ఆంధ్రప్రదేశ్: బీఈడీ కాలేజీలలో కోళ్ల ఫారాలు, ఎందుకీ దుస్థితి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బి.ఈడీలో చేరేందుకు ప్రవేశ పరీక్ష ఎడ్‌సెట్ ఈ నెల 21న నిర్వహించారు.
గతంలో బీఈడీ చదివేందుకు లక్షల మంది పోటీ పడేవారు. కానీ ఈసారి బీఈడీ ఎంట్రన్స్‌కి 15,638 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 87శాతం మంది పరీక్ష రాశారు.
ఒకప్పుడు ఎడ్ సెట్ అంటే ఎంసెట్‌తో సమానంగా పోటీ ఉండేది. కానీ , ప్రస్తుత పరిస్తులను బట్టి చూస్తుంటే బీఈడీ చదివేందుకు పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని అర్ధమవుతోంది. ఎందుకిలా జరిగింది, బీఈడీ కాలేజీల పరిస్థితి ఏమవుతోంది.
ఉద్యోగమంటే టీచరే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి ఉద్యోగాలంటే కేవలం పోలీస్ కానిస్టేబుళ్లు, టీచర్ పోస్టులు మాత్రమే అన్నట్టుగా ఉండేది. ఉపాధ్యాయ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావాహులు పోటీ పడేవారు. ఇందుకోసం బీఈడీ, డీఈడీ కోర్సులలో చేరేవారు.
కేవలం ఏపీలోని యూనివర్సిటీల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా బీఈడీ సర్టిఫికెట్లు తీసుకుని ఉద్యోగాల కోసం సిద్ధమయ్యేవారు.
బీఈడీ చదివిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఉద్యోగం వస్తుందనే నమ్మకం కూడా అత్యధికుల్లో కనిపించేది. ప్రభుత్వ ఉద్యోగం దక్కకపోయినా ప్రైవేటు స్కూళ్లలోనయినా ఉపాధి గ్యారంటీ అన్నట్టుగా భావించేవారు.
కానీ రానురాను పరిస్థితి తారుమారైంది. విద్యావిధానంలో వచ్చిన మార్పులు, కరోనా అనంతర పరిస్థితులు ఉపాధ్యాయ ఉద్యోగార్థులలో తీవ్ర నిరాశను నింపాయి. బీఈడీ చదివేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
డీఎస్సీ నోటిఫికేషన్లు ఎప్పుడు?
గతంలో ప్రభుత్వాలు తరచుగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేవి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను కనీసం రెండు, మూడేళ్లకోమారు భర్తీ చేస్తుండేవారు.
1990ల నుంచి రాష్ట్ర విభజన వరకూ సగటున మూడేళ్లకోసారి ఉపాధ్యాయ నియామకాలకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్‌సీ) నోటిఫికేషన్లు వచ్చాయి.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో గడిచిన ఏడున్నరేళ్ల కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అవి కూడా తక్కువ సంఖ్యలోనే పోస్టుల భర్తీ జరగడంతో ఆశావాహులకు నిరాశ మిగిలింది.
2014లో ఇచ్చిన నోటిఫికేషన్‌తో చంద్రబాబు ప్రభుత్వ సమయంలో నియామకాలు జరగ్గా.. అనంతరం 2018లో 7,325 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నియామకాలు పూర్తిచేశారు.
అంతకుముందు 2006 నుంచి 2012 మధ్య మూడు నోటిఫికేషన్లు వచ్చాయి. దాదాపు 80వేల మంది కొత్త ఉపాధ్యాయులు వచ్చారు. కానీ ఆ తర్వాత కేవలం రెండు నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా ఉపాధ్యాయ ఆశావాహులు మాత్రమే కాకుండా, ఆ వృత్తిలో అడుగుపెడదామనుకున్న వారి ఆశలపై కూడా నీళ్లు జల్లినట్టయింది.

జాబ్ క్యాలెండర్‌లో కూడా లేదు..
ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఖాళీ టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని ఏపీలో వైసీపీ హామీ ఇచ్చింది. పైగా త్వరలో మెగా డీఎస్సీ అంటూ చాలాకాలంగా ఆయా ప్రభుత్వాల్లో విద్యాశాఖ మంత్రుల నుంచి ఊరించే ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి.
