కరోనావైరస్ టీకా తయారీకి తూర్పు ఆసియాలో ముమ్మర ప్రయత్నాలు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ -19కు టీకా అభివృద్ధి చేసేందుకు తూర్పు ఆసియా దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అయితే, ఈ ప్రక్రియలో దేశాల మధ్య సమన్వయం, మనుషుల ప్రాణాలను ఫణంగా పెట్టి టీకాను కనుగొనేందుకు తీస్తున్న పరుగు, వ్యాక్సిన్ సమర్ధవంతంగా పని చేస్తుందో లేదోననే సందేహాలు సవాళ్లుగా నిలుస్తున్నాయి.

చైనా నేతృత్వంలో అభివృద్ధి చేసిన మూడు ప్రయోగాత్మక టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరాయి. ఈ మూడింటిలో హాంకాంగ్‌కు చెందిన కాన్‌సినో బయోలాజికల్ సంస్థ, బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీ కలిసి తయారు చేసిన ఒక టీకా మనుషులపై పరీక్షల్లో రెండో దశకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా 77 వ్యాక్సిన్లు తయారు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 23న తెలిపింది. అందులో చాలా వరకు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ స్థాయిలో ఉన్నాయి.

సాధ్యమైనంత వేగంగా కోవిడ్-19కు మందు కనిపెట్టాలనే ఆలోచనతో క్లినికల్ ట్రయల్స్‌కు అవసరమైన అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేశామని దక్షిణ కొరియా తెలిపింది.

చైనా అనుభవం ఉపయోగపడుతుందా?

చైనాలోని వుహాన్ నగరంలో కరోనావైరస్ తొలుత బయటపడటంతో, ఆ దేశం వేగవంతంగా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు మొదలుపెట్టింది.

జనవరి 2020 నుంచి ఏప్రిల్ 27 వరకు చైనాలో 82,830 మంది వైరస్ బారిన పడగా, 4,633 మంది చనిపోయారని ఆ దేశ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లోగానే టీకా తయారు కావచ్చని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారి డాక్టర్ గావు ఫు చెప్పారు. 2021 ఆరంభంలో అది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సిజీటీఎన్ ఛానల్ తన కథనంలో తెలిపింది.

వ్యాక్సిన్ అభివృద్ధికి ఎంత కాలం పడుతుందన్న వివరాలు చైనా అధికారి వెల్లడించడం ఇదే మొదటిసారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక రాసింది.

వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి 12 నుంచి 15 నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఏడాది దాకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని అమెరికా చెప్పింది. అమెరికాలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.

రెండో దశలో జరుగుతున్న యాంటీ బాడీ పరీక్షలు సానుకూల ఫలితాలిస్తే, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మరికొన్ని నెలల్లో మొదలవుతాయని చైనా జాతీయ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఏప్రిల్ 27వ తేదీన ప్రచురించిన వ్యాసంలో పేర్కొంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

చైనా ఆశావహ దృక్పథంతో ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ తయారీ మూడో దశ చేరేటప్పటికి తగినన్ని కోవిడ్- 19 కేసులు ఉండకపోవచ్చు, లేదా కేసులు పూర్తిగా తగ్గిపోవచ్చు. దీంతో వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేయడం కష్టం అవుతుంది.

మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి తగినంత మంది రోగులు ఉండటం అవసరమని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.

కోవిడ్- 19 వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు దేశాల మధ్య సమన్వయం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 24న ఒక సహకార వేదికను ఏర్పాటు చేసింది.

వ్యాక్సిన్‌ని ఏ ఒక్క దేశమో, ఒక్క సంస్థో కనిపెట్టలేదని, అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అన్నారు.

ఈ ప్రారంభ కార్యక్రమానికి తూర్పు ఆసియా దేశాలైన మలేషియా, వియత్నాం ఆన్‌లైన్‌లో హాజరు కాగా, చైనా, జపాన్, దక్షిణ కొరియా జాడ మాత్రం కనిపించలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్

వ్యాక్సిన్ తయారు చేసేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేయాలని దక్షిణ కొరియా యోచిస్తోందని యోన్హాప్ వార్తా సంస్థ ఏప్రిల్ 10న ప్రచురించింది.

మలేషియా కూడా వ్యాక్సిన్ తయారీకి, భారత్, రష్యా, బ్రిటన్‌తో పాటు దక్షిణ కొరియా భాగస్వామ్యం అవసరమని భావిస్తోందని, మలేషియా వార్తాపత్రిక న్యూ స్ట్రెయిట్స్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

మలేషియాలో శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ తయారు చేయడానికి అవసరమైన సామర్ధ్యం లేదని ఆ దేశ సైన్స్ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో సభ్య దేశాలన్నీ కలిసి వ్యాక్సిన్ తయారు చేయాలని 2020 మార్చిలో జరిగిన జి20 దేశాల సమావేశంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ కోరారు.

అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ సహకారంతో ఆగష్టు కల్లా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చేయాలని సింగపూర్‌లోని ఎంయుఎస్ మెడికల్ స్కూల్ ప్రయత్నాలు చేస్తోంది.

కరోనావైరస్ టీకా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సవాళ్లు

గత రెండు దశాబ్దాల్లో మహమ్మారులు విజృంభించినప్పుడు ఎదురైన సవాళ్లు ఈ సారి పునరావృతం కాకుండా చూసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

2009లో ఎచ్‌1‌ఎన్‌1 (స్వైన్ ఫ్ల్యూ) ప్రబలినప్పుడు వ్యాక్సిన్ ఖరీదు అధికంగా ఉండటంతో, ప్రపంచ దేశాలన్నిటికీ సమానంగా పంపిణీ జరగలేదని, ఏప్రిల్ 24న ప్రచురించిన కథనంలో జకార్తా పోస్ట్ రాసింది.

ఇప్పుడు కూడా చైనా, అమెరికాల మధ్య తలెత్తిన కలహాల కారణంగా పరిస్థితులు సాఫీగా ఉండకపోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బీజింగ్‌కు అనుకూలంగా పనిచేస్తోందని, ఆ సంస్థకు తాము అందించే నిధులను నిలిపివేస్తామని అమెరికా ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య సహకారంతో వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థకు సాధ్యమయ్యే పని కాదు.

కరోనావైరస్ టీకా

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నాలలో భాగంగా చైనా, దక్షిణ కొరియా క్లినికల్ ట్రయల్స్ చేసే సమయాన్ని తగ్గించేశాయి.

సాధారణ వ్యాక్సిన్లకు క్లినికల్ ట్రయల్స్ చేసే సమయం ఒకటి నుంచి రెండు సంవత్సరాలు ఉంటే, కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ మొదటి దశ మూడు నెలలు మాత్రమే ఉండవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ పేర్కొంది.

చైనాలో రెండవ దశ క్లినికల్ ట్రయిల్‌లో ఉన్న వ్యాక్సిన్ తయారీ మార్చి నెలాఖరులోనే మొదలైంది. దీంతో, వ్యాక్సీన్ భద్రతపై ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాక్సిన్‌ని జంతువులపై ప్రయోగించలేదు.

జంతువులపై ప్రయోగించకుండా, క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయకుండా వాడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని షాంఘైకి చెందిన మైక్రో బయాలజీ ప్రొఫెసర్ జియాంగ్ షీబో అన్నారని ఒక దక్షిణ కొరియా పత్రిక తెలిపింది.

దక్షిణ కొరియాలో రెండోసారి నమోదైన కోవిడ్-19 కేసులతో యాంటీబాడీ వ్యాక్సిన్ తయారీ పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)