రంప తిరుగుబాటుకు, అల్లూరి కి సంబంధం ఉందా?మోదీ ఏమన్నారు, చరిత్ర ఏం చెబుతోంది?- బీబీసీ ఫ్యాక్ట్ చెక్

ఫొటో సోర్స్, @narendramodi/twitter
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
మన్యం వీరుడిగా పిలుచుకునే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జులై 4న భీమవరంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ముఖ్యంగా అల్లూరి పోరాటానికి సంబంధించి ప్రధాని ప్రస్తావించిన అంశాలపై చరిత్రకారులు, పరిశోధకులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలతో పాటు రంప తిరుగుబాటుకి వందేళ్లు పూర్తయినట్టు గుర్తించాలని ప్రధాని మోదీ అన్నారు.
అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో రంప తిరుగుబాటు జరిగిందన్నారు. రంపలో గిరిజనులను సమీకరించి అల్లూరి చేసిన పోరాటాన్ని అందరం స్మరించుకోవాలని, అల్లూరి స్ఫూర్తిని యువత నింపుకోవాలని పిలుపునిచ్చారు.

రంప తిరుగుబాటుకు, అల్లూరికి సంబంధముందా?
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడిగా ప్రధాని మోదీ కీర్తించిన అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న జన్మించారు.
చిన్న వయసులోనే గిరిజనులకు నాయకత్వం వహించి, నాటి బ్రిటీష్ ప్రభుత్వంపై అల్లూరి తిరుగుబాటు చేశారు. సాయుధ పోరాటం సాగించారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపైనే దాడి చేసి వారి ఆయుధాలతోనే బ్రిటిష్ సేనలను ఎదుర్కొనే ప్రయత్నం చేసిన చరిత్ర ఆయనది.
అల్లూరి సీతారామరాజు చేతుల్లో మరణించిన ఇద్దరు బ్రిటీష్ అధికారుల సమాధులు నేటికీ నర్సీపట్నంలో ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు సారధ్యంలో జరిగిన తిరుగుబాటును అడ్డుకోవడానికి బ్రిటీష్ అధికారులు మలబారు పోలీసులతో పాటు అస్సాం రైఫిల్స్ ని కూడా రంగంలో దింపారు. చివరకు ఆయన్ని బంధించి, కాల్చి చంపినట్టు రికార్డులు చెబుతున్నాయి.
1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజును కొయ్యూరు సమీపంలో చంపేసి, ఆ తర్వాత కేడీ పేటలో అంత్యక్రియలు నిర్వహించారు.
1917లో ఏజన్సీలో అడుగుపెట్టిన అల్లూరి అప్పటికే ఆ ప్రాంతంలో గిరిజనులపై సాగుతున్న దౌర్జన్యాలపై తిరుగుబాటు చేశారు. చివరకు సాయుధ పోరాటం ప్రారంభించిన మూడేళ్లకు దానిని ప్రభుత్వం అణచివేయడంతో అల్లూరి పోరాటం ముగిసింది.
సీతారామరాజు తిరుగుబాటు గురించి అప్పట్లో వివిధ తెలుగు పత్రికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ పత్రికల్లో వచ్చింది. రాయిటర్స్ లాంటి వార్తాసంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి.
రిచ్ మాండ్ రివర్ న్యూస్ అని లండన్ నుంచి వెలువడే పత్రికలోనూ 1922 సెప్టెంబర్ 4న కథనాలు ప్రచురితం కావడం ఆయన తిరుగుబాటు ప్రభావాన్ని చాటుతుంది.
అయితే, ఈ పోరాటాన్ని రంప విప్లవం గా భీమవరం బహిరంగ సభలో ప్రధాని ప్రస్తావించారు. కానీ రంప తిరుగుబాటుకు, అల్లూరికి సంబంధం లేదని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, @narendramodi/twitter
రంప తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
అల్లూరి పుట్టడానికి ముందే రంప తిరుగుబాటు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఆంధ్రపత్రికలో వచ్చిన కథనాలతోపాటు గోదావరి డిస్ట్రిక్ట్ గెజిట్ లోనూ రంప తిరుగుబాట్లను ప్రస్తావించారు.
1915లో మద్రాస్ లో ముద్రించిన ఈ గెజిట్ ప్రకారం రంప తిరుగుబాటు మొత్తం గిరిజనుల నాయకత్వంలో జరిగింది. దాదాపు ఏడాది పాటు ఇది సాగింది. 1879 మార్చి నుంచి 1880 చివరి వరకూ సాగింది.
ముఖ్యంగా ప్రస్తుతం అల్లూరి జిల్లా చింతూరు పరిధిలో ఉన్న ప్రాంతంలో ఇది మొదలయ్యింది. ఆనాటి రేకపల్లి ఎస్టేట్ పరిధిలోనూ, మల్కన్ గిరి ప్రాంతంలోనూ ఈ తిరుగుబాటు సాగింది. మల్కన్ గిరి ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో ఉంది.
ప్రస్తుతం అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం, చింతూరు, సీలేరు ప్రాంతాల్లో ఎక్కువగా రంప తిరుగుబాటు ప్రభావం చూపినట్టు నాటి ప్రభుత్వ నివేదికలు చాటుతున్నాయి.
ఇక అల్లూరి సీతారామరాజు పోరాటం ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం అల్లూరి జిల్లాలోనే ఉన్న చింతపల్లి, కొయ్యూరు, రాజవొమ్మంగి, అడ్డతీగల ప్రాంతాల్లో సీతారామరాజు ఉద్యమం సాగింది.
మైదాన ప్రాంతం నుంచి ఏజన్సీకి వెళ్లిన అల్లూరి, కొందరు అనుచరులు ఈ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించారు. వారిలో అగ్గిరాజు వంటి వారిని ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం చంపేసింది.
వారంతా గిరిజనులను సమీకరించి పోరాడారు. ప్రస్తుతం ఎస్టీలుగా గుర్తించిన భగత తెగకు చెందిన గంటం దొర, మల్లుదొర వంటి వారు కూడా ముందువరుసలో నిలిచారు.
"రంప తిరుగుబాటుకు, అల్లూరి పోరాటానికి సంబంధం లేదు. అల్లూరి పుట్టడానికి ముందే జరిగిన రంప పితూరీని అల్లూరి ఉద్యమానికి ముడిపెట్టడం తగదు. మన్యం విప్లవంగా అల్లూరి పోరాటాన్ని చరిత్రలో ప్రస్తావించారు. రంప తిరుగుబాటుకు అనేక మంది గిరిజనులు సారథ్యం వహించారు. పైగా రంప తిరుగుబాటుకు 140 ఏళ్లు నిండిపోయాయి. ఇప్పుడు మోదీ మాటల్లో రంప విప్లవానికి వందేళ్లుగా ప్రస్తావించడం ఆశ్చర్యమేసింది" అని తూర్పు ఏజన్సీ ప్రాంత చరిత్ర విశ్లేషకుడు పి.అచ్యుత్ దేశాయ్ బీబీసీతో అన్నారు.
అల్లూరి నడిపిన పోరాటానికి ముందే గిరిజనుల సారధ్యంలో జరిగిన రంప పితూరీ మూలంగా 1882లోనే జీవో నెం.109 విడుదలయిందని, మన్యం చట్టాలకు సంబంధించి గిరిజనులకు అనేక రాయితీలు కల్పించినట్టు నాటి ప్రభుత్వం ప్రకటించిందని దేశాయ్ తెలిపారు. దానినే మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అంటారని వెల్లడించారు.

