పంజాబ్: సిద్ధూతో ఎవరికి నష్టం? కాంగ్రెస్‌కా, ఆయనకా?

నవజ్యోత్ సింగ్ సిద్ధూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నవజ్యోత్ సింగ్ సిద్దూ
    • రచయిత, అరవింద్ ఛాబ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సెప్టెంబర్ 27 సోమవారం, పంజాబ్ కొత్త మంత్రులు తమ కొత్త బాధ్యతల్లో కుదురుకుంటూ ఉండగా, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విట్టర్‌లో ప్రకటించారు. దాంతో, ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.

రెండు రోజుల తరువాత, తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ సిద్ధూ ఒక వీడియోను పోస్ట్ చేశారు.

కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రభుత్వంలో అధికారులు, నాయకుల నియామకాలపై అసంతృప్తి కారణంగా రాజీనామా చేసినట్లు ఆ వీడియోలో తెలిపారు.

కొంతమంది పార్టీ నాయకులు సిద్ధూను ఒప్పించి, వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, సిద్ధూను సంతృప్తి పరిచేందుకు తమ అధికారులను, నాయకులను పదవుల నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తయారుగా ఉందా? సిద్ధూను ఒప్పించడానికి పార్టీ ఎంత దూరం వెళ్లగలదు?

నవజ్యోత్ సింగ్ సిద్ధూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పార్టీలో సిద్ధూ స్థాయి

ఈ ఏడాది జులైలో సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే, ఈ నిర్ణయానికి అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సుముఖంగా లేరు.

సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అమరీందర్ సింగ్ విఫలం అవుతున్నారని గత ఏడాది కాలంగా సిద్ధూ ఆరోపిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో, సిద్దూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో వారిద్దరి మధ్య ఘర్షణలు పెరిగాయి.

దానికి తోడు, మరికొందరు నాయకులు కూడా అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి పదవిలో మార్పు కావాలని డిమాండ్ చేశారు.

నాయకుడు లేకుండా ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. చివరికి, అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న వెంటనే మాఝా ప్రాంతం నుంచి త్రిపాత్ రజిందర్ సింగ్ బజ్వా ఎమ్మెల్యేలను సమీకరించడం ప్రారంభించారని సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ చెప్పారు.

"అంతా కలిసి సిద్ధూను ముందుకు తీసుకువచ్చారు. దాంతో, తనవల్లే అంతా ఒక్కటయ్యారని సిద్ధూకు అనిపించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు.

అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తరువాత పార్టీలో సిద్ధూ పరపతి, స్థాయి బాగా పెరిగాయి కానీ ముఖ్యమంత్రి అయ్యేంత కాదు.

సిద్ధూ

ఫొటో సోర్స్, Getty Images

సిద్ధూ సూపర్ సీఎం?

ఎమ్మెల్యేలందరూ ఇష్టపడిన సుఖ్వీందర్ సింగ్ రణధవా ముఖ్యమంత్రి కాకుండా సిద్ధూ అడ్డుకున్నారని సమాచారం.

చివరకు, తొలి దళిత సీఎంగా చరణ్‌జీత్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు.

మూడింట ఒక వంతు దళితులు ఉన్న పంజాబ్‌లో ఈ రాజకీయ వ్యూహం భవిష్యత్తులో కాంగ్రెస్‌కు లాభదాయకం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొదట్లో సిద్ధూను, చన్నీని పక్కపక్కనే చూసినప్పుడు.. చన్నీ నామమాత్రపు సీఎం అనీ, చక్రం తిప్పేది సిద్దూనే అని అనిపించి ఉండవచ్చు.

కానీ, చన్నీని దగ్గరగా చూసినవారికి మాత్రం ఆయన రబ్బరు స్టాంపు నాయకుడు కారని బాగా తెలుసు. అది నిరూపించడంలో చన్నీ ఏమాత్రం ఆలస్యం చేయలేదు.

ముందుగా క్యాబినెట్ మంత్రుల పేర్లు ప్రకటించారు. ఆ జాబితా చూస్తే, అందులో సిద్ధూ హస్తం ఏమీ లేనట్లు కనిపించింది.

డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అడ్వకేట్ జనరల్‌ పదవుల్లో కూడా సిద్ధూ సన్నిహితులు లేకపోయేసరికి ఆయన కోరుకున్నది అస్సలు జరగట్లేదని స్పష్టమైంది.

