పాకిస్తాన్‌లో క్షమాభిక్షలు కొనుక్కుంటున్న హంతకులు

ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సికిందర్ కిర్మానీ
    • హోదా, బీబీసీ న్యూస్, ఇస్లామాబాద్

ఆమెను కిరాతకంగా చంపేశారు.. నేర పరిశోధనలో భాగంగా ఇలాంటివెన్నో చూసిన డిటెక్టివ్‌లు కూడా ఆ మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు.

పాకిస్తాన్ రాజధాని ఇస్లామబాద్ శివారుల్లో జరిగిందీ హత్య. బుష్రా ఇఫ్తికార్ అనే 28 ఏళ్ల వివాహితను క్రూరంగా పొడిచి చంపారు.

ఎంత క్రూరంగా అంటే, ఆమెపై దాడికి ఉపయోగించిన కత్తి వంగిపోతే ఆ తరువాత స్క్రూడ్రైవర్‌తో పొడిచేశారు.

ఇంతకీ ఆమెను చంపిందెవరో తెలుసా? సమీ ఉల్లా. స్వయాన ఆమె భర్తే.

బుష్రా ఇఫ్తికార్, సమీ ఉల్లా దంపతులకు నలుగురు సంతానం. హత్యకు గురయినప్పటికీ బుష్రా గర్భిణి. భర్త ఆమెను ఎందుకు చంపాడన్నది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రం.. ఇస్లాంలోనే వేరే తెగలోని ఆమె మారాలనుకుటున్నందునే భర్త చంపేశాడని ఆరోపిస్తున్నారు.

అయితే, సమీ మాత్రం తన మెదడు స్తంభించిపోయిందని, అప్పుడేం జరిగిందో తనకేమీ గుర్తు లేదని కోర్టుకు చెప్పాడు.

గతంలో పక్కింటాయనపై దాడి చేశాడని, ఒక రెస్టారెంటు వద్ద హింసకు దారితీసిన వాదనల్లో ఉన్నాడని ఆరోపణలున్నాయి.

అయితే, సమీ ఉల్లాపై సరైన విచారణేమీ జరగలేదు. ఆయన కుటుంబానికి స్థానికంగా పట్టుందని, గత రెండు ఘటనల్లో బాధిత కుటుంబాలకు డబ్బులిచ్చి కేసుల నుంచి, జైలు నుంచి బయటపడ్డాడని బుష్రా సోదరుడు మొహమ్మద్ జకారియా 'బీబీసీ'తో చెప్పారు.

పాకిస్తాన్‌లోని చట్టాల ప్రకారం నేరాల బాధితులు కానీ, వారి కుటుంబసభ్యులు కానీ, ఆయా నేరస్థులకు క్షమాభిక్ష పెట్టే హక్కుంది. అనేక హత్యానేరాల్లోనూ ఇలా జరిగిన ఉదంతాలున్నాయి.

ఇందుకోసం వారు 'దైవం తోడుగా క్షమించాం' అంటూ కోర్టులో ప్రకటించాలి. అయితే, బాధిత కుటుంబాలకు డబ్బులిచ్చి ఇలా క్షమాభిక్ష ప్రకటనలు చేయించుకుని కేసుల నుంచి బయటపడుతున్నారని న్యాయపరిశీలకులు చెబుతారు. బాధిత కుటుంబాలకు ఇలా అనధికారికంగా డబ్బులివ్వడమనేది పాకిస్తాన్‌లో చట్ట విరుద్ధమేమీ కాదు.

బుష్రా ఇఫ్తికార్ సోదరుడు జకారియా
ఫొటో క్యాప్షన్, బుష్రా ఇఫ్తికార్ సోదరుడు జకారియా

ఇస్లాం ప్రభావిత న్యాయ సంస్కరణల్లో భాగంగా 1990లో ఇలాంటి క్షమాభిక్ష, కోర్టు వెలుపల పరిష్కారాలకు అవకాశమిచ్చారు.

పెండింగు కేసుల భారంతో ఇప్పటికే నలిగిపోతున్న పాకిస్తానీ కోర్టులకు ఈ పద్ధతి వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని దీనికి మద్దతిచ్చేవారు వాదిస్తారు.

