ఇరాన్ అణు ఒప్పందంలోని కీలకాంశాలేమిటి... వాటిని ఆ దేశం ఉల్లంఘించిందా?

ఫొటో సోర్స్, AFP
ఇరాన్ తన అణు కార్యక్రమం మీద 2015లో పీ5 + 1 అని పిలిచే ప్రపంచ శక్తుల బృందంతో దీర్ఘ కాలిక ఒప్పందానికి అంగీకరించింది. ఆ బృందంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీలు ఉన్నాయి.
ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేయటానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలతో కొన్నేళ్ల పాటు ఉద్రిక్తత కొనసాగిన తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. తన అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని ఇరాన్ ఉద్ఘాటించింది. కానీ, దానిని అంతర్జాతీయ సమాజం విశ్వసించలేదు.
ఆ ఒప్పందం ప్రకారం, ఇరాన్ తనను కుంగదీస్తున్న ఆర్థిక ఆంక్షలను తొలగించటానికి బదులుగా తన సున్నిత అణు కార్యకలాపాలను పరిమితం చేయటానికి, అంతర్జాతీయ పరిశీలకుల తనిఖీకి అంగీకరించింది.
జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ) అనే ఆ ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలివి.

ఫొటో సోర్స్, Getty Images
యురేనియం శుద్ధి
శుద్ధిచేసిన యురేనియాన్ని రియాక్టర్ ఫ్యూయల్ తయారీకి వాడతారు. అణ్వస్త్రాల తయారీకి కూడా ఉపయోగిస్తారు.
ఇరాన్‌లో నాటాన్జ్, ఫోర్డో అనే రెండు ప్రాంతాల్లో యురేనియం శుద్ధి కేంద్రాలున్నాయి. అక్కడ యురేనియం హెక్సాఫ్లోరైడ్ గ్యాస్‌ను ఒక సెంట్రిఫ్యూజులలోకి (యురేనియం శుద్ధి యంత్రాలు) పంపించి ఫిసైల్ ఐసోటోప్ యు-235ను వేరు చేస్తారు.
యు-235 సాంద్రత 3 శాతం నుంచి 4 శాతం వరకూ ఉండే తక్కువ శుద్ధి చేసిన యురేనియంను.. అణు విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేయటానికి ఉపయోగించవచ్చు. ''ఆయుధ శ్రేణి'' యురేనియం 90 శాతం శుద్ధి చేసి ఉండాలి.
2015 జూలైలో ఇరాన్‌లో దాదాపు 20,000 సెంట్రిఫ్యూజులు ఉన్నాయి. జేసీపీఓఏ ఒప్పందం ప్రకారం.. ఆ ఒప్పందం అమలులోకి వచ్చిన 2016 జనవరి నుంచి పదేళ్ల కాలంలో అంటే 2026 వరకూ నాటాన్జ్ యురేనియం శుద్ధి కేంద్రంలో అత్యంత పాతవైన, అతి తక్కువ సామర్థ్యం గల సెంట్రిఫ్యూజులు 5,060 మించి స్థాపించరాదని పరిమితం చేశారు.
అలాగే ఇరాన్ యురేనియం నిల్వలను 98 శాతం తగ్గించి 300 కిలోలకు కుదించాలి. ఈ నిల్వ పరిమితి 2031 వరకూ దాటకూడదు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల స్థాయి కూడా 3.67 శాతం మేరకు మాత్రమే ఉండాలి.
2016 జనవరి నాటికి నాటాన్జ్, ఫోర్డోలలో ఇన్‌స్టాల్ చేసిన సెంట్రిఫ్యూజుల సంఖ్యను ఇరాన్ విపరీతంగా తగ్గించివేసింది. టన్నుల కొద్దీ తక్కువ శుద్ధి చేసిన యురేనియంను రష్యాకు తరలించింది.
దీనికితోడు.. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నాటాన్జ్ కేంద్రంలో మాత్రమే జరగాలి. అది కూడా 2024 వరకూ పరిమితం కావాలి.
ఫోర్డో కేంద్రంలో 2031 వరకూ యురేనియం శుద్ధికి అనుమతి లేదు. ఆ భూగర్భ కేంద్రాన్ని.. అణు, భౌతికశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంగా మారుస్తారు. ఆ కేంద్రంలో ఉన్న 1,044 సెంట్రిఫ్యూజులు.. ఔషధాలు, వ్యవసాయం, పరిశ్రమలు, శాస్త్ర విజ్ఞానంలో ఉపయోగించటానికి అవసరమైన రేడియోఐసోటోపులను ఉత్పత్తి చేస్తాయి.