కానీ, ఈ ఏడాది జూన్ 18న విడుదల చేసిన జాబ్ కాలెండర్ లో ఉపాధ్యాయ పోస్టుల ప్రస్తావన లేదు. దాంతో డీఎస్సీ ఆశావాహులు అనేక చోట్ల ఆందోళనకు దిగారు. పలు జిల్లాల్లో పెద్ద స్థాయిలో నిరసనలు సాగాయి.
"ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని అనుకున్నాం. చంద్రబాబు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశారు. జగన్ వస్తే మేలు జరుగుతుందని భావించాం. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందోనని ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్ల కోసం అప్పులు చేసి ఖర్చు చేశాం. కానీ జాబ్ క్యాలెండర్ లో మాకు చోటు ఇవ్వలేదు. ఈ పోస్టుల కోసం సుమారు 2 లక్షల మంది ఎదురు చూస్తున్నారు'' అని ఉపాధ్యాయ పోస్టు కోసం ఎదురు చూస్తున్న ఎం.మహేశ్ బీబీసీతో అన్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆయన 2019లో బీఈడీ పూర్తి చేయగా, మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

‘ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నా’
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశమంతా ప్రైవేటు విద్యాసంస్థపై ప్రభావం పడింది. అందులోనూ బడ్జెట్ స్కూళ్లకు సిబ్బంది వేతనాలు పెద్ద భారమయ్యాయి. ఫలితంగా అనేక చోట్ల తొలగింపులు, దాదాపుగా అందరికీ వేతనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ ప్రైవేటు ఉపాధ్యాయుల విషయంలో కూడా ప్రభుత్వాలు ఎలాంటి సహాయం అందించకపోవడంతో ఆ వర్గం తీవ్రంగా సతమతమైంది.
"వస్తే గవర్నమెంట్ పోస్టు, లేదంటే ప్రైవేటు టీచర్ గా పనిచేసినా బీఈడీ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. బీఈడీ కోసం రూ. 1.5లక్షలు ఖర్చు చేశాను. సర్టిఫికెట్ వచ్చింది గానీ నోటిఫికేషన్లు లేక గడిచిన ఆరేళ్లుగా ప్రైవేటు స్కూల్లో పని చేస్తున్నాను.
బీఈడీ పూర్తి చేసిన తర్వాత ఒక్కసారే నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా తక్కువ పోస్టులు. దాంతో ప్రైవేటు స్కూల్లో బీఈడీ ఉన్న వారికి రూ. 16 వేలు వరకు జీతం ఇస్తుండడంతో సంతృప్తి పడ్డాను. తీరా లాక్‌డౌన్‌లో స్కూళ్లు మూతపడడం, ఆన్‌లైన్ చదువుల కారణంగా మాలాంటి వారిని తొలగించారు. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నా'' అని గుంటూరుకి చెందిన మండవ ప్రసన్నకృష్ణ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీఈడీ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరం
కొన్నేళ్ల కిందట బీఈడీ కాలేజీలు ఓ వెలుగు వెలిగాయనే చెప్పవచ్చు. ఇందులో సీటు కోసం చాలామంది పోటీ పడేవారు. కన్వీనర్ సీట్లు భర్తీ అయిన తర్వాత మేనేజ్‌మెంట్ సీట్లకు చాలా పెద్ద మొత్తం చెల్లించాల్సి వచ్చేది. లక్షల రూపాయలు ఫీజులుగా వసూలు చేసిన బీఈడీ కాలేజీలు కూడా ఉన్నాయి. డీఎడ్ కాలేజీలది కూడా దాదాపు అదే పరిస్థితి.
కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు బీఈడీ కాలేజీలలో ఉన్న సీట్లు కూడా భర్తీ కావడం లేదని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని చోట్ల బీఈడీ కాలేజీలు మూతపడ్డాయి. వాటిని వివిధ అవసరాల కోసం మళ్లించారు.
"బీఈడీకి బాగా డిమాండ్ ఉన్న సమయంలో కాలేజీ పర్మిషన్ కోసం చాలా ప్రయత్నాలు చేశాం. రెండు, మూడు బ్యాచులు బాగానే నడిచాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులయ్యింది. కాలేజీలో చేరేవాళ్లే కనిపించడం లేదు. దాంతో ఇప్పుడు బీఈడీ క్లాసులు ఆపేశాం.
రాష్ట్రంలో సుమారు 80 కాలేజీలు మూతపడ్డాయి. 340 కాలేజీలకు అనుమతి ఉన్నప్పటికీ నడిచేవి అందులో కొన్నే. డీఎడ్ కాలేజీలది కూడా అదే పరిస్థితి.
విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరకపోవడంతో బీఈడీ కాలేజీలు మూతవేసి వాటిని పౌల్ట్రీ ఫారాలుగా మార్చేసిన వాళ్లు కూడా ఉన్నారు" అంటూ సెయింట్ మేరీస్ విద్యాసంస్థలకు చెందిన జాన్ వెస్లీ బీబీసీతో అన్నారు.
ఒకప్పుడు డీఎస్సీతో పాటుగా బీఈడీ ఎంట్రన్స్ టెస్టు కోసం కూడా కోచింగ్ సెంటర్లు ఉండేవని పోటీ పరీక్షల శిక్షకుడు ఎ. శ్రీనివాసరెడ్డి తెలిపారు.
అవనిగడ్డకు చెందిన ఆయన ప్రస్తుతం డీఎస్సీ కోచింగ్ సెంటర్లకు కూడా స్పందన కనిపించడం లేదన్నారు. త్వరలో డీఎస్సీ వస్తుందనే ఆశాభావంతో కొందరు మాత్రం కోచింగ్ లో కొనసాగుతున్నట్టు తెలిపారు.

నూతన విద్యావిధానంతో ఉన్న పోస్టులకే ఎసరు
"ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యావిధానం అమలు చేస్తున్నారు. ఫలితంగా స్కూళ్ల వర్గీకరణ జరుగుతోంది. ఫౌండేషన్, ప్రీ ప్రైమరీ అంటూ స్కూళ్లు మార్చేస్తున్నారు. తద్వారా అంగన్ వాడీలను కూడా టీచర్ల సంఖ్యలో చూపించేందుకు యత్నిస్తున్నారు. కొన్ని స్కూళ్లు మూతపడబోతున్నాయి. అప్పుడు ఖాళీ పోస్టులు కనిపించవు, ప్రస్తుతం 65వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. ఇది ఉపాద్యాయ ఆశావాహులకు తీరని నష్టం. అంతేగాకుండా భవిష్యత్తులో ఉపాధ్యాయుల మీద పెను భారం పడబోతోంది". అంటూ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ బీబీసీతో అన్నారు.
రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు
‘ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’
" బీఈడీ కాలేజీల నిర్వహణలో సమస్యలున్నట్టు గుర్తించాం. విద్యార్థులు బీఈడీ వంటి కోర్సుల వైపు రావడం తగ్గిందనేది వాస్తవం. కానీ మళ్లీ నియామకాలు జరిగితే ఈ కోర్సులకు ఆదరణ దక్కుతుంది. డీఎస్పీ విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటికే జాబ్ కాలెండర్ సహా వివిధ నియామకాలు జరుగుతున్నాయి'' అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
నూతన విద్యావిధానానికి అనుగుణంగా పాఠశాలల విభజన తర్వాత కొత్తగా టీచర్ పోస్టుల నియామకాలు జరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఒకప్పుడు ఏటా 40,50 వేల మంది బీఈడీ అర్హతలు సాధించేవారు ఉంటే, ప్రస్తుతం వారి సంఖ్య 10వేలకు పరిమితమైంది.
డీఎస్సీ నోటిఫికేషన్లు రాకపోతే ఇక రానురాను ఈ కోర్సుకి ఆదరణ మరింత పడిపోయే ప్రమాదం ఉంటుది. అందుకే నాడు-నేడు అంటూ స్కూళ్ల రూపురేఖలు మార్చే యత్నంలో ఉన్న ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీతో విద్యావ్యవస్థ మెరుగుపరిచే యత్నం చేయాలని అంతా కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘చైనా ఫోన్లు కొనకండి, మీ దగ్గరున్నవి వీలైనంత త్వరగా పడేయండి’
- అమెరికాలో మోదీ కలవబోతున్న ఐదు కంపెనీల సీఈవోలు ఎవరు, ఈ సమావేశాలు ఎందుకంత కీలకం?
- ‘ప్రపంచంలో కరోనావైరస్ చేరని దేశం మాదే’ అంటున్న తుర్క్మెనిస్తాన్, నిజమెంత?
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, పొందడం ఎలా?
- విశాఖలో కుక్కల పార్కుపై వివాదమేంటి? వద్దంటున్నదెవరు, కావాలనేదెవరు
- 'కన్యాదానం' అమ్మాయిలకే ఎందుకు? భారతీయ సంప్రదాయాలను సవాలు చేస్తున్న ప్రకటనలు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లకు ఇప్పుడు ఐఎస్ శత్రువుగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












