చైనా ఫోన్లు కొనకండి, కొన్నవి విసిరికొట్టండి-ప్రజలకు లిథువేనియా ప్రభుత్వ హెచ్చరిక

షియోమీ 10టి అనే మోడల్‌లో పదాలను సెన్సార్‌ చేసే యాప్‌లు ఉన్నాయని లిథువేనియా అంటోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షియోమీ 10టి అనే మోడల్‌లో పదాలను సెన్సార్‌ చేసే యాప్‌లు ఉన్నాయని లిథువేనియా అంటోంది

లిథువేనియా రక్షణ శాఖ ఇటీవల తమ దేశ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసింది.

'చైనా తయారు చేసే ఫోన్‌లను ఎవరూ కొనొద్దు. ఒకవేళ ఇప్పటికే కొన్నా వాటిని పడేయండి' అన్నది ఆ హెచ్చరిక సారాంశం.

దేశ భద్రతకు, యూజర్ డేటాకు చైనా ఫోన్‌లలో రక్షణ లేదని ఆ దేశం చెబుతుండగా, అలాంటి ఇబ్బంది ఏమీ లేదని కొన్ని చైనా టెక్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

చైనా కంపెనీకి చెందిన 5జీ మొబైల్‌లను లిథువేనియా నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ పరీక్షించి ఒక నివేదిక విడుదల చేసింది.

షియోమీ ఫోన్‌లో అంతర్నిర్మిత సెన్సార్‌షిప్ టూల్స్ ఉన్నాయని, హువావే కంపెనీకి చెందిన మరో మోడల్ ఫోన్‌ సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.

అయితే యూజర్ల డేటా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లదని హువావే పేర్కొంది.

"కొత్త చైనీస్ ఫోన్‌లను కొనుగోలు చేయొద్దు, ఇప్పటికే కొనుగోలు చేసిన వాటిని సాధ్యమైనంత వేగంగా వదిలించుకోండి" అని డిఫెన్స్ డిప్యూటీ మినిస్టర్ మార్గిరిస్‌ అబూకెవిసియస్ అన్నారు.

సెన్సార్‌షిప్ పై షియోమీ కంపెనీ స్పందించ లేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెన్సార్‌షిప్‌పై షియోమి కంపెనీ స్పందించ లేదు.

సెన్సార్‌షిప్

షియోమి ఫ్లాగ్‌షిప్‌ ఎంఐ 10టీ అనే 5జీ ఫోన్‌లో "ఫ్రీ టిబెట్", "లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్‌" లేదా "డెమొక్రసీ మూమెంట్‌" వంటి పదాలను గుర్తించి, సెన్సార్ చేయగల సాఫ్ట్‌వేర్‌ని కనుగొన్నట్టు నివేదికలో పేర్కొన్నారు.

ఇది డిఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్‌తో సహా షియోమి ఫోన్ సిస్టమ్ యాప్‌లు, సెన్సార్ చేయగల 449 కంటే ఎక్కువ పదాలను హైలైట్ చేసింది.

యూరోప్‌లో ఈ సెన్సార్‌షిప్ చేయగల యాప్‌లను పని చేయకుండా చేశారని, కానీ ఎప్పుడైనా రిమోట్‌గా వాటిని యాక్టివేట్ చేయవచ్చని రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ విషయంపై మాట్లాడేందుకు బీబీసీ షియోమీ కంపెనీని సంప్రదించగా వారు స్పందించలేదు.

షియోమీ ఫోన్‌లోని పరికరం ఎన్‌క్రిప్ట్ చేసిన ఫోన్ యూజర్ డేటాను సింగపూర్‌లోని సర్వర్‌కు బదిలీ చేస్తున్నట్లు పరిశోధనలో తేలింది.

"ఇది లిథువేనియాకు మాత్రమే కాకుండా షియోమీ పరికరాలను ఉపయోగించే అన్ని దేశాలకు కీలకం" అని ఆ దేశ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది.

షియోమీ కంపెనీ ఫోన్‌లు తక్కువ ధరలతో పాపులర్ అయ్యాయి. ఒక సంవత్సరం క్రితం కంటే రెండవ త్రైమాసికంలో దాని ఆదాయం 64శాతం పెరిగింది.

యూజర్ల డేటాకు రక్షణ ఉందని హువావే చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూజర్ల డేటాకు రక్షణ ఉందని హువావే చెబుతోంది.

హువావే పీ40

ఈ నివేదిక హువావే పీ40 అనే 5జీ ఫోన్‌లో లోపాలను కూడా ప్రస్తావించింది. ఇది కస్టమర్ల సైబర్-సెక్యూరిటీని ఉల్లంఘిస్తోందని పేర్కొంది.

"అధికారిక హువావే అప్లికేషన్ స్టోర్ యాప్‌ గ్యాలరీ వినియోగదారులను థర్డ్ పార్టీ ఈ-స్టోర్‌లకు వెళ్లేలా చేస్తుంది. ఇక్కడ కొన్ని అప్లికేషన్‌లు యాంటీ-వైరస్ ప్రోగ్రామ్‌ల ద్వారా హానికరమైన వైరస్‌ను చొప్పిస్తున్నట్లు గుర్తించాం" అని లిథువేనియన్ రక్షణ మంత్రిత్వ శాఖ, లిథువేనియా నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

అయితే, తమ ప్రోడక్ట్‌లు అమ్ముతున్న దేశాల చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉంటామని, సైబర్-సెక్యూరిటీ, గోప్యతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు హువావే ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.

"హువావే ఫోన్ల నుంచి యూజర్ల డేటా బయటకు వెళ్లే ప్రసక్తే లేదు" అని ఆ అధికారి తెలిపారు.

"యాప్‌ గ్యాలరీ తన కస్టమర్‌లను ఇతర యాప్ స్టోర్‌ల మాదిరిగానే థర్డ్-పార్టీ యాప్‌లను సెర్చ్ చేయడానికి, ఇన్‌స్టాల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అనుమతించడానికి అవసరమైన డేటాను మాత్రమే సేకరిస్తుంది" ఆయన అన్నారు.

వినియోగదారులు సురక్షితంగా ఉండే యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసేలా నిర్ధారించుకోవడానికి హువావే సెక్యూరిటీ చెక్‌లు నిర్వహిస్తుందని వెల్లడించారు.

వన్‌ ప్లస్‌కి చెందిన 5జీ మోడల్‌ను కూడా లిథువేనియా రక్షణ బృందం పరిశీలించింది. కానీ ఇందులో ఎలాంటి సమస్యలను గుర్తించలేదు.

లిథువేనియా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక వచ్చింది.

''మీ రాయబారిని బీజింగ్ నుంచి వెనక్కి పిలిపించండి'' అంటూ గత నెలలో లిథువేనియాకు చైనా సూచించింది. లిథువేనియా నుంచి తన రాయబారిని ఉపసంహరించుకుంటామని చైనా చెప్పింది.

లిథువేనియాలో తన కార్యకలాపాలను తైవానీస్ ప్రతినిధి కార్యాలయం నుంచి చేస్తామని తైవాన్ ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది.

తైవాన్‌ను చైనా భూభాగంగా చెప్పకుండా ఉండేందుకు యూరోప్‌, యునైటెడ్ స్టేట్స్‌లోని ఇతర తైవానీస్ రాయబార కార్యాలయాలు కూడా తైవాన్ రాజధాని తైపీ పేరునే వాడుతున్నాయి. దీనిపై చైనా ఆగ్రహంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)