కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, తులిప్ మజుందార్
- హోదా, బీబీసీ గ్లోబల్ హెల్త్ కరెస్పాండెంట్
జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలోకి అడుగు పెట్టగానే మొత్తం 194 సభ్య దేశాల జెండాలతో అందంగా అలంకరించిన పైకప్పు కనిపిస్తుంది.
ఇక ఎండ బాగా కాసే రోజుల్లో అయితే ఆ అతి పెద్ద ఆడిటోరియం అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తూ వచ్చి పోయే వారిని విశేషంగా ఆకర్షిస్తుంది.
“ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తలెత్తిన అత్యంత కఠినమైన పరీక్షా సమయం.” ప్రపంచ దేశాలు ఒకరికొకరు సమన్వయంతో పని చేయాల్సిన సందర్భం ఇది. అని కరోనావైరస్ విషయంలో అన్ని దేశాలు ముక్త కంఠంతో అంగీకరిస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ 1948లో ప్రారంభమయ్యింది. “ప్రపంచ దేశాల ప్రజారోగ్యానికి కావలి”గా ఆ సంస్థను అభివర్ణించారు.
ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనుకున్నంత సులభమేం కాదు.
ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన కార్యాలయం: డబ్ల్యూహెచ్ఓ
గత 11 ఏళ్లలో ఆరు సార్లు ప్రపంచం ఆరోగ్య అత్యవసర పరిస్థితులను చవి చూడాల్సి వచ్చింది.
అందులో 2014లో ఆఫ్రికాను వణికించిన ఎబోలా వైరస్, ఆపై జికా వైరస్ సహా ప్రస్తుతం ప్రపంచాన్ని గజ గజలాడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కూడా ఉన్నాయి.
ఈ సంస్థ ఇంకా ఏం చేస్తుంది?
- ఇటువంటి మహమ్మారులు వ్యాపిస్తున్న సందర్భాలలో ప్రపంచ దేశాలలో వేటిని హెచ్చరించాలో డబ్ల్యూహెచ్ఓ నిర్ణయిస్తుంది.
- ఆ మహమ్మారులను తరిమికొట్టేందుకు సరికొత్త చికిత్స విధానాలను, టీకాలను వీలైనంత త్వరగా సిద్ధం చేసేలా ప్రపంచ వ్యాప్తంగా పరిశోధన-అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందిస్తుంది.
- వైరస్‌లు పుట్టిన ప్రాంతాలకు నిపుణులను పంపించి ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలన్న విషయాలకు సంబంధించి తగిన వివరాలను సేకరిస్తుంది కూడా.
- ఇతర ఆరోగ్యసమస్యల విషయంలో కూడా డబ్ల్యూహెచ్ఓ బాధ్యత వహిస్తుంటుంది.
- ప్రపంచ దేశాలలో పెరిగిపోతున్న డయాబెటిక్, ఊబకాయం సమస్యలకు పరిష్కారం వెతకడం.
- రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రణాళికల్ని రచించడం.
- చికిత్స అందుబాటులో ఉన్న పోలియో వంటి మహమ్మారులను పూర్తిగా తరిమికొట్టడం.
- కాన్పు సమయాల్లో తల్లి, బిడ్డల మరణాల రేటును తగ్గించేందుకు ప్రయత్నించడం.
సూచనలు-సలహాలకే పరిమితం
వ్యాధులను నివారించేందుకు లేదా వ్యాధి విజృంభించకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో ఏం చెయ్యాలి...? ఏం చెయ్యకూడదన్న సలహాలు మాత్రమే ఈ సంస్థ ప్రపంచ దేశాలకు ఇస్తుంది.
అంతే కానీ తన సూచనల్ని కచ్చితంగా అమలు చెయ్యాలని బలవంతం చేసే అధికారం ఈ సంస్థకు లేదు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19 మహమ్మారి విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరిగ్గా వ్యవహరించలేదా?
మీరు ఎవర్ని ఈ ప్రశ్న అడుగుతున్నారన్నదానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది.
ఒక వేళ ఈ ప్రశ్నను మీరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అడిగినట్టయితే అవును అని సమాధానం వస్తుంది.
కానీ ఇప్పటికే 6లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు, సుమారు 26వేలకు పైగా మరణాలు సంభవించిన అమెరికాలో అందరి వేళ్లు ట్రంప్ వైపే చూపుతున్నాయి.
