కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..

కరోనా గురించి ఇంకా తెలీని ప్రశ్నలు

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, కరోనా గురించి ఇంకా తెలీని ప్రశ్నలు
    • రచయిత, జేమ్స్ గలఘెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ మనకు ఎప్పటినుంచో ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ, దీని గురించి మనలో చాలామందికి 2019 డిసెంబర్‌ నుంచే తెలిసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నా, మనకు ఈ వైరస్ గురించి పెద్దగా ఏమీ తెలీడం లేదు. ఇప్పుడు దీనికి సమాధానాలు వెతుకుతున్న ప్రపంచంలో మనం కూడా భాగ మైపోయాం.

దీనికి సంబంధించి కొన్ని సమాధానాలు లేని పెద్ద ప్రశ్నలు మిగిలిపోయాయి.

1. ఎంతమంది ప్రజలకు వ్యాపించింది

ఇది అత్యంత ప్రాథమిక ప్రశ్నల్లో ఒకటి. కానీ చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా.

ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోవిడ్-19 కేసులను ధ్రువీకరిస్తున్నారు. కానీ మొత్తం పాజిటివ్ కేసుల్లో అవి ఒక చిన్న భాగం మాత్రమే. ప్రజల్లో వైరస్ ఉన్నప్పటికీ, ఆ లక్షణాలు కనిపించని కేసులు ఎన్ని ఉన్నాయో, ఆ గణాంకాలు అంతుపట్టకపోవడం అందరినీ మరింత గందరగోళపరుస్తోంది.

ఒక యాంటీబాడీ టెస్ట్ రూపొందించడం వల్ల ఎవరిలో అయినా వైరస్ ఉందా లేదా అనేది పరిశోధకులు చూడచ్చు. అలా చేయగలిగితే, కరోనావైరస్ ఎంత దూరం వరకూ చేరుతోంది, ఎంత సులభంగా వ్యాపిస్తోంది అనేది మనం తెలుసుకోగలం.

2.ఇది నిజంగా ఎంత ప్రాణాంతకం

ఇప్పటివరకూ కచ్చితంగా ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో మనం గుర్తించేవరకూ, మరణాల రేటును కచ్చితంగా చెప్పడం అసాధ్యం.

ప్రస్తుతానికి వైరస్ వ్యాపించిన వారిలో దాదాపు 1 శాతం మంది చనిపోతారని అంచనా వేస్తున్నారు.

కానీ ఈ లక్షణాలు లేని రోగులు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ మరణాల రేటు తగ్గవచ్చు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

3. పూర్తి స్థాయి లక్షణాలు

కరోనావైరస్ ప్రధాన లక్షణం జ్వరం, పొడి దగ్గు. మనం బయట వెతకాల్సిన లక్షణాలు ఇవే.

కొన్ని కేసుల్లో గొంతు పొడిబారడం, తలనొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు కూడా కనిపించాయి. కొందరిలో అయితే వాసన చూసే శక్తి కూడా కోల్పోవడం జరిగిందని చెప్పుకుంటున్నారు.

కానీ, వారికి స్వల్పంగా జలుబు లాంటి లక్షణాలు, అంటే, కొంతమంది రోగుల్లో ఉన్నట్లు ముక్కు కారడం, తుమ్ములు లాంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయా అనేది చూడడం చాలా ముఖ్యం..

తాము వైరస్ క్యారీ చేస్తున్నామని తెలీకుండానే, జనం దాని ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

4.వైరస్ వ్యాప్తిలో పిల్లల పాత్ర

కరోనావైరస్ కచ్చితంగా పిల్లలకు కూడా వ్యాపిస్తుంది. అయితే వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా వయసుల వారితో పోలిస్తే, ఈ వైరస్‌తో చనిపోయిన పిల్లల సంఖ్య చాలా తక్కువ.

పిల్లలు సాధారణంగా ఈ వ్యాధి వేగంగా వ్యాపించేలా చేస్తారు. ఎందుకంటే వారు చాలా మంది(తరచూ ఆటస్థలాల్లో)తో కలిసిపోతుంటారు.

కానీ, ఈ వైరస్‌తో ఉన్న పిల్లలు అది వ్యాపించేలా ఏమేరకు సహాయపడుతున్నారు అనేది ఇంకా స్పష్టంగా తెలీలేదు.

Sorry, your browser cannot display this map