మన్యంలో వరుస తిరుగుబాట్లు?
నేటి రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేకపల్లి కేంద్రంగా 1879 తిరుగుబాటుకు ద్వారబందాల చంద్రయ్య నాయకత్వం వహించారు.
ఆయనతోపాటు కారం తమ్మన్నదొర, పలిచింత సాంబయ్య, అంబుల్ రెడ్డి వంటి వారు బ్రిటీష్ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి సాగుతున్నట్టు నాటి ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఈ తిరుగుబాటును రంప పితూరీగా నాటి ప్రభుత్వం గెజిట్‌లో చెప్పింది.
రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించిన చంద్రయ్య స్మారకార్థం పోస్టల్ శాఖ ఇటీవల ఓ స్టాంప్ కూడా విడుదల చేసింది. బ్రిటీష్ సేనలకు వ్యతిరేకంగా పోరాడిన నాయకులకు గుర్తింపుగా స్టాంప్ విడుదల చేసినట్టు పోస్టల్ అధికారులు వెల్లడించారు.
"మన్యం యువతుల పట్ల బ్రిటీష్ పోలీసుల దౌర్జన్యాలను అడ్డుకునే క్రమంలో ద్వారబందాల చంద్రయ్య తిరుగుబాటు మొదలైంది. అప్పటికీ అటవీ ఆంక్షలు, ఇతర దౌర్జన్యాలతో విసిగిపోయిన గిరిజన యువత ఆయనని అనుసరించారు. ఐదేళ్ల పాటు అనేక బ్రిటీష్ సేనలతో పోరాడారు. చివరకు 1879లో ఆయన బ్రిటీష్ సేనల చేతిలో నేలకొరిగారు. ఆయన చనిపోయిన తర్వాత కొద్దికాలానికే రంప తిరుగుబాటును అణచివేయగలిగారు" అంటూ చరిత్ర పరిశోధకుడు వంగలపూడి శివకృష్ణ తెలిపారు.
బ్రిటీష్ అధికారిక నివేదికల ప్రకారం రంప తిరుగుబాటుగా దానినే పేర్కొన్నారనేది గుర్తించాలని ఆయన బీబీసీతో అన్నారు.
1879 నాటి తిరుగుబాటుకి ముందే నాటి గోదావరి జిల్లా పరిధిలో పలు తిరుగుబాట్లు జరిగినట్టు బ్రిటీష్ ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 1798 ప్రాంతంలో ఓసారి, 1857లో మరోసారి తిరుగుబాట్లు తీవ్ర స్థాయిలో సాగాయి. అందులో 1857 నాటి సిపాయిల తిరుగుబాటు కాలంలోనే గోదావరి జిల్లా పరిధిలోని గిరిజనులు కొరుకొండ్ల సుబ్బారెడ్డి నాయకత్వంలో ఉద్యమించినట్టు గోదావరి గెజిట్ నివేదిక 299వ పేజీలో ప్రస్తావించారు.
ప్రతీ తిరుగుబాటుని అణచివేయడమే కాకుండా, ఆ తర్వాత కొన్ని రాయితీలను గిరిజనులకు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యిందని అచ్యుత్ దేశాయ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లో కూడా అంతే..
అల్లూరి సీతారామరాజుని రంప తిరుగుబాటుదారుడిగా ప్రధాని చెప్పడమే కాదు, ఇదే మాట కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వెబ్ సైట్ లో కూడా ఉంది. ఆ వెబ్ సైట్లో అల్లూరి గురించి ప్ర్తస్తావిస్తూ మన్యం వీరుడిగానూ అభివర్ణించింది. మన్యం విప్లవం లేదా గిరిజనుల తిరుగుబాటు అంటూ వివరించింది.
అదే సమయంలో ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చెన్నై విమానాశ్రయంలో అల్లూరి సీతారామరాజు గురించి చేసిన ప్రచారంలో మాత్రం కొంత భిన్నంగా ప్రస్తావించారు. అల్లూరిని రంప తిరుగుబాటుకు నాయకుడిగా పేర్కొన్నారు.

