ప్రధాని హెలికాప్టర్‌పైకి కాంగ్రెస్ నల్ల బెలూన్లు.. మోదీ భద్రతలో వైఫల్యం ఉందా? లేదా?

గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, Govt of AP

ఫొటో క్యాప్షన్, గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భద్రతా వ్యవహారాలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో భీమవరం బయలుదేరిన సమయంలో గాలిలో కనిపించిన నల్లబెలూన్ల చుట్టూ వివాదం ఏర్పడింది.

కాంగ్రెస్ కి చెందిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) ఈ విషయంలో జోక్యం చేసుకుందనే ప్రచారం జరిగింది. అయితే వాటిని ఏపీ పోలీసులు ఖండించారు. పీఎం పర్యటనలో ఎటువంటి భద్రతా లోపం జరగలేదని కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకటించారు.

రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా నల్లబెలూన్లు ఎగురవేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. భద్రతా సమస్యలు లేనప్పుడు ప్రతిపక్షాల నిరసనపై కేసులు ఎందుకు నమోదయ్యాయనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ముగ్గురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

ప్రధాని భద్రతకు సంబంధించి ఎస్పీజీ నిబంధనలు ఏం చెబుతున్నాయి. గన్నవరంలో ఏం జరిగిందన్న దాని చుట్టూ చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగరేసిన బెలూన్లు

గన్నవరం ఎయిర్ పోర్టులో ఏం జరిగింది..

మన్యం వీరుడిగా పిలుచుకునే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి వచ్చారు. రెండు రోజుల పాటు తన పార్టీ సమావేశాల నిమిత్తం హైదరాబాద్ లో ఉన్న ఆయన ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. అక్కడి నుంచి భీమవరం వెళ్లేందుకు హెలికాప్టర్ లో బయలుదేరారు. ఆయన వెంట సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తదితరులు అదే హెలికాప్టర్ లో పయనమయ్యారు.

గతంలో ప్రత్యేక హోదా సహా వివిధ హామీలు ఇచ్చి ఏపీకి ప్రధాని మోదీ మోసం చేశారంటూ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. నల్లజెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలిపాలని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తో పాటుగా వామపక్షాలు కూడా గో బ్యాక్ మోదీ అనే పేరుతో ఆందోళనలకు పూనుకున్నాయి. ఆ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లెఫ్ట్ శ్రేణుల్లో కొందరిని ముందస్తుగా గృహనిర్బంధంలో ఉంచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత, రాష్ట్ర కార్యదర్శి సుంకర పద్మశ్రీ నేతృత్వంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద ఆందోళనకు ప్రయత్నించారు. నల్లబెలూన్లతో ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్న ఆమెతో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొద్దిసేపటికే ఎయిర్ పోర్ట్ సమీపంలో కొన్ని నల్లబెలూన్లు గాలిలో ఎగురుతూ కనిపించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు వాటిని ఎగురవేశారని కృష్ణా జిల్లా పోలీసులు నిర్ధారించారు.

భద్రతా వైఫల్యమేనా?

ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలోకి లేస్తున్న సమయంలో నల్లబెలూన్లు ఎగురవేసిన వైనం మీద మీడియాలో పలు కథనాలు వచ్చాయి. హైడ్రోజన్ తో నింపిన బెలూన్లు ఎగురవేశారని, ప్రధానికి భద్రత కల్పించడంలో ఏపీ పోలీస్ యంత్రాంగం వైఫల్యమని వార్తలు వచ్చాయి. దాంతో ఈ వ్యవహారంపై బీజేపీ నాయకులు సీరియస్ అయ్యారు. అది ఒక భారీ కుట్ర అంటూ బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

"కాంగ్రెస్ పార్టీ నేతలు నల్ల బెలూన్లు ఎగరవేయడం ద్వారా "భారీ కుట్రకు" పాల్పడ్డారు. ఆ సంఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీని వెనుక సూత్రధారులు పాత్రధారులు, కుట్ర అమలు చేసిన దుష్టశ్తులను వెంటనే గుర్తించాలి. ఈ వ్యవహారంపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తున్నాం"అంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

