పంజాబ్ ఎన్నికలు: సీఎం అభ్యర్థి రేసులో ఉన్న ఈ ఆరుగురి బలాలు, బలహీనతలు ఏంటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, కుశాహల్ లాలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఏ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు అన్న చర్చ మొదలైంది. దీనికి కారణం, భగవంత్ మాన్ తమ సీఎం అభ్యర్ధి అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటన చేయడమే.
అధికార కాంగ్రెస్‌లో ఈసారి సీఎం పదవి కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే, పరిస్థితులు చరణ్‌జిత్ సింగ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, అకాలీదళ్-బహుజన్ సమాజ్ పార్టీ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తండ్రి ప్రకాష్ సింగ్ బాదల్ స్వయంగా ప్రకటించారు.
రైతు ఉద్యమం తర్వాత కొత్తగా ఏర్పడిన యునైటెడ్ సమాజ్ మోర్చా, తమ పార్టీ సీఎం అభ్యర్ధి బల్బీర్ సింగ్ రాజేవాల్ అని ప్రకటించింది.
అయితే, బీజేపీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా నాయకత్వంలోని అకాలీదళ్(యునైటెడ్) ఇంత వరకు తమ సీఎం అభ్యర్ధుల పేర్లను ప్రకటించ లేదు.
పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన ఆరు ప్రధాన పార్టీలు/కూటముల తరఫున ఎవరెవరు సీఎం పదవి రేసులో ఉన్నారు, ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయన్నది చూద్దాం.

ఫొటో సోర్స్, ANI
1. చరణ్‌జిత్ సింగ్ చన్నీ (కాంగ్రెస్):
సానుకూలతలు
చరణ్‌జిత్ సింగ్ దళిత వర్గం నుంచి వచ్చారు. ముఖ్యమంత్రిగా గత నాలుగు నెలల్లో దళితులలో తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నారు.
ఇతర పార్టీల నుంచి సీఎం పదవి రేసులో ఉన్నవారంతా జాట్ సిక్కు వర్గానికి చెందినవారే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గపు ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఏకైక సీఎం అభ్యర్థి కావడం చన్నీకి కలిసొచ్చే అంశం.
మరోవైపు, రైతుల డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించడం, విద్యుత్తు, పెట్రోల్, డీజిల్ చౌకగా చేయడం వంటి నిర్ణయాల వల్ల చన్నీకి ఆదరణ పెరిగి ఉండవచ్చు. సామాన్య ప్రజానీకాన్ని ముఖ్యమంత్రి దగ్గరకు చేరేలా చేస్తామన్న ఆమ్ ఆద్మీ అజెండాను, అసలు ముఖ్యమంత్రే సామాన్యుడు అన్న నినాదం ద్వారా చన్నీ ఎదుర్కోవచ్చు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రజల తరఫు మనిషిలా వ్యవహరించడం, ఎన్నికల సమయంలో ఆయన బంధువులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడంతో చన్నీ స్థాయి మరింత పెరిగింది.
ప్రతికూలతలుః
నవజ్యోత్ సిద్ధూ, సునీల్ జాఖర్, మనీశ్ తివారీ వంటి కాంగ్రెస్ నేతల వ్యతిరేకత చన్నీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్థానిక నాయకులతో అభిప్రాయభేదాలు కూడా ఆయనకు ప్రధాన సమస్య.
సామాన్యుడిలా కనిపించాలంటూ చన్నీ చేసిన ప్రయత్నాలకు ఆయన ప్రత్యర్థుల నుంచి హేళన ఎదురైంది. సిక్కు ప్రార్థనా మందిరాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు, డ్రగ్స్ వ్యవహారాలలో ఆయన సీరియస్‌గా వ్యవహరించ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ, పంజాబ్ ప్రభుత్వంలోని లోపాలకు ఆయనే జవాబుదారీ కావడం ఆయనకు పెనుభారమే.

