కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారతీయ శాస్త్రవేత్త మీనల్ దఖావే భోసలే

మీనల్ దఖావే భోసలే

ఫొటో సోర్స్, MINAL DAKHAVE BHOSALE

ఫొటో క్యాప్షన్, మైల్యాబ్ టెస్టింగ్ కిట్‌ను రికార్డు సమయంలో తయారు చేశామని మీనల్ దఖావే భోసలే చెప్తున్నారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్

కొత్త కరోనావైరస్ మీద పోరాటంలో ప్రజలకు తగినంతగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటం లేదని భారతదేశం విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే.. ఒక వైరాలజిస్ట్ కృషితో ఆ పరిస్థితి మారబోతోంది.

ఆ వైరాలజిస్ట్ ఒక బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు.. దేశీయంగా కరోనావైరస్ టెస్టింగ్ (పరీక్ష పరికరం)ను తయారు చేసి అందించారు.

మొట్టమొదటి మేడిన్ ఇండియా కరోనావైరస్ టెస్టింగ్ కిట్ గురువారం మార్కెట్‌లోకి వచ్చింది. ఫ్లూ లక్షణాలు గల రోగులకు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ ఉందా, లేదా అనేది నిర్ధారించటానికి మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేయవచ్చుననే ఆశలను ఇది పెంచింది.

పుణెలోని 'మైల్యాబ్ డిస్కవరీ' అనే సంస్థ.. కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను తయారు చేసి, విక్రయించటానికి పూర్తి స్థాయి అనుమతి పొందిన తొలి భారతీయ సంస్థగా నిలిచింది. ఆ సంస్థ ఈ వారంలో 150 కిట్లను తయారు చేసి పుణె, ముంబై, దిల్లీ, గోవా, బెంగళూరుల్లోని డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు పంపించింది.

''మా తయారీ విభాగం నిరంతరం పనిచేస్తోంది. సోమవారం మరో బ్యాచ్ టెస్టింగ్ కిట్లను పంపిస్తాం'' అని మైల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ వాంఖడే శుక్రవారం నాడు బీబీసీతో చెప్పారు.

ఈ మాలిక్యులార్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ.. హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి తదితర వ్యాధులకు కూడా వ్యాధినిర్ధారణ పరీక్ష కిట్లను తయారు చేస్తోంది. తాము వారానికి 1,00,000 కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను సరఫరా చేయగలమని.. అవసరమైతే 2,00,000 కిట్ల వరకూ ఉత్పత్తిని పెంచగలమని ఆ సంస్థ చెప్తోంది.

ఒక్కో మైల్యాబ్ కిట్.. 100 నమూనాలను పరీక్షించగలదు. ఒక్కో కిట్ ధర 1,200 రూపాయలు. ప్రస్తుతం భారతదేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కోవిడ్-19 టెస్టింగ్ కిట్ ధర రూ. 4,500గా ఉంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

టెస్టింగ్ కిట్‌కు ప్రాణం పోసిన కొన్ని గంటలకే ప్రసవం...

''దిగుమతి చేసుకున్న టెస్టింగ్ కిట్‌లు ఫలితాలను చూపటానికి ఆరు, ఏడు గంటల సమయం తీసుకుంటాయి. కానీ మా టెస్టింగ్ కిట్ కేవలం రెండున్నర గంటల్లోనే ఫలితాలు చూపిస్తుంది'' అని మైల్యాబ్ సంస్థలో పరిశోధన, అభివృద్ధి విభాగం అధిపతి, వైరాలజిస్ట్ మీనల్ ధవే భోసలే చెప్పారు.

కోవిడ్-19ను గుర్తించటానికి పాథో డిటెక్ట్ అనే ఈ పరీక్ష కిట్‌ను రూపొందించిన బృందానికి ఆమె సారథ్యం వహించారు. ఈ కిట్‌ను రికార్డు స్థాయిలో కేవలం ఆరు వారాల సమయంలోనే తయారు చేశామని ఆమె తెలిపారు.

ఈ కిట్ తయారీ కోసం పనిచేస్తున్నప్పుడు.. ఈ శాస్త్రవేత్త నిండు గర్భిణి కూడా. గత వారంలోనే ఆమె ప్రసవించారు. ఆమె గర్భానికి సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఫిబ్రవరిలో డిస్చార్జ్ అయిన కొద్ది రోజులకే ఈ టెస్టింగ్ కిట్ తయారీ ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమయ్యారు.

''ఇది అత్యవసర పరిస్థితి. దీనినొక సవాలుగా స్వీకరించా. నా దేశానికి నేను సేవ చేయాలి. పది మంది సభ్యులున్న మా బృందం చాలా కష్టపడి పనిచేసి ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది'' అని చెప్పారు.

మీనల్ చివరికి మార్చి 18వ తేదీన తమ టెస్టింగ్ కిట్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) విశ్లేషణ కోసం సమర్పించారు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఆ మరుసటి రోజు - అంటే మార్చి 19వ తేదీన ఆమె తన టెస్టింగ్ కిట్ ప్రతిపాదనను ఇండియన్ ఎఫ్‌డీఏకి, వాణిజ్య అనుమతి కోసం ఔషధ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓకు సమర్పించారు.

అలా సమర్పించిన గంటకే మీనల్‌కు సిజేరియన్ ఆపరేషన్ చేయటానికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చారు.

