కరోనావైరస్: తొలి కేసు నమోదవడంతో యెమెన్‌లో 'భయం భయం'

కరోనావైరస్

ఫొటో సోర్స్, EPA

ఏళ్ల నుంచీ జరుగుతున్న అంతర్యుద్ధంతో అతలాకుతలం అవుతున్న యెమెన్‌లో మొదటి కరోనా పాజిటివ్ కేసు బయటపడడంతో సహాయక సంస్థలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

ఆక్స్ ఫాం దీనిని 'వినాశకరమైన దెబ్బ'గా అభివర్ణించింది. ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (ఐఆర్సీ) ఇది 'పీడకల లాంటిదే' అని చెబుతోంది.

యెమెన్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభంలో తల్లడిల్లుతోంది. దేశంలో లక్షలాది ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. కలరా, డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు విజృంభిస్తుంటే, దేశంలో సగం ఆస్పత్రులు మాత్రమే పూర్తిగా పనిచేస్తున్నాయి.హూతీ తిరిగుబాటుదారులతో పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు కాల్పుల విరమణ ప్రారంభించిన ఒక రోజు తర్వాత దేశంలో కోవిడ్-19 కేసు బయటపడినట్లు వార్తలు వచ్చాయి.

యెమెన్‌లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలనే ఐక్యరాజ్య సమితి శాంతియత్నాలకు సహకరించేందుకు సౌదీ కాల్పుల విరమణ పాటించింది.

దక్షిణ యెమెన్‌లో చమురు ఉత్పత్తి చేసే హద్రమౌత్ ప్రాంతంలో 60 ఏళ్ల వృద్ధుడికి కరోనావైరస్ సోకినట్లు ఆ దేశ జాతీయ అత్యవసర కమిటీ శుక్రవారం చెప్పింది.

"బాధితుడిని క్వారంటైన్ కేంద్రానికి పంపించాం. అతడి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది" అని కమిటీ ప్రతినిధి అలీ అల్-వాలిదీ చెప్పారు.

కరోనా బాధితుడు పనిచేస్తున్న రేవును వెంటనే సీల్ చేశారని, అక్కడ పనిచేసే మిగతా సిబ్బందికి రెండు వారాలపాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని చెప్పారని రాయిటర్స్ చెప్పింది.

హద్రమౌత్ ప్రాంతంలో రాత్రి పూట 12 గంటల కర్ఫ్యూ విధించారు. పక్కనే ఉన్న షాబ్వా, అల్ మహ్రా ప్రాంతాలు ఈ ప్రాంతంతో ఉన్న తమ సరిహద్దులను మూసివేశాయి.

line

బీబీసీ ప్రతినిధి లీజ్ డోసెట్ విశ్లేషణ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది కరోనాతో పోరాడుతున్నారని చెబుతున్న సమయంలో, యెమెన్‌లో ఉన్న వైద్య సిబ్బంది మరో యుద్ధం చేయాల్సి వస్తోంది. వారు ఇప్పటికే దేశంలో వ్యాపిస్తున్న కలరా, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఎక్కడా లేనంతగా ఇక్కడ ఇటీవల కలరా ప్రబలింది.

ఈ ఏడాది మొదట్లో మేం దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ఒక అతిపెద్ద, అత్యుత్తమ ఆస్పత్రిని సందర్శించాం. రోగులకు చికిత్స అందించడానికి సరైన మందులు, పరికరాలు లేక, నిస్సహాయ స్థితిలో ఉన్నామని అక్కడి డాక్టర్లు మాకు చెప్పారు.

కిక్కిరిసిన ఆ ఆస్పత్రి నిజంగానే దేశ సరిహద్దులకు దగ్గరగా ఉంది.

"యెమెన్ యుద్ధానికి ముగింపు పలకండి" అని తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఎంతోమంది పిల్లలను చూసుకుంటున్న డాక్టర్ మెక్కియా మాతో కోపంగా అన్నారు.

