కరోనావైరస్: చనిపోయారని మృతదేహం అప్పగించారు... ఆ తర్వాత కోలుకున్నారు వచ్చి తీసుకెళ్లండని ఫోన్ చేశారు...

ఫొటో సోర్స్, NILESH KATKE
- రచయిత, భార్గవ్ ఫారిక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లోని అహమ్మదాబాద్ నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం నాడు జరిగిన ఘటన అందర్నీ నివ్వెరపరచింది.
ఆస్పత్రిలో కోవిడ్-19 వ్యాధికి చికిత్స పొందుతున్న ఓ రోగి మరణించారంటూ ఆయన బంధువులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఓ రోజు గడిచిన తర్వాత అదే ఆస్పత్రి నుంచి మరో ఫోన్ వచ్చింది. ఈ సారి వచ్చిన సమాచారం ముందు ఇచ్చిన సమాచారానికి పూర్తి విరుద్ధంగా ఉంది.
వారి బంధువుకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, మీరు ఇంటికి తీసుకువెళ్లవచ్చన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. తీరా ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఆయన మృతికి సంబంధించిన డాక్యుమెంట్లను చేతుల్లో పెట్టారు.
నికోల్ ప్రాంతానికి చెందిన 71 ఏళ్ల వయసున్న దేవ్రం భిస్కర్ డయాబెటిక్ రోగి. నాలుగు రోజుల క్రితం శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తగా ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.
ఆస్పత్రిలో చేర్చుకునే ముందే భిస్కర్ అల్లుడు నిలేష్ నిక్తేతో ఆస్పత్రి వర్గాలు ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే తమ బాధ్యత కాదంటూ ఓ లేఖ రాయించుకున్నారు.
“మా మామయ్యను కోవిడ్-19 ఆస్పత్రిగా మార్చిన స్థానిక ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చాం. ఆ సమయంలో నిర్వహించిన డయాబెటిక్ పరీక్షలో ఆయన షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా (575) ఉన్నాయి. నన్ను ఆ లెటర్‌పై సంతకం పెట్టమన్నప్పుడు నేను ఓ సారి ఆయన్ను చూడాలని అడిగాను. దాంతో ఆస్పత్రి సిబ్బంది వీడియో కాల్ ద్వారా ఆయన్ను చూపించారు. ఆయన్ను చూసిన తర్వాత నేను సంతకం పెట్టాను” అని నీలేష్ బీబీసీకి చెప్పారు.
వైద్యులు చికిత్స ప్రారంభించిన తర్వాత వారికి ఆయన ఆరోగ్యంపై ఆశలు చిగురించాయి.
“అన్ని విధివిధానాలను పూర్తి చేసుకొని మేం ఇంటికి తిరిగి వచ్చాం. మర్నాడే కరోనావైరస్ కారణంగా ఆయన మరణించారంటూ ఆస్పత్రి నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఆస్పత్రికి వెళ్లగానే నీలి రంగు పీపీఈ కిట్ చుట్టిన ఓ మృతదేహాన్ని మాకు అప్పగించారు. అయితే అప్పటికి ఇంకా ఆయన కరోనావైరస్ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు. ఆయన వేసుకున్న దుస్తులు చూపించగానే ఆయన ముఖం కూడా చూడకుండా మా మామయ్య ఇక లేరని బాధపడ్డాం. ఆపై ఆయన అంత్యక్రియల హడావుడిలో పడిపోయాం” అని నీలేష్ చెప్పారు.
దేవ్రం భిస్కర్ కుటుంబంలో ఆయన భార్య సహా ఆరుగురు కుటుంబసభ్యులున్నారు.
ఆయన బతికే ఉన్నారంటూ ఆస్పత్రి నుంచి ఫోన్
“ఓ రోజు గడిచిన తర్వాత మాకు ఆస్పత్రి నుంచి మరోసారి ఫోన్ వచ్చింది. మా మామయ్యకు కరోనావైరస్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని, ఆయన్ను సాధారణ వార్డులోకి మారుస్తున్నామని, ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారు” అని నీలేష్ బీబీసీతో అన్నారు.
ఆ ఫోన్ కాల్‌తో మొత్తం కుటుంబం అంతా ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది. ఆస్పత్రి వర్గాలు చెప్పినట్టు భిస్కర్ ప్రాణాలతోనే ఉంటే ముందు రోజు వాళ్లు ఎవరికి అంత్యక్రియలను నిర్వహించినట్టు?
ఇదే ప్రశ్నతో నీలేష్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ తీరా అక్కడికి వెళ్లాక అధికారులు భాస్కర్ చనిపోయారని చెప్పడమే కాదు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వారికి అందజేశారు. దీంతో పొరపాటు జరిగి ఉంటుందనుకొని ఊసురుమంటూ ఇంటికి వచ్చిన నీలేష్ కుటుంబ సభ్యులు ఆ వార్తను తమ కుటుంసభ్యులకు చేరవేయడంలో బీజీ అయిపోయారు.
