తెలంగాణ: గ్రామ సర్పంచ్‌లు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేస్తోంది?

ఫొటో సోర్స్, @Telangana CMO
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
షేక్ అజారుద్దీన్.. రంగారెడ్డి జిల్లాలోని కాశగూడెం గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైన యువ సర్పంచ్. పెద్దగా ఆస్తులు లేవు. అయినా సొంత పనులు మానుకుని ఊరి కోసం తిరిగారు. అంతా బానే ఉందనుకుంటే.. ఓ రోజు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి చనిపోయారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని రఘుమాపూర్ గ్రామం. మహిళా సర్పంచ్ ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి సంబంధించిన గొడవల్లో ఆమె తండ్రిపై కేసు నమోదైంది.
ఈ రెండు కేసులూ ఆత్మహత్యల వరకూ వెళ్లడానికి కారణం ఒకటే.. ఆ గ్రామాల్లో జరగుతున్న లేదా జరగాల్సిన అభివృద్ధి పనులు.
అవును. సర్పంచ్‌లకు మంచి పేరు తేవాల్సిన అభివృద్ధి పనులు వారికి సమస్యలను తెస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో గ్రామాల సర్పంచ్‌లు కొందరు నరకం చూస్తున్నారు.
ప్రభుత్వ ఉన్నతాధికారులు పెట్టే ఒత్తిడి, గ్రామంలో పరువు ప్రతిష్టల సమస్యలు, కష్టపడి గెలుచుకున్న పదవి పోతుందన్న బాధ.. అన్నీ కలిసి తీవ్ర వేధనను అనుభవిస్తున్నారు.
షేక్ అజారుద్దీన్ గ్రామంలో అప్పుచేసి మరీ కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. వాటి నిధులు ఉన్నతాధికారులు విడుదల చేయలేదు. దీంతో అప్పు పెరిగింది. భార్య వస్తువులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
ఝాన్సీది మరో సమస్య. ఆమె గ్రామంలో డంపింగ్ యార్డు కోసం స్థలం విషయంలో వివాదం వచ్చింది. అది పెరిగి పెద్దదైంది. చివరకు ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రికి తీసుకువెళ్తే, బతికారు. కానీ ఈ గొడవల్లో ఆమె తండ్రిపై కేసు నమోదైంది.

ఫొటో సోర్స్, twitter/Guravaiahgoud
అప్పు చేసి అభివృద్ధి చేయడం ఎందుకంటే?
అప్పు చేసి అభివృద్ధి చేయడం ఎందుకు? తరువాత తిప్పలు పడడం ఎందుకు? సర్పంచ్ పదవి ఉందని ఇంట్లో కూచుంటే సరిపోదా అనే అనుమానం చాలా మందికి రావొచ్చు.
సాధారణంగా పంచాయితీ నిధులు ఉంటే పనులు చేస్తారు. కానీ, తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. సర్పంచ్‌లు అప్పు చేసైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి వస్తోంది.
ప్రతీ గ్రామంలో హరితహారం నర్సరీల నిర్వహణ, ఆ మొక్కలను కాపాడటం, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలూ.. ఇవన్నీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఆ బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించింది.
కానీ, అందుకు తగిన నిధులను సమయానికి ఇవ్వడం లేదు. పనులు పూర్తి చేయాలని మాత్రం ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
ఉన్నతాధికారులు నేరుగా సర్పంచ్‌లకు ఫోన్ చేస్తున్నారని, పనులు పూర్తి చేయకపోతే సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించడం మొదలుపెట్టారని సర్పంచ్‌ల సంఘం నాయకులు అంటున్నారు.
ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టినట్టుగా సర్పంచ్‌లకు కూడా టార్గెట్లు పెట్టారు. నోటీసులు ఇచ్చారు. పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ డబ్బు మాత్రం ఇవ్వడం మానేశారు.
కట్ చేస్తే, టార్గెట్లు పూర్తి చేయడం కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేయించిన సర్పంచ్‌లు నానా ఇబ్బందులూ పడుతున్నారు.