అల్లూరికి సంబంధం లేకపోవడమే కాకుండా, ఆయన జన్మించడానికి ముందే జరిగిన ఉద్యమాన్ని ఆయన నేతృత్వంలో సాగినట్టు స్వయంగా ప్రధాని నోటి వెంట రావడం నిరాశ కలిగించిందని రిటైర్డ్ చరిత్ర అధ్యాపకుడు ఎం.శేషగిరి రావు బీబీసీతో చెప్పారు.
"అల్లూరి మన్యం విప్లవానికి నాయకత్వం వహించారు. అందుకే మన్యం వీరుడని అంటాము. అయితే, రంప తిరుగుబాటుతో ఆయనకు సంబంధం లేదు. ఆయన కాలంలో కూడా జరగలేదని చెప్పడానికి అనేక ఆధారాలున్నాయి. 1936 నాటి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో మన్యంలో జరిగిన వివిధ పోరాటాలను ప్రస్తావించారు. ఆయా కాల పరిధులు, పోరాటం జరిగిన ప్రాంతాల గురించి కూడా చెప్పారు. వివిధ పత్రికలతోపాటు అధికారిక సమాచారం కూడా అదే చెబుతోంది. కాబట్టి రంప విప్లవాన్ని, అల్లూరి పోరాటంతో ముడిపెట్టకూడదు. రెండింటినీ వేర్వేరుగా చూడాలి. భవిష్యత్తు తరాలకు స్పస్టత అవసరం" అని ఆయన వివరించారు.
అధికారికంగానూ, నాయకుల మాటల్లోనూ ఈ అంశాన్ని గుర్తించాలని శేషగిరిరావు కోరారు.

ఇవి కూడా చదవండి:
- జమ్మూకశ్మీర్: అరెస్టయిన అనుమానిత లష్కరే తోయిబా మిలిటెంట్‌తో బీజేపీకి సంబంధం ఏంటి?
- డార్క్ మ్యాటర్ అంటే ఏంటి... ఈ రహస్యాన్ని సైంటిస్టులు త్వరలో ఛేదించబోతున్నారా?
- 'కాళి' పోస్టర్‌పై వివాదం: నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. డైరెక్టర్ లీనా మణిమేకలైపై పోలీసులకు ఫిర్యాదు
- ప్రధాని హెలికాప్టర్‌పైకి కాంగ్రెస్ నల్ల బెలూన్లు.. మోదీ భద్రతలో వైఫల్యం ఉందా? లేదా?
- ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