ఈ వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ఆయన పూర్తిగా వైఫల్యం చెందారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోవిడ్-19 సంక్షోభం కన్నా ముందు నుంచే ట్రంప్ చైనాతో తీవ్రమైన భౌగోళిక, రాజకీయ యుద్ధం చేస్తున్నారు.
కరోనావైరస్ విషయంలో చైనాతీసుకుంటున్న చర్యలపై డబ్ల్యూహెచ్ఓ అదే పనిగా ప్రశంసలు కురిపిస్తుంటే వ్యతిరేకించిన వారిలో ట్రంప్ మాత్రమే మొదటి వ్యక్తి కాదు.
చైనాలోని వైద్య వర్గాలు కూడా తాము ముందు నుంచీ హెచ్చరిస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
చైనాను ప్రశంసించడం ద్వారా డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ డాక్టర్ టెడ్రోస్ తన వైఖరిని పదే పదే వెల్లడించే ప్రయత్నం చేశారని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు.
అంతర్జాతీయంగా వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉందని చెబుతూ ఇతర దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కాలహరణ చేసేందుకు టెడ్రోస్ కారణమయ్యారని ట్రంప్ విమర్శించారు.
కేవలం ట్రంప్ మాత్రమే కాదు చాలా మంది ఇతర శాస్త్రవేత్తలు ఈ విషయంలో చైనానే వేలెత్తి చూపిస్తున్నారు.
వైరస్ తమ దేశంలో విజృంభించిన వెంటనే దానికి సంబంధించిన జెనిటిక్ కోడ్‌ను ఇతర దేశాలతో పంచుకొని ఉండి ఉంటే.. దాన్ని నివారించేందుకు టీకాను తయారు చేసే ప్రయత్నాలు మరింత వేగవంతమయ్యేవని వారు అభిప్రాయపడుతున్నారు.
“మహమ్మారి గురించి ప్రపంచానికి తెలియజేయడంలో చైనా సరిగ్గా వ్యవహరించలేదు. ఆలస్యం జరిగిందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.” అని ఎడిన్ బర్గ్‌లోని గ్లోబల్ పబ్లిక్ హెల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ దేవి శ్రీధర్ బీబీసీతో అన్నారు. అంతేకాదు.. మొదట్లో దాని తీవ్రతను తగ్గించి చూపించేందుకు చైనా ప్రయత్నించిందని కూడా విమర్శించారు.
పశ్చిమాఫ్రికాలో ఎబోలా మహమ్మారి విజృంభించినప్పుడు డబ్ల్యూహెచ్ఓ వ్యవహారశైలిపై తీవ్రంగా విమర్శించిన వారిలో తాను కూడా ఒకరినని ఆమె చెబుతుంటారు.
అయితే కరోనావిషయంలో మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పు పట్టడం కష్టమని ఆమె వ్యాఖ్యానించారు.
తనకున్న పరిమితుల మధ్య ఈ మహమ్మారి గురించి అన్ని దేశాలను ముందుగానే హెచ్చరించేందుకు ప్రయత్నించిందని అదే సమయంలో అన్ని దేశాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నించిందని దేవీ శ్రీధర్ అభిప్రాయపడ్డారు.
నిజానికి డబ్ల్యూహెచ్ఓ దౌత్యం మాత్రమే నెరుపుంది. ఎందుకంటే ఇలాంటి మహ్మారులు తలెత్తే సమయాల్లో దానికి సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేసే అధికారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేదు. ప్రపంచ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆ దేశాలే ముందుకొస్తాయని నమ్ముతుంది.
ఈ విషయంలో చైనాను విమర్శిస్తూ ఒక్క ప్రకటన చేస్తే చాలు ఐదు నిమిషాల్లో డాక్టర్ టెడ్రోస్ పేరు ప్రపంచమంతా మారు మోగిపోతుంది. కానీ ఆ తర్వాత కోవిడ్-19 విషయంలో ప్రపంచ పరిణామాలు వేరుగా ఉంటాయని శ్రీధర్ అన్నారు.
“ఓ వారం తర్వాత కూడా ఆయన చైనా వెళ్లి డేటాను పంచుకోవాలని కోరినంత మాత్రాన ఏం సాధిస్తాం?” అని ఆమె ప్రశ్నించారు.
