ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల రహస్య జీవోలు: ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ప్రజలకు తెలియనవసరం లేదా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, FACEBOOK/TELANGANA/ANDHRAPRADESH/CMO

    • రచయిత, బళ్ల సతీశ్, వి.శంకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

తెలంగాణలో ప్రభుత్వ పాలనా ఉత్తర్వుల్లో చాలా వరకూ రహస్యంగా ఉంటున్నాయి. సాధారణంగా ప్రతి ప్రభుత్వం తాము ఇచ్చే ఉత్తర్వులను (గవర్నమెంటు ఆర్డర్స్ - జీవో) ప్రభుత్వ వెబ్‌సైట్లో ప్రజలందరికీ అందుబాటులో పెడుతుంది. వెబ్‌సైట్లు రాకముందు, ప్రభుత్వ ప్రచురణాలయాల దగ్గర నామ మాత్రపు ధరకు వాటిని అమ్మేవారు.

కొన్ని జీవోలను మాత్రం కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్యంగా ఉంచుతారు. ఆ రహస్య జీవోలను సెక్షన్ ఆఫీసర్లు, కొందరు అధికారులు మాత్రమే చూడగలరు.

2014 తరువాత, తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో జీవోలను రహస్యంగా ఉంచుతోంది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 40 శాతం జీవోలు రహస్యంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రహస్య జీవోల విడుదల ఈ స్థాయిలో లేకపోయినా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని రహస్య జీవోలు వివాదాస్పదమయ్యాయి.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పాలనలో 1.6 శాతం జీవోలు రహస్యంగా ఉండగా, జగన్మోహన్‌ రెడ్డి పాలనలో 0.97 శాతం రహస్య జీవోలున్నాయి.

రెండు రాష్ట్రాల్లోనూ ఈ రహస్య జీవోలు సమస్యగానే ఉన్నాయి. అయితే, తెలంగాణ పరిస్థితి కోర్టు వరకూ వెళ్లింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, TS HIGH COURT

ఫొటో క్యాప్షన్, తెలంగాణ రహస్య జీవోలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

తెలంగాణ రహస్య జీవోలపై హైకోర్టులో పిటిషన్

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర రావు ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఐదు వాయిదాలు ముగిసినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌంటర్ దాఖలు చేయలేదు.

పిటిషనర్ కోర్టుకు ఇచ్చిన సమాచారం ప్రకారం 2014 జూన్ 2 నుంచి 2019 ఆగస్టు వరకూ తెలంగాణలో మొత్తం 1,04,171 జీవోలు విడుదల కాగా వాటిలో 42,462 జీవోలను రహస్యంగా ఉంచారు. అంటే మొత్తం 40.76 % జీవోలు రహస్యంగానే ఉన్నాయి.

నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జీవోలను రహస్యంగా ఉంచడం అనే ప్రక్రియ ఉండేది. కానీ, ఏవో కొన్ని జీవోలు తప్ప, మెజార్టీ ఉత్తర్వులను వెబ్ సైట్లో పెట్టేవారు.

ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితేంటి?

2009 జనవరి నుంచి 2013 డిసెంబరు వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక శాఖ 23,667 జీవోలు విడుదల చేస్తే, వాటిలో 21,676 జీవోలు అందుబాటులో ఉన్నాయి.

1,991 జీవోలను మాత్రం రహస్యంగా ఉంచారు. అంటే 8.4 % జీవోలు రహస్యంగా ఉన్నాయి. అదే కాలంలో సాధారణ పరిపాలన శాఖ 30,010 జీవోలు విడుదల చేయగా అందులో 408 ప్రభుత్వ ఉత్తర్వులను రహస్యంగా ఉంచి మిగిలిన 29,602 జీవోలను బయట పెట్టింది. అంటే 1.35 శాతం రహస్యంగా ఉన్నాయి.

