కరోనావైరస్: "నా హౌస్‌మేట్ సామాజిక దూరం పాటించడంలేదు, అర్ధరాత్రి వేరేవాళ్లను తీసుకొస్తున్నాడు"

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనీష్ పాండే
- హోదా, బీబీసీ న్యూస్‌బీట్ రిపోర్టర్
“దేశమంతా లాక్‌డౌన్ అమలులో ఉంది. కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కానీ, నా హౌస్‌మేట్ అవేవీ పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో ఆయన అర్ధరాత్రి ఇద్దరు మహిళలను వెంట తీసుకొని మా ఫ్లాట్‌కు వచ్చారు" అని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే ఇంటిని షేర్ చేసుకుని ఉండే చాలామందికి ఇలాంటి అనుభవాలు కొత్తేం కాకపోవచ్చు.
అందరూ ఇళ్లలోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్న ఇలాంటి సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తించే హౌస్‌మేట్ ఉండటం ఎవరికైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది.
“ఇతరులకు దగ్గరగా వెళ్లకూడదన్న ఆలోచన ఆయనకు ఏమాత్రం లేదు. ప్రభుత్వం చెబుతున్న సూచనలను పట్టించుకోకుండా, ఆయన చాలామంది మహిళలను ఇంటికి తీసుకొస్తున్నారు. సామాజిక దూరం పాటించడం లేదు" అని బ్రిటన్‌కు చెందిన హెలెన్ (పేరు మార్చాం) బీబీసీ రేడియో 1 న్యూస్‌బీట్‌తో చెప్పారు.
ఆయన వల్ల పదేపదే చాలామంది ఇంటికి వచ్చి వెళ్తుండటంతో హెలెన్ ఆందోళన చెందుతున్నారు. వారి నిర్లక్ష్యం వల్ల తనకు వైరస్ సోకుతుందేమోనని ఆమె భయపడుతున్నారు.
"వస్తువుల మీద, ఇతర ఉపరితలాలపైన కరోనావైరస్ చాలా కాలం పాటు క్రియాశీలంగా ఉండగలదని మనకు తెలుసు. అంతమంది ఇంటికి వస్తుంటే, వారిలో ఎవరికైనా కరోనా ఉంటే, వాళ్లు వాడిన ఏదైనా వస్తువును సరిగ్గా కడగకపోతే, మా అపార్ట్‌మెంట్ అంతా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది" అంటూ హెలెన్ ఆందోళన పడుతున్నారు.
ఆ భయంతోనే ఒక గదిలో ఒంటరిగా ఉంటున్నానని, తమ ఫ్లాట్‌లోని మిగతా గదులకు వెళ్లే సాహసం చేయడంలేదని ఆమె చెప్పారు.
"నా గదిని మొత్తం శుభ్రం చేసుకున్నాను. తప్పనిసరి అయితేనే అప్పుడప్పుడు వంటగదికి వెళ్తున్నాను" అని హెలెన్ తెలిపారు.
ఆమెకు వచ్చే జీతంలో సగం ఆ ఇంటి అద్దెకే పోతోంది. అంత ఖర్చు పెట్టి ఉంటున్న ఫ్లాట్‌లో, తోటి వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తాను భయపడుతూ చిన్న గదికే పరిమితం కావాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'చేతులు కూడా కడుక్కోడు'
ఈ సమస్య ఒక్క హెలెన్‌ది మాత్రమే కాదు. 23 ఏళ్ల నాథన్ కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారు.
మొరాకో నుంచి వచ్చిన నాథన్‌ను బ్రిటన్ ప్రభుత్వం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచింది. రెండు వారాలు పూర్తయ్యాయి. కానీ, ఇప్పుడు తన హౌస్‌మేట్ నిర్లక్ష్యం కారణంగా తాను మళ్లీ క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తుందేమోనని నాథన్ భయపడుతున్నారు.
