కరోనావైరస్: లాక్‌డౌన్ సమయంలో మద్యం ప్రియులు ఏం చేయాలి?

మద్యం దొరక్కపోవడంతో కొందరు వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మద్యం దొరక్కపోవడంతో కొందరు వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతుకు పైగా మంది అడుగుతున్న ప్రశ్న ఇది. ఒంటరితనాన్ని ఎదుర్కొనేందుకు కొంతమందికి ఆల్కహాల్ ఉపయోగపడుతున్నట్లు అనిపిస్తోంది.

అమెరికాలో ఈ ఏడాది మార్చి 21తో ముగిసిన వారంలో మద్యం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 55 శాతం పెరిగాయని నీల్సన్ సర్వేలో వెల్లడైంది. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలలోనూ ఆల్కహాల్ అమ్మకాలలో పెరుగుదల కనిపించింది. అయితే, ఈ ధోరణి కొత్త ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

లాక్‌డౌన్ సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలను ఎంచుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది.

మద్యం దుకాణం (పాత చిత్రం)

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మద్యం దుకాణం (పాత చిత్రం)

సంపూర్ణ నిషేధం

లాక్‌డౌన్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా లాంటి దేశాలలో మద్యం అమ్మకాలను ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించాయి. దీంతో, మద్యం దొరక్కపోవడంతో వింతగా ప్రవర్తిస్తూ కొందరు ఆస్పత్రుల పాలవుతున్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో రద్దీ పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.

అలా, మద్యం లేక ఇబ్బంది పడిన వారిలో కేరళకు చెందిన రతీష్ సుకుమారన్ ఒకరు. "రోజూ మద్యం తాగేవాడిని. ఇప్పుడు దొరకడంలేదు. ఇంటి నుంచి బయట అడుగుపెట్టే అవకాశం లేదు" అని ఆయన చెప్పారు.

మానేసేందుకు ఇదో అవకాశం

తిరువనంతపురంలో ఉండే 47 ఏళ్ల రతీష్, చలనచిత్ర, టీవీ పరిశ్రమలో స్క్రిప్ట్ రైటర్‌. దేశంలోని మిగతా ప్రాంతాల మాదిరిగానే, ఇక్కడ కూడా నిత్యవసర సరకులు, మందులు మినహా అన్ని రకాల దుకాణాలనూ మూసివేశారు.

“ఇన్నాళ్లూ మద్యానికి బానిసనని ఎన్నడూ అనుకోలేదు. కానీ, ఇప్పుడు మద్యాన్ని మిస్సవుతున్నట్లు అనిపిస్తోంది. మూడు వారాల లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితం అయ్యాం. ఇన్నాళ్లూ ఆల్కహాల్‌కు ఎంతగా అలవాటు పడ్డానో ఇప్పుడు అర్థమవుతోంది” అని ఆయన వివరించారు.

అయితే, మద్యం మానేసేందుకు ఈ నిషేధాన్ని ఒక అవకాశంగా వాడుకుంటానని ఆయన చెప్పారు. 25 ఏళ్లుగా మద్యం అలవాటు ఉన్న తనకు ఇదో కొత్త అనుభవమని రతీష్ అంటున్నారు.

“ఆఫీసుకు వెళ్లినప్పుడు రోజూ సాయంత్రం తాగడం నాకు అలవాటు. వారాంతాల్లో అయితే మధ్యాహ్నమే లాగించేవాడిని. ఎంత తాగుతాన్నది నాకు కంపెనీ ఇచ్చేవారి మీద ఆధారపడి ఉంటుంది” అని ఆయన చెప్పారు.

చాలామంది భారతీయ మహిళల్లాగే, రతీష్ భార్యకు కూడా మద్యం అలవాటు లేదు. భర్త ఇంట్లో మద్యం తాగితే ఆమె ఊరుకోరు. దాంతో, ఆయన ఎక్కువగా స్నేహితులతో కలిసి సమీపంలోని పబ్బులు, బార్లకు వెళ్లేవారు. ఇప్పుడు అవి పూర్తిగా మూతపడ్డాయి.

వైద్యుల ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి మద్యం అమ్మాలని కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వైద్యుల ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి మద్యం అమ్మాలని కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు

స్వీయనియంత్రణకుపరీక్ష

మద్యం విషయంలో తన స్వీయ నియంత్రణను పరీక్షించుకుంటున్నానని రతీష్ అంటున్నారు. "లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా మా ప్రాంతంలో కొన్ని మద్యం దుకాణాలు తెరిచి ఉన్నాయి. అయినా, నేను వెళ్లొద్దని నిర్ణయించుకున్నాను. కానీ, ఏడు రోజుల తర్వాత మద్యం లేకుండా ఉండలేనన్న విషయం అర్థమైంది” అని ఆయన చెప్పారు.

