‘ప్రపంచంలో కరోనావైరస్ చేరని దేశం మాదే’ అంటున్న తుర్క్‌మెనిస్తాన్, నిజమెంత?

దేశాధ్యక్షుడు గుర్‌బంగూలి బెర్దీముఖమేదోవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెర్దీముఖమెదోవ్ తన పాలనా కాలాన్ని 'శక్తి, సంతోషాల శకం'గా ప్రకటించారు.
    • రచయిత, అబ్దు జలీల్ అబ్దురసులోవ్
    • హోదా, బీబీసీ న్యూస్

సయాహత్ కుర్బనోవ్‌కు (పేరు మార్చాం) ఊపిరి ఆడటం లేదు. మారథాన్‌లో పరుగు పెట్టినప్పుడు మాదిరిగా ఆయన ఊపిరి తీసుకోవడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. గుండెలో భరించలేనంత నొప్పి వస్తోంది. ఆయనకు కరోనావైరస్ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి.

కానీ, తుర్క్‌మెనిస్తాన్‌లో సమస్య ఏంటంటే, ఆయనలాగా ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలు అధికారికంగా నమోదు కావడం లేదు.

ఆయన ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతూ అంబులెన్స్‌ని పిలిచినప్పుడు, న్యుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయని, వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని డాక్టర్ సలహా ఇచ్చారు. ఆ దేశంలో డాక్టర్లు కరోనావైరస్‌ను న్యుమోనియాలా పరిగణిస్తున్నారని కుర్బనోవ్‌కు తెలుసు.

ఆయన ఆసుపత్రికి వెళ్లే దారిలో కుర్బనోవ్ అంతకు ముందు కోవిడ్ పరీక్ష చేయించుకున్న క్లినిక్‌కు కాల్ చేశారు. ‘అవును పాజిటివ్’ అంటూ నెమ్మదిగా చెబుతున్న మాటలు నాకు వినిపించాయి. ఏమిటి పాజిటివ్ , కోవిడ్ వచ్చిందా అని గట్టిగా అడగగానే, అటునుంచి అవుననే సమాధానం వచ్చింది" అని కుర్బనోవ్ చెప్పారు.

కానీ, తుర్క్‌మెనిస్తాన్‌లో పాజిటివ్ వస్తే ఆ విషయాన్ని కాగితం పై రాసి మాత్రం ఇవ్వరని ఆయనకు తర్వాత అర్ధమయింది. ఆయన చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రి రోగులతో నిండిపోవడంతో ఆయనను చేర్చుకోవడానికి అంగీకరించలేదు.

"నాకు దారిలోనే ప్రాణం పోయినట్లు అనిపించింది" అని కుర్బనోవ్ అన్నారు.

"గాలి అందడం లేదు. వైరస్ చాలా త్వరగా వ్యాపించింది. నేను అంబులెన్స్ కిటికీని గట్టిగా కొట్టి, ‘ఊపిరి తీసుకోలేకపోతున్నాను, ఆపండి’ అని గట్టిగా అరిచాను. వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చారు కానీ, అది పెద్దగా ఉపయోగపడలేదు" అని వివరించారు.

తుర్క్‌మెనిస్తాన్‌ రాజధాని అష్గాబాట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోని రోగులను తీసుకోవడం నిషేధం కావడంతో, మరొక ఆసుపత్రి వాళ్ళు కూడా ఆయనను చేర్చుకోలేదు.

"నాకు వణుకు పుట్టడం మొదలయింది. నేనిప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చనిపోవాలా?" అని డాక్టర్ ను అడిగాను.

చివరకు ఆయనకు తెలిసిన ఒక డాక్టర్‌కు కాల్ చేసి సహాయం కోసం అడిగారు. చాలా ఫోన్ కాల్స్ , వాదనల తర్వాత చివరకు ఒక ఆసుపత్రిలో ఆయనకు అడ్మిషన్ లభించింది.

కానీ, మరొక అయిదు రోజుల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ రాలేదు.

