డేటింగ్ చేయడానికి కూడా లీవులు ఇస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో వచ్చే కొత్త చాంద్రమాన సంవత్సరంలో ఉద్యోగాలకు సెలవు పెట్టి తమ ఇళ్లకు వెళ్లటానికి లక్షలాది మంది సంసిద్ధమవుతున్నారు.
అయితే, అదృష్టవంతులైన కొంతమంది ఉద్యోగులకు మామూలుగా ఇచ్చే ఏడు రోజుల సెలవులకన్నా అదనంగా ఎనిమిది రోజుల ఐచ్ఛిక సెలవులు తీసుకునే సదవకాశం లభిస్తోంది. కాకపోతే, ఈ సౌకర్యం 30 ఏళ్ల వయసు పైబడిన ఒంటరి మహిళలకు మాత్రమే.
ఇంతకీ, ఎందుకీ సెలవులు? వారు తమ జీవిత భాగస్వామిని వెదుక్కోవటానికి.
తూర్పు చైనాలోని హాంగ్‌ఝో టూరిస్ట్ పార్క్‌లో రెండు కంపెనీలు. తమ ఉద్యోగులకు అదనంగా ‘డేటింగ్ లీవ్’ ఇస్తున్నాయని సౌత్ చైనా మోర్నింగ్ స్టార్ దినపత్రిక పేర్కొంది.
ఇదే నగరంలోని ఒక స్కూల్‌లో అవివాహిత మహిళా టీచర్లకు ‘‘లవ్ లీవ్’’ పేరుతో సెలవులు ఇస్తున్నారు.
మిగిలిపోయిన మహిళలు...
చైనాలో మూడు పదుల వయసుకు దగ్గరపడిన పెళ్లికాని మహిళలను ‘షెంగ్ ను’ - అంటే ‘మిగిలిపోయిన మహిళలు’ - అని కించపరుస్తూ వ్యవహరిస్తుంటారు.
ఎక్కువ మంది జనం కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తూనో, ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకోవటం వల్లనో చైనాలో అవివాహితుల సంఖ్య పెరుగుతూ ఉంది.
కానీ, పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలన్న ఒత్తిడి మహిళలపై కొనసాగుతూనే ఉంది. మరోవైపు దేశంలో వృద్ధ జనాభా పెరుగుతుండటం, శ్రామికుల సంఖ్య తగ్గిపోతుండటం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఒంటరిగా ఉన్నటువంటి ఇరవై ఏళ్లు దాటిన, ముప్పయ్యో పడికి దగ్గర పడిన మహిళలను నిందించటానికి చైనా ప్రభుత్వం రచించిన దుష్ప్రచారం ఇది’’ అని లెటా హాంగ్ ఫించర్ అనే రచయిత వ్యాఖ్యానించారు.
చైనా ఒంటరి మహిళల గురించి ‘‘లెఫ్టోవర్ ఉమెన్’’, ‘‘బెట్రేయింగ్ బిగ్ బ్రదర్: ద ఫెమినిస్ట్ అవేకెనింగ్ ఇన్ చైనా’’ పేర్లతో ఆమె పుస్తకాలు రాశారు.
‘‘ఇదంతా ప్రత్యేకించి విద్యావంతులైన మహిళలను పెళ్లిచేసుకుని, పిల్లలను కనేలా ఒత్తిడి చేసే ప్రభుత్వ ప్రయత్నంలో భాగం’’ అని ఆమె బీబీసీతో అన్నారు.
పడిపోతున్న జననాల రేట్లు
చైనాలో ఒకే బిడ్డ విధానం 2015లో ముగిసిపోయినా కూడా జననాల సంఖ్య పడిపోవటం కొనసాగుతూనే ఉంది. 2013 నుంచి వివాహాల రేటు కూడా తగ్గిపోయింది.
దేశంలో 2018లో కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే పుట్టారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 20 లక్షలకు పైగా జననాలు తగ్గిపోయాయి.
ఒకే బిడ్డ విధానం చైనాలోని కుటుంబాలు మగపిల్లలను కనటానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ప్రోత్సహించిందని.. దానివల్ల దేశంలో స్త్రీ-పురుష నిష్పత్తిలో తీవ్ర అసమతుల్యత తలెత్తిందని హాంగ్ ఫించర్ చెప్పారు.
‘‘నిజానికి (చైనాలో) మహిళల కొరత ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం మహిళల కన్నా కనీసం మూడు కోట్ల మంది పురుషులు అధికంగా ఉన్నారు’’ అని ఆమె వివరించారు.
ప్రస్తుతం 140 కోట్ల మందిగా ఉన్న దేశ జనాభా రాబోయే 50 సంవత్సరాల్లో 120 కోట్లకు పడిపోతుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు జనాభా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న నిజాన్ని కలుపుకుంటే, దేశ ఆదాయం, సామాజిక సంక్షేమ వ్యవస్థ మీద ఒత్తిడి భారీగా పెరిగే అవకాశముంది.
భాగస్వామికి కోసం అన్వేషణ
అయితే, అదనంగా ఇచ్చే ‘డేటింగ్ లీవ్’ మహిళలు తమ జీవిత భాగస్వామిని కలుసుకోవటానికి, ఆ తర్వాత పిల్లలని కనటానికి ఎలా ఉపయోగపడుతుందనేది అస్పష్టమే.
‘‘కొంతమంది మహిళా సిబ్బందికి బయటి ప్రపంచంతో సంబంధాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మహిళా సిబ్బందికి ఎక్కువ సెలవులు ఇవ్వాలని.. తద్వారా తమ జీవిత భాగస్వాములను కలుసుకునేందుకు ఎక్కువ సమయం, అవకాశాలు కల్పించాలని మేం భావిస్తున్నాం’’ అని హాంగ్‌ఝో సాంగ్‌చెంగ్ పెర్ఫార్మన్స్ సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ హువాంగ్ లే చైనా డిజిటల్ మీడియా సంస్థ ఝీజియాంగ్ ఆన్‌లైన్‌తో చెప్పారు.
ఈ డేటింగ్ లీవ్‌ను తమ సంస్థ సిబ్బంది సంతోషంగా ఆహ్వానించారని ఆయన చెప్పారు.
కానీ, ఈ ప్రయత్నం అంతగా ఫలించదని హాంగ్ ఫించర్ భావిస్తున్నారు. ‘‘అనేక రకాల ప్రయోగాలు, విధానాలలో ఇదొకటి మాత్రమే’’ అని ఆమె అంటారు.
‘‘పెళ్లి చేసుకోవాలని కానీ, పిల్లల్ని కనాలని కానీ మహిళల్లో ఆత్రుత లేదు’’ అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పెళ్లయ్యాక సంతోషం ఎన్నాళ్లు?
- ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
- ఈ దీవిలో 12 ఏళ్ల తర్వాత పాప పుట్టింది
- బీబీసీ సర్వే: 16-24 ఏళ్ళ యువతలో పెరుగుతున్న ఒంటరితనం
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ప్రియాంకా గాంధీని 'భయ్యా జీ' అని ఎందుకంటారు
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