ఫొటో సోర్స్, twitter/Collector_SRD
‘భారంగా మారిన హరితహారం’
‘‘ఎక్కడైనా ఒక సదుపాయం కావాలి అంటే భూమి, డబ్బూ కావాలి. కానీ తెలంగాణలో అలా లేదు. నెలలో శ్మశాన వాటిక నిర్మించాలి అంటారు. లేదంటే డంపింగ్ యార్డ్ పెట్టాలి అంటారు. గ్రామానికి చెందిన ఖాళీ భూములు ఎక్కడ ఉన్నాయో రెవెన్యూ వారు చెప్పరు. మరి ఆ స్థలాలు సర్పంచ్‌లు ఎక్కడి నుంచి తేవాలి? ఏదైనా ఖాళీ స్థలం చూస్తే, దాని రికార్డు సంగతి తెలీదు. కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్లు ఒప్పుకోరు. అదో సమస్య. దీనికి మించిన సమస్య టార్గెట్లు. అవి పూర్తి చేయడానికి డబ్బు ఖర్చు పెడుతున్నారు సర్పంచ్‌లు. కానీ ఆ నిధులు విడుదల కావడం లేదు’’ అని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ బీబీసీతో చెప్పారు.
‘‘నాకు తెలిసి సర్పంచ్‌లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్యల్లో హరితహారం నర్సరీలు నిర్వహించడం ఒకటి. దానికి స్థలాలు వెతకాలి. మొక్కలు పెంచాలి. అలాగే గ్రామాల్లో హరిత హారం కింద నాటిన మొక్కల్లో 85 శాతం బతకకపోయినా సర్పంచ్‌లనే బాధ్యులు చేస్తున్నారు. ఇది కాక డంపింగు యార్డులకు స్థలాలు వెతకడం. ఈ మూడూ సర్పంచ్‌లకు భారం అయ్యాయి’’ అన్నారు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కన్వీనర్ బండారు రామ్మోహనరావు.
ఆయన తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తుంటారు.
‘‘కొత్తగా వచ్చిన 2018 చట్టం ఎలా ఉందంటే గ్రామంలో పన్నులు వసూలు కాకపోయినా సర్పంచ్‌నే బాధ్యుణ్ణి చేస్తున్నారు. 200 ఓటర్లు, 300 జనాభా ఉన్న పల్లెలను కూడా పంచాయితీలు చేశారు. ఆ పంచాయితీ ఏడాది మొత్తం ఆదాయం కలిపినా రానంత డబ్బును, ఆ పంచాయితీ అభివృద్ధి కోసమని సర్పంచ్ ఎక్కడి నుంచి తెస్తాడు? వీధి దీపాల (స్ట్రీట్ లైట్స్) కి కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని పంచాయితీలు లక్షల రూపాయలు పెట్టి స్థలాలు కొనలేవు. అసలు స్థల సేకరణ రెవెన్యూ పని అయితే సర్పంచ్‌ని వేధిస్తున్నారు’’ అని అన్నారు రామ్మోహన రావు.
ఈ కొత్త పద్ధతి వల్ల కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికై, ఆర్థికంగా బలం లేని దళితులు, పేదలు, మహిళా సర్పంచ్‌లే ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. 2018 చట్టం వారికి అధికారాలు ఇవ్వకుండా బాధ్యతలనే ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, @telangana CMO
సర్పంచ్‌లను సస్పెండ్ చేయవచ్చా?
తెలంగాణ ప్రభుత్వం 2018లో కొత్త పంచాయితీ రాజ్ చట్టం తెచ్చింది. ఈ చట్టం కింద కొన్ని బాధ్యతలు నిర్వర్తించని సర్పంచ్‌లను పదవుల నుంచి సస్పెండు చేసే అధికారం కలెక్టర్లుకు ఉంటుంది.
గతంలో కూడా సస్పెన్షన్ ఉండేది. కానీ, ఇప్పుడు కారణాలు పెరిగాయి. ఈ చట్టం ఆ బాధ్యతల గురించి చెప్పింది తప్ప, ఆ బాధ్యతలు పూర్తి చేయడానికి అధికారం, డబ్బు ఎలా వస్తాయనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకూ తెలంగాణలో 47 మంది సర్పంచ్‌ల వరకూ సస్పెండ్ అయినట్టు కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇలా సస్పెండ్ అయిన వారు ట్రిబ్యునల్‌కి వెళ్లాల్సి ఉంటుంది.
ఒకప్పుడు గ్రామాల్లో సర్పంచ్ అంటే బాగా డబ్బున్న, పలుకుబడి ఉన్న వ్యక్తులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆదాయం, కులంతో సంబంధం లేకుండా అందరూ సర్పంచ్‌లు కాగలుగుతున్నారు.
మధ్య తరగతి, పేద వర్గాల వారు సర్పంచ్‌లు అయితే, వారీ ఖర్చులు భరించలేకపోతున్నారు. సొంత డబ్బులేక అలాగని సస్పెండ్ అయి పరువు పోగొట్టుకోలేక అప్పులు చేస్తున్నారు.
‘‘ఇప్పుడు చాలా చిన్న కారణాలతో సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తున్నారు. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి సర్పంచ్‌లకు బాధ్యతలు ఇచ్చింది కానీ అధికారాలు ఇవ్వలేదు. లైన్ మెన్, కార్యదర్శి వంటి వారిని నియంత్రించే అధికారం కూడా సర్పంచ్‌లకు ఇవ్వలేదు. అంతేకాదు, అంగన్ వాడీలు పిల్లల్ని సరిగా చూసుకోకపోతే ప్రశ్నించే అధికారం కూడా సర్పంచ్‌కి లేదు’’ అన్నారు ప్రణీల్.
ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వ పంచాయితీ రాజ్ శాఖ స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








