మధ్యప్రదేశ్‌లో ముస్లింల ఇళ్లను ఎందుకు కూలగొడుతున్నారు?

మధ్యప్రదేశ్‌లో కూల్చివేతలు

ఫొటో సోర్స్, Madhya Pradesh police via Twitter

ఫొటో క్యాప్షన్, ఈ కూల్చివేతలు ఓ రకమైన శిక్షలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది
    • రచయిత, జోయా మటీన్
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

ఆరోజు ఉదయాన్నే ఇంకా నిద్రలోనే ఉన్న షేక్ మొహమ్మద్ రఫీక్ కుటుంబం పెద్ద పెద్ద శబ్దాలు వినపడటంతో తుళ్లిపడి లేచారు.

''ఆ శబ్దాలు వినగానే ఎవరో గేటు షట్టర్లను పగలగొడుతున్నారని మాకు అర్థమైంది'' అని చెప్పారు 72 ఏళ్ల రఫీక్.

బయట వందలాది మంది ఆఫీసర్లు బుల్డోజర్లు వెంట పెట్టుకుని అతడి ఇంటిని చుట్టుముట్టి ఉన్నారు. తమను ఆపుతున్న వారిని పక్కకి పంపించేస్తున్నారు. వారి పని ముగిసేసరికి శిథిలాల కుప్ప మిగిలింది.

మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ నగరంలోని ఓ చిన్న ముస్లిం వాడలో ఉంది అతడి ఇల్లు. ఆయన కూల్‌డ్రింకులు అమ్ముతారు. ''ఇది రంజాన్ మాసం. కాబట్టి మా వ్యాపారం మామూలుగా సాయంత్రం ఊపందుకుంటుంది'' అని చెప్పారాయన.

ఆయనకు, ఆయన కొడుకులకు ఆ రాత్రి చాలా సుదీర్ఘంగా సాగింది. ''మేం ఎంతగా భయపడిపోయామంటే ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. వాళ్లు అంతా కూల్చేస్తోంటే మౌనంగా చూస్తుండిపోయాం'' అని చెప్పారు.

ఏప్రిల్ 10వ తేదీన హిందూ పండుగ శ్రీరామనవమి రోజు మధ్యప్రదేశ్‌లో మత హింస చెలరేగింది. తదనంతరం రాష్ట్రంలో ముస్లింలకు చెందిన పలు ఇళ్లు, షాపులను కూల్చివేస్తున్నారు.

పసుపుపచ్చ రంగులోని పెద్ద పెద్ద బుల్‌డోజర్లు.. కుటుంబాలు నిస్సహాయంగా ఏడుస్తుండగా, వారి ఇళ్లను కూల్చివేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వరదలా పోటెత్తాయి.

దీనిపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ భారతదేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా విమర్శకులు ఈ సంఘటనలను అభివర్ణించారు.

మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బాహాటంగానే ఆ కుటుంబాలను నిందిస్తోంది. ''ముస్లింలు ఇటువంటి దాడులు చేసినట్లయితే.. వారు న్యాయాన్ని ఆశించకూడదు'' అని రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఎన్‌డీటీవీ న్యూస్ చానల్‌తో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ కూల్చివేతలు చేపట్టిన ఘోరమైన తీరు మీద కూడా తీవ్ర ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఇలా చేయటానికి చట్టబద్ధంగా ఎలాంటి సమర్థనా లేదని నిపుణులు చెప్తున్నారు. ఇది ముస్లింలపై మూకుమ్మడి శిక్షకు ఉదాహరణ అని కొందరు అభివర్ణిస్తున్నారు.

''ఎలాంటి చట్టపరమైన ప్రక్రియనూ పాటించకుండా ఒక మతానికి చెందిన ప్రజలను విపరీతంగా శిక్షిస్తున్నారు. ఇది కేవలం చట్టవ్యతిరేకం మాత్రమే కాదు.. ఒక ప్రమాదకరమైన పోకడను కూడా మొదలుపెడుతుంది'' అని ఇండోర్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది అషర్ వార్సీ పేర్కొన్నారు.

''మీరు మమ్మల్ని ఏ రకంగా ప్రశ్నించినా, సవాల్ చేసినా.. మేం మీమీదకు వస్తాం. మీ ఇళ్లు, మీ జీవనాధారాలు ధ్వంసం చేస్తాం. మిమ్మల్ని నేలమట్టం చేస్తాం' అనేది వారి సందేశం'' అన్నారాయన.

