#గమ్యం: సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, స్టేట్ బోర్డులు... మీ పిల్లలకు ఏది మంచిది?
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏ బోర్డుతో ఏంటి ప్రయోజనం.. ఏది కష్టం, ఏది సులభం? ఎందులో చదివితే ఎక్కువ మార్కులొస్తాయి. దేంతో ఎక్కువ అవకాశాలు వస్తాయి..? వంటి అనేక సందేహాలు తల్లితండ్రులను తర్జనభర్జనకు లోనయ్యేలా చేస్తాయి. 'బీబీసీ తెలుగు' పాఠకుల కోసం careers360.com చైర్మన్ మహేశ్వర్ పేరి ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేస్తున్నారు.
బోర్డు ఎంపికలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి, ఆ బోర్డు సిలబస్ బోధించే పాఠశాలలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, విద్యార్థి సామర్థ్యం, తల్లిదండ్రులది ఒకే రాష్ట్రంలో ఉంటూ చేసే ఉద్యోగమా కాదా? వంటి అనేక అంశాల ప్రాతిపదికగా సిలబస్ ఎంపిక చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని రకాలు ఉన్నాయి?
భారత్‌లో ప్రధానంగా నాలుగు రకాల బోర్డులు వ్యాప్తిలో ఉన్నాయి. అవి..
1. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
2. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(ఐసీఎస్‌ఈ)
3. ఇంటర్నేషనల్ బేక్యులరేట్(ఐబీ)
4. వివిధ రాష్ట్రాల బోర్డులు(స్టేట్ బోర్డు)

ఫొటో సోర్స్, Getty Images
సీబీఎస్‌ఈ
దేశంలో చాలా పాఠశాలల్లో ఇది భోధిస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను వినియోగిస్తారు. ఇంజనీరింగ్, మెడిసన్ చేసేవారికి ఇది ప్రయోజనకరం.
అంతేకాకుండా.. కెరీర్ పరంగా వేర్వేరు రాష్ట్రాలకు మారాల్సి వచ్చే తల్లిదండ్రులకు ఇది మంచిది. ఏ రాష్ట్రానికి మారినా ఈ సిలబస్ బోధించే స్కూల్స్ ఉంటాయి, దీనివల్ల పిల్లలకు తరచూ సిలబస్ మారే ఇబ్బందులుండవు.
ఈ సిలబస్‌లో సైన్స్, మ్యాథ్స్ పై ఎక్కువగా దృష్టి పెడతారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్ తదితర ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ, ఎన్ఈఈటీ పరీక్షలను సీబీఎస్ఈనే నిర్వహిస్తుంటుంది.
కాబట్టి ఇది చదివేవారికి ఈ పరీక్షల్లో మంచి ఫలితం సాధించడం మిగతా వారికంటే సులభమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీఎస్‌ఈ
ఇది విశ్లేషణాత్మక, ప్రయోగాత్మక విద్యకు అవకాశమిచ్చే సిలబస్ ఉంటుంది. బట్టీ పద్ధతికి ఇది చాలా దూరం.
సీబీఎస్‌ఈ కంటే కొంత కఠినంగా ఉన్నా విద్యార్థికి విషయ పరిజ్ఞానం పెంచడంతో పాటు లోతైన అవగాహన, ప్రయోగాత్మకంగా నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుందీ సిలబస్.
అందువల్ల ప్రతి అంశంపైనా పూర్తి పట్టు చిక్కుతుంది. ఇందులో ప్రతి సబ్జెక్టుకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐబీ
ఇది అంతర్జాతీయ సిలబస్. పిల్లలను భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ చదివించాలనుకుంటే ఇది ఉత్తమం.
ప్రపంచవ్యాప్తంగా ఈ సిలబస్ ఉన్న స్కూళ్లు ఉంటాయి. ఇది ఖరీదైనది. అంతేకాకుండా.. ఈ కరిక్యులమ్ బోధించేవారు అన్నిచోట్లా అందుబాటులో లేకపోవచ్చు.
ఇది కూడా విశ్లేషణాత్మక, ప్రయోగాత్మక విద్యా విధానం. ఐబీ బోధించే పాఠశాలలు భారత్‌లో చాలా తక్కువ ఉన్నాయి.
భారత్‌లోని ప్రవేశ పరీక్షలకు ఇది ఏమాత్రం అనుకూలం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
స్టేట్ బోర్డులు
దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో భోధనకు వీలుగా స్టేట్ బోర్డుల సిలబస్ లు ఉన్నాయి. రాష్ట్రానికి, రాష్ట్రానికి సిలబస్ మారిపోతుంటుంది.
ఇందులో ఎక్కువగా మార్కులు సాధించే వీలుంటుంది. కానీ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో వీరు కష్టపడాల్సి ఉంటుంది.
ఏపీ, తెలంగాణల్లో పదో తరగతి కోసం ఎస్‌ఎస్‌సీ బోర్డు, ఇంటర్ కోసం ఇంటర్ బోర్డు ఉన్నాయి. సీబీఎస్‌ఈ స్కూల్స్‌తో పోల్చితే ఫీజులు తక్కువగా ఉంటాయి.
స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది కనుక రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది చాలా అనుకూలం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









