గుజరాత్: పక్షులను కాపాడే అమ్మాయి తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయింది

ఫొటో సోర్స్, Neha Jeshwani
- రచయిత, హరిత కంద్‌పాల్
- హోదా, బీబీసీ కోసం
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎంత ఘనంగా జరుపుకుంటారో.. గుజరాత్‌లో ఉత్తరాయణ్ పండుగను అలా చేసుకుంటారు.
ఈ పండక్కి గుజరాత్‌లో పెద్దఎత్తున పతంగులు ఎగురవేస్తుంటారు. అయితే, ఆ పతంగులకు కట్టే మాంజా(దారం) చుట్టుకుని ఏటా వేలాది పక్షులతో పాటు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
అందుకే, చాలామంది పండుగ సంబరాలు చేసుకుంటుంటే, కొందరు మాత్రం పక్షులను కాపాడే పనిలో ఉంటారు.
అలాంటి వారిలో అహ్మదాబాద్‌కు చెందిన యువతి రాహిలా ఒకరు. అనేక పక్షులను రక్షించిన ఆ అమ్మాయి, అదే మాంజా తన మెడకు చుట్టుకోవడంతో చనిపోయింది. ఈ ఘటన ఎంతోమంది హృదయాలను కదిలించింది.

ఫొటో సోర్స్, SHERWIN EVERETT
ఉత్తరాయణ్ పండుగ సందర్భంగా జనవరి 14న పక్షులను కాపాడేందుకు గుజరాత్ అటవీ శాఖ గాంధీనగర్‌లో ఓ కార్యక్రమం చేపట్టింది. అందులో, రాహిలా పాల్గొన్నారు. కాళ్లకు, రెక్కలకు మాంజా చుట్టుకుని కింద పడిపోయిన అనేక పావురాలను, పిచ్చుకలను కాపాడారు.
అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ఒక్కసారిగా ఓ పదునైన మాంజా వచ్చి ఆమె మెడకు చుట్టుకుంది. దాంతో మెడ ఒక్కసారిగా కోసుకుపోయింది. హుటాహుటిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించినా.. ఫలితం దక్కలేదు.
పక్షులంటే రాహిలాకు ఎంతో ప్రేమ ఉండేదని, పతంగుల కారణంగా మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తుండేదని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పక్షుల ప్రాణాలు తీస్తున్న మాంజా
ఏటా ఉత్తరాయణ్ సందర్భంగా రెండు రోజుల పాటు ఎగురవేసే పతంగుల కారణంగా వేలాది పక్షుల ప్రాణాలు పోతున్నాయి.
పతంగులకు కొందరు అత్యంత ప్రమాదకరమైన గాజు లేదా లోహంతో తయారు చేసిన మాంజా వాడుతున్నారు. అది సాధారణ దారం కంటే ఎంతో గట్టిగా ఉంటుంది. ప్రత్యర్థుల పతంగుల దారాన్ని కత్తిరించేందుకు అలాంటి పదునైన మాంజా వాడుతుంటారు.
ఆ మాంజా వల్లే పక్షులతో పాటు, మనుషులు కూడా చనిపోతున్నారు.
పక్షులను కాపాడేందుకు ఏటా జనవరిలో గుజరాత్ రాష్ట్ర అటవీ శాఖ 'కరుణ' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా ఏటా దాదాపు 20,000 పక్షులను కాపాడుతున్నామని, గత రెండేళ్లలో 40,000 పక్షులను బతికించామని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెప్పారు.
ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పక్షులను కాపాడేందుకు పనిచేస్తున్నాయి.

ఫొటో సోర్స్, IFTIKHAR MALEK
ముగ్గురు మృతి
పావురాలు, పిచ్చుకలు, కాకులతో పాటు శీతాకాలంలో ఇతర దేశాల నుంచి వలస వచ్చే ఎన్నో అరుదైన పక్షులు కూడా మాంజా బారిన పడుతున్నాయని జీవ్‌దయ చారిటీ ట్రస్ట్ నిర్వాహకులు షెర్విన్ బీబీసీతో చెప్పారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈసారి పతంగుల కారణంగా గుజరాత్‌లో ముగ్గురు మరణించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








