గుజరాత్: 127 మంది ముస్లింలకు 20 ఏళ్ల తరువాత లభించిన 'న్యాయం'

హనీఫ్ భాయ్ వోరా
ఫొటో క్యాప్షన్, హనీఫ్ భాయ్ వోరా

నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్(SIMI) సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన 127 మంది ముస్లింలు నిర్దోషులని సూరత్‌లోని ఒక కోర్టు దాదాపు 20 ఏళ్ల తర్వాత గత శనివారం తీర్పు ఇచ్చింది.

ఈ కేసులో అరెస్టయిన వారిలో ఇప్పటికే ఐదుగురు చనిపోయారు. గుజరాత్ పోలీసులు వీరిని సూరత్‌లోని ఒక హోటల్‌లో అరెస్ట్ చేశారు. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం 1967ను ఉల్లంఘించినందుకు వీరందరినీ అరెస్ట్ చేశామని చెప్పారు.

ఈ కేసులో విచారణలు చేపట్టిన సూరత్‌లోని ఒక స్థానిక కోర్టు, నిందితులకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలు నిరూపించడానికి తగిన ఆధారాలు లేకపోవడంతో వారందరూ నిర్దోషులని తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిర్దోషులుగా విడుదలైన కొందరితో బీబీసీ మాట్లాడింది.

అసలు కేసు ఏంటి...

2001లో గుజరాత్‌లోని సూరత్‌లో మైనారిటీ వర్గాల విద్యకు సంబంధించి ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి భారత్‌లోని వివిధ రాష్ట్రాల వారు వచ్చారు. కానీ, వర్క్ షాప్ ప్రారంభమయ్యే ఒక రోజు ముందే వారందరినీ అరెస్ట్ చేశారు.

సిమీ కార్యకర్తలనే ఆరోపణలతో పోలీసులు తమను అరెస్ట్ చేశారని మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన జియావుద్దీన్ సిద్దిఖీ చెప్పారు.

"అప్పుడు మమ్మల్ని అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఎలాంటి సవరణా లేదు. మేం దాదాపు 11-13 నెలలు జైల్లో ఉన్నాం. తర్వాత హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. తర్వాత నుంచి తేదీ ముందుకు జరుగుతూ వచ్చింది" అన్నారు.

ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఈ తీర్పు వచ్చింది. ఏ చట్టం కింద మమ్మల్ని అరెస్ట్ చేశారో, ఆ చట్టం ప్రకారం అరెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం అని చెప్పింది,

అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం(సవరణ లేనిది) కింద ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. కానీ, ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేయడానికి అనుమతులు లభించాయి.

"పోలీసులు తమ ఫిర్యాదులో సెమినార్ రేపు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. అంటే, అప్పటికి ఎలాంటి కార్యకలాపాలూ జరగనపుడు, అవి చట్టవిరుద్ధం ఎలా అవుతాయి" అని డిఫెన్స్ వాదించింది.

ఈ విషయాలన్నీ పరిశీలించిన కోర్టు 127 మంది నిర్దోషులని తీర్పు ఇచ్చింది.

20 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా విడుదలైన ముస్లింలు

ఫొటో సోర్స్, NARESH SOLANKI

ఫొటో క్యాప్షన్, 20 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా విడుదలైన ముస్లింలు

20 ఏళ్ల తర్వాత విముక్తి

"మమ్మల్ని 2001లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మీడియా ట్రయల్ జరిగింది. సమాజంలో మమ్మల్ని ఏకాకిగా చేసేందుకు మాపై ఉగ్రవాదం, మతతత్వం, మంత్రగాళ్లని ఆరోపణలు చేశారు. జనం మాతో మాట్లాడాలన్నా భయపడిపోయేవారు" అని జియావుద్దీన్ చెప్పారు.

"మాలో కొంతమందిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. చాలామంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. పిల్లల చదువు పాడైంది. నేను ప్రతి నెలా ఇక్కడికి రావాల్సి వచ్చేది. అలా 20 ఏళ్లు జరిగిన తర్వాత, ఈరోజు కోర్టు మేము నిర్దోషులని చెప్పింది. మాపై ఆరోపణలు వచ్చినప్పుడు మేం నిర్దోషులమే, ఈరోజు కూడా మేం నిర్దోషులమే" అన్నారు.

