తబ్లీగీ జమాత్ మర్కజ్: కరోనా వ్యాప్తి చేస్తున్నారంటూ ఏడాది క్రితం పెట్టిన కేసులు ఏమయ్యాయి.. కోర్టులేం చెప్పాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్రరావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దాదాపు ఏడాది క్రితం దేశవ్యాప్తంగా తబ్లీగీ జమాత్ మర్కజ్ పేరు మారుమోగిపోయింది.
భారత్‌లో కోవిడ్‌ను వ్యాప్తి చేస్తున్నారంటూ దిల్లీ పోలీసులు తబ్లీగీ జమాత్ సభ్యులపై కేసులు పెట్టారు.
కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు వద్ద మతపరమైన కార్యక్రమం నిర్వహించినందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అప్పట్లో ఈ కార్యక్రమానికి హాజరైన 24 మందిని కోవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించారు.
దాంతో మర్కజ్ కరోనా హాట్‌స్పాట్‌గా మారింది.
మర్కజ్‌కు హాజరైన 955 మంది విదేశీయులపై పలు చట్టాల కింద దిల్లీ క్రైమ్ బ్రాంచ్ కేసులు నమోదు చేసింది.
వీరంతా టూరిస్ట్ వీసా మీద ఇండియాకు వచ్చి మర్కజ్‌లో పాల్గొన్నారని దిల్లీ పోలీసులు ఆరోపించారు.
ఈ విదేశీయులంతా వీసా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారని, మర్కజ్‌కు హాజరైనవారికీ, సాధారణ ప్రజలకూ కూడా ముప్పు కొనితెచ్చారని పోలీసులు ఆరోపించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను గుర్తించిన వెంటనే తబ్లీగీ జమాత్ సభ్యులు దేశంలో కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారని ప్రభుత్వం ఆరోపించింది.
ఈ సంఘటన దేశంలో కలకలం సృష్టించింది. మర్కజ్‌కు హాజరైనవారిని వెతికి పట్టుకుని క్వారంటైన్‌కు పంపేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి.
ఈ సంఘటన జరిగి ఏడాది కావొస్తోంది.
అసలు తబ్లీగీ జమాత్‌కు హాజరైన వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి? ఇప్పుడు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
వాస్తవాలేంటి?
955 మంది విదేశీయులను దిల్లీలో విచారించారు. వీరిలో 911 మంది 'ప్లీ బార్గైన్' (కేసుపై అభ్యర్థన) చేసి తమ తమ దేశాలకు వెళ్లిపోయారు.
ప్లీ బార్గైన్ అంటే ప్రాసిక్యూటర్‌కు, ప్రతివాదికి మధ్య జరిగే ఒక ఏర్పాటు.
ఇందులో ప్రతివాది తనపై వచ్చిన ఒక చిన్న అభియోగానికి నేరాన్ని అంగీకరిస్తారు. దానికి బదులుగా ఆ వ్యక్తిపై మోపిన మిగతా పెద్ద పెద్ద ఆరోపణలన్నిటినీ తొలగిస్తారు లేదా వాటికి కఠిన శిక్షలు విధించరు.
మిగిలిన 44 మంది తమపై మోపిన కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు.
వీరిలో ఎనిమిది మందిపై పెట్టిన కేసులకు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ముందే వారిపై కేసులు కొట్టివేశారు.
మిగిలిన 36 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులే కాకుండా దిల్లీలోని ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా 29 కేసులు నమోదు చేశారు. వీటన్నిటినీ దిలీ హైకోర్టు సాకేత్ కోర్టుకు బదిలీ చేసింది.
వీటిలో కొన్ని కేసులను కొట్టివేయాలనే పిటిషన్ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది. అందుకే వీటి విషయంలో ట్రయల్ కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఈ 29 కేసులలో ప్రస్తుతం 13 కేసుల విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 51 మంది భారత పౌరులు ఈ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఈ 29 కేసుల్లో ఉన్న 193 విదేశీయులు క్రైమ్ బ్రాంచ్ ప్రకారం మర్కజ్‌లో పాలుపంచుకున్నవాళ్లేనని తబ్లీగీ జమాత్ తరపు న్యాయవాది అషిమా మండ్లా తెలిపారు.
"ఆరోజు వాళ్లను మర్కజ్‌లోనే పట్టుకున్నారని క్రైమ్ బ్రాచ్ చెప్తోంది. మరి వాళ్లంతా అదే రోజు వేర్వేరు మసీదుల్లో కనిపించారని చెబుతూ వారిపై మళ్లీ ప్రత్యేక కేసులు నమోదు చేయడం ఎలా సాధ్యమని మేము కోర్టును అడిగాం" అని అషిమా తెలిపారు.
ప్లీ బార్గైన్ కింద తబ్లీగీ జమాత్ వాళ్లు దిల్లీ హైకోర్టుకు రూ.55 లక్షల జరిమానా చెల్లించారు.
అందులో రూ.20 లక్షలు పీఎం కేర్ ఫండ్‌కు చేరాయని అషిమా చెప్పారు.