మీడియా కథనాలు, బీజేపీ ప్రకటన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే అదుపులో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. వారిని ఎయిర్ పోర్ట్ గేట్ వద్దనే తొలుత అరెస్ట్ చేయగా, ఆ తర్వాత నల్లబెలూన్లు ఎగరడానికి కారకుడిగా రాజీవ్ రతన్ అనే కాంగ్రెస్ నాయకుడిని గుర్తించారు. ఆయన మీద కూడా కేసు నమోదయ్యింది.

ప్రధానమంత్రి ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ సమీపంలో నల్ల బెలూన్లు

హైడ్రోజన్ వాడలేదు..

గాలిలో ఎగిరిన నల్లబెలూన్లలో హైడ్రోజన్ నింపారంటూ సాగిన ప్రచారం వాస్తవం కాదని కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. భద్రతా వైఫల్యమంటూ సాగిన ప్రచారంలో వాస్తవం లేదంటూ జిల్లా ఎస్పీ జాషువా బీబీసీతో అన్నారు.

"కాంగ్రెస్ నాయకులు కొందరు దేశవ్యాప్త పార్టీ పిలుపులో భాగంగా నిరసనకు దిగారు. ఎయిర్ పోర్ట్ వద్ద పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144ని ఉల్లంఘించారు. మరికొందరు నల్లబెలూన్లు ఎగురవేశారు. వారి మీద ఐపీసీ 353, 341, 188, 145 కింద కేసు నమోదయ్యింది. కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, పార్వతి, కిషోర్ లను అరెస్ట్ చేశాము. ఆ బెలూన్లను పోలీసులే పగులగొట్టారు. ఎయిర్ పోర్ట్ కి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరంపల్లి అనే గ్రామంలో ఓ భవనం పై నుంచి రాజీవ్ రతన్, రవి ప్రకాష్ అనే వ్యక్తులు కొన్ని బెలూన్లు నోటితో ఊది వదిలారు. ప్రధాని హెలికాప్టర్ వెళ్లిపోయిన తర్వాత అది జరిగింది. రవి ప్రకాష్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. రాజీవ్ రతన్ కోసం వెదుకుతున్నాం" అంటూ ఆయన వెల్లడించారు.

ప్రధాన భద్రత విషయంలో ఎటువంటి లోపం జరగలేదని ఆయన తెలిపారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

జెడ్ క్యాటగిరీ భద్రతలో ఉండే ప్రధాని రక్షణ వ్యవహారాలను ఎస్పీజీ పర్యవేక్షిస్తుంది. ఆయన ప్రయాణాల సమయంలో పలు జాగ్రత్తలు పాటిస్తుంది. దానికి అనుగుణంగా వివిధ తనిఖీలు ఉంటాయి. అదే సమయంలో ఎయిర్ పోర్ట్ ఆవరణలో ప్రధాని రాక సమయంలో ఆంక్షలు ఉంటాయి. సాధారణ ఎయిర్ పోర్టులను పూర్తిగా ఎస్పీజీ తన పరిధిలోకి తీసుకుంటుంది. రక్షణకు సంబంధించిన జాగ్రత్తల్లో భాగంగా ప్రయాణీకులను కూడా నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు.

సోమవారం పీఎం పర్యటనలో ఆయన నేరుగా ప్రత్యేక విమానంలో దిగి, రన్ వే మీద నుంచే మళ్లీ హెలికాప్టర్ ఎక్కి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ హెలికాప్టర్ లో గన్నవరం చేరుకుని నేరుగా తన ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమయ్యారు. ఆ సమయంలో కూడా ప్రత్యేక బలగాలు పలు జాగ్రత్తలు పాటించాయి.