కానీ, ఈ సంస్కరణను తీసుకొచ్చిన 1990 తరువాత హత్య కేసుల్లో దోషిత్వ నిర్ధరణ, శిక్షలు పడే రేటు తగ్గిపోయింది. 1990లో హత్య కేసుల్లో దోషిత్వ నిర్ధరణ రేటు 29 శాతం ఉండగా 2000లో అది 12 శాతానికి పడిపోయింది.

ఈ న్యాయ సంస్కరణ పదేపదే నేరాలు చేసేవారికి తప్పించుకోవచ్చులే అనే ధీమా కలుగుతుందని, శక్తిమంతులు చట్టం నుంచి తప్పించుకోవడానికీ ఇది అవకాశం కల్పిస్తుందన్నది విమర్శకుల మాట.

తన బావ సమీ ఉల్లా గతంలో హింసాత్మక నేరాలకు పాల్పడి తప్పించుకోగలగడం వల్లే ఆయన మరింత హింసాత్మక మారి చివరకు భార్యనే చంపేశాడని బుష్రా సోదరుడు మొహమ్మద్ జకారియా అన్నారు.

సమీ ఉల్లా గతంలో చేసిన నేరాలుగా చెబుతున్న ఘటనల్లో రాజీ కుదుర్చుకున్నామని.. అయితే, ఆయన ఆ కేసుల్లో దోషి కావడం వల్ల రాజీ కుదుర్చుకోవడం కాకుండా న్యాయ ప్రక్రియను నివారించడానికే ఆ పని చేశామని చెప్పారు.

ప్రస్తుతం భార్యను హత్య చేసిన కేసులో దోషిగా తేలడంతో మరణశిక్ష పడకుండా సమీ ఉల్లా అప్పీల్ చేసుకుంటున్నాడు.

కోర్టు

ఫొటో సోర్స్, AFP

గత ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన అస్తార్ ఆసఫ్ అలీ ఆ న్యాయసంస్కరణల్లో మార్పులకు 2015లో ప్రతిపాదించారు. కానీ, అందులోనూ ఈ క్షమాభిక్ష అంశం మాత్రం అలాగే ఉంచారు.

''క్షమించే హక్కు అందరికీ ఉంటుంద''ని ఆయన బీబీసీతో అన్నారు. అయితే, క్షమాభిక్ష తరువాత కూడా కనీస జైలు శిక్ష ఉండాలని.. అలా ఉంటే, నేరాలు చేసినా డబ్బులిచ్చి బయటపడలేమని నేరస్థులకు అర్థమవుతుందని అన్నారు.

అస్తార్ ప్రతిపాదనలకు అప్పట్లో కొద్దిమంది మినహా ఎక్కువ మంది ఇస్లామిక్ రాజకీయ నాయకుల నుంచి మద్దతు దొరకలేదు.

ప్రస్తుత చట్టం అటు పోలీసులు, క్రిమినల్ లాయర్లకు కూడా నిరాశ కలిగిస్తోంది. అయితే, ఈ క్షమాభిక్షల వెనుక ఒత్తిళ్లు కానీ, డబ్బులు మారడం కానీ ఉందని కోర్టులు అనుమానిస్తే ఆ క్షమాభిక్షను తిరస్కరించే అధికారం వాటికి ఉంటుంది. కానీ.. పెండింగు కేసుల భారం వల్ల కోర్టులు కూడా వారు కూడా ఇలాంటి క్షమాభిక్షల ఉదంతాల లోతుల్లోకి వెళ్లలేకపోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

చాలా కేసుల్లో బాధితులను నేరస్థులు బెదిరించి రాజీలు చేసుకుంటున్నారని.. మాట వినకపోతే మళ్లీ దాడి చేస్తామని బెదిరించి క్షమాభిక్ష పొందుతున్నారని ఓ డిటెక్టివ్ చెప్పారు.

ఇలాంటి సెటిల్‌మెంట్లలో పోలీసులు లాభపడుతున్నారని ఆయన ఆరోపించారు.

