బీబీసీ సర్వే: 16-24 ఏళ్ళ యువతలో పెరుగుతున్న ఒంటరితనం

యువతి

ఓ వైపు ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుంటే, మరోవైపు చాలా మంది ప్రజలు ఒంటరితనంతో బాధపడుతున్నారు.

సుమారు 8 నెలల కిందట అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 14న బీబీసీ, ఒంటరితనంతో బాధపడుతున్న వారి మీద ఓ సర్వే ప్రారంభించింది. అత్యధికంగా 55 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇంతటి భారీ స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగడం ఇదే మొదటి సారి.

చుట్టూ జనం ఉన్నా ఒంటరిగా ఉండటం, ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వంటివి ఒంటరితనానికి ప్రధాన కారణాలు
ఫొటో క్యాప్షన్, చుట్టూ జనం ఉన్నా ఒంటరిగా ఉండటం, ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వంటివి ఒంటరితనానికి ప్రధాన కారణాలు

హన్నా అనే యువతి బీబీసీతో మాట్లాడుతూ, తాను ఆత్మ విశ్వాసంతో, స్నేహపూర్వకంగా ఉంటానన్నారు. కానీ, ఇప్పటికీ తాను ఒంటరినేనని తెలిపారు.

''అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే ఉంటుంది. చాలా ఒంటరితనంతో కుమిలిపోతాం. ఏమీ జరగకపోయినా ఈ ప్రపంచం నుంచి వేరుపడినట్టు అనిపిస్తుంది. ఒంటరితనం చాలా దారుణమైన పరిస్థితి'' అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరితనమే! ఎందుకిలా?

బీబీసీ సర్వే ప్రకారం ఇప్పుడున్నవారిలో హన్నా లాంటి 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులు చాలా తరచుగా తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నారు.

''మా కన్నా వయసులో ఉన్న వారితో పని చేస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నామని భావించడం కాస్త సులభంగానే ఉంటుంది. కానీ యుక్తవయసులో ఉన్న వారితో ఉన్నప్పుడు వాళ్లు కూడా మనలాగే ఉన్నప్పుడు మనం మాత్రమే ఎందుకు ఒంటరిగా ఉన్నామన్న ప్రశ్న తలెత్తుతుంది. పాఠశాలలు/కళాశాలలకు వెళ్తాం. చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అలాంటప్పుడు ఒంటరితనంతో బాధపడాల్సినవసరం ఏముంది" అని హన్నా చెప్పారు.

ఒంటరితనాన్ని జయించే క్రమంలో హన్నా 'ఫాస్ట్ ఫ్రెండ్స్' అనే సంస్థకు తన వంతు సేవలందిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, ఒంటరితనాన్ని జయించే క్రమంలో హన్నా 'ఫాస్ట్ ఫ్రెండ్స్' అనే సంస్థకు తన వంతు సేవలందిస్తున్నారు

చుట్టూ జనం ఉన్నా ఒంటరిగా ఉండటం, ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వంటివి ఒంటరితనానికి ప్రధాన కారణాలు. మాంచెస్టర్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని మరింత బలపరిచాయి. ఎలాంటి సమూహాల్లో తాము ఇమడగలమనే విషయాన్ని ఒంటరితనంతో బాధపడే యువత ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒంటరితనాన్ని జయించే క్రమంలో హన్నా 'ఫాస్ట్ ఫ్రెండ్స్' అనే సంస్థకు తన వంతు సేవలందిస్తున్నారు. ఒంటరిగా ఉంటూ ఎవరైనా తమతో మాట్లాడతారేమోనని ఎదురుచూసే వాళ్లకు సాయం చేస్తుంది ఫాస్ట్ ఫ్రెండ్స్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)