దాంతో, ఆల్కహాల్ మానేసిన కొందరు స్నేహితులతో రతీష్ ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించారు. కొన్ని రోజులు ఇబ్బంది అనిపించినా, క్రమంగా పూర్తిగా మానేయొచ్చని వారు చెప్పారు. వారి సలహాలను ఆయన పట్టించుకోలేదు.

“నా శరీరానికి ఆల్కహాల్ అత్యవసరం అన్నట్లు అనిపించింది. దేని మీదా ధ్యాస ఉండేది కాదు. సినిమా చూద్దామని ప్రయత్నించా, అయినా ఫలితం లేదు. మానసికంగా ఆందోళనకు గురయ్యాను. రాత్రి నిద్ర పట్టదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసేవాడిని. ఉదయం పొద్దు పొడిచాక కాస్త ఉపశమనం దొరికినట్లు అనిపించేది. మందు మానేయడాన్ని కొందరు ఎలా ఇబ్బంది పడతారో నాకు బాగా అర్థమైంది” అని ఆయన వివరించారు.

ఆల్కహాల్ దొరక్క ఇబ్బంది పడేవారిలో వణుకు, ఆందోళన, మూర్ఛ లాంటి చాలా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

వైద్యులు వర్సెస్ ప్రభుత్వం

తెలంగాణతో పాటు కేరళలోనూ కొందరు మద్యం దొరక్క ఆత్మహత్య కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు వైద్యులను ధ్రువీకరణ పత్రాలు పొందిన వారికి మద్యం అమ్మాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.

కానీ, ఆ నిర్ణయం పట్ల వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రభుత్వం ఆదేశాల తర్వాత ఆల్కహాల్‌ తాగేందుకు అనుమతి కోసం అనేక మంది వైద్యులను సంప్రదించారు. రసీదు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు బెదిరించారు” అని కేరళ ప్రభుత్వ వైద్య అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీఎస్ విజయకృష్ణన్ చెప్పారు.

వైద్యులంతా కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అంటున్నారు.

మందుబాబులకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వైద్యుల సంఘం నిరాకరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్లు రాష్ట్ర హైకోర్టుకు కూడా వెళ్లారు. దాంతో, ప్రభుత్వ ఆదేశాలపై న్యాయస్థానం స్టే ఇచ్చింది.

మద్యంపై ఆధారపడటం ఒక వ్యాధి అని, మద్యానికి బానిసలైన వారికి ధృవపత్రాలు ఇవ్వడం అనైతికమని వైద్యులు స్పష్టం చేశారు.

"ఎటు చూసినా ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం కనిపించ లేదు. మద్యం దుకాణాలను తెరిస్తే, భారీగా జనాలు ఎగబడతారు. దాంతో, కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నాలు నిష్ఫలంగా మారుతాయి. ఒకవేళ ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే, అది ఇంటర్నెట్ వాడేవారికి మాత్రమే ఉపయోగపడుతుంది" అని రతీష్ అంటున్నారు.

కరోనావైరస్

'పూర్తిగా మానేస్తా'

అన్నీ ఆలోచించిన తర్వాత, చివరికి మద్యాన్ని పూర్తిగా మానేయాలనే లక్ష్యానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నానని రతీష్ చెప్పారు.

"నేను సానుకూల మార్గంలో వెళ్లేందుకు ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయంలో నేను నెగ్గుతానో లేదో చూస్తా. ఇప్పుడిప్పుడే మద్యం ధ్యాస నుంచి నేను బయటపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆల్కహాల్ లేకున్నా బతకగలన్న నమ్మకం కలుగుతోంది. ఎంత ఎక్కువ మంది స్నేహితులు అయితే, అంత ఎక్కువగా తాగేవాడిని. ఇప్పుడు నేను కోల్పోతున్నది స్నేహితులనా? లేక ఆల్కహాల్‌నా? అన్నది తెలుసుకోవాలని ఉంది” అని ఆయన అంటున్నారు.

“నాలో వచ్చిన ఈ మార్పు లక్‌ డౌన్ తర్వాత కూడా కొనసాగాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత కూడా స్నేహితులను కలుస్తా, వాళ్లతో కలిసి బార్లకు వెళ్తా, కానీ నేను మద్యం తాగను” అని చెబుతున్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)