ఉత్తర్ ప్రదేశ్‌లో ఘన విజయంతో యోగి ఆదిత్యనాథ్ బీజేపీలో నంబర్ 2 అయిపోయారా?

యోగీ నంబర్ టూ అవుతారా

ఫొటో సోర్స్, Ani

    • రచయిత, నీలేష్ ధోత్రే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లాల్‌కృష్ణ అడ్వాణీ జీవితంలో 2002 ఫిబ్రవరి 5 అత్యంత ముఖ్యమైన రోజు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతోంది. అప్పటివరకూ హోంమంత్రిగా ఉన్న అడ్వాణీ అదే రోజు ఉప ప్రధాని అయ్యారు.

వాజ్‌పేయి-అడ్వాణీ కాలంలో వాజ్‌పేయి బీజేపీ నంబర్ వన్ అయితే, అడ్వాణీ నంబర్ టూగా ఉండేవారు. కానీ 2002 ఫిబ్రవరి 5న ఆయన తర్వాత నంబర్ వన్ అవుతారని అధికారిక ప్రకటన వచ్చింది. మరింత ముందుకెళ్లిన అడ్వాణీ 2009లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలిచారు. నంబర్ టూ నుంచి నంబర్ వన్ స్థానానికి చేరుకోవడంలో విజయవంతం అయ్యారు.

కానీ, అడ్వాణీ నంబర్ వన్ స్థానానికి చేరుకోగానే, ఇక నంబర్ టూ స్థానం ఎవరికి అనే చర్చ కూడా మొదలైంది. కానీ, 2009లో ప్రధానమంత్రి కాలేకపోయిన అడ్వాణీ ప్రతిపక్ష నేత హోదాను కూడా స్వీకరించలేదు. ఆ చోటు చివరకు సుష్మా స్వరాజ్‌కు దక్కింది.

టూజీ, బొగ్గు కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని విపక్ష నేతగా సుష్మా స్వరాజ్ ఇరుకున పెట్టారు. తర్వాత మొదలైన అన్నా హజారే ఉద్యమంతో యూపీఏ-2 ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.

ఇక్కడ కేంద్ర స్థాయిలో ఇవన్నీ జరుగుతుంటే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ భారీ విజయం సాధించారు. ఆయన వరసగా మూడోసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.

లాల్‌కృష్ణ అడ్వాణీ

ఫొటో సోర్స్, PRAKASH SINGH/GETTY IMAGES

ఇదంతా జరుగుతున్న సమయంలో లాల్‌కృష్ణ అడ్వాణీ నంబర్ వన్‌గానే ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో వరుసగా సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు.

కానీ, 2012లో నరేంద్ర మోదీ విజయంతో ఆ స్థానాలు మొత్తం మారిపోయాయి. తర్వాత ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ పేరు కూడా చర్చలోకి వచ్చింది. 2013 జూన్‌లో గోవాలో బీజేపీ కార్యవర్గాన్ని ఏర్పాటుచేసిన పార్టీ, 2014 ఎన్నికల ప్రచారానికి మోదీని చీఫ్‌గా చేశారు. తర్వాత జరిగిన చరిత్ర అందరికీ తెలిసిందే.

దిగ్విజయ్ సింగ్ ఒక కార్యక్రమంలో సుష్మా స్వరాజ్‌తో లోక్‌సభ విపక్ష నేతగా ప్రధాన మంత్రి పదవి వైపు వెళ్లడానికి, ఇది మీ తొలి అడుగు అన్నారు. కానీ సుష్మా స్వరాజ్ అప్పుడు ఆయనకు ఏ సమాధానం ఇవ్వలేకపోయారు. పార్టీలో రెండో స్థానం, తను ఆశిస్తున్న నంబర్ వన్ స్థానాన్ని కోల్పోతామనే ఆందోళన అప్పుడు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.

అదే తర్వాత చరిత్రగా మారింది

కానీ, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ అదే జరగబోతోందా అనేది ఇప్పుడు దిల్లీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పుడు పాత్రలు మారుతున్నాయి. అమిత్ షా ప్రస్తుతం బీజేపీలో, ప్రభుత్వంలో మోదీ తర్వాత అతిపెద్ద నేతగా ఉన్నారు. అయితే, ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ బీజేపీ కొత్త నేతగా ఆవిర్భవిస్తున్నారు.

అడ్వాణీతో ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, RAVEENDRAN/GETTY IMAGES

మోదీ మొదటి ప్రభుత్వ సమయంలో అమిత్ షా పార్టీకి నాయకత్వం వహించారు. ఆయన రెండో పదవీకాలంలో ఇప్పుడు నేరుగా ప్రభుత్వంలో ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రెండో హోంమంత్రి అయిన ఆయన, తిరుగులేని విధంగా రెండో స్థానంలో ఉన్నారు. అయితే పార్టీలో రెండో స్థానం ఎవరిది..

బీజేపీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా ఉన్నారు. కానీ పార్టీలో షా హవా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు యోగీ రూపంలో ఒక వ్యక్తి వారి ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇండియా టుడే గ్రూప్ అప్పుడప్పుడూ 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వే చేస్తుంటుంది. అది తమ 2021 సర్వేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తర్వాత యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రజలు కాబోయే ప్రధానమంత్రిగా చూశారు.

ఈ సర్వేలో 24 శాతం మంది ప్రధానిగా నరేంద్ర మోదీ పేరును చెబితే, 11 శాతం మంది యోగీ ఆదిత్యనాథ్‌ను ఇష్టపడ్డారు.