ఈ విషయంలో మొదట్లోనే చైనాపై డబ్ల్యూహెచ్ఓ ఒత్తిడి తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ అది తెర వెనుకే జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.
“ప్రపంచ దేశాల మధ్య దౌత్యం నెరపడానికి.. మీడియా ముందుకొచ్చి షో చెయ్యడానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటి విషయాల గురించి వీలైనంత వరకు ఆంతరంగికంగానే చర్చించాలి. నిజానికి చర్చలు జరపడం ద్వారా పని సాగేలా చూడాలి.” అని దేవీ శ్రీధర్ అన్నారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?

గతంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఏం జరిగింది ?
ప్రపంచ ఆరోగ్య సంస్థపై విమర్శలు రావడం ఇదే మొదటి సారి కాదు.
2014లో గునియాలోని ఎబోలా వైరస్ బయటపడ్డఐదు నెలల తర్వాత గ్లోబల్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడంపైనా అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో చాలా ఆలస్యంగా స్పందించిందని చాలా దేశాలు ఆరోపించాయి.
అదే సమయంలో 2009లో హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ విషయంలో అవసరం లేకుండానే గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించి తప్పు చేసిందని కూడా విమర్శించారు.
గత వారంలోనే డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపేస్తామని ట్రంప్ హెచ్చరించినప్పుడు ఈ వైరస్‌ను రాజకీయం చెయ్యవద్దని డాక్టర్ టెడ్రెస్ విజ్ఞప్తి చేశారు.
తమ వ్యవహారశైలిపై వస్తున్న విశ్లేషణల్ని ఆయన ఆహ్వానించారు కూడా. “మా బలాలు, బలహీనతల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా ముందుకు సాగుతాం.” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి తమ దృష్టంతా వైరస్‌తో పోరాడటంపైనే ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ట్రంప్ నిర్ణయంతో ఏం జరగనుంది.?
డబ్ల్యూహెచ్ఓకు అత్యధికంగా నిధులు అందించే దేశాల్లో అమెరికా ముందుంటుంది.
2,200 బిలియన్ డాలర్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక బడ్జెట్‌కు స్వచ్ఛందంగా వచ్చే నిధులే ఆధారం.
గత ఏడాది అమెరికా సుమారు 400మిలియన్ డాలర్లను అందించింది.
“ఇటువంటి పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓకి మరిన్ని నిధులు అవసరం.” అని బ్రిటన్‌కు చెందిన వెల్కమ్ ట్రస్ట్ డైరక్టర్ డాక్టర్ జెరెమి ఫర్రార్ అభిప్రాయపడ్డారు.
మనం మన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓ చేస్తున్నట్టు ఏ ఇతర సంస్థ చెయ్యలేదు. ఇది వారికి అండగా ఉండాల్సిన సమయం. అని జెరెమీ అన్నారు.
“తన ముఖంపై ఉన్న కోపంతో ముక్కును కోసుకుంటున్నట్టుంది.” అని అమెరికా వ్యవహారశైలిని ఎద్దేవా చేశారు ప్రొఫెసర్ దేవీ శ్రీధర్.
“కోవిడ్-19 విషయంలో డబ్ల్యూహెచ్ఓను తప్పు బడితే... మలేరియా, టీబీ, పోలియో విషయంలో కూడా మనం తప్పుపట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం జయించామనుకుంటున్న ఆ వ్యాధులన్నీ ఇప్పుడు మళ్లీ తిరగబెడుతూనే ఉన్నాయి.” అని దేవీ శ్రీధర్ వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్డౌన్ పొడిగిస్తే ఎదురయ్యే పరిస్థితులకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
- కరోనావైరస్: తొలి కేసు నమోదవడంతో యెమెన్‌లో 'భయం భయం'
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- కరోనావైరస్: నియంత్రణ రేఖ 'సామాజిక దూరం' ఎలా పాటించాలంటున్న స్థానికులు
- మామకు కరోనా పాజిటివ్... రహస్యంగా చూసివచ్చిన అల్లుడిపై కేసు
- కొడుకు శవంతో రోడ్డుపై పరుగులు తీసిన తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








