ఎయిడ్స్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఇదేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మైకోప్లాస్మా జెనిటాలియం (ఎంజీ) అనే సుఖవ్యాధి మందులకు లొంగని సూపర్ బగ్ కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ వ్యాధి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఎంజీ వ్యాధిని గుర్తించడానికి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ దీని వల్ల కటిభాగంలో పుళ్లు ఏర్పడవచ్చచు. మహిళల్లో పిల్లలు పుట్టకుండా పోయే అవకాశం ఉంది.
ఎంజీని సరైన సమయంలో గుర్తించి దానికి చికిత్స చేయకుంటే.. అది ముందు ముందు యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగకుండా పోతుంది.
ఈ నేపథ్యంలో 'బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ అండ్ హెచ్‌ఐవీ' ఎంజీని ఎలా గుర్తించాలి, దానికి ఎలాంటి చికిత్స చేయాలన్న దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకూ ఎంజీ అంటే ఏమిటి?
మైకోప్లాస్మా జెనిటాలియం అనేది ఒక సూక్ష్మజీవి. ఇది పురుషులలో మూత్ర విసర్జన నాళం వాపునకు కారణమై, మూత్ర విసర్జన బాధాకరంగా అయ్యేలా చేస్తుంది.
అదే మహిళల విషయానికి వస్తే, వారిలో పునరుత్పాదక అంగాలు (గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్) వాయడానికి కారణమవుతుంది. దీని వల్ల జ్వరంతో పాటు విపరీతమైన బాధ, కొంత రక్తస్త్రావం కూడా ఉంటుంది.
ఈ వ్యాధి ఉన్నవారితో కండోమ్స్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటే ఇది వాళ్లకు కూడా అంటుకునే ప్రమాదముంది.
ఎంజీని మొదట బ్రిటన్‌లో 1980లలో గుర్తించారు.
ఎంజీ ఉన్నా అన్నిసార్లూ దాని లక్షణాలు కనిపించవు. దానికి అన్నిసార్లూ చికిత్స కూడా అవసరం లేదు. కొన్నిసార్లు దీనిని క్లామైడియా అనే మరో సుఖవ్యాధిగా కూడా పొరబడే అవకాశం ఉంది.
ఇటీవలే ఈ వ్యాధికి పరీక్షలు కనుగొన్నా, ప్రస్తుతం ఇవి అన్నిచోట్లా అందుబాటులో లేవు.
ఈ పరిశోధనల్లో పాల్గొన్న ప్యాడీ హార్నర్, ''పిల్లలు పుట్టని మహిళలు తప్పకుండా వెంటనే ఈ ఎంజీ పరీక్షలు చేయించుకోవాలి. అలాంటి పరీక్షలు అంతటా అందుబాటులోకి రావాల్సిన అవసరముంది.'' అని విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
'నాకు ఎంజీ ఉందని తెలిసింది'
జాన్ (పేరు మార్చాం) బీబీసీతో ఈ ఇన్ఫెక్షన్‌పై తన అనుభవాలను పంచుకున్నారు.
''గత ఏడాది నా కొత్త పార్ట్‌నర్‌తో కలిసాక, నాకు ఎంజీ ఉందని పరీక్షల్లో తేలింది. మేమిద్దరం భాగస్వాములు కావడానికి ముందు పరీక్షలు చేయించుకోగా, ఇద్దరికీ ఎలాంటి వ్యాధీ లేదని తేలింది. అయితే ఏవో లక్షణాలు కనిపిస్తే తప్ప, ఎంజీ పరీక్షలు నిర్వహించరు.''
''మేమిద్దరం భాగస్వాములయ్యాక నాలో ఎంజీ లక్షణాలు కనిపించాయి. మూత్రనాళం నుంచి చీములాంటిది కారడం ప్రారంభమైంది. మూత్రం పోస్తుంటే మంటగా అనిపించడం ప్రారంభమైంది. కానీ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అదే సమయంలో నా భాగస్వామికి కూడా ఎంజీ ఉందని పరీక్షల్లో తేలింది. రెండు వారాల పాటు యాంటీ బయాటిక్స్ వాడాక, మాకిద్దరికీ నయమైంది.'' అని జాన్ వివరించారు.
ప్రస్తుతం యాంటీబయాటిక్స్‌తో ఎంజీకి చికిత్స చేయొచ్చు. కానీ ఇది క్రమక్రమంగా కొన్ని యాంటీబయాటిక్స్‌కు లొంగకుండా పోతోంది.
ఉదాహరణకు బ్రిటన్‌లో ఎంజీ చికిత్సలో ఉపయోగించే మాక్రోలైడ్స్ అనే యాంటీబయాటిక్స్‌కు 40 శాతం పని చేయడం తగ్గిపోయిందని పరిశోధనల్లో తేలడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