"నేను ఊపిరి తీసుకోలేకపోయాను. నా లోపల ప్రతీ భాగం అతుక్కుపోయినట్లు అనిపించింది. ఊపిరి అందకపోవడంతో భయంతో నాకు పానిక్ అటాక్ లు వచ్చాయి. నీటి లోపలికి వెళ్ళాక అక్కడ చిక్కుకుపోయి, బయటకు రాలేకపోయినట్లుగా అనిపించింది" అని ఆయన తాను పడిన వేదనను గుర్తు చేసుకున్నారు.

ఈ బాధ నుంచి ఉపశమనానికి ఏదైనా ఇమ్మని ఆయన నర్సుల పై అరిచేవారు. ‘‘చికిత్స తీసుకునేందుకు ఆసుపత్రిలో చేరడం కూడా తుర్క్‌మెనిస్తాన్‌లో అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు" అని కుర్బనోవ్ చెప్పారు.

"సాధారణంగా డాక్టర్లు రోగుల గురించి పట్టించుకోరు, ఎవరో పై అధికారులు ఆసుపత్రి అధికారులకు కాల్ చేసి చెబితే గాని, నర్సులు కూడా రోగులను చూసుకోరు" అని చెప్పారు.

కెమాల్ ఉకున్

ఫొటో సోర్స్, Turkish government

ఫొటో క్యాప్షన్, కెమాల్ ఉకున్

అసౌకర్యాలు-అపరిశుభ్రత

"ఆసుపత్రిలో తగినంత మంది సిబ్బంది కూడా లేరు. 60 మంది రోగులను చూసుకోవడానికి కేవలం ఇద్దరే నర్సులు ఉన్నారు. ఒక్కొక్కసారి ఆసుపత్రి శుభ్రం చేసే సిబ్బంది కూడా ఇంజెక్షన్లు చేస్తున్నారు" అని కుర్బనోవ్ చెప్పారు.

ఆక్సిజన్ మెషీన్లు పని చేయక, వెంటిలేటర్లు లేక తమ కళ్ళ ముందే పడిపోతూ ప్రాణాలు కోల్పోతున్న వారి కథల గురించి నర్సులు చెబుతున్నారు. కుర్బనోవ్ కు చేసే చికిత్సను కూడా డాక్టర్లు చాలా సార్లు మార్చారు.

ఆయన చికిత్స కోసం మందులకు, లంచాలకు సుమారు 2000 డాలర్లు ఖర్చు పెట్టారు. ఇది తుర్క్‌మెనిస్తాన్‌ కరెన్సీలో చాలా పెద్ద మొత్తం. ఆయనను 10 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

తుర్క్‌మెనిస్తాన్‌లో ఉన్న విదేశీ మీడియా సంస్థలు ఇక్కడ మొదలైన మూడవ వేవ్ ఇన్ఫెక్షన్ల గురించి రిపోర్ట్ చేస్తున్నాయి, కానీ, ఆ దేశంలో మాత్రం ఈ విషయం గురించి మాట్లాడటానికి ప్రతీ ఒక్కరూ భయపడుతున్నారు.

మహమ్మారి మొదలైనప్పటి నుంచీ 60 మందికి పైగా కరోనావైరస్ బారిన పడి మరణించినట్లు ది తుర్క్ మెన్.న్యూస్ వెబ్ సైట్ పేర్కొంది.

కరోనా కేసులు నమోదవుతున్నట్లు తుర్క్ మెన్ అధికారులు వెల్లడించరు. దేశాధ్యక్షుడు గుర్‌బంగూలి బెర్దీముఖమేదోవ్ తమ దేశం ఆరోగ్యకరమైన దేశంగా నిలిచిందనే ప్రతిష్టను ప్రచారం చేసుకోవడానికి చూస్తారు. ఆయన మాజీ దంత వైద్యుడు.

తమ దేశం మహమ్మారి బారిన పడిందని అంగీకరిస్తే, ఆయన పాలన తీరు పై ప్రభావం చూపిస్తుందేమోననే సందేహాలున్నాయి. కానీ, గతేడాది నమోదయిన ఒక్క కేసు ఈ మొత్తం వ్యవహారాన్ని బయటకు తెచ్చింది.