“మా హౌస్‌మేట్ రోజూ అర్ధరాత్రి తన గర్ల్ ఫ్రెండ్‌ను చూసేందుకు బయటకు వెళ్తారు. ఆమె ఓ ఆసుపత్రిలో పనిచేస్తారు. ఆమె ద్వారా ఆయనకు వైరస్ సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఆయన చాలామందిని ఇంటికి తీసుకొస్తారు. మా ఫ్లాట్ చాలా చిన్నది. వారికి దూరంగా ఉండటం చాలా కష్టమైన పని” అని నాథన్ వివరించారు.
"ఇతరుల గురించి ఏమాత్రం ఆయన ఆలోచించడం లేదు, తన గురించి కూడా పట్టించుకోవడం లేదు. బయటి నుంచి వచ్చాక చేతులు కూడా కడుక్కోడు. అది ఏమాత్రం మంచిది కాదు, చాలా ప్రమాదకరం" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హెలెన్, నాథన్ ఇద్దరూ వారి సహచరులు తమ ప్రవర్తనను మార్చుకునేలా ఒప్పించేందుకు ప్రయత్నించారు.
కానీ, తాము యువకులం, ఆరోగ్యంగా ఉన్నామనే ధీమాతో వారు మాట్లాడుతుంటారు.
"ఆరోగ్యంగా ఉన్న యువతలోనూ చాలామంది ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మనకేం కాదులే అనే ధీమా మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలని చాలా చెప్పాను. అయినా ఆయన అసలు పట్టించుకోవడం లేదు” అని హెలెన్ చెప్పారు.
“కరోనావైరస్ ఎంత ప్రమాదకరమో మా హౌస్‌మేట్‌కు తెలుసు. అయినా, ఆయన పట్టించుకోడు” అని నాథన్ అంటున్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు


ఫొటో సోర్స్, Getty Images
'ఇతరుల ప్రమాదం'
22 ఏళ్ల మరో యువతి షార్లెట్ కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు.
ఆమెతో పాటు ఫ్లాట్‌లో ఉండే ఒక అమ్మాయి తన ప్రియుడిని కలిసేందుకు ఐదు గంటలు ప్రయాణం చేసి వెళ్లారు. పది రోజులకు పైగా అక్కడే గడిపారు.
తర్వాత తన ప్రియుడిని తీసుకొని ఫ్లాట్‌కు వచ్చింది.
"అలా రావొద్దు, ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండటం మంచిదని చెప్పాను. అయినా ఆమె నా మాట వినకుండా ప్రియుడిని తీసుకొని వచ్చింది. ఆమెకు నిర్లక్ష్యం ఎక్కువ. ఇతరులతో కలిసి ఆమె పార్టీ చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూశాను. తను ఎక్కడా జాగ్రత్తలు పాటించలేదు. ఆమె కారణంగా ఇతరులు ప్రమాదంలో పడాల్సి వస్తోంది" అంటూ షార్లెట్ ఆవేదన వ్యక్తం చేశారు.
వారిని మార్చేదెలా?
తోటి హౌస్‌మేట్స్ చొరవ తీసుకుని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారితో నేరుగా మాట్లాడి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు డాక్టర్ ఎలెన్ టూరోని సూచిస్తున్నారు.
“వారితో ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా మాట్లాడాలి. అలా చేయడం మంచిది కాదని, దాని వల్ల ఇతరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని వివరించాలి. ఒకసారి చెబితే వారికి కోపం రావచ్చు. అయినా, వారు చెప్పే అభిప్రాయాలను కూడా శ్రద్ధగా వినాలి. ఇద్దరూ చర్చించుకోవాలి. వారి బాగోగుల గురించి కూడా అడిగి తెలుసుకోవాలి. వారు చెప్పేది వింటూ, చర్చించడం ద్వారా వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు అవకాశం ఉంటుంది” అని ఆమె చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్:నిరుపేద ముస్లింల పాలిట ఫేక్ న్యూస్ ఎలా శాపమవుతోంది
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- వేడి నీళ్లు, పానీయాలు కోవిడ్-19 బారి నుంచి రక్షిస్తాయా?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