ఇక్కడ, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమిత్ షా ఈ సర్వేలో ఆరో స్థానంలో నిలిచారు. ప్రధానిగా ఆయన పేరును 7 శాతం మంది మాత్రమే చెప్పారు. ఈ సర్వేలో షా కంటే ముందు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా ఉన్నారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, NURPHOTO

అదే, ఇండియా టుడే న్యూస్ 'మూడ్ ఆఫ్ ద నేషన్' 2022 పోల్‌లో 49 శాతం మంది యూపీ తర్వాత ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్‌కు ఓటు వేశారు.

తాజా ఎన్నికల ఫలితాలు విడుదలైన కాసేపటికే యోగీ ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయం స్పష్టమైంది.

ఈ విజయంతో యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు బీజేపీలో నంబర్ టూ స్థానానికి చేరుకోగలరా, లేక రెండో స్థానానికి రేసులో నిలిచారా?

"ఈ ఎన్నికలకు ముందు నుంచే యోగీ ఆదిత్యనాథ్ మద్దతుదారులు ఆయన్ను రెండో స్థానంలో చూస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు, ఆయన రెండో స్థానం రేసులో ఉన్నారు" అని బీబీసీ హిందీ ఎడిటర్ రాజేష్ ప్రియదర్శి చెప్పారు.

కానీ, చరిత్రలో మొదటిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే తమ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారనే విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో యోగీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

మోదీతో యోగీ

ఫొటో సోర్స్, Ani

రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఇప్పుడు తన పార్టీలో వ్యతిరేకులను ఎలా హాండిల్ చేస్తారనే విషయంపైనే తర్వాత లెక్కలు ఆధారపడి ఉంటాయని రాజేష్ ప్రియదర్శి అంటున్నారు.

ఇక, బీజేపీలో రెండో స్థానం కోసం అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్ మధ్య పోరు తీవ్రంగా ఉంటుందని ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎడిటర్ మనోరంజన్ భారతి భావిస్తున్నారు.

"బీజేపీ కచ్చితంగా రెండో స్థానం కోసం పోటీపడుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు యోగీ ముఖచిత్రంతోనే వెళ్లారు. ప్రచారంలో మోదీ చిత్రాలను ఎన్ని ఉపయోగించారో, అన్ని యోగీ ముఖాలను కూడా వాడారు. ఈరోజు హిందుత్వకు అతిపెద్ద పోస్టర్ బాయ్ యోగీనే. భారతీ కూడా మనకు దానిని గుర్తు చేస్తున్నారు" అన్నారు.

మరోవైపు, బీజేపీలో అమిత్ షా నంబర్ టూ స్థానానికి ప్రస్తుతానికి ఢోకా లేదని ద హిందూ పొలిటికల్ ఎడిటర్ నిస్తుల్లా హెబ్బార్ చెబుతున్నారు.

"బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే విజయం సాధించి ఉంటే యోగీ రెండో స్థానం సాధిస్తారనే వాదనకు మరంత బలం వచ్చేది. బీజేపీ ఉత్తరాఖండ్, మణిపూర్‌లో కూడా గెలిచింది. గోవాలో కూడా పరిస్థితి బాగానే ఉంది. అందుకే దీనిని మోదీ విజయంగానే చూస్తున్నారు. ఈ ఎన్నికలు యోగీని కూడా మిగతా అనుభవజ్ఞులైన బీజేపీ ముఖ్యమంత్రుల వరుసలోకి తీసుకొచ్చాయి" అన్నారామె.

ఈ ఫలితాలు అమిత్ షాపై భారం పెంచాయని ఆమె భావిస్తున్నారు.

"అమిత్ షా ఎన్నికల వ్యవస్థలను నడిపించిన తీరును బట్టి బీజేపీ ఈ రాష్ట్రాల్లో విజయం సాధించిందనే విషయం స్పష్టమవుతోంది. ఈ విజయంలో షా ఒక పెద్ద పాత్ర పోషించారు. అందుకే, ఆయన కోసం రెండో స్థానం ఇప్పటికీ అలాగే ఉంది" అంటారు హెబ్బార్.

మోదీతో యోగీ

ఫొటో సోర్స్, @MYOGIADITYANATH

రేవతి లాల్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఆమె ఉత్తరప్రదేశ్‌లో పొలిటికల్ రిపోర్టింగ్ చేస్తున్నారు.

బీజేపీలో నంబర్ వన్, నంబర్ టూ అనే ప్రశ్నే తప్పు అని అక్కడి సామాజిక, కుల, ఆర్థిక పరిస్థితుల గురించి బాగా తెలిసిన రేవతి చెప్పారు.

"బీజేపీలో ఎవరు నంబర్ వన్, ఎవరు నంబర్ టూ అనే దానివల్ల పెద్దగా తేడా ఉండదు. అసలు ఆ ప్రశ్నే తప్పు. దానివల్ల వాస్తవిక సమాజంలో పరిస్థితిలు మారవు. క్షేత్రస్థాయిలో ఏయే అంశాలు ముఖ్యం అనేది ప్రధానం. ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టాలి. మొదట అది చేయాల్సుంటుంది. కానీ మనం అదే రాజకీయ సమస్యల్లో చిక్కుకుపోయున్నాం" అన్నారు.

మనం అవే రాజకీయ సమస్యల్లో చిక్కుకుపోయామా, దేశ సామాజిక, రాజకీయాలను నడిపించే శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నామా అనేది సమీప భవిష్యత్తులో స్పష్టం అవుతుంది

కానీ, ఒకటి మాత్రం కచ్చితం. బీజేపీలో మొదటి, రెండో స్థానాల కోసం ఎప్పుడూ రేస్ కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ టూ, ఎప్పుడూ నంబర్ వన్ కాలేరని చరిత్ర కూడా చెబుతోంది. ఒక్కోసారి అసలు చర్చల్లోనే లేని ఒక పేరు హఠాత్తుగా తెరపైకి వస్తుందనేది కూడా అంతే వాస్తవం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)