హిందూ భక్తులతో కూడిన భారీ ప్రదర్శనలు ముస్లిం నివాస ప్రాంతాలు, మసీదుల ముందుగా.. ఆ మైనారిటీ ప్రజల మీద హింసను ప్రేరేపించేటటువంటి రెచ్చగొట్టే పాటలు మోగిస్తూ వెళుతున్నపుడు తొలుత హింస చెలరేగింది. కొన్నిచోట్ల కొందరు ముస్లింలు, హిందూ ప్రదర్శకులు పరస్పరం రాళ్లు విసురుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత హిందూ మూకలు తమపై దాడి చేయటానికి పోలీసులు అనుమతించారని చాలా మంది ముస్లింలు ఆరోపించారు. రెచ్చిపోయిన పురుషులు కత్తులు ఝళిపిస్తూ, మసీదులను అపవిత్రం చేస్తున్న వీడియో దృశ్యాలు గత ఆదివారం నుంచి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో కూల్చివేతలు

ఫొటో సోర్స్, Madhya Pradesh police via Twitter

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్‌లో సోమవారం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి

ఖార్గోన్‌కు సుమారు 137 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేంధ్వా నగరంలో ఒక మసీదు మినార్లను హిందూ భక్తులు ధ్వంసం చేశారని, ముస్లింలపై రాళ్లు విసురుతూ తరిమారని షాబాజ్ ఖాన్ (28) ఆరోపించారు.

కానీ అసలైన భయోత్పాతం ఆ తర్వాతి రోజు సంభవించిందని.. అధికారులు అకస్మాత్తుగా ప్రత్యక్షమై తన ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేశారని ఆయన చెప్పారు.

''మా వస్తువులను బయటకు తెచ్చుకుంటామని, కనీసం ఖురాన్‌నైనా తెచ్చుకుంటామని నా భార్య, చెల్లెలు ఏడుస్తూ పోలీసులను ప్రాధేయపడ్డారు. కానీ వాళ్లు వినలేదు'' అన్నారాయన. ఆయన ప్రస్తుతం ఒక మసీదులో తలదాచుకుంటున్నారు.

''మాకు ఏమీ మిగలలేదు. కానీ ఎవరికీ పట్టినట్టు లేదు. మేం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రతిసారీ వారి మమ్మల్ని పశువుల్లా తోలేస్తున్నారు'' అని చెప్పారు.

రాళ్లు విసరటం, గలాటా సృష్టించటంలో పాలుపంచుకున్నారని ఆరోపణలున్న వారికి.. ఈ ఇళ్లు కూల్చివేయటం ఒక విధమైన శిక్ష అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ''రాళ్లు వచ్చిన ఇళ్లను రాళ్ల కుప్పలా మార్చేస్తాం'' అని హోంమంత్రి మిశ్రా ఇటీవల పేర్కొన్నారు.

అయితే.. చట్టపరంగా ఈ చర్యను అనుమతిలేని కట్టడాల ప్రాతిపదికన సమర్థించుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఉన్న కట్టడాలను తాము లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు వాదిస్తున్నారు.

''ఇందులో రెండు అంశాలూ ఉన్నాయి'' అని ఖార్గోన్ జిల్లా కలెక్టర్ అనుగృహ పి చెప్పారు.

''దోషులను ఒక్కొక్కరిగా గుర్తించటం అనేది చాలా సమయం పట్టే ప్రక్రియ. కాబట్టి అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నిటినీ మేం పరిశీలించాం. అల్లర్లకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పటానికి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం'' అని ఆమె వివరించారు.

అయితే.. తమ నివాస ప్రాంతంలో హింస జరిగిన ఉదంతాలేవీ లేవని రఫీక్ చెప్పారు. ''నా ఇల్లు అక్రమ కట్టడం కాదని నిరూపించటానికి నా ఆస్తి పత్రాలన్నీ కూడా నా దగ్గరున్నాయి. కానీ పోలీసులు అకస్మాత్తుగా ప్రత్యక్షమై, నేను చెప్పేది వినటానికి కూడా నిరాకరించి, నా ఇంటిని కూల్చేశారు'' అని తెలిపారు.

ఒకరిపై ఆరోపిత నేరానికి గాను, వేరే నేరానికి ఉద్దేశించిన చట్టాన్ని ఉపయోగించుకుని వారిని శిక్షించటంలో అర్థం లేదని.. ఈ కూల్చివేత లాజిక్‌ను నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

''చట్టబద్ధతను ఒక ముసుగుగా వాడుకుంటున్నారు. మత ప్రదర్శనలకు ముందు కూడా ఈ ఇళ్లు అక్రమ కట్టడాలే. ప్రతీకారంగా స్పందించటానికి ఉపయోగించుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే అనుసరించాల్సిన ప్రక్రియనంతటినీ ఉల్లంఘించటమే అవుతుంది. రాజ్యం కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది'' అని రాజకీయ శాస్త్రవేత్త రాహుల్ వర్మ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హిందూ ఓటర్లను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శకులు అంటున్నారు