ఫొటో సోర్స్, AFP
ప్లుటోనియం ప్రణాళిక
అరాక్ పట్టణం సమీపంలో ఇరాన్ ఒక భారజల అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. భారజల రియాక్టర్‌లో ఉపయోగించిన ఇంధనంలో అణు బాంబుకు పనికివచ్చే ప్లుటోనియం ఉంటుంది.
వాస్తవానికి.. అణ్వస్త్ర వ్యాప్తి ప్రమాదం ఉన్నందున అరాక్ భారజల అణువిద్యుత్ కేంద్రాన్ని తొలగించాలని ప్రపంచ శక్తులు కోరుకున్నాయి. 2013లో చేసుకున్న తాత్కాలిక అణు ఒప్పందం ప్రకారం, ఆ కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా ఉండటానికి లేదా ఆ రియాక్టర్‌కు ఇంధనం అందించకుండా ఉండటానికి ఇరాన్ అంగీకరించింది.
జేసీపీఓఏ ఒప్పందం మేరకు ఆ అణు రియాక్టర్‌లో ఆయుధ శ్రేణి ప్లుటోనియం ఉత్పత్తి జరగకుండా ఉండేలా దాని డిజైన్‌ను మారుస్తామని ఇరాన్ చెప్పింది. అలా డిజైన్ మార్చిన రియాక్టర్ ఉన్నంత వరకూ.. అందులో ఉపయోగించిన ఇంధనాన్ని దేశం వెలుపలికి పంపిస్తామనీ చెప్పింది.
అలాగే, 2031 వరకూ ఇరాన్ అదనంగా భార జల రియాక్టర్లు నిర్మించటానికి అనుమతి లేదు. అలాగే.. 2031 వరకూ భారజలం నిల్వలు పెంచుకోవటానికి వీలులేదు.

ఫొటో సోర్స్, AFP
రహస్య కార్యకలాపాలు
ఈ ఒప్పందం కుదిరిన సమయంలో.. ఇరాన్ రహస్యంగా అణు కార్యక్రమం నిర్మించకుండా జేసీపీఓఏ నిరోధిస్తుందని నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం విశ్వాసం వ్యక్తంచేసింది. ఇరాన్ ''అసాధారణ, దృఢమైన పర్యవేక్షణకు, తనిఖీకి, సోదా చేయటానికి'' కట్టుబడిందని కూడా చెప్పింది.
ప్రపంచ అణు నిఘా సంస్థ అయిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పరిశీలకులు.. ఇరాన్ ప్రకటించిన అణు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. బాంబు తయారుచేయటానికి ఫిసైల్ పదార్థాలను దొంగచాటుగా ఏదైనా రహస్య ప్రాంతానికి తరలించకుండా ఉండేలా తనిఖీ చేస్తారు.
అంతేకాదు, ఐఏఈఏ భద్రతాచర్యల ఒప్పందంతో పాటు ఐఏఈఏ పరిశీలకులు దేశంలో తాము అనుమానాస్పదంగా భావించిన ఏ కేంద్రాన్నైనా తనిఖీ చేయటానికి అనుమతించే అడిషనల్ ప్రొటోకాల్‌ను అమలు చేయటానికి కూడా ఇరాన్ అంగీకరించింది.
2031 వరకూ ఐఏఈఏ ఎటువంటి వినతి పంపినా దానిని పాటించటానికి ఇరాన్‌కు 24 రోజుల గడువు ఉంటుంది. ఒకవేళ ఇరాన్ తిరస్కరించినట్లయితే.. ఎనిమిది మంది సభ్యులు గల సంయుక్త కమిషన్ (ఇందులో ఇరాన్ కూడా ఉంది) ఈ అంశంపై ఆదేశాలు ఇస్తుంది. ఇరాన్ మీద ఆంక్షలను పునరుద్ధరించటం సహా చేపట్టగల దండన చర్యలను ఆ కమిషన్ మెజారిటీ ఓటు ద్వారా నిర్ణయిస్తుంది.

ఫొటో సోర్స్, AFP
బాంబు తయారీ సమయం...
2015 జూలై నాటికి ముందు.. ఇరాన్ దగ్గర శుద్ధి చేసిన యురేనియం నిల్వలు భారీ మొత్తంలో ఉండగా.. 20,000 వరకూ సెంట్రీఫ్యూజులు ఉన్నాయని.. వీటి ద్వారా ఎనిమిది నుంచి పది వరకూ బాంబులు నిర్మించవచ్చనని.. ఒబామా ప్రభుత్వం పేర్కొంది.
ఒకవేళ వేగంగా బాంబు తయారు చేయాలని ఇరాన్ నిర్ణయించి వున్నట్లయితే.. అణు బాంబు తయారీకి అవసరమైన 90 శాతం శుద్ధిచేసిన యురేనియాన్ని తగినంత సిద్ధం చేయటానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని అమెరికా నిపుణులు అంచనా వేశారు.
ఇరాన్ అణు బాంబును తయారు చేయటానికి అవసరమైన కీలక అంశాలను జేసీపీఓఏ తొలగిస్తుందని, బాంబు తయారీకి అవసరమైన సమయాన్ని ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ కాలానికి పెంచుతుందని ఒబామా ప్రభుత్వం చెప్పింది.
పరిశోధన, అభివృద్ధి సహా అణు బాంబు తయారీకి దోహదపడే కార్యకాలాపాలు నిర్వహించబోమని కూడా ఇరాన్ అంగీకరించింది.
ఇరాన్ అణు కార్యక్రమంలో సైనిక కోణాల మీద దశాబ్ద కాలంగా జరపుతున్న దర్యాప్తు ముగిసినట్లు ఐఏఈఏ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ డిసెంబర్ 2015లో ప్రకటించింది.
ఇరాన్ 2003 వరకూ ఒక అణు విస్ఫోటన పరికరాన్ని తయారు చేటానికి సంబంధించిన అనేక కార్యకలాపాల మీద 'సమన్వయంతో కృషి చేసినట్లు ఆ నివేదిక నిర్ధారించిందని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ యుకియా అమానో చెప్పారు. కొన్ని కార్యక్రమాలను 2009 వరకూ కొనసాగించిందని.. కానీ ఆ తర్వాత ఆయుధ తయారీకి సంబంధించి విశ్వసనీయ సూచనలేవీ లేవని వివరించారు.
తమ దేశం మీద ఐక్యరాజ్యసమితి విధించిన ఆయుధ నిషేధాజ్ఞలను మరో ఐదేళ్ల వరకూ కొనసాగించటానికి కూడా ఇరాన్ ఒప్పుకుంది. ఇరాన్ అణు కార్యక్రమం మొత్తం శాంతియుతంగా ఉందని ఐఏఈఏ సంతృప్తిచెందినట్లయితే ఆ నిషేధాజ్ఞలు ఇంకా ముందుగానే ముగియగలవు.
ఖండాంతర క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి మీద కూడా ఐక్యరాజ్యసమితి విధించిన నిషేధం మరో ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగుతుంది.