న్యాయ శాఖ 11,522 జీవోల్లో ఒకే ఒక్క దాన్ని రహస్యంగా ఉంచి మిగిలిన వాటిని బహిర్గతం చేసింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 8976 జీవోల్లో కేవలం నాలుగింటిని మాత్రమే రహస్యంగా ఉంచింది.

కానీ ఇప్పుడలా కాదు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ వంటి చోట్ల అయితే రహస్య జీవోల సంఖ్యే ఎక్కువగా ఉంది.

తెలంగాణ వచ్చాక 2014 జూన్ నుంచి 2019 ఆగస్టు వరకు ఉన్న రహస్య జీవోల జాబితా ఇది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రహస్య జీవోల జాబితా

ఇక జి.శ్రీనివాస రావు అనే మరో వ్యక్తి వేసిన సమాచార హక్కు దరఖాస్తు ప్రకారం ఒక్క హోం శాఖ నుంచి విడుదలైన 7,945 జీవోల్లో 5,371 జీవోలను రహస్యంగా ఉంచారు.

''లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చుచేస్తున్నారు. అది దేనిపై ఖర్చు పెడుతున్నారు? బడ్జెట్లో పెట్టిందెంత? వాస్తవంగా ఖర్చు చేసిందెంత? ఎవరికి ఎంత ఎలా ఖర్చు చేశారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది.

అది ఎందుకు దాచి పెట్టాలి? తప్పులు, అక్రమాలు, అవినీతి లేకుంటే దాచాల్సిన అవసరం లేదు కదా? ముఖ్యమంత్రి కేసీఆర్ నిబంధనల ప్రకారం కాకుండా, తన ఇష్టానుసారం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. వాటిని జీవోల రూపంలో ప్రజల ముందుంచితే ఎవరైనా ప్రశ్నిస్తారన్న భయంతో రహస్యంగా ఉంచి ఉండవచ్చు.

గతంలో ఎన్నోసార్లు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టి వేసింది. మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురై అవమానాలు పడకుండా కూడా వీటిని రహస్యంగా ఉంచుతూ ఉండవచ్చు'' అని తెలంగాణ ప్రభుత్వ రహస్య జీవోలపై బీజేపీ నాయకుడు శేఖరరావు అభిప్రాయపడ్డారు.

''ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ ఖర్చు అవుతుందో ఆ జీవోలు బయటకు తేవడం లేదు. ఉదాహరణకు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, పోలీసులకు ఇన్నోవా వాహనాల కొనుగోలు, కలెక్టర్ల కార్యాలయాల నిర్మాణాలు, వాటికి భూముల కొనుగోళ్లు, చెరువుల పునరుద్ధరణ తదితర పథకాల ఖర్చులకు సంబంధించిన జీవోలు ఎక్కడా అందుబాటులో లేవు.

ముఖ్యంగా వ్యయం అంచనాలు విపరీతంగా పెంచేసి, డీపీఆర్‌లను ఇష్టానుసారం మార్చేస్తూ, వంద ఖర్చు చేసే చోట రెండొందలు ఖర్చు చేస్తున్నారు. ఆ విషయాలను ఎవరైనా గుర్తు పట్టి ప్రశ్నిస్తారని, కోర్టుకు వెళ్తారని, ప్రజల ముందుంచుతారన్న ఉద్దేశంతోనే వాటిని రహస్యంగా ఉంచుతున్నారు.

ఆఖరికి ఎంత దారుణం అంటే, చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ నియామకానికి సంబంధించిన జీవోను కూడా రహస్యంగా ఉంచింది ఈ ప్రభుత్వం'' అని శేఖరరావు విమర్శించారు.

రహస్య జీవోలు

ఫొటో సోర్స్, BBC/www.facebook.com/TelanganaSecretariat

ఫొటో క్యాప్షన్, రూ.490 చెల్లింపులకు కూడా జీవో విడుదల చేసిన ప్రభుత్వం

రూ.128 ఖర్చుకు కూడా జీవో విడుదల

ఈ జీవోల కోసం వెతుకుతున్నప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తుంటాయి. సచివాలయంలో జరిగే చిన్న చిన్న పనులకు కూడా జీవోలు ఇస్తుంటారు.

