పాకిస్తాన్: నెల రోజుల్లో 700 హెచ్ఐవీ కేసులు.. బాధితుల్లో చిన్నారులే ఎక్కువ

ఫొటో సోర్స్, AFP
పాకిస్తాన్‌లో కేవలం ఒక్క నెల రోజుల్లోనే 700 హెచ్ఐవీ కేసులు బయటపడ్డాయి. బాధితుల్లో 600 మంది చిన్నారులే. వారిలో సగం కన్నా ఎక్కువ మంది ఐదేళ్ల లోపు వారే. చాలా కేసుల్లో వారి తల్లిదండ్రులను పరీక్షించగా ఆ వ్యాధి లక్షణాలే లేవు.
కరాచీకి ఉత్తరాన ఉన్న రటో డేరో అనే పట్టణంలో ఇలా ఒక్కసారిగా హెచ్ఐవీ విజృంభించడానికి కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు.
ఇటీవలే హెచ్‌ఐవీ సోకి తన ఐదేళ్ల కొడుకు మొజమ్మల్ అలీని కోల్పోయారు నవాబ్ ఖతూన్.
ఆ చిన్నారికి హెచ్ఐవీ సోకినట్టు కేవలం నెల రోజుల కిందే గుర్తించారు. మూడేళ్ల పాటు ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతూ వచ్చాడు. ఈ ప్రమాదకరమైన వ్యాధి గురించి నవాబ్ ఖాతూన్ గతంలో ఎప్పుడూ వినలేదు.
తన కుమారుని అకాల మరణానికి స్థానిక వైద్య వ్యవస్థే కారణమన్నది ఆమె ఆరోపణ.
"స్థానిక వైద్యుడు నా బిడ్డకు ఓ ఇంజక్షన్ ఇచ్చాడు. అప్పటి నుంచి వాడు మళ్లీ కోలుకోలేదు. వాణ్ణి మేం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ వాళ్లు చికిత్స చెయ్యలేదు. నా బిడ్డ చాలా నొప్పితో బాధపడ్డాడు. నేను ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయేదాన్ని" అని నవాబ్ ఖతూన్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
600 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ
గత కొద్ది వారాల్లో రాటోడేరో పట్టణంలో 600ల మందికి పైగా చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారు. వాళ్లలో చాలా మంది ఐదేళ్ల లోపు వారే. వారిలో నవాబ్ ఖతూన్ కొడుకు కూడా ఒకరు.
ముందుగా స్థానిక ప్రైవేట్ డాక్టర్ ఈ ప్రమాదాన్ని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు.
నేను మొదట ఒక హెచ్ఐవీ కేసును గుర్తించాను. ఆ తర్వాత రెండు వారాల్లోనే మరో 20 కేసులు బయటపడ్డాయి. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశాను అని డాక్టర్ ఇమ్రాన్ అర్బానీ బీబీసీకి చెప్పారు.
వెంటనే ఆరోగ్యశాఖ అధికారులు భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, AFP
వాడిన సిరంజీలను మళ్లీ మళ్లీ వాడటం వల్లే హెచ్‌ఐవీ?
స్థానిక వైద్యులు వాడిన సిరింజన్లే మళ్లీ మళ్లీ వాడటం వల్ల ఈ వ్యాధి వ్యాపించి ఉండొచ్చని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఒక్కసారిగా హెచ్ఐవీ ఈ స్థాయిలో విజృంభించడానికి కచ్చితమైన కారణాలేంటో ఇంకా నిర్ధరించాల్సి ఉంది.
సగంకన్నా ఎక్కువ కేసుల్లో హెచ్ఐవీ వ్యాప్తికి సిరంజిలే ప్రధాన కారణం. అయితే దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో దర్యాప్తు తర్వాతే వెలుగులోకి వస్తాయని సింధ్ ఎయిడ్స్ ప్రోగ్రాం చీఫ్ సికందర్ మెమన్ చెప్పారు.
హెచ్ఐవీ రోగుల సంఖ్య మరింతగా పెరగొచ్చనే భయాలున్నాయి. మరోవైపు, తమకు అవసరమైన వైద్య సదుపాయాలు అందటం లేదని స్థానిక ప్రజలంటున్నారు.
సర్కారీ వైద్య కేంద్రాల నుంచి రోగులను వెనక్కి పంపిస్తున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
ఈ ప్రాంతంలోని నిరుపేద గ్రామీణ ప్రజలంతా ఇప్పుడు భయం, అనిశ్చితి గుప్పిట్లో చిక్కుకున్నారు.
హెచ్ఐవీ వ్యాధి విజృంభించడానికి కారణాలను గుర్తించి ఈ ప్రాంతంలోని చిన్నారుల్ని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- జగన్ క్యాబినెట్: సుచరితకు హోం శాఖ.. 25 మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇవీ
- మోదీ తొలి విదేశీ పర్యటనకు మాల్దీవులనే ఎందుకు ఎంచుకున్నారు?
- నాసా: అంతరిక్ష కేంద్రంలో హాలిడే.. పర్యాటకులకు అనుమతి.. ఒక రాత్రికి అద్దె రూ. 24 లక్షలు
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