"గత డిసెంబర్‌లో తబ్లీగీ జమాత్ సభ్యులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఇంతవరకూ ప్రభుత్వం ఏ రకమైన అప్పీల్ చేయలేదు. నిర్దోషులుగా ప్రకటించిన వారిపై ఆరు నెలల వరకూ మళ్లీ ఏ అప్పీల్ రాకపోతే వారిపై కేసు పూర్తిగా కొట్టేస్తారు" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ఈ విషయంపై వివిధ కోర్టులు ఏం చెప్పాయి?
ఈ కేసుల్లో 29 మంది విదేశీ పౌరులను, ఆరుగురు భారతీయులను బలి పశువులను చేశారని, అన్యాయంగా వారిపై కేసులు నమోదు చేశారని చెప్తూ గత ఏడాది ఆగస్ట్‌లో ముంబై హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ ధర్మాసనం ఆ కేసులను కొట్టివేసింది.
పౌరసత్వ సవరణ చట్టం కింద వీరికి వ్యతిరేకంగా నమోదు చేసిన కేసులు దేశంలోని ముస్లింలను పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తున్నాయని తెలిపింది.
"ఇటీవల దేశంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత దుర్వినియోగం అవుతున్నాయి" అని తబ్లీగీ జమాత్ కార్యక్రమం మీడియా కవరేజ్‌పై వేసిన పిటీషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
తబ్లీగీ జమాత్ కేసుల విషయంలో మీడియాలో కొందరు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
2020 డిసెంబర్‌లో 36 మంది తబ్లీగీ జమాత్ సభ్యులను దిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు వీరు మర్కజ్‌లో ఉన్నారనడానికి సరైన సాక్ష్యాధారాలు లేనందు వల్ల వీరిపై కేసు కొట్టివేసినట్లు తెలిపింది.
2020 డిసెంబర్‌లో తబ్లీగీ జమాత్‌కు చెందిన ఒక యువ సభ్యుడిపై వేసిన కేసు విచారణ సందర్భంగా.. మర్కజ్‌లో పాల్గొన్న వ్యక్తిపై హత్యాయత్నం కేసు వేయడం చట్టాలను దుర్వినియోగం చేయడమేనని అలహాబాద్ హై కోర్టు వ్యాఖ్యానించింది.
2020 అక్టోబర్‌లో 20 మంది తబ్లీగీ జమాత్ సభ్యులను ముంబై హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై వేసిన కేసులకు సరైన సాక్ష్యాలు లేవని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మర్కజ్ మళ్లీ తెరుచుకుంటుందా?
గత ఏడాది కోవిడ్-19 కారణంగా మర్కజ్ మూసివేశారు.
మళ్లీ మర్కజ్ తలుపులు తెరిచేందుకు తబ్లీగీ జమాత్ ఎదురుచూస్తోంది.
అందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే, షాబ్-ఎ-బరాత్ సందర్భంగా నిజాముద్దీన్ మర్కజ్ వద్ద ఉన్న మసీదులో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎంపిక చేసిన 50 మంది సభ్యులను మాత్రమే ప్రార్థనలకు అనుమతించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దీనిపై దిల్లీ హైకోర్టు తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది.
మర్కజ్‌లో మసీదు, మదరసా, హాస్టళ్లను కూడా తెరవాలని దిల్లీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ వేసింది.

ఫొటో సోర్స్, REUTERS/DANISH SIDDIUI
తబ్లీగీ జమాత్ అంటే ఏంటి?
భారతదేశంలో 1926-27లో తబ్లీగీ జమాత్ ఆవిర్భవించింది.
దిల్లీ పక్కనే ఉన్న మేవాట్ ప్రాంత ప్రజలకు మతవిద్యను బోధించే ఉద్దేశంతో ఇస్లామిక్ పండితుడు మౌలానా మొహమ్మద్ ఇలియాస్ దీన్ని ప్రారంభించారు.
తబ్లీగీ జమాత్ మొదటి సమావేశం 1941లో ఇండియాలో జరిగింది. దీనికి 25 వేల మంది హాజరయ్యారు.
స్వాతంత్రానంతరం తబ్లీగీ జమాత్ శాఖలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు కూడా విస్తరించాయి.
ఆ తరువాత, జమాత్ పని వేగం పెంచడంతో ఈ కార్యక్రమం ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రస్తుతం దీని కేంద్రాలు 140 దేశాల్లో ఉన్నాయి.
తబ్లీగీ జమాత్‌కు చెందిన అతి పెద్ద కార్యక్రమం (జల్సా) ప్రతీ సంవత్సరం బంగ్లాదేశ్‌లో జరుగుతుంది.
పాకిస్తాన్‌లో కూడా వార్షిక సమావేశాలు నిర్వహిస్తారు.
ప్రపంచం నలుమూలలనుంచి లక్షలాదిమంది ముస్లింలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
భారతదేశంలో అన్ని పెద్ద నగరాల్లోనూ తబ్లీగీ జమాత్ మర్కజ్ ఉంది.
వీటిల్లో సంవత్సరం పొడుగునా మత విద్యాబోధన కొనసాగుతూ ఉంటుంది.
తబ్లీగీ జమాత్ అంటే ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యాప్తి చేసే సమూహం అని అర్థం.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









