దానిశ్ ఆజాద్ అన్సారీ: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని ఏకైక ముస్లిం మంత్రి ఎవరు?

దానిశ్ ఆజాద్ అన్సారీ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 52 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 16 మంది క్యాబినెట్ మంత్రులు, 14 మంది సహాయక మంత్రులు(స్వతంత్ర హోదా), 20 మంది సహాయక మంత్రులు ఉన్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో ముస్లింల జనాభా 20 శాతం వరకూ ఉంటుంది. అయితే, ఆ వర్గానికి చెందినవారు యోగి ప్రభుత్వంలో ఒక్కరే ఉన్నారు. ఆయన పేరు దానిశ్ ఆజాద్ అన్సారీ. బలియాకు చెందిన ఆయనకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)తోనూ సంబంధముంది.

ఇదివరకటి యోగి ప్రభుత్వంలోనూ ఒకే ఒక ముస్లిం మంత్రి ఉండేవారు. ఆయన పేరు మోహిసిన్ రాజా.

ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అన్సారీ వయసు 32ఏళ్లు. లఖ్‌నవూ యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లోనూ ఆయన పాలుపంచుకున్నారు.

బలియాలోని అపాయల్ గ్రామం అన్సారీ స్వస్థలం.

దానిశ్ ఆజాద్ అన్సారీ

ఫొటో సోర్స్, Danish Azad

ఫొటో క్యాప్షన్, బలియాలోని అపాయల్ గ్రామంలో దానిశ్ ఆజాద్ అన్సారీ ఇల్లు

లఖ్‌నవూ యూనివర్సిటీలో

‘‘అన్సారీ తాతగారు మహ్మద్ తాహా అన్సారీ.. సుఖ్‌పురా గ్రామంలోని జూనియర్ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. ఆయనకు చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరుండేది. ఆయన ప్రభావం దానిశ్ అన్సారీపైనా ఉంది’’అని అన్సారీ బంధువు పింటూ ఖాన్ బీబీసీతో చెప్పారు.

దానిశ్ తండ్రి పేరు సమీఉల్లా అన్సారీ. ఆయన కూడా బలియాలోనే ఉంటారు.

అన్సారీ మొదట అపాయల్ గ్రామ ప్రైమరీ స్కూల్‌లో చదువుకున్నారు.

12వ తరగతి వరకు బలియాలోనే చదువుకున్న ఆయన లఖ్‌నవూ యూనివర్సిటీలో 2006లో బీకామ్ పూర్తిచేశారు. ఆ తర్వాత అక్కడి నుంచే క్వాలిటీ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చదివారు.

దానిశ్ ఆజాద్ అన్సారీ

ఫొటో సోర్స్, Danish Azad

2011 జనవరిలో అన్సారీ ఏబీవీపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం ఏ సభలోనూ ఆయనకు సభ్యత్వం లేదు.

రాజకీయాల్లో ఆయన చురుగ్గా ఉంటారని, ఆయన స్వేచ్ఛగా అభిప్రాయాలు చెబుతుంటారని, అందుకే ఆయన పేరు చివరన ఆజాద్ అనే పదం వచ్చి చేరిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

దానిశ్ ఆజాద్ అన్సారీ కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, Danish Azad

ఫొటో క్యాప్షన్, దానిశ్ ఆజాద్ అన్సారీ బంధువులు

‘‘ఏబీవీపీ రాజకీయాల్లో అన్సారీ తనదైన మార్కు వేశారు. ఆయన స్వేచ్ఛగా మాట్లాడుతూ ప్రజలను ప్రభావితం చేసేవారు. అప్పటి నుంచే ఆయనకు ఆజాద్ అనే పేరు కూడా వచ్చింది’’అని పింటూ ఖాన్ చెప్పారు.

ముస్లిం యువత కోసం ఆరెస్సెస్

ఉత్తర్ ప్రదేశ్‌ ముస్లిం యువతలో బీజేపీ, ఆరెస్సెస్‌ల భావజాలం ప్రచారం చేయడంలో అన్సారీ ప్రధాన పాత్ర పోషించారు.

పార్టీ మైనారిటీ విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ అన్సారీ పనిచేశారు.

వీడియో క్యాప్షన్, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఎంత?

సంప్రదాయ ముస్లిం కుటుంబం

అన్సారీ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు. అన్సారీతోపాటు ఆయన సోదరికి కూడా వివాహమైంది.

సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అన్సారీకి తమ వర్గంలో మంచి గుర్తింపు ఉంది. అన్సారీ తల్లిదండ్రులు హజ్ యాత్రకు కూడా వెళ్లొచ్చారు.

వీడియో క్యాప్షన్, RRR మూవీ రివ్యూ: ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి సినిమా ఎలా ఉందంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)