అష్గాబాట్‌లో ఉన్న ఒక టర్కీ రాయబారి కెమాల్ ఉకున్ అనారోగ్యం పాలయ్యారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. గుండెలో నొప్పి, చెమట్లు పట్టడం, జ్వరం వచ్చాయి. డాక్టర్లు ఆయనకు న్యుమోనియా అని తేల్చారు.

కానీ, ఆయన భార్య గుజీడ్ ఉకున్ తన భర్త ఎక్స్‌రేలను టర్కీలో ఆసుపత్రులకు పంపించారు. వారంతా ఆయనకు కోవిడ్ అని తేల్చారు.

ఆయనను టర్కీ తీసుకుని వెళ్లాలని ఆమె చాలా ప్రయత్నించారు. కానీ, ఆయనను తీసుకుని వచ్చేందుకు వైద్య పరికరాలతో కూడిన విమానాన్ని పంపేందుకు టర్కీ అధికారులు అంగీకరించలేదు. ఆయన మరణించిన కొన్ని గంటల తర్వాత వారికి అనుమతి లభించింది.

ఆయన శరీరాన్ని ఎంబాల్మ్ చేసిన తర్వాత ఆయన శరీరం పై కరోనావైరస్ సోకిన ఛాయలు కనిపించలేదని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు.

ఫార్మసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫార్మసీ

కరోనా లేదంటున్న ప్రభుత్వం

ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తుర్క్‌మెన్ అధికారులు కొన్ని క్వారంటైన్ చర్యలు చేపట్టారు. తాము తీసుకున్న చర్యల వల్లే దేశం కోవిడ్ రహిత దేశంగా ఉందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

కుర్బనోవ్ చికిత్స తీసుకున్న ఆసుపత్రిలో కూడా ఎక్కడా కోవిడ్ అనే పదాన్ని వాడలేదు. "ఈ వైరస్, ఈ రోగం అనే అనేవారు" అని ఆయన చెప్పారు.

"అసలైన జబ్బేమిటో ఎందుకు చెప్పరని నేను వాళ్ళను బలవంత పెట్టేవాడిని. ఇది కోవిడేనా అని అడిగేవాడిని. వారు నెమ్మదిగా తలాడించేవారు" అని చెప్పారు.

కుర్బనోవ్ ఆసుపత్రిలో ఉండగా గాలిలో దుమ్ము ఉండటం వల్ల ప్రజలంతా ముఖానికి మాస్కు వేసుకోవాలని చెబుతూ ప్రభుత్వం చేసిన వైద్య హెచ్చరిక సందేశం వచ్చింది.

"మనం ధూళి వల్ల చచ్చిపోతున్నామా? అని ఆయన ప్రశ్నించారు. "ప్రజలను చావనిస్తారుగానీ, కోవిడ్ ఉందని మాత్రం వాళ్లు ఎప్పటికీ అంగీకరించరు" అని కుర్బనోవ్ అన్నారు.

Presentational grey line
తుర్క్‌మెనిస్తాన్ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘అడవి మూలికలతో పొగ వేస్తే ‘వంద రోగాలు’ పోతాయి’’

కరోనావైరస్ తమ దేశంలో లేదని, తమది కరోనావైరస్ లేని దేశమని ప్రకటించుకున్న తుర్క్‌మెనిస్తాన్‌లో గత కొంత కాలంగా అడవి మూలికల (స్థానికంగా యుజెర్లిక్ అని పిలుస్తుంటారు) అమ్మకాలు, వినియోగం మాత్రం బాగా పెరిగాయి.

ఔషధ గుణాలు ఉన్నాయని భావించే ఈ మూలికలను ఎన్నో దశాబ్దాలుగా తుర్క్‌మెనిస్తాన్‌తో పాటు ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని పలు దేశాల్లో కూడా ఉపయోగిస్తుంటారు.

నిర్ధిష్ట పద్ధతిలో కనుక ఈ అడవి మూలికలను కాల్చి, ఇంట్లో పొగ వేస్తే.. దాని ధాటికి బ్యాక్టీనియా చనిపోతుందని దేశాధ్యక్షుడు గుర్‌బంగూలి బెర్దీముఖమేదోవ్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)