ఫొటో సోర్స్, AFP
ఆంక్షల తొలగింపు
ఇరాన్ యురేనియం శుద్ధి చేయటాన్ని నిలిపివేసేలా ఒత్తిడి చేసే ప్రయత్నంలో భాగంగా ఐక్యరాజ్యసమితి, అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు అంతకుముందు విధించిన ఆంక్షలు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. 2012-2016 సంవత్సరాల మధ్య ఇరాన్ 16,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 11,50,000 కోట్ల) చమురు ఆదాయం కోల్పోయింది.
అణు ఒప్పందం కింద.. విదేశాల్లో స్తంభింపజేసిన 1,000 కోట్ల డాలర్ల విలువైన తన ఆస్తులు ఇరాన్‌కు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రపంచ వాణిజ్య ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకుని అంతర్జాతీయ మార్కెట్లకు చమురు విక్రయాలను మళ్లీ ప్రారంభించగలిగింది.
కానీ.. ఈ చరిత్రాత్మక ఒప్పందాన్ని 2018 మే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రద్దు చేశారు. అదే ఏడాది నవంబరులో ఇరాన్‌ను, ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఆంక్షలను పునరుద్ధరించారు.
దీంతో ఇరాన్ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో పడింది. ఆ దేశ కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. వార్షిక ద్రవ్యోల్బణం రేటు నాలుగు రెట్లు పెరిగింది. విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. ప్రజాందోళనలు చెలరేగాయి.
అమెరికా ఆంక్షల పునరుద్ధరణను వ్యతిరేకించిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు.. అమెరికా శిక్షలను ఎదుర్కోకుండా ఇరాన్‌తో వ్యాపారం చేసే అంతర్జాతీయ సంస్థలకు సాయం చేయటానికి ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థను నెలకొల్పాయి.
అయితే.. 2019 మే నెలలో జేసీపీఓఏ ఒప్పందం కింద తను కట్టుబాట్లను ఇరాన్ పక్కన పెట్టింది. అమెరికా ఆంక్షల నుంచి తమ దేశానికి రక్షణ కల్పించటానికి.. ఆ ఒప్పందం మీద సంతకాలు చేసిన ఇతర దేశాలకు 60 రోజుల గడువు ఇచ్చింది. లేకపోతే అత్యంత శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తిని తాను పునరుద్ధరిస్తానని చెప్పింది.
ఇరాన్ ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తిని పెంచిందని.. అది ఎంత మొత్తమనేది తనకు తెలియదని ఐఏఈఏ చెప్తోంది.
ఐక్యరాజ్యసమితి ఆంక్షలు తొలగించే ఉన్నాయి. కానీ.. ఆ ఒప్పందంలోని ఏ అంశాన్నైనా ఇరాన్ ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే.. ఆ ఆంక్షలు మరో 10 ఏళ్ల పాటు అమలులోకి వస్తాయి. ఆ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించే అవకాశమూ ఉంది.
వివాదాన్ని జాయింట్ కమిషన్ పరిష్కరించలేకపోతే... దానిని ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి నివేదిస్తారు.
ఇవి కూడా చదవండి:
- JNU క్యాంపస్‌లో ఆదివారం రాత్రి ఏం జరిగింది? విద్యార్థులు, అధ్యాపకులు ఏం చెప్పారు?
- పాకిస్తాన్లో ప్రతి హత్యా నేరానికీ ఓ రేటు
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో జరిగేది ఇదే.. వాంతులు ఎందుకొస్తాయి? హ్యాంగోవర్ దిగేదెలా?
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








