ఇరాన్‌ సుప్రీం లీడరే లక్ష్యంగా డోనల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షలు.. ఇది యుద్ధ దాహమే అంటున్న అధికారులు

ఇరాన్‌పై కొత్త ఆంక్షలు

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌పై అమెరికా కొత్తగా మరింత కఠిన ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వీటిని ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖొమైనీని కూడా కొత్త ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చారు.

అమెరికా డ్రోన్‌పై దాడి చేయడం, ఇతర కారణాలతో ఈ ఆంక్షలు విధించామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఈ ఆంక్షల ఆదేశాలు జారీ చేసిన తర్వాత వైట్ హౌస్‌లో మాట్లాడిన ట్రంప్.. అయాతుల్లా ఖొమైనీని కూడా ఈ ఆంక్షల పరిధిలో చేర్చడం చాలా అవసరం అన్నారు.

"ఇరాన్ సుప్రీం నేతలు తమ పాలనలో జరిగే అన్నిటికీ బాధ్యులు అవుతారు. వారికి వారి దేశంలో చాలా గౌరవం ఉంటుంది. వారి అధీనంలో చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్‌ ఆర్మీ కూడా అందులోకి వస్తుంది. ఈ ఆంక్షల తర్వాత ఇరాన్ సుప్రీం నేత, ఆయన కార్యాలయం, దానికి సంబంధించిన మిగతా అందరూ ఏదో ఒక విధంగా ఆర్థిక సహకారం కోల్పోతారు" అని ట్రంప్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మరోవైపు ఈ కొత్త ఆంక్షలను యుద్ధం దిశగా అమెరికా వేసిన మరో అడుగుగా ఇరాన్ వర్ణించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జావేద్ జరిఫ్ తన ట్వీట్‌లో ఈ ఆంక్షలను అమెరికా నీచ దౌత్యంగా పేర్కొన్నారు. ట్రంప్ పాలన యుద్ధదాహంతో ఉందన్నారు.

ఇరాన్‌పై కొత్త ఆంక్షలు

ఫొటో సోర్స్, AFP

చర్చలకు తావుంటుందా..

అమెరికా ట్రెజరీ విభాగం వివరాల ప్రకారం రెవెల్యూషనరీ గార్డ్స్‌లోని 8 మంది కమాండర్లను బ్లాక్‌లిస్ట్ చేశారు. కొత్త ఆంక్షల అమలులో భాగంగా మిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తారు. ఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా కోశాధికారి స్టీవ్ మ్యూనిచ్ చెప్పారు.

"అధ్యక్షుడి వైఖరి స్పష్టంగా ఉంది. వాళ్లు మళ్లీ చర్చల టేబుల్ దగ్గరకు తిరిగి రావాలనుకుంటే, మేం సిద్ధంగా ఉన్నాం. వాళ్లు అది వద్దనుకుంటే, మేం కూడా అది కోరుకోం. కొందరు ఈ ఆంక్షలు లాంఛనప్రాయమే అనుకుంటున్నారు. కానీ అదేం కాదు. మేం నిజంగా ఇరాన్‌కు చెందిన మిలియన్ డాలర్లను అడ్డుకున్నాం. ఈ ఆంక్షల వల్ల చాలా విస్తృత ప్రభావం చూడవచ్చు" అని ఆయన అన్నారు.

అటు ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి మాజిద్ తఖ్త్ రవాంచీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు అమెరికాతో చర్చలు జరిపేలా లేవన్నారు.

"చర్చల కోసం నిర్ణీత నిబంధనలు, షరతులు ఉంటాయని మనకందరికీ తెలుసు. మిమ్మల్ని బెదిరిస్తూ, భయపెడుతూ ఉండే ఏదైనా దేశం లేదా వ్యక్తితో చర్చలు జరపడం మీకు సాధ్యం కాదు. ఇరాన్‌పై ఆంక్షలు విధించడమే వాళ్ల పని అయినపుడు మేం వాళ్లతో చర్చలు ఎలా ప్రారంభించగలం. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో చర్యలు సాధ్యం కాదు" అన్నారు.

అమెరికా కోశాధికారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా కోశాధికారి స్టీవ్ మ్యూనిచ్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు

ఇరాన్, అమెరికా మధ్య గత కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా 2018 మేలో ఇరాన్‌పై ఎత్తివేసిన అన్ని ఆంక్షలను మళ్లీ అమలు చేసింది. అమెరికా ఈ ఆంక్షలను 2015లో జరిగిన అణు ఒప్పందం తర్వాత ఎత్తివేసింది.

అమెరికా గత ఏడాది తనకు తానుగా ఈ ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు అమెరికా - ఇరాన్ సంబంధాలకు బీటలు పడ్డాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఇరాన్ కూడా ఆ ఒప్పందం నుంచి పాక్షికంగా వైదొలిగింది.

ఉద్రిక్త పరిస్థితుల మధ్య గల్ఫ్‌లో ఉన్న సౌదీ చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. దాని వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా అంటుంటే, ఇరాన్ ఆ ఆరోపణలను ఖండించింది. జూన్ 27 తర్వాత తమ అణు కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్ధారిత పరిధి కంటే పెంచుతామని ఇరాన్ చెప్పింది.

కొన్ని రోజుల తర్వాత ఇరాన్ ఒక అమెరికా డ్రోన్‌ను కూల్చేసింది. అది అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో ఉందని అమెరికా అంటుంటే, ఇరాన్ మాత్రం అది తమ సరిహద్దుల్లోకి ప్రవేశించిందని చెబుతోంది.

కొత్త ఆంక్షల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పుడున్న ఈ ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)