2. భగవంత్ మాన్ (ఆమ్ ఆద్మీ పార్టీ):
సానుకూలతలు
భగవంత్ మాన్ స్టార్ ఆర్టిస్ట్. పంజాబ్ అంతటా ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రచారంలో దిట్ట. నిజాయితీ గల నాయకుడన్న ఇమేజ్ ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఆయన మీద ఎలాంటి అవినీతి మరక లేదు.
మాల్వా ప్రాంతంలోని సామాన్య జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు భగవంత్ మాన్. ఈ రెండూ ఆయనకు కలిసొచ్చేవే. పంజాబ్‌లో కేజ్రీవాల్ దిల్లీ మోడల్ భగవంత్ మాన్‌కు అనుకూలించే అంశం.
ప్రతికూలతలుః
మద్యం మత్తులో బహిరంగ కార్యక్రమాలకు హాజరవుతారని, ఆయన 'డ్రగ్ అడిక్ట్' అని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు.
ఆమ్ఆద్మీ పార్టీ సంస్థాగత నిర్మాణం కాంగ్రెస్, అకాలీదళ్ లాగా బలంగా లేదు. ఇది ఆయనకు సమస్య కావచ్చు. పార్టీ ప్రధాన కేంద్రం మాల్వాకే పరిమితం కావడంతో గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 20 సీట్లకే పరిమితమైంది.
హాస్య నటుడు కావడంతో రాజకీయ ప్రత్యర్థులు ఆయనను నాన్-సీరియస్ నేత అని విమర్శిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
3.నవజ్యోత్ సింగ్ సిద్ధూ (కాంగ్రెస్):
సానుకూలతలుః
నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ వెలుపల స్టార్ ప్లేయర్. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మంచి పేరున్న వ్యక్తి. పంజాబ్ మోడల్, కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడంలో ఆయన పాత్ర, కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించడంలో సఫలత కారణంగా ఆయన శక్తి సామర్ధ్యాల మీద చాలామందికి గురి ఏర్పడింది.
డ్రగ్ మాఫియా, సిక్కు ప్రార్ధనాలయాలను అపవిత్రం చేసిన కేసుల విషయంలో న్యాయం జరగాలంటూ గట్టిగా నిలబడటంతో ఆయనకు మైలేజ్ పెరిగి ఉండొచ్చు.
సిద్ధూ మాల్వా ప్రాంతానికి చెందిన జాట్ సిక్కు. కానీ మాఝ ఆయన కర్మభూమి. అదే సమయంలో, హిందూ ఆచారాలను పాటించడం వల్ల, హిందువులలో కూడా ఆయనకు మంచి పట్టు ఉంది.
ప్రతికూలతలు
నవజ్యోత్ సిద్ధూది గట్టిగా మాట్లాడే వ్యక్తిత్వం. ఆవేశంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రతిష్ట కొంతవరకు దిగజారింది.
టీమ్ వర్క్ కాకుండా 'వన్ మ్యాన్ ఆర్మీ'గా పనిచేసుకుపోయే ఆయన తీరు కాంగ్రెస్‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. పంజాబ్‌లో చాలాకాలంగా కాంగ్రెస్‌లో ఉంటున్న నేతలకు దూరం కావడం ఆయనకు ప్రతికూలంగా మారవచ్చు.

ఫొటో సోర్స్, SUKHBIR SINGH BADAL/FACEBOOK
4. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (అకాలీదళ్-బీఎస్పీ కూటమి):
సానుకూలతలు
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నాయకుడిగా, ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో సమర్ధుడిగా పేరు పొందారు. సుఖ్‌బీర్ సత్తా ముందు మిగతా వారెవరూ నిలవలేరన్నది రాజకీయ వర్గాలలో టాక్.
శిరోమణి అకాలీదళ్‌లో ఆయన నాయకత్వాన్ని సవాల్ చేసేవారు ఎవరూ లేరు. పంజాబ్ అంతటా అకాలీదళ్‌కు బలమైన పార్టీ నిర్మాణం, క్రమశిక్షణ కలిగిన క్యాడర్ ఉంది.
బహుజన్ సమాజ్ పార్టీతో అకాలీదళ్ కూటమి జాట్ సిక్కు, దళితుల ఓటు బ్యాంకుల కలయికగా నిరూపణ అయ్యే అవకాశం ఉంది.
అకాలీదళ్ (యునైటెడ్)కి చెందిన రంజిత్ సింగ్ బ్రహ్మపుర వంటి అకాలీలు తిరిగి అకాలీదళ్‌లోకి రావడం, టిక్కెట్ పంపిణీ సమయంలో ఎలాంటి తిరుగుబాట్లు లేకపోవడం కూడా సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు అనుకూలంగా మారింది.
శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) పంజాబ్‌లో అకాలీదళ్‌కు సమాంతర శక్తిగా పని చేస్తుంది. ఇది వారికి ప్రయోజనం కలిగిస్తుంది.
ప్రతికూలతలు
అకాలీదళ్‌ను ప్రైవేట్ కంపెనీగా నడుపుతూ, ఆయుధ బలంతో తన వ్యాపారాన్ని విస్తరించడం నుంచి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఇంకా బయటపడ లేదన్న విమర్శ ఉంది.
అకాలీదళ్ పాలనలో ఇసుక, డ్రగ్స్, కేబుల్, రవాణా రంగాలలో మాఫియా కార్యకలాపాలతో పాటు గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రం చేసిన వివాదంలో ఆ పార్టీ కార్యాచరణ సరిగా లేవన్న ఆరోపణలు వినిపించాయి.
పార్టీ ఎజెండాలో కొత్త విధానాలు, పథకాలు ఏవీ లేవని, పంజాబ్‌లోని మత సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను ఎన్నికల అజెండాలో చేర్చకపోవడం నెగెటివ్ భావన కలిగించవచ్చన్న మాట వినిపిస్తోంది.

