ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు: మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా...

ఫొటో సోర్స్, AFP
అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ మిలటరీ కమాండర్ కాసిం సులేమానీ మరణించిన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు.. కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఈ వ్యవహారం చుట్టూ తలెత్తుతున్న అనేక సందేహాలకు బీబీసీ రక్షణ, దౌత్య వ్యవహారాల ప్రతినిధి జొనాథన్ మార్కస్ సమాధానాలిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?
జొనాథన్ మార్కస్: సులేమానీని అమెరికా హతమార్చడమనేది ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కానీ, ఇది మూడో ప్రపంచ యుద్ధానికేమీ దారితీయదు. మూడో ప్రపంచ యుద్ధం భారీ సంక్షోభం అనే తలెత్తితే కీలకంగా ఉంటాయనుకునే రష్యా, చైనా వంటి దేశాలకు ప్రస్తుత వ్యవహారంలో ఎలాంటి పాత్రా లేకపోవడం అందుకు ఓ కారణం.
అయితే, తాజా పరిణామాలు పశ్చిమాసియాలో మాత్రం ప్రభావం చూపుతాయి. ఇరాన్ నుంచి ప్రతీకార చర్యలు ఉండే అవకాశాలున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులు ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇలా ఎవరినైనా చంపేయడం చట్టబద్ధమా?
జొనాథన్ మార్కస్: ఇరాక్‌లోని అమెరికా బలగాలపై దాడులకు సులేమానీ బాధ్యుడని అమెరికా వాదించొచ్చు. అనేక మంది అమెరికన్ల రక్తంతో సులేమానీ చేతులు ఇప్పటికే తడిసిపోయాయని అమెరికా ఆరోపిస్తోంది. సులేమానీ నేతృత్వంలో ఖడ్స్ గ్రూప్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా చూస్తోంది. ఆ ప్రకారం ఇది చట్టబద్ధమే అనే కథనం అమెరికా వినిపించొచ్చు.
అయితే, అంతర్జాతీయ న్యాయఅంశాల నిపుణులు, నోట్ర డామ్ లా స్కూల్ ప్రొఫెసర్ 'మేరీ ఎలెన్ ఓ కానెల్' ఏమంటున్నారంటే.. ''ఆత్మరక్షణ కోసం ముందు జాగ్రత్తతో చంపామని చెప్పినంత మాత్రాన ఆ హత్య చట్టప్రకారం సమర్థనీయమైపోదు. ఐక్యరాజ్య సమితి చట్టాల ప్రకారం ఆత్మరక్షణలో భాగంగా సాయుధ దాడికి ప్రతిచర్యకు దిగే హక్కు ఉంటుంది'' అన్నారామె.
''అయితే, సులేమానీపై డ్రోన్ దాడి చేసి హతమార్చడం అమెరికాపై సాయుధదాడికి ప్రతిచర్యేమీ కాదు. అమెరికా సార్వభౌమిక ప్రదేశంలో ఎక్కడా ఇరాన్ దాడులు చేయలేదు. ఈ ఘటనలో అమెరికా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సులేమానీని హతమార్చడమే కాదు, ఇరాక్ భూభాగంలో చట్టవిరుద్ధంగా దాడి చేసింది'' అని మేరీ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి ఐక్యరాజ్య సమితి ఏమంటుంది?
జొనాథన్ మార్కస్: ఐక్యరాజ్య సమితిలో ప్రాతినిధ్య దేశాల అభిప్రాయం కాకుండా వేరేగా సమితి అభిప్రాయమనేదేమీ ఉండదు. ఐరాస భద్రతా మండలి ఎలా చూస్తుందన్నది ఆలోచిస్తే అక్కడ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇప్పటికే అన్నారు. గల్ఫ్‌లో మరో యుద్ధమొస్తే భరించే స్థితిలో ప్రపంచం లేదని.. నాయకులు సంయమనం పాటించాలంటూ గుటెరస్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ అభిశంసన వ్యవహారం నుంచి దృష్టి మరల్చడానికే ఇదంతా చేశారా?
జొనాథన్ మార్కస్: ఇలాంటి ఆరోపణలు చేయడం సులభం. అయితే, దేశీయ రాజకీయ అవసరాలు ఎప్పుడూ కీలకమేనన్నది కొట్టిపారేయలేం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంవత్సరంలో ట్రంప్‌కు ఇంకా కీలకం. కాబట్టి సులేమానీని హతమార్చాలన్న నిర్ణయం వెనుక అవకాశవాదం, రాజకీయ పరిస్థితులు ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ అణ్వస్త్రాలతో బదులు తీర్చుకునే ప్రమాదం ఉందా? అసలు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలున్నాయా?