అక్కడితో ఈ ఘటన ముగిసిపోలేదు. మళ్లీ ఆదే ఆస్పత్రి నుంచి వారికి మరో సారి ఫోన్ వచ్చింది. దేవ్రం ఆరోగ్యం మెరుగుపడుతోందన్నది ఆ ఫోన్ సారాంశం.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా


ఫొటో సోర్స్, NILESH KATKE
ఆ తర్వాత ఏం జరిగిందో నీలేష్ ఇలా చెప్పుకొచ్చారు.
“ఇది మాకు ఆస్పత్రి నుంచి వచ్చిన మూడో ఫోన్ కాల్. ఈ సారి ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. అయితే గతంలో వచ్చిన ఫోన్ కాల్స్ గురించి వాళ్లకు చెప్పి ఆయన మరణానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని కోరాం. రెండు గంటల క్రితమే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తమకు నివేదికలు అందాయని చెప్పారు. ఓ సారి ఆయన చనిపోయారంటూ మృత దేహాన్ని కూడా అప్పగించిన ఆస్పత్రి వర్గాలు మరోసారి ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు” అని ఆయన వివరించారు.
క్షమాపణ కోరిన ఆస్పత్రి వర్గాలు
ఇదే విషయమై ఆస్పత్రి డీన్ డా.శశాంక్ పాండ్య తో మేం మాట్లాడాం. అందుకు ఆయన సమాధానమిస్తూ... సమాచార లోపం జరగడం వాస్తవమేనని స్పష్టం చేశారు.
“దేవ్రం భిస్కర్‌ను మే 28న ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన అనారోగ్య లక్షణాలను చూసిన మేము గుజరాత్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 వార్డుకు తరలించాం. ఆ పై ఆయన శాంపిళ్లను పరీక్షల కోసం పంపించాం. మే 29న ఆయన మరణించారు. దాంతో ఆయన కుటుంబానికి భిస్కర్ మృతదేహాన్ని అందజేశాం. ముందు జాగ్రత్తలో భాగంగా మేం కోవిడ్-19 కారణంగా మరణించిన రోగి శరీరాన్ని పీపీఈ కిట్ చుట్టి ఇస్తాం. అందుకే ఆ రోజు ఆయన కుటుంబం ఆ రీతిలో భిస్కర్ మృతదేహాన్ని తీసుకున్నారు.”
ఫోన్ కాల్స్ గురించి డా.పాండ్యాను అడగ్గా ఆయన ఇలా చెప్పుకొచ్చారు.
“ఆయన మరణించినప్పటికీ ఆయన రిపోర్ట్ అప్పటికీ ఇంకా రాలేదు. ఆయన రిపోర్ట్‌లో నెగిటివ్ అని రాగానే ఆయన మరణ వార్త తెలియని సిబ్బంది వారి కుటుంబానికి ఫోన్ చేసి సాధారణ వార్డులోకి మారుస్తున్నట్టు చెప్పారు” అని పాండ్యా వివరించారు.
మృతదేహాలు తారుమారై ఉంటాయన్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. ఇది కేవలం సమాచార లోపం కారణంగానే జరిగిందని డా.పాండ్యా అన్నారు.
ఆ తరువాత భిస్కర్ కుటుంబానికి డాక్టర్ పాండ్యా క్షమాపణ కోరారు. “ఆయన మాకు క్షమాపణ కోరారు. అందుకే మేం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలనుకుంటున్నాం. అయితే వాళ్ల మధ్య జరిగిన సమాచార లోపం కారణంగా మానసికంగా మేం చాలా ఇబ్బందికి గురయ్యాం. ఇంకెవ్వరికీ మాలాంటి పరిస్థితి రాకూడదని మేం కోరుకుంటున్నాం” అని నీలేష్ బీబీసీకి తెలిపారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- అమెరికా: ‘అల్లర్లను అణచివేయటానికి సైన్యాన్ని పంపిస్తున్నా’ - ట్రంప్ ప్రకటన
- తెలంగాణ అవతరణ దినోత్సవం: విలీనం నుంచి విభజన దాకా..
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- భారత్‌లో పరిస్థితులు చేయిదాటిపోతాయా? ‘కళ్లకు గంతలు కట్టుకుని’ యుద్ధం చేయగలమా?
- కరోనావైరస్: మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందా.. శాఖాహారం తింటే వైరస్‌ను అడ్డుకోవచ్చా
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా
- భారత్‌లో కేసులు పెరుగుతున్నా లాక్‌డౌన్‌ను ఎందుకు సడలిస్తున్నారు
- జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