"కానీ, ఈ వ్యవస్థకు మాది ఒకటే ప్రశ్న. ఈ 20 ఏళ్ల పాటు మేం ఎన్ని భరించామో, అవన్నీ ఎవరు తీరుస్తారు. ఎంత నష్టం జరగాలో జరిగిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎవరు పూడుస్తారు అంటారు జియావుద్దీన్.

"20 ఏళ్ల నుంచీ మాపై ఉగ్రవాదులని ఉన్న ఆరోపణలను కోర్టు కొట్టివేసింది బాగానే ఉంది. కానీ ఇన్నేళ్లూ మేం ఎన్ని భరించామో, అవెలా పోతాయి. జనం మమ్మల్ని బహిష్కరించారు. మాలో ఒక మంచి జర్నలిస్ట్ ఉండేవారు. కానీ, ఈ కేసు వల్ల ఆయన ఈరోజు చిన్నాచితకా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు" అన్నారు.

వ్యవస్థ మాపై వేసిన ఆ ముద్ర వల్ల మేం ఇప్పటికీ బాధితులమే. దాని నుంచి మాకు ఉపశమనం లభించడం సంతోషమే. కానీ, మాలాంటి నిర్దోషులకు శిక్షలు వేసి, 20 ఏళ్ల తర్వాత మీరు నిర్దోషులని ఈ వ్యవస్థ అనాలని మేం కోరుకోవడం లేదు. ఈరోజు మా ప్రశ్నలకు, మాకు సమాధానం కావాలి".

జియావుద్దీన్ సిద్దిఖీ
ఫొటో క్యాప్షన్, జియావుద్దీన్ సిద్దిఖీ

ఇప్పటికీ డిప్రెషన్ వెంటాడుతోంది

నిర్దోషులుగా విడుదలైన 127 మందిలో సూరత్‌లోని గోపీపురాలో ఉంటున్న హనీఫ్ భాయ్ వోరా కూడా ఒకరు.

"కార్యక్రమం గురించి ఒక ప్రకటన వచ్చింది. నేను కూడా దానిలో పాల్గొనాలని వెళ్లాను. పోలీసులు రాత్రి దాడులు చేశారు. అందరినీ అరెస్ట్ చేశారు. మమ్మల్ని వేరు వేరు పోలీస్ స్టేషన్లలో ఉంచారు. మా మీద ఆరోపణలు నమోదు చేశారు. పోలీసులు సీరియస్ కేసు పెట్టారని, దానిని ఎలా, ఎందుకు పెట్టారో కూడా నాకు తెలీదు" అని హనీఫ్ చెప్పారు..

అరెస్ట్ అయిన 10 నెలల తర్వాత హైకోర్ట్ 127 మందికి విడివిడిగా బెయిల్ ఇచ్చింది. సూరత్ కోర్ట్ వారికి ఎలాంటి బెయిల్ ఇవ్వలేదు.

హనీఫ్ 14 నెలలపాటు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటున్న సమయంలో ఆయన డిప్రెషన్‌కు గురయ్యారు. ఇప్పటికీ ఆ మంతులు వేసుకోకపోతే నిద్రపట్టదని చెప్పారు.

"నేను 14 నెలలు జైల్లో ఉన్నంత కాలం నా భార్య, పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు నా పిల్లలు చాలా చిన్నవాళ్లు. అప్పుడు నా వయసు 35 ఏళ్లు. ఇప్పుడు 55 వచ్చాయి. జైల్లో మానసిక సమస్యలు ఎదుర్కున్నాను. వడోదరా జైల్లో, సూరత్ సబ్ జైల్లో నాకు చికిత్స కూడా జరిగింది" అన్నారు.

