తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్: ‘ట్రాఫిక్ చలాన్ల పైసలు మొత్తం జీహెచ్ఎంసీ కట్టేలా చేస్తాం’

బండి సంజయ్

ఫొటో సోర్స్, Bandi sanjay

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం బీజేపీ సంచలన హామీ ఇచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారికి పోలీసులు విధించే జరిమానాలను, జీహెచ్ఎంసీయే చెల్లిస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.

అంతేకాదు, ట్రిపుల్ రైడింగ్ చేసే (ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్లడం) యువతను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటుందంటూ ఆయన విమర్శించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎవరూ జరిమానాలు చెల్లించడం లేదనీ, వారి దగ్గర నుంచి ప్రభుత్వం వసూలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

‘‘(ట్రాఫిక్) చలాన్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. యువకులు (బైక్‌పై) మగ్గురు ముగ్గురు పోయినా, రోడ్డు దాటినా... వాళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి చేపట్టిన తరువాత, భాగ్యనగరంలో చలాన్ల పైసలు మొత్తం జీహెచ్ఎంసీయే కట్టేలా చర్యలు తీసుకుంటాం. మొత్తం చలాన్లు మేమే, వంద శాతం కడతాం. ఎక్కువ మంది యువకులే పాపం. ఏదో పిల్లలు కష్టపడి చదువుకుంటున్నారని తల్లితండ్రులు బైకులు కొనిస్తున్నారు. చేయని పొరపాటుకు యువకులు ఇలా జరిమానాలు కట్టాల్సి వస్తుంది. ఓల్డ్ సిటీలో ఎంత మంది జరిమానాలు కడుతున్నారు? ఓల్డ్ సిటీలో చలాన్లు ఎన్ని వేస్తున్నారు? ఎన్ని వసూలు చేశారు? బయటి వాళ్లు మనుషులు కారా. అన్నీ రద్దు చేస్తాం. జీహెచ్ఎంసీ తరఫున కట్టే ప్రయత్నం చేస్తాం. కడతాం కూడా’’ అని అన్నారు సంజయ్.

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. సాధారణంగా పౌరులు చేసే తప్పులకు శిక్షగా జరిమానా వసూలు చేస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ, పౌరుల తప్పులకు ప్రభుత్వాలే జరిమానా చెల్లించేలా చేస్తామంటూ సంజయ్ ఈ హామీ ఇవ్వడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది.

పోలీసులు

సంజయ్ తీరును లోక్ సత్తాలో పనిచేసిన కటారి శ్రీనివాస్ తప్పుపట్టారు.

‘‘ఓల్డ్ సిటీలో పట్టించుకోవడం లేదు. ఇక్కడ వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అది సరికాదు. ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అంతే కానీ, మీరూ తప్పు చేయండి అనడం పరిష్కారం కాదు’’ అని ఆయన అన్నారు.

’’అయితే ట్రాఫిక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడో విషయం చెప్పాలి. ఈ మధ్య ఒక సమస్య వచ్చింది. హైదరాబాద్‌లో కొత్తగా బండిపై వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేశారు. కానీ, దీనిపై సరైన ప్రచారం కల్పించలేదు. దీంతో చాలా మంది తెలియక జరిమానాలు కట్టాల్సి వచ్చింది. అటువంటి నిబంధన అమలు చేసేప్పుడు ముందు ప్రచారం చేసి, అలాగే బండి ఆపి చెబితే తెలుస్తుంది. కానీ నేరుగా ఫోటోలు తీసి పంపడం వల్ల కొందరు నష్టపోయింది వాస్తవం’’ అన్నారు శ్రీనివాస్.

పాత నగరంలో ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడం లేదన్న ఆరోపణలపై సమాధానం కోసం హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ ట్రాఫిక్, అనిల్ కుమార్‌ను బీబీసీ సంప్రదించింది. దీనిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.

దీనిపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

‘‘మా పార్టీ అధ్యక్షుడు ప్రకటించే ఏ నిర్ణయమైనా పార్టీలో చర్చించాకే బయటకు వస్తుంది. అది అధ్యక్షుడి వ్యక్తిగత నిర్ణయం కాదు. అధ్యక్షుడి మాటకు పార్టీ కట్టుబడి ఉంటుంది’’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర రావు అన్నారు.

కొందరు పౌరులు చేసిన తప్పులకు పడిన జరిమానా ప్రజల సొమ్ము నుంచి ఎలా కడతారు అన్న ప్రశ్నకు... ‘‘ఎన్నికల మేనిఫెస్టోలు పక్కాగా అమలు చేయాలనీ, అమలు చేయకపోతే ఆయా పార్టీల నాయకులపై కేసులు వేసేలా ఒప్పందాలు రావాలి. మా పార్టీయే కాదు, అన్ని పార్టీలు దీనిపై సంతకం చేయాలి’’ అని శేఖర రావు బదులు ఇచ్చారు.

బండి సంజయ్

ఫొటో సోర్స్, ugc

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై భారీ ఎత్తున జరిమానాలు విధించాలని కేంద్రం నిర్ణయించింది. 2019 సెప్టెంబరు 1న అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వాహనాల చట్టం ఈ జరిమానాలను భారీగా పెంచింది.

అప్పట్లో ఆ పెంపుదలను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకుండా పాత రేట్లనే కొనసాగించాయి. తరువాత క్రమంగా పెంచుకుంటూ వచ్చాయి.

ఈ కొత్త చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల పరిధిలో జరిమానాలు నిర్ణయిస్తాయి. పోలీసు వ్యవస్థ, మోటారు వాహనాల రవాణా వ్యవస్థ – ఈ రెండూ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నందున జరిమానాల నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారాల పరిధిలోకే వస్తుంది.

అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, యూరోప్‌లోని కొన్ని దేశాల్లో మాత్రం జరిమానాలను నిర్ణయించే అధికారం అక్కడి నగర పాలక సంస్థలకు ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రిపుల్ రైడింగ్‌కు గరిష్ట జరిమానా 1200 రూపాయలు ఉంది.

బండి సంజయ్

ఫొటో సోర్స్, ugc

‘నా సంతకం ఫోర్జరీ చేశారు’

తాను రాయని లేఖను రాసినట్టుగా చూపించేందుకు తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బండి సంజయ్.

హైదరాబాద్‌లో వరద బాధితులకు 10 వేల రూపాయల సహాయం ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈలోపే జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ పంపిణీని ఆపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.

అయితే, ఈ ఆదేశాలకు కారణం ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేయడమేనని టీఆర్ఎస్ అనకూలురు సోషల్ మీడియాలో కొన్ని లేఖలను ప్రచారంలో పెట్టారు.

అయితే ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాకుండా, భారత ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్‌కు రాసినట్టుగా ఉంది. అందులో ఇంగ్లీషు భాష, వ్యాకరణ తప్పులు కూడా చాలా ఉన్నాయి.

బండి సంజయ్

ఫొటో సోర్స్, ugc

ఆ లేఖ తాము రాయలేదనీ, ఎవరో తన సంతకం ఫోర్జరీ చేశారని బండి సంజయ్ అంటున్నారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కాపీని కేంద్ర హోం మంత్రికి కూడా పంపారు.

‘‘ఆ లేఖలో నా సంతకం ఫోర్జరీ చేశారు. అందులో విషయాలు నేను చెప్పినవి కావు. హైదరాబాద్ ఎన్నికలకూ భారత ఎన్నికల సంఘానికీ సంబంధం లేదు. ఈ లేఖ విషయంలో తగిన దర్యాప్తు జరిపి నేరస్థులను చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతున్నాను’’ అని సంజయ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘బండి సంజయ్ ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం’’ అని హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)