Australia: ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు

మే నెలలో సిడ్నీలో జరిగిన భారతీయుల కార్యక్రమానికి హాజరైన అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్

ఫొటో సోర్స్, facebook/hinducouncil.australia

ఫొటో క్యాప్షన్, మే నెలలో సిడ్నీలో జరిగిన భారతీయుల కార్యక్రమానికి హాజరైన అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్
    • రచయిత, టిఫనీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ

ఆస్ట్రేలియా జనాభాలో పెద్ద మార్పులు జరుగుతున్నట్లు కొత్త సెన్సస్ (జనగణన) డేటా చూపిస్తోంది. ఈ డేటాలో హిందు మతం గురించి, అక్కడ నివసిస్తోన్న భారతీయుల గురించి కొత్త విషయాలు తెలిశాయి.

ఆస్ట్రేలియాలో ప్రతీ ఐదేళ్లకు జనగణన జరుగుతుంది. తాజా జనగణన 2021లో జరిగింది. ఈ డేటా గత వారం విడుదలైంది.

కొత్త సెన్సస్ డేటా ప్రకారం, ఆస్ట్రేలియా జనాభా 2. 5 కోట్లు దాటింది. గడిచిన అయిదేళ్లలో అక్కడ 21 లక్షల జనాభా పెరిగింది. అదే సమయంలో దేశ సగటు ఆదాయం కూడా స్వల్పంగా పెరిగింది.

రాబోయే రోజుల్లో దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపయోగపడే ధోరణులను కూడా ఈ సెన్సస్ డేటా వెల్లడిస్తుంది. సెన్సస్ డేటా వెల్లడించే 5 ధోరణుల గురించి ఇక్కడ చూద్దాం.

వీడియో క్యాప్షన్, చెట్టులా కనిపించే అద్భుతమైన సరస్సు

1. హిందూ, ఇస్లాం వేగంగా పెరుగుతున్నాయి

ఆస్ట్రేలియన్లలో సగం కంటే తక్కువగా (44 శాతం) క్రిస్టియన్లు ఉండటం ఇదే తొలిసారి అని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఏబీఎస్) చెప్పింది. 50 ఏళ్ల క్రితం ఇక్కడ 90 శాతం క్రిస్టియన్లే ఉండేవారు.

క్రిస్టియన్ల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ ఈ ప్రాంతంలో ఇప్పటికీ క్రిస్టియానిటీని అనుసరించేవారే ఎక్కువగా ఉన్నారు. వీరి తర్వాత స్థానంలో 'ఏ మతాన్ని అనుసరించని వారు' ఉన్నారు. ఏ మతాన్ని అనుసరించని వారి సంఖ్య 9 శాతం పెరిగి 39 శాతానికి చేరింది.

ఆస్ట్రేలియాలో హిందూ, ఇస్లాం మతాలు వేగంగా పెరుగుతున్నాయి. అక్కడి జనాభాలో హిందూ మతాన్ని అనుసరించేవారు 3 శాతం, ఇస్లాంను నమ్మే వారు 3 శాతంగా ఉన్నారు.

ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు

2. మరింత వైవిధ్యంగా మారుతోంది

ఆస్ట్రేలియా ఇంతకుముందెన్నడూ లేనంత వైవిధ్యంగా మారుతోంది. ఇక్కడి ప్రజల్లో సగం కంటే ఎక్కువ మంది విదేశాల్లో జన్మించారు. లేదా విదేశీ తల్లిదండ్రులను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి ఆధునిక ఆస్ట్రేలియా, వలసల మీద నిర్మాణమైనట్లు అర్థం అవుతోంది.

కరోనా మహమ్మారి సమయంలో వలసలు మందగించాయి. కానీ, 2016 నుంచి పది లక్షలకు పైగా ప్రజలు ఆస్ట్రేలియాకు తరలి వెళ్లారు. అందులో దాదాపు నాలుగో వంతు అంటే రెండున్నర లక్షల మంది భారత్ నుంచే వెళ్లారు.

వేరే దేశంలో జన్మించి ఆస్ట్రేలియాలో నివసిస్తోన్న వారి సంఖ్యలో చైనా, న్యూజీలాండ్‌లను వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానానికి ఎగబాకింది.