''మేం కాలంతో పోటీపడుతున్నాం. మా ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలి. ప్రతీదీ మళ్లీ సవరించాల్సిన అవసరం లేకుండా సక్రమంగా చేయాలి. మా కృషిని మీనల్ ముందుండి నడిపించారు'' అంటారు డాక్టర్ వాంఖడే.

టెస్టింగ్ కిట్లను విశ్లేషణకు పంపించటానికి ముందు.. ఆ టెస్ట్ ఫలితాలు ఖచ్చితంగా, నిర్దుష్టంగా ఉండేలా చూడటానికి పరిశోధన బృందం అన్ని ప్రమాణాలనూ మళ్లీ మళ్లీ తనిఖీ చేయాల్సి వచ్చింది.

''ఒకే శాంపిల్ మీద 10 పరీక్షలు చేస్తే.. అన్ని పరీక్షల ఫలితాలూ ఒకేలా ఉండాలి. మేం దానిని సాధించాం. మా టెస్టింగ్ కిట్ పర్ఫెక్ట్‌గా ఉంది'' అని మీనల్ తెలిపారు.

దీనితో ప్రభుత్వ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఏకీభవించింది. ఈ మండలి నియంత్రణలోనే ఎన్‌ఐవీ పనిచేస్తుంది. నూరు శాతం ఫలితాలు సాధించిన ఏకైక భారతీయ సంస్థ మైల్యాబ్ అని పేర్కొంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

'భారత వైద్య వ్యవస్థలో భారీ లోపాలు'

భారతదేశం కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించటానికి తగినంత స్థాయిలో పరీక్షలు నిర్వహించటంలేదని విమర్శలు వస్తున్నాయి.

దేశంలో ప్రస్తుతం ప్రతి పది లక్షల మందికి గాను కేవలం 6.8 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యల్ప స్థాయిల్లో ఇదొకటి.

అధిక ముప్పున్న దేశాల నుంచి వచ్చిన వాళ్లకు, వైరస్ సోకిన వారిని కలిసిన వారికి, కరోనావైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని భారతదేశం మొదట్లో స్పష్టంచేసింది. ఆ తర్వాత.. తీవ్ర స్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరిన వారందరికీ ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది.

కానీ.. ఇన్‌ఫెక్షన్ల వలయం రోజు రోజుకూ విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

భారత్ గత కొద్ది రోజులుగా పరీక్షల సంఖ్యను పెంచింది. ఆరంభంలో కేవలం ప్రభుత్వ డయాగ్నోస్టిక్ ల్యాబుల్లో మాత్రమే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించటానికి అనుమతించారు. ఇప్పుడు కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లకు కూడా ఈ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

అలాగే.. అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో పాటు పలు ఇతర దేశాల నుంచి పొందిన లైసెన్సుల ఆధారంగా 15 ప్రైవేటు కంపెనీలు కోవిడ్-19 పరీక్ష కిట్లను విక్రయించటానికి కూడా ప్రభుత్వం గురువారం అనుమతులు జారీచేసింది.

పంపిణీదారులు, ల్యాబ్‌ల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతోందని.. పరీక్షలు చేయటం గణనీయంగా పెరుగుతుందని డాక్టర్ వాంఖడే చెప్తున్నారు.

కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు పెరగటం చాలా సాయపడుతుందని.. అయితే భారత వైద్య సదుపాయాల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని.. పెరుగుతున్న కరోనావైరస్ కేసులకు చికిత్స చేయాలంటే ఆ లోపాలను తక్షణమే సరిచేయాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

''దక్షిణ కొరియా వంటి అతి చిన్న దేశంలో కరోనావైరస్ పరీక్షలు నిర్వహించటానికి 650 ల్యాబ్‌లు ఉన్నాయి. మన దేశంలో ఎన్ని ఉన్నాయి?'' అని మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుజాతారావు ప్రశ్నిస్తున్నారు.

ఇండియాలో కేవలం 118 ప్రభుత్వ డయాగ్నొస్టిక్ లేబొరేటరీలు మాత్రమే ఉన్నాయి. మరో 50 ప్రైవేటు లేబొరేటరీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారని ప్రభుత్వం చెప్తోంది.

మొత్తం 130 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు ఇవి ఏ మూలకూ సరిపోవు.

''భారతదేశం మరిన్ని ల్యాబ్‌లను గుర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయా ల్యాబ్‌లకు టెస్టింగ్ కిట్లు చేరాలి. టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వాలి. సదుపాయాలను బలోపేతం చేయటానికి సమయం పడుతుంది'' అని సుజాతారావు పేర్కొన్నారు.

ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు వెలువడటం మొదలయ్యాక.. పెద్ద సంఖ్యలో ప్రజలకు ఇది సోకినట్లు వెల్లడై, వారిని ఆస్పత్రుల్లో చేర్చాల్సిన పరిస్థితులు వస్తే భారతదేశం ఆ పరిస్థితిని ఎదుర్కోవటం చాలా కష్టమవుతుంది.

''దేశంలో ఆరోగ్య రక్షణ సదుపాయాల పరిస్థితి గురించి మీకు తెలుసా? అవన్నీ పట్టణ ప్రాంతాల్లో పోగుపడి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలేం లేవు. అది పెను సవాలు అవుతుంది'' అంటున్నారామె.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)