అదే సమయంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎయిర్ పోర్ట్ గేట్ వద్ద సెక్యూరిటీతో పాటుగా సమీప ప్రాంతంలో కూడా నిఘా ఏర్పాటు చేసింది. అయితే గాలిలో బెలూన్లు కనిపించడం వివాదంగా మారింది. కానీ అది ప్రధాని హెలికాప్టర్ వెళ్లిపోయిన తర్వాత జరిగిన ఘటన అంటూ పోలీసులు చెబుతున్నారు. ఎయిర్ పోర్ట్ కి తమ నేతలు ఎగురవేసిన ప్రదేశానికి చాలా దూరం ఉందని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు.

పొంతనలేని పోలీసు ప్రకటనలు

గన్నవరంలో ప్రధాన మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలోకి ఎగిరిన తర్వాత, విమానాశ్రయానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరంపల్లి అనే గ్రామంలో నల్ల బెలూన్లు ఎగరేశారని కృష్ణాజిల్లా ఎస్పీ ప్రకటించారు. కాబట్టి, ఇందులో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని ఆయన తెలిపారు.

వాస్తవానికి ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గన్నవరం నుంచి ఈశాన్య దిక్కులో ఉన్న భీమవరం వెళుతోంది.

సూరంపల్లి అనే గ్రామం గన్నవరానికి పశ్చిమ దిక్కులో ఉంది. ఎస్పీ ప్రకటన ప్రకారం చూస్తే హెలికాప్టర్ బయలుదేరిన తర్వాత అంత దూరంలో ఉన్న వాళ్లు బెలూన్లను ఎగరవేయడం వల్ల ఎలాంటి భద్రతా సమస్యలూ లేవు. కానీ, గన్నవరం డీఎస్పీ మాత్రం ఈ బెలూన్లను ఎగరేసిన ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు వెదుకుతున్నామని ప్రకటించారు. పైగా, ఆయనే ‘‘మూడు బెలూన్లు ఎగురవేస్తే భద్రతా లోపం అంటారా’’ అని కూడా ప్రశ్నించారు.

ప్రధాని భద్రతకు ఎలాంటి ముప్పూ లేని పక్షంలో, 144 సెక్షన్ కూడా లేని ఒక గ్రామంలో బెలూన్లను ఎగరవేసినందుకు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై స్పందించాలని కృష్ణాజిల్లా పోలీసులను బీబీసీ సంప్రదించింది.

దీనికి కృష్ణాజిల్లా ఎస్పీ స్పందిస్తూ.. ఎయిర్ పోర్ట్ అధికారులు ఫిర్యాదు చేయడం వల్లనే కేసు నమోదు చేశామని ప్రకటించారు.

విజయవాడలో సీపీఎం ఆందోళన
ఫొటో క్యాప్షన్, విజయవాడలో సీపీఎం నాయకుల ఆందోళన

‘ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెప్పిన ప్రభుత్వం మాపై కేసులు పెడుతోంది’ - శైలజానాథ్

ప్రధాని ఏపీ పర్యటన సందర్భంగా గతంలో కూడా నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపిన అనుభవం ఉంది. అయితే ఈసారి నేరుగా ఎయిర్ పోర్ట్ వద్ద అలాంటి ప్రయత్నం జరగడంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పీఎం భద్రత వైఫల్యమంటూ మీడియాలో ప్రచారం జరిగిన తర్వాత ఈ ఫిర్యాదు అందింది. దానికి అనుగుణంగా కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని, వారిని కోర్టులో హాజరుపరుస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ వెల్లడించారు.

ప్రధాని రాకను నిరసిస్తూ ఆందోళనకు పూనుకున్న వారిని పలు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన పరిణామాలపై మాత్రం కేసు నమోదు చేయడం చర్చనీయాంశమయ్యింది.