అక్రమ కట్టడాలను కూల్చివేసే అధికారం రాజ్యానికి ఉన్నప్పటికీ.. అందులో కొన్ని దశలున్నాయి. యజమానికి నోటీసు ఇవ్వటం, వారు జవాబు ఇవ్వటానికి లేదా కోర్టును ఆశ్రయించటానికి అవకాశం ఇవ్వటం ఉంటాయి. కూల్చవేతకు ముందు వాటిని పాటించాలి. ఆక్రమణదారులకు తాము నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్తున్నారు. కానీ బీబీసీ మాట్లాడిన మూడు కుటుంబాలు తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నాయి.

''అదీగాక.. మధ్యప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1956 కింద కింద.. నిందితులను జరిమానా కట్టాలని కోరటం వంటి ఇతర మార్గాలూ ఉన్నాయి. అధికారులు తొలుత వాటిని ఉపయోగించవచ్చు. ఆస్తిని ధ్వంసం చేయటం అనేది చిట్టచివరి అంశంగా ఉండాలి'' అని వార్సీ చెప్పారు.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. శిక్ష విధించటానికి ఇలాంటి పద్ధతిని ఎంచుకోవటం ఇదే మొదటిసారి కాదు. గతంలో అత్యాచారం ఆరోపణలున్న వారు, గ్యాంగ్‌స్టర్లు, ఇతర నేరస్తుల ఇళ్లను కూడా ప్రభుత్వం కూల్చివేసింది.

''మనం ఇక్కడ చూస్తున్నది ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు - కుహనా యూపీ నమూనా - ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తోంది'' అన్నారు వర్మ.

''దీని లక్ష్యం బీజేపీకి కీలకమైన హిందుత్వ (అతివాద హిందూ జాతీయవాద) ఓటు బ్యాంకును సంతృప్తి పరచటం'' అని ఆయన పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, కాషాయ వస్త్రాలు ధరించిన హిందూ జాతీయవాది యోగి ఆదిత్యనాథ్.. తన రాష్ట్రంలో నేరాలను నిర్మూలించటమే ధ్యేయంగా ఉన్న కఠిన యోగిని తానని ప్రకటించుకున్నారు. ఆయన ప్రభుత్వం.. నిందితుల ఇళ్లను తరచుగా ధ్వంసం చేస్తుంటుంది. అందువల్ల ఆయనను 'బుల్‌డోజర్ బాబా' అని కూడా కొందరు అంటుంటారు.

ఇప్పుడు శివరాజ్‌సింగ్ చౌహాన్ మద్దతుదారులు కూడా ఆయనను 'బుల్‌డోజర్ మామ' అని పిలవటం మొదలుపెట్టారు.

ఈ రెండు రష్ట్రాల్లోనూ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెప్తున్న అనేక విధానాలను ప్రవేశపెట్టాయి. మతాంతర ప్రేమకు వ్యతిరేకంగా చట్టం చేయటం, ధ్వంసమైన ఆస్తులను నిరసనకారుల నుంచి వసూలు చేయటానికి ప్రభుత్వానికి వీలు కల్పించే వివాదాస్పద చట్టం చేయటం కూడా అందులో ఉన్నాయి.

ఈ చట్టాన్ని యూపీలో.. వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించిన వారి మీద ఉపయోగించటం వివాదాస్పదమైంది. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో ఈ చట్టాన్ని ఆమోదించినపుడు.. ఏదైనా నిరసన, సమ్మె, అల్లర్ల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన వారిపైన ఈ చట్టాన్ని ఉపయోగిస్తామని, అవసరమైతే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయటం ద్వారా డబ్బును వసూలు చేస్తామని హోంమంత్రి మిశ్రా పేర్కొన్నారు.

కానీ.. ఆరోపిత నేరాల పేరుతో శిక్షించటానికి నోటీసు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయటానికి ఏ చట్టం కిందా న్యాయ భూమిక లేదని నిపుణులు అంటున్నారు. ''ఇలా చేయటానికి వీలే లేదు'' అన్నారు వార్సీ.

''ఎలాంటి మార్గాన్నైనా నిరాకరించటం ద్వారా అధికారులు చట్టాన్ని తమ సొంత చేతుల్లోకి తీసుకుంటూ కోర్టులను నిర్వీర్యం చేస్తున్నారు. ముస్లింలతో రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తం ప్రకారం వ్యవహరించేలా చేస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

''ప్రభుత్వం ఈ పని చేయటానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)