5.కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్ లోక్ కాంగ్రెస్-బీజేపీ-అకాలీదళ్ యునైటెడ్ కూటమి)
ఈసారి బీజేపీ, అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ (యునైటెడ్) కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. అయితే ఈ కూటమి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు.
అయితే, ఇప్పటి వరకు ఈ కూటమిలో ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా మారగల ఏకైక వ్యక్తి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రమే.
సానుకూలతలు
పంజాబ్ ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పేరుంది. ముక్కుసూటితనం, కొత్తకొత్త ఆలోచనలతో ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఆపరేషన్ బ్లూస్టార్‌కు నిరసనగా 1984లో తన సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి ఎంపీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. రాష్ట్రంలో నీటి సమస్యపై 2004లో పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపించారు.
జాతీయవాదం, పాకిస్తాన్ పై విమర్శలు చేయడంలో ఆయన బీజేపీకంటే ముందుంటారు. హిందువులలో కూడా ఆయనకు మంచి పేరుంది.
ప్రతికూలతలు
కెప్టెన్ అమరీందర్ ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఎదుర్కొన్నారు. సామాన్యుల సమస్యలపై ఆయన చర్యలు తీసుకోరన్న విమర్శలు వినిపిస్తాయి.
అదే సమయంలో, పార్లమెంటులో మూడు వ్యవసాయ చట్టాలు చేసి పంజాబీల ఆగ్రహానికి గురైన బీజేపీతో ఆయన చేతులు కలపడం ఆయనకు మైనస్ కావచ్చు. చట్టాలను ఉపసంహరించుకున్నా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోంది.
నాలుగుగేళ్ల కాలంలో ఆయన పని తీరు పేలవంగా ఉండటమే కాకుండా, రైతు వ్యతిరేకి అని ఆరోపణలున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

6. బల్బీర్ సింగ్ రాజేవాల్ (యునైటెడ్ సోషల్ ఫ్రంట్):
సానుకూలతలు
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రముఖుడిగా, సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన నాయకుడిగా పంజాబ్ సీఎం పదవి రేసులో నిలిచారు బల్బీర్ సింగ్.
ఆయన అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడతారని, సరళమైన, సామాన్యుల భాషలో మాట్లాడటం ఆయన ప్రత్యేకత అని చెబుతారు. రైతుల ఉద్యమానికి ఎంతగానో సహకారం అందించిన ఆయనకు రైతుల నుంచి మద్ధతు లభించే అవకాశం ఉంది.
తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎలాంటి ఆరోపణలు, వివాదాలు లేవు.
ప్రతికూలతలు
రైతుల ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్‌లోని పెద్ద పెద్ద సంస్థలను పరిగణనలోకి తీసుకోకపోవడం రాజేవాల్‌కు హానికరం. అదే సమయంలో, క్రమశిక్షణతో కూడిన క్యాడర్ లేకపోవడం, ఎన్నికలకు తగిన నిధులు, మౌలిక సదుపాయాల కొరత ఈ ఫ్రంట్ బలహీనతలు.
పట్టణ ప్రాంతాలు, రైతులు కానివారి నుంచి ఆయనకు మద్ధతు కష్టమే.
ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. రైతు ఉద్యమంతో తన సత్తా నిరూపించుకున్నా, ఈ వయసులో ఆయన ఎన్నికలను ఎదుర్కొనగలరా అన్నది సందేహం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















