంట్ చేశారు.

టెహ్రాన్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉక్రెయిన్ విమానం కూలిపోయిన ఘటనలో ఓ మృతురాలి ఫొటో ప్రదర్శిస్తున్న ఒక నిరసనకారుడు

ఇరాన్‌

అమెరికాతో అత్యంత దారుణమైన సంబంధాలున్న చాలా కొద్ది దేశాలలో ఇరాన్‌ ముందు వరసలో ఉంటుంది. 1979 విప్లవం తర్వాత అమెరికా నుంచి ఇరాన్ ఆంక్షలను ఎదుర్కొంటూనే ఉంది.

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య తర్వాత అమెరికాలో నల్లజాతీయు హక్కులకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పాలన భంగం కలిగిస్తోందని, దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిపించాలంటూ ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ ఒక కాలమ్‌ రాసింది.

''మానవహక్కుల ఉల్లంఘనపై అమెరికా వివిధ దేశాలపై విమర్శలు చేస్తుంది. కానీ మధ్యప్రాచ్య దేశాలలో ఆ దేశం, ఆ దేశ మిత్ర రాజ్యాలు పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి దానికి ఏమాత్రం పట్టింపు ఉండదు'' అని ఆ కాలమ్‌లో విమర్శించింది.

మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ జావెద్‌ జరీఫ్‌ అమెరికా పోలీసుల దాష్టీకాన్ని, ఇరాన్‌ అమెరికాపై విధిస్తున్న ఆంక్షలతో పోల్చారు.

ఇటు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా మర్షాద్‌ నగరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ పెద్దలు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారంటూ ట్విటర్‌లో విమర్శలు చెలరేగాయి.

''గతంలో ఉక్రెయిన్‌ విమాన ప్రమాదంలో మరణించిన వారికి మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన వారిని అరెస్టు చేశారు'' అని ఒక నిరసకారుడు ఆరోపించారు. మరికొందరు అమెరికాలో జరుగుతున్న ఆందోళనలను గత నవంబర్‌లో ఇరాన్‌లో జరిగిన నిరసనోద్యమాలతో పోల్చారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అంచనా ప్రకారం ఇరాన్‌ ప్రభుత్వ అణచివేత కారణంగా 300 మంది బలయ్యారు.

2012లో రష్యాలో ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనకారుల మీద అల్లర్ల ఆరోపణలతో విచారణ చేపట్టటం ఆపేయాలంటూ రష్యా ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది

రష్యా

అమెరికా ఆత్మవంచనకు పాల్పడుతోందంటూ రష్యన్‌ మీడియా కూడా విమర్శించింది. ''ఇలాంటి ఆందోళనలు రష్యాలో జరిగితే అమెరికా దాని మిత్రదేశాలు మనపై మరిన్ని ఆంక్షలు రుద్దేవి'' అని టీవీ జర్నలిస్ట్‌ దిమిత్రి కిసెల్యోవ్‌ అన్నారు.

''నల్ల సముద్రంలో క్రిమియా నుంచి ఉక్రెయిన్‌ వరకు రష్యా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు, దాని వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అమెరికా అనేక ఆంక్షలను విధించింది'' అని ఆయన అన్నారు.

''ప్రపంచం ఎలా ఉండాలో అమెరికా నీతులు చెబుతుంది. కానీ పోలీసు దాష్టీకాలకే కాదు, కరోనా వైరస్‌కు కూడా అమెరికాలోనే ఎక్కువమంది బలయ్యారు'' అని కిసెల్యోవ్‌ అన్నారు.

చైనాలో సంఘటనలను, అమెరికాలో ఆందోళనలను తన టీవీ కార్యక్రమం సందర్భంగా కిసెల్యోవ్‌. అమెరికాలో సోషల్ మీడియాపై కూడా ఎక్కడలేని ఆంక్షలు పెట్టారని ఆయన విమర్శించారు.

''గతంలో టర్కీ, ఈజిప్టులలో జరిగిన ఘటనలను నేరాలుగా చిత్రించిన అమెరికా ఇప్పుడు తన దేశంలో అదే పని చేస్తోంది'' అని చానల్‌ వన్‌ రష్యా అనే టీవీ చానల్‌ ఈవినింగ్ న్యూస్‌లో విమర్శలు చేసింది.

2013లో ఇస్తాంబుల్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2013లో టర్కీలో గెజీ పార్క్ నిరసనల్లో పలువురు చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు

టర్కీ

టర్కీలో ప్రభుత్వ అనుకూల మీడియాగా పేరున్న 'యెని సఫక్‌' దినపత్రిక అమెరికాలో జరుగుతున్న నిరసనలను 'ఆఫ్రో-అమెరికన్ విప్లవం'గా అభివర్ణించింది. అలాగే 'సబా' అనే పత్రిక కూడా 'ఐ కాంట్‌ బ్రీత్‌ ఉద్యమం ఉధృతంగా విస్తరిస్తోంది'' అని రాసింది.

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంపై ''జాత్యహంకార, ఫాసిస్టు హత్యపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను'' అంటూ అధ్యక్షుడు ఎర్డోగన్‌ చేసిన ట్వీట్‌ను టర్కీలోని ప్రధాన పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

సోషల్‌ మీడియాలో ప్రభుత్వ అనుకూల యూజర్లు కొందరు గతంలో టర్కీ నిరసనలపై పోలీసులు అనుసరించిన విధానాలకు సంబంధించి అమెరికా చేసిన విమర్శలను గుర్తు చేశారు. ''తన పాపాలకు అమెరికా శిక్ష అనుభవిస్తోంది'' అని కొందరు రాశారు.

2013లో ఇస్తాంబుల్‌లోని గెజి పార్క్‌ సమీపంలో నిర్మాణాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా.. పోలీసులు నిరసనకారులను దారుణంగా అణచివేస్తున్నారంటూ అమెరికా విమర్శలు చేసింది.

అయితే కొందరు సోషల్ మీడియా యూజుర్లు అమెరికాపై విమర్శల విషయంలో అధ్యక్షుడు ఎర్గోగన్‌ ఆత్మవంచనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ దేశంలో ప్రముఖ ఆన్‌లైన్‌ చర్చా వేదిక 'ఎక్సీసొజ్‌లక్‌' లో ఒక యూజర్‌ అధ్యక్షుడు ఎర్డోగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

2013 నిరసనల్లో 13 ఏళ్ల చిన్నారి తలకు టియర్‌ గ్యాస్‌ బుల్లెట్ తగిలి మరణించిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ''మా దేశంలో రేసిస్టులు అమెరికాలో జాతి వివక్ష గురించి విమర్శలు చేస్తున్నారు. మీకా హక్కు ఉందా? అమెరికాపై మీ విమర్శలు ముగిశాక మిమ్మల్ని మార్దిన్‌కు తీసుకెళతాను'' అని జర్నలిస్టు నుర్కాన్‌ బేసల్‌ అన్నారు.

మార్దిన్‌ అనే ప్రాంతంలో 40 మందిని సామూహిక ఖననం చేసినట్లు ఇటీవలే బైటపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)