సలాఉద్దీన్ అయూబీ

ఫొటో సోర్స్, Handout

2019 ఆగస్టులో సెంట్రల్ పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ఓ దొంగ బ్యాంకు నగదు యంత్రం నుంచి క్యాష్ కార్డు దోచుకుని వెళ్తూ సీసీ టీవీ వైపు చూసి నాలుక కరుస్తూ వెక్కిరించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

ఆ తరువాత పోలీసులు సలాఉద్దీన్ అయూబీ అనే దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.. కస్టడీలో ఆయన చనిపోయాడు.

సలాఉద్దీన్ మరణం తరువాత మరో వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో పోలీసులు ఆయన్ను విచారిస్తుంటారు. ఓ పోలీసు అతడి రెండు చేతులు మెలితిప్పి పట్టుకోగా మరో పోలీసు విచారిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సలాఉద్దీన్ చెవిటి, మూగవాడిగా నటిస్తూ బాధతో మెలికలు తిరగడం కనిపిస్తుందా వీడియాలో.

సలాఉద్దీన్ చనిపోయిన తరువాత ఆయన తండ్రి న్యాయం కోసం పోరాడారు. తన కుమారుడు మానసిక వికలాంగుడని ఆయన చెప్పారు. అయితే.. ఓ నెల రోజుల తరువాత ఆయన తన కుమారుడిని చంపారంటున్న పోలీసులను దేవుడి పేరిట క్షమించినట్లుగా ప్రకటించారు.

బాధిత కుటుంబానికి భారీ మొత్తం ఇవ్వడంతో పాటు ఆ ఊరికి కొత్తగా రోడ్డు వేయడం, గ్యాస్ పైప్‌లైన్ వేయడం వంటి ఒప్పందాలు చేసుకుని పోలీసు శాఖ సెటిల్మెంట్ చేసుకుందన్న విమర్శలున్నాయి.

పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ విభాగంతో సంబంధాలున్న ఓ మతాధికారి కుదిర్చిన ఈ రాజీతో సలాఉద్దీన్ తండ్రి సంతృప్తి చెందినట్లుగా ఉంది. ప్రజల మద్దతో, బలవంతుల మద్దతో లేనివారంతా న్యాయం కోసం పోరాడలేక ఇలాంటి ఆఫర్లకు తలొగ్గి రాజీపడిపోతున్నారు.

లాహోర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించాడు. హత్య కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకోగా కస్టడీలో చనిపోయాడు. అందుకు కారకులైన పోలీసులపై ఆకేసు పెట్టగా తమను డబ్బుతో ప్రలోభపెట్టడమే కాకుండా కేసు ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని కుటుంబసభ్యులు బీబీసీకి చెప్పారు.

పోలీసుల బలవంతంతో నిస్సహాయ స్థితిలో క్షమిస్తున్నట్లు ప్రకటించామని, కానీ తమ హృదయంలో మాత్రం వారిపై ఎలాంటి కనికారం లేదని మృతుడి సోదరుడు చెప్పారు.

పోలీసులు, రాజకీయ నాయకులు తమ ఇంటికి క్యూ కట్టారని.. కేసు వెనక్కు తీసుకోకపోతే నిందితులు జైలు శిక్ష పడినా ఆర్నెళ్లో, సంవత్సరం తరువాత బయటకొస్తే మీకు ఇబ్బందులు తప్పవంటూ బెదిరించడంతో క్షమించినట్లు ప్రకటించామని చెప్పారు.

బాధితులది పేద కుటుంబం.. వారికి ఇల్లు కొనుక్కోవడానికి డబ్బిచ్చి బలవంతంగా ఈ ఒప్పందం చేసుకున్నారు.

అయితే, మృతుడి తల్లి మాత్రం ఇదేం న్యాయం.. మాకు సొంతిల్లు లేకపోయినా ఫరవాలేదు, తన కుమారుడు బతికి ఉంటే అద్దె ఇంటిలోనే ఉంటూ సంతోషంగా ఉండేవాళ్లమని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)