అదృష్టవశాత్తూ ఎలాగోలా ఆస్పత్రులకు చేరుకోగలిగిన కుటుంబాల్లో చాలామందికి కూడా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేదు. వారు తమను ఐసొలేట్ చేసుకోవడం, లేదా సామాజిక దూరం పాటించడం కానీ సాధ్యం కాదు.

అత్యంత ప్రాణాంతకమైన కరోనావైరస్‌తో పోరాటం మొదలవుతున్న ఈ సమయంలో, తమను తాము సురక్షితంగా ఉంచుకోడానికి అవసరమైన శుభ్రమైన నీళ్లు, సబ్బు కూడా వీరికి ఒక విలాస వస్తువుగా మారింది.

line
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

యెమెన్‌లో కరోనా వ్యాపిస్తే ఆ ప్రభావం వినాశకరంగా ఉంటుంది అని ఐక్యరాజ్యసమితి మానవతాసాయం సమన్వయ కర్త లీసీ గ్రాండే అన్నారు.

"మేం ఏది జరక్కూడదని భయపడుతూ వచ్చామో, అదే జరిగింది. ఐదేళ్ల యుద్ధం తర్వాత యెమెన్‌లో ఉన్న అందరికీ రోగనిరోధక శక్తి చాలా తక్కువ స్థాయిలో ఉంది. ప్రపంచంలో వీరు అత్యంత దుర్బలస్థితిలో ఉన్నారు" అన్నారు.

"మేం వైద్య పరికరాలు, మందులు, టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్స్ అందిస్తున్నాం, యెమెన్ వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

కాల్పుల విరమణ పాటిస్తున్న రెండు వైపుల వారికీ ఈ సమయం చాలా కీలకం అని యెమెన్‌లో 'సేవ్ ది చిల్డ్రన్' డైరెక్టర్ జేవియర్ జోబెర్ట్ అన్నారు.

"మేమంతా భయపడింది, తప్పించుకోవాలని అనుకుంది ఈ క్షణం గురించే, ఎందుకంటే యెమెన్ ఇప్పుడు ఈ వైరస్‌ను ఎదుర్కోగలిగే స్థితిలో లేదు" అన్నారు.

"యెమెన్‌లో కోవిడ్-19 వ్యాపిస్తే, దేశంలో దారుణంగా ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలకు అది ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది. అది పౌరులపై వినాశకరమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు స్పందించకపోతే, మనం రేపు చూడబోయేది మాటలకు అందనంత భయంకరంగా ఉంటుంది" అన్నారు.

"లక్షలాది యెమెన్ ప్రజలు ఇరుకుగా, అపరిశుభ్ర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వారు ఈ వైరస్‌ నుంచి తప్పించుకోలేనంత బలహీనంగా ఉన్నారు. ఈ వైరస్ వస్తోందని మాకు తెలుసు. కానీ, దేశంలో కోవిడ్-19 వ్యాపించడం అనేది ఒక పీడకలే అవుతుంది" అని ఐఆర్‌సీకి చెందిన తమునా సబేడ్జే అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

అంతకుముందు, నిధుల సంక్షోభం కారణంగా హూతీ తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ప్రాంతాలకు అందించే సాయం సగానికి తగ్గించాల్సి ఉంటుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) చెప్పింది.

కొంతమంది దాతలు తాము సరఫరా చేస్తున్న వాటిని హూతీ దళాలు అడ్డుకుంటున్నాయంటూ తమ సాయాన్ని ఆపివేశారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ సంస్థ చెప్పింది.

దీంతో ప్రతి నెలా సాయం అందుకున్న యెమెన్‌లోని కుటుంబాలు ఇప్పుడు రెండు నెలలకోసారి దీనిని అందుకుంటున్నాయి.

హూతీ తిరుగుబాటుదారులు వీటిని అడ్డుకుంటున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని, వాటిని సరిగా అందించడం లేదని డబ్ల్యూఎఫ్‌పీతో సహా సహాయ సంస్థలన్నీ ఆరోపిస్తున్నాయి.

హూతీ తిరుగుబాటుదారులు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని రాజధాని సనాలో గద్దె దింపిన తర్వాత 2015 నుంచి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు వారితో పోరాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)