ఉదాహరణకు, 128 రూపాయల టెలిఫోన్ బిల్లు చెల్లించేందుకు సంబంధించిన ఉత్తర్వులను, 720 రూపాయల నీటి క్యాన్ల బిల్లులకు సంబంధించిన ఉత్తర్వులను కూడా గతంలో జీవోల రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. కానీ కోట్లాది రూపాయలకు సంబంధించిన జీవోలు మాత్రం కనిపించవు.

వాస్తవానికి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 (1) (సి) ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఇదే విషయంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.

ఈ వివాదంపై స్పందన కోసం, తెలంగాణకు చెందిన ఐదుగురు మంత్రుల కార్యాలయాలను బీబీసీ సంప్రదించింది. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, facebook.com/AndhraPradeshCM

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది?

సాధారణంగా రహస్య జీవోల వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంచరు. కేవలం జీవో నంబర్, శాఖ పేరు మాత్రమే తెలుస్తుంది.

మిగతా వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రోజులోనే 12 ర‌హ‌స్య జీవోలు విడుద‌ల చేయడం చర్చకు దారి తీసింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, 2019 జూన్ 1 నుంచి 2020 మార్చి 5వ తేదీ వ‌ర‌కూ మొత్తం 15,283 జీవోలు విడుదల కాగా వాటిలో 149 రహస్య జీవోలు ఉన్నాయి.

వాటిలో ఏకంగా 12 జీవోలను 2020 మార్చి 3వ తేదీన‌ విడుద‌ల చేశారు. వాటికి తోడుగా మ‌రో 3 జీవోలు మార్చి 4న విడుద‌ల‌య్యాయి. అవ‌న్నీ పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాల‌కు సంబంధించిన‌వే కావ‌డం విశేషం.

దాంతో స్థానిక సంస్థల ఎన్నిక‌ల ముంగిట సంబంధిత శాఖ‌ల త‌రపున ప్రభుత్వం ఈ ఉత్వర్వులు విడుద‌ల చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నిక‌ల నియమావ‌ళి, నిర్వహణ విష‌యాల్లో ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ జీవోలు విడుద‌లైన‌ట్టు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, www.facebook.com/AndhraPradeshCM

అసలింతకీ జీవోలు ఎన్ని ర‌కాలు?

ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు స‌హ‌జంగా రెండు ర‌కాలుగా ఉంటాయి. అందులో ఒక‌టి 'జీవో ఎంస్' అని రాసి నెంబ‌ర్ వేస్తారు. అంటే అది మాన్యువ‌ల్ స్క్రిప్ట్ అని భావించాలి.

ఒక‌ప్పుడు పాల‌నా వ్య‌వ‌స్థ పూర్తిగా కాగితాలు, రాత‌ల ఆధారంగా కొనసాగేది. అప్పట్లో అధికారులు జీవో విడుద‌ల కోసం ఫైల్ నోట్స్ రాస్తూ ఉండేవారు.

అలా నోట్స్ ఆధారంగా సంబంధిత శాఖ జీవో విడుద‌ల చేసే స‌మ‌యంలో 'జీవో ఎంస్' అని పేర్కొనేవారు. ఆ త‌ర్వాత 'జీవో పీ' అని కూడా ఉండేది.

అంటే ప్రింటెడ్ అని అర్థం. ప్ర‌స్తుతం దాదాపుగా అన్ని జీవోలు ప్రింట్ అవుతున్న త‌రుణంలో మాన్యువ‌ల్స్ స్క్సిప్ట్, డిజిట‌ల్ స్క్రిప్ట్ స‌హాయంతో త‌యారు చేస్తున్న పరిస్థితుల్లో కేవ‌లం 'జీవో ఎంస్' అని మాత్రం ప్ర‌స్తావిస్తున్నారు. 'జీవో పీ' అనేవి దాదాపుగా క‌నిపించ‌డం లేదు.