జొనాథన్ మార్కస్: అణ్వస్త్ర కార్యక్రమాలకు కావాల్సిన సకల ఏర్పాట్లూ ఇరాన్ వద్ద ఉన్నప్పటికీ అణ్వస్త్ర దాడులకు పాల్పడే ఉద్దేశంలో ఇరాన్ లేదు. మరోవైపు అణుబాంబులు తమకు అవసరం లేదని ఇరాన్ ఎప్పటి నుంచో చెబుతోంది.
అయితే, అమెరికాతో పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో సంయమనం వీడి అంతర్జాతీయ సమాజంతో తాను చేసుకున్న అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని ఇరాన్ పక్కనపెట్టి అణ్వస్త్ర కార్యక్రమం చేపట్టే అవకాశం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ జనరల్ సులేమానీ ఇరాక్‌లో ఏం చేస్తున్నారు.. ఆయన్ను హత్య చేయడంపై ఇరాక్ ఏమంటోంది?
జొనాథన్ మార్కస్:ఇరాక్‌లో ఆయనేం చేస్తున్నారో కచ్చితంగా తెలియనప్పటికీ.. ఇరాక్‌లోని కొన్ని షియా మిలీషియా గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇస్తుందన్నది వాస్తవం. మరోవైపు సులేమానీతో పాటు మరణించిన అబూ మహదీ అల్-ముహందిస్ ఇటీవల అమెరికా స్థావరాలపై రాకెట్ దాడులు చేసిన కతైబ్ హిజ్బుల్లా సంస్థ నాయకుడు. అంతేకాదు.. ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలీషియా సంస్థల సంకీర్ణానికి డిప్యూటీ కమాండర్.
ఈ పరిస్థితుల్లో అమెరికా చర్యతో ఇరాక్ ఇరుకునపడింది. ఇరాన్, అమెరికాలు రెండింటికీ ఇరాక్ మిత్రదేశమే.
అమెరికా స్థావరాలపై సైనిక దాడులతో ఇరాక్ అధికారులు అప్పటికే ఇబ్బంది పడ్డారు. కతైబ్ హిజ్బుల్లా గ్రూపుపై అమెరికా దాడులను ఇటీవల ఇరాక్ ఖండించింది. అలాగే, అమెరికా స్థావరాలపై దాడులనూ ఇరాక్ ఖండించడంతో పాటు అమెరికా స్థావరాల రక్షణకు పూచీ ఇచ్చింది.
మరోవైపు సులేమానీ హత్యను ఇరాక్ ప్రధాని కార్యాలయం ఖండించింది. సులేమానీ, ఆయనతో పాటు మరణించిన మిలీషియా నాయకుడు ఇద్దరూ ఐఎస్ వ్యతిరేక పోరాటంలో గొప్ప విజయాలు సాధించారని చెబుతూ ఇద్దరినీ అమరవీరులుగా కీర్తించింది. తమ దేశంలో ఉన్న అమెరికన్ బలగాలు తమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని ఇరాక్ గట్టిగా చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్‌లో ఇరాన్, అమెరికాల పాత్రేమిటి?
జొనాథన్ మార్కస్:ఇరాక్‌లోని పాలక షియా ప్రభుత్వానికి ఇరాన్ సన్నిహిత దేశం. ఇరాక్‌లోని కొన్ని మిలీషియా గ్రూపులతో పనిచేస్తూ అక్కడ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇరాక్‌లో అమెరికాకు 5 వేల మంది బలగం ఉంది. ఇరాక్‌లో ఇంకా మిగిలిన ఐఎస్ టెర్రరిస్టులను ఏరివేసేందుకు గాను ఇరాకీ సైన్యానికి శిక్షణ, సహాయం అందించడం వీరి పని.
మొత్తానికి ఈ రెండు బయటి శక్తులూ కలిసి ఇరాక్‌లో ఒకదానితో మరొకటి తలపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!
- కాసిం సులేమానీ హత్య తర్వాత ఇరాన్, ఇరాక్‌లో ఏం జరుగుతోంది?
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
- కాసిం సులేమానీ మృతి: దిల్లీలో కూడా దాడులకు కుట్ర పన్నారంటున్న డోనల్డ్ ట్రంప్
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
- వివాహ వేదికల నుంచి ఉచిత న్యాయ సేవల వరకు... పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా యువత ఎలా ఉద్యమిస్తున్నారు?
- పాకిస్తాన్‌లోని నాన్కానా సాహెబ్ గురుద్వారాపై దాడి.. సిక్కు ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలన్న భారత్
- డబ్బు ప్రమేయం లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక: విశాఖపట్నంలోనే సెక్రటేరియట్, సీఎం, అన్ని హెచ్ఓడీల కార్యాలయాలు
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
- 'సూర్యుడు ఓం అంటూ జపం చేస్తున్నాడు’: నాసా వీడియో అంటూ కిరణ్‌బేడి ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