"నిరసన తెలపడం మీద కేసులు పెడతారా. సెక్యూరిటీకి ఎటువంటి సమస్య రాకపోయినా కాంగ్రెస్ నేతల మీద నమోదు చేసిన కేసులు అన్యాయం. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పోరాడుతుంటే నోరు నొక్కాలని చూస్తోంది. ఇది తగదు" అంటూ ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన బీబీసీతో అన్నారు. మోదీ ఏపీ పర్యటనలో రాష్ట్రానికి ఒక్క పైసా లేకపోగా, రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన వారికి కేసులు మిగిల్చారంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో కొందరు నల్ల జెండాలు ఊపుతూ, నల్ల బెలూన్లు ఎగురవేశారు. ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలొ ఎగురుతున్న సమయంలో నల్ల బెలూన్లు ఎగురవేయడం భద్రతా లోపం అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దీనిపై స్పందించారు. దుష్టశక్తుల పన్నాగం అంటూ వ్యాఖ్యానించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ఒకే హెలికాప్టర్‌లో ప్రమాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నల్ల బెలూన్లను ఎగరవేయడం ద్వారా ‘భారీ కుట్ర’కు పాల్పడిందని ఆరోపించారు. బెలూన్లు ఎగరవేసినవారిని దుష్టశక్తులుగా వీర్రాజు అభివర్ణించారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు.

దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వివరణ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ కి, బెలూన్లు ఎగర వేసిన ప్రాంతానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరం ఉందని చెప్పారు.

ఈ ఘటనపై ఎస్పీజీ వివరణ కోరిందని సాగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదన్నారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి భద్రతా వైఫల్యం లేదని ప్రకటించారు.

మరోవైపు ఎయిర్ పోర్ట్ వద్ద నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులపై కేసులు నమోదు చేసినట్టు గన్నవరం డిఎస్పీ విజయ్ పాల్ ప్రకటించారు. సెక్షన్ 144 సహా పోలీస్ ఆంక్షలు ఉల్లంఘించి, సెక్యూరిటీ జోన్లో ప్రవేశించే ప్రయత్నం చేసినందుకు కేసులు నమోదయ్యాయని మీడియాకి తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు.

వీడియో క్యాప్షన్, అమరావతిలో నరేంద్ర మోదీ ప్రసంగం

‘అప్పట్లో మట్టి, నీళ్లు తెచ్చారు, ఈసారి అదీ లేదు’

ఈ సభలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కానీ, భీమవరం అభివృద్ధికి సంబంధించి కానీ మోదీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో అమరావతి శంకుస్థాపన కోసం పార్లమెంట్ నుంచి మట్టి, యమునా నది నుంచి నీళ్లు తెచ్చి ఇచ్చిన మోదీ ఈసారి వాటికి కూడా దిక్కులేని స్థితికి నెట్టారని ప్రత్యేక హోదా సాధనా సమితి ప్రతినిధి చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

‘‘ప్రధాన మంత్రి పర్యటన అనగానే రాష్ట్రానికి ఏదో ఒక మేలు చేస్తారని అంతా ఆశించారు. కనీసం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల గురించయినా మట్లాడతారని భావించారు. కానీ పూర్తిగా రాష్ట్రాన్ని విస్మరించినట్టు ఆయన తీరు ఉంది. ఏపీకి చట్ట ప్రకారం రావాల్సిన నిధులు గానీ, ప్రత్యేక హోదా వంటి హామీలు గానీ గతంలో తాను చెప్పిన మాటలను కూడా ప్రధాని గుర్తు చేసుకోలేదు. ఆయనకు గుర్తు చేయాల్సిన ముఖ్యమంత్రి కూడా వేదిక మీద మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం రాష్ట్రానికి అన్యాయాన్ని మిగిల్చింది’’ అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలతో సతమతమవుతూ, కనీసం రాజధాని కూడా లేని సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని దిశానిర్దేశం చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఒట్టి చేతులు మాత్రమే చూపడం బాధాకరం అంటూ శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ వారిని గడగడలాడించిన తెలుగు వీరుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)