"నాకు ఒక మంచి కన్‌స్ట్రక్షన్ బిజినెస్ ఉండేది. అది పూర్తిగా పాడవడంతో, ఆర్థిక స్థితి కూడా దిగజారింది. ఆ సమస్యల నుంచి బయటపడ్డానికి నాకు మూడేళ్లు పట్టింది. కానీ, మేము, మా కుటుంబాలు భరించిన ఆ మానసిక ఒత్తిడి చాలా భయంకరంగా ఉండేది" అని వోరా చెప్పారు.

కోర్టులు ఏం చెప్పాయి

ఫొటో సోర్స్, Getty Images

లాయర్లు ఏం చెబుతున్నారు

ఈ కేసులో డిఫెన్స్ తరఫున వాదించిన లాయర్ అబ్దుల్ వహాబ్ షేక్ బీబీసీతో మాట్లాడారు.

"సూరత్‌లోని రాజేశ్రీ హాల్లో కొంతమంది సిమీ కార్యకర్తలు గుమిగూడారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో, తెల్లవారుజామున రెండు గంటలకు పోలీసులు ఆ భవనంపై దాడులు చేశారు. అక్కడున్న అందరినీ అరెస్ట్ చేసి, కేసులు పెట్టారు. సిమీ నిషేధిత సంస్థ కావడంతో వారిపై అక్రమ కార్యకలాపాల చట్టం కింద ఆరోపణలు నమోదు చేశారు" అని చెప్పారు.

"అరెస్ట్ తర్వాత దాఖలు చేసిన చార్జిషీటుకు, కేంద్రం నుంచి అనుమతి తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అనుమతి కోరారు. అది చట్టవిరుద్ధం. తాము అరెస్టు చేసినవారందరూ సిమీకి చెందినవారు అని కూడా పోలీసులు నిరూపించలేకపోయారు" అని లాయర్ తెలిపారు.

జైల్లో ఏడాది గడిపిన తర్వాత 120 మందికి బెయిల్ వచ్చింది. ఏడుగురు నిందితులు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో సాక్ష్యుల నుంచి పోలీసుల వరకూ మొత్తం 27 మందిని విచారించారు.

బీబీసీ ఈ కేసు గురించి ప్రభుత్వం తరఫు వివరణ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ లాయర్ మయంక్ సుఖడ్‌వాలా దీనిపై మాట్లాడారు.

"మేం తీర్పును పరిశీలిస్తున్నాం. అపీల్ గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం. చార్జిషీటు దాఖలు చేసే విషయంలో జరిగిన దానిని బట్టి కోర్టు తన తీర్పు ఇచ్చింది. దీనిని పూర్తిగా పరిశీలించాక, తదుపరి చర్యల గురించి ఆలోచిస్తాం" అన్నారు.

చార్జిషీటు కాపీ

పోలీసులు ఏ చెప్పారు

ఒక పోలీసు ఫిర్యాదు ప్రకారం 2001లో దిల్లీ జామియానగర్‌లోని ఆల్ ఇండియా మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్డ్, మైనారిటీ వర్గాల విద్యా హక్కులకు రాజ్యాంగ మార్గదర్శకత్వం అందించే విషయమై సూరత్‌లోని రాజేశ్రీ హాల్లో రెండు రోజుల సదస్సు నిర్వహించింది.

ఈ సెమినార్‌లో భారత్‌లోని 10 రాష్ట్రాలకు చెందిన 127 మంది పాల్గొన్నారు.

సెమినార్ డిసెంబర్ 28న ప్రారంభం కావాల్సి ఉంది. డిసెంబర్ 27 రాత్రి పోలీసులు ఆ హాల్లోని 127 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టులు చేసిన తర్వాత వారి దగ్గరనుంచి 'సిమీ' సాహిత్యం కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

సిమీకి చెందిన ఒక మాజీ సబ్యుడు డిసెంబర్ 27-30 మధ్య సూరత్‌లో మతపరమైన సమావేశం నిర్వహించబోతున్నాడని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సిమీ కార్యకర్తలు అందులో పాల్గొంటారని కూడా తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు.

ఆల్ ఇండియా మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్డ్ దిల్లీ అడ్రస్‌లో అలాంటి కార్యాలయం ఏదీ లేదని కూడా పోలీసులు తమ దర్యాప్తులో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)