ఆస్ట్రేలియాలోని ప్రతీ అయిదుగురిలో ఒకరు ఇంగ్లిష్ కాకుండా వేరే భాషలో మాట్లాడతారు. 2016 నుంచి ఇలాంటి వారి సంఖ్య దాదాపు 8 లక్షలు పెరిగింది. ఆస్ట్రేలియాలో ఇంగ్లిష్ కాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన ఇతర భాషలు చైనీస్ లేదా అరబిక్.

స్థానిక ప్రజలు

3. స్థానికుల జనాభాలో వేగంగా వృద్ధి

ఆస్ట్రేలియాలో ఆదివాసులు, టొర్రెస్ ద్వీప వాసులుగా గుర్తింపు ఉన్న ప్రజల సంఖ్య గత సెన్సస్ నుంచి ఇప్పటికి పావు వంతు పెరిగింది.

వీరి సంఖ్య పెరగడానికి జననాలు మాత్రమే కారణం కాదు. ఆదివాసులుగా తమ గుర్తింపు పట్ల ప్రజలు మరింత సౌకర్యవంతంగా మారడం కూడా దీనికి దోహదపడిందని ఏబీఎస్ తెలిపింది.

స్థానిక ఆస్ట్రేలియన్ల సంఖ్య ఇప్పుడు 8,12,728గా ఉంది. దేశ జనాభాలో ఇది 3.2 శాతం.

ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఆదివాసులు లేదా టొర్రెస్ ద్వీపవాసులకు చెందిన 167 భాషలు మనుగడలో ఉన్నాయని డేటా ద్వారా తెలిసింది. 78 వేలకు పైగా ప్రజలు ఈ భాషలను ఉపయోగిస్తున్నారు.

యూరోపియన్లు రాకముందు 1788లో స్థానిక ఆస్ట్రేలియన్ సంఖ్య 3,15,000 నుంచి 10 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. కొత్త వ్యాధులు, హింస తదితర కారణాలతో వీరి సంఖ్య వేగంగా తగ్గిపోయింది.

మిలీనియల్స్

ఫొటో సోర్స్, Getty Images

4. మిలీనియల్స్‌

ఆస్ట్రేలియాలో తరాల మార్పు జరుగుతున్నట్లు తాజా సెన్సస్ డేటా చూపిస్తోంది.

1946 నుంచి 1965 మధ్య జన్మించిన వారిని 'బేబీ బూమర్స్' అని, 1981 నుంచి 1995 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్ అని పిలుస్తారు.

గతంలో ఆస్ట్రేలియా జనాభాలో బేబీ బూమర్స్ ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని మిలీనియల్స్ అందుకున్నారు.

దేశ జనాభాలో ఈ రెండు తరాలకు చెందిన ప్రజలు 21.5 శాతం చొప్పున ఉన్నారు.

అంటే హౌజింగ్, వృద్దుల సంరక్షణ వంటి విధానాలపై ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

5. ఇల్లు కొనడం చాలా కష్టం

25 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియన్లలో దాదాపు నాలుగింట ఒక వంతు ప్రజలు ఇల్లు కొనుక్కునేవారు. కానీ, ఇప్పుడు అక్కడ ఇల్లు కొనడం అంత సులభం కాదు.

ఆకాశన్నంటుతున్న ధరల కారణంగా 1996 నుంచి మార్టిగేజ్‌ ఆస్తుల వాటా రెట్టింపు అయింది.

ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల కొనుగోళ్ల విషయంలో ఆస్ట్రేలియా నగరాలు అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్నాయని 2022 నాటి ఒక నివేదిక తెలిపింది.

కానీ, ఇప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారని తాజా సెన్సస్ డేటా చూపింది.

దేశంలో కారవ్యాన్‌లను ఉపయోగించే వారి సంఖ్య దాదాపు 150 శాతం పెరిగింది. దేశంలో 60,000 మందికి సొంత కారవ్యాన్‌లు ఉన్నాయి. దేశంలో 30,000 హౌస్‌బోట్లు కూడా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, మహిళా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కార్ ఇలా దూసుకెళ్లింది..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)