AG, DG

ఫొటో సోర్స్, ANI

ఏజీ, డీజీ

పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ డీజీపీ సుమేధా సైనీ కేసులో ప్రస్తుత ఏజీ వాదించి, ఆయనకు బెయిల్ కూడా ఇప్పించారు. ఇది పంజాబ్ ప్రభుత్వానికి గట్టి దెబ్బే.

డీజీపీ ఇక్బాల్ సింగ్ సహోటా పేరు చెప్పకుండా, బాదల్‌లకు (మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుటుంబం) క్లీన్ చిట్ ఇచ్చినవారికి ముఖ్యమైన పదవులు కట్టబెట్టారని సిద్ధూ ఆరోపించారు.

అయితే, సహోటా అలాంటి చర్యలకు పాల్పడలేదని పంజాబ్ పోలీసులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

సిద్ధూ ప్రస్తావించిన విషయం 2015 నాటిది. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌కు, పంజాబ్ ప్రజల మనోభావాలకు సంబంధించినది.

2015లో బర్గాడి గ్రామంలోని గురుద్వారా సాహిబ్ వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యపదజాలంతో కూడిన పోస్టర్లు అతికించారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను అవమానించారు.

ఈ సంఘటనతో సిక్కులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పలుచోట్ల నిరసనలు చేశారు.

ఈ కేసును ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటా నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఐటీ) దర్యాప్తు చేసింది. తరువాత, దీన్ని సీబీఐకి అప్పగించారు.

ఈ కేసులో, అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు.

తరువాత వారిని నిరపరాధులుగా పేర్కొంటూ విడుదల చేశారు. మరొక ఏడుగురి పేర్లు బయటికొచ్చాయి. వారిలో అయిదుగురిని అరెస్ట్ చేశారు.

గురుద్వారా

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసులో ఇద్దరిని నిందితులుగా పేర్కొని అరెస్ట్ చేయడపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మత గ్రంథాన్ని అవమానించినవారికి తప్పక శిక్ష పడేలా చేస్తామని కూడా ఆయన చెబుతూ వచ్చారు.

కానీ, ఇలాంటి అధికారులను నియమిస్తే న్యాయం ఎలా జరుగుతుందని సిద్ధూ అన్నారు.

మరోపక్క, తనకు ఇగో లేదని, తన నిర్ణయాలను పునఃపరిశీలించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చన్నీ స్పష్టం చేశారు.

అయితే, సిద్ధూను శాంతపరచడానికి మొదట అధికారులను, తరువాత మంత్రులను మార్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?

సిద్దూతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిద్దూతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ

ఒత్తిడి మీద చన్నీ తన నిర్ణయాలను మార్చుకుని, నియామకాలను రద్దు చేస్తే ఆయన పదవే ప్రశ్నార్థకంగా మారుతుందని, కొత్త సంక్షోభం తలెత్తుతుందని చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఖలీద్ మొహమ్మద్ అన్నారు.

"ఆయన తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటే, మళ్లీ ప్రజల నమ్మకాన్ని పొందగలరా?"

అయితే, పార్టీ ఏం చేయాలి?

రాజీనామా చేసినవారి నిర్ణయాన్ని ఆమోదించాలని ప్రొఫెసర్ ఖలీద్ అభిప్రాయపడ్డారు.

మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి."

సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పార్టీకి సిద్ధూ ఎంత ముఖ్యం?

సిద్ధూ ప్రసంగాలు ఆసక్తికరంగా, జనరంజకంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

సిద్ధూకు ఆకర్షితులై ఎంతమంది ఆయనకు లేదా పార్టీకి ఓటు వేస్తారనే దానిపై భినాభిప్రాయాలు ఉన్నాయి.

"ఇటీవల సిద్ధూ ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదిగారని నా అభిప్రాయం. కానీ తొందరపాటుతనంతో ఆయన విశ్వశనీయతను కోల్పోయారు" సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో సిద్ధూకు ఉన్నత స్థానం ఉందిగానీ, ఆయన అధ్యక్ష పదవిని విడిచిపెట్టినా లేదా పార్టీనే విడిచిపెట్టినా పెద్దగా నష్టం ఉండదని పార్టీలో కొందరి అభిప్రాయం.

అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే సిద్ధూ లేవనెత్తిన అంశాలకు త్వరగా పరిష్కారం చూపించకపోతే మాత్రం పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలో వీటిని ఉపయోగించుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏ మాత్రం వెనుకాడవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)