మ‌రో ర‌కం ఉత్త‌ర్వుల్లో 'జీవో ఆర్టీ' అని ఉంటుంది. అంటే పాల‌నా ప్ర‌క్రియ‌లో రొటీన్‌గా జరిగిపోయే విష‌యాల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను 'జీవో రొటీన్' అని చెప్ప‌డానికి 'జీవో ఆర్టీ' అని రాస్తూ ఉంటారు.

స‌హ‌జంగా జ‌రిగే బ‌దిలీలు, స‌ర్వీసు వ్య‌వ‌హ‌రాల్లో ఎక్కువ‌గా 'జీవో ఆర్టీ' అని పేర్కొంటారు. గ‌త 9 నెల‌ల కాలంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం 'జీవో ఎంస్' త‌ర‌హాలో 2553, 'జీవో ఆర్టీ' తరహాలో 12,731 జీవోలను విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వ విధానాల్లో పెద్ద‌గా మార్పులు లేక‌పోతే 'జీవో ఆర్టీ' కింద‌, పాల‌నా పద్ధ‌తుల్లో మార్పులు తీసుకొచ్చే వాటిని 'జీవో ఎంస్' కేట‌గిరీ కింద పేర్కొంటారు.

గ‌త ఏడాది జూన్ 1 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల చేసిన మొత్తం జీవోలు 15283 కాగా, వాటిలో నిధుల విడుద‌ల‌కు సంబంధించిన జీవోలు 1238, స‌ర్వీసు సంబంధిత విష‌యాలపై విడుద‌ల జీవోలు 1976, ప‌ర్య‌ట‌న‌లకు సంబంధించినవి 164, బ‌దిలీల కోసం 313 జీవోలు విడుద‌ల చేశారు. అవి కాకుండా 'ఇత‌రాలు' పేరుతో 11592 ఉండ‌డం విశేషం.

టీడీపీ పాల‌నా కాలంలో 8 జూన్ 2014 నుంచి 22 మే 2019 వ‌ర‌కూ మొత్తం 1,05,971 జీవోలు విడుద‌ల‌యితే అందులో 1729 కాన్ఫిడెన్షియ‌ల్ జీవోలు ఉన్నాయి. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం కూడా పెద్ద సంఖ్య‌లోనే ర‌హ‌స్య జీవోలు విడుద‌ల చేస్తోంది.

ర‌హ‌స్య జీవోలు ఎందుకు?

ఉత్తర్వుల్లో ఉన్న వివ‌రాల‌ను వెల్ల‌డించ‌డానికి సిద్ధ‌ప‌డ‌కుండా, ఆ స‌మాచారం రహస్యంగా పేర్కొన‌డం వెనుక ప్ర‌భుత్వానికి అనేక కార‌ణాలుంటాయి. అన్ని వివ‌రాలు ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచాల్సిన అవ‌స‌రం లేద‌ని పాల‌నా సంబంధిత విష‌యాల నిపుణుడు, న్యాయవాది ఎం.వెంక‌టేశ్వ‌ర రావు బీబీసీతో అన్నారు.

"జీవోల్లో కొన్ని నేరుగా ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాలుంటాయి. మ‌రికొన్ని పాల‌నా సంబంధిత విష‌యాలు ఉంటాయి. అన్నింటినీ ఒకే విధంగా చూడ‌లేం. ప్ర‌జ‌ల‌ను ఆర్థికంగా, లేదా వేరే విధంగా నేరుగా ప్ర‌భావితం చేసే అంశాల్లో స‌హ‌జంగా కాన్ఫిడెన్షియ‌ల్ జీవోలు ఉండ‌వు.

కొన్ని విధాన సంబంధిత విషయాల్లో ప్ర‌భుత్వం గోప్య‌త పాటించాల్సి ఉంటుంది. చ‌ట్టానికి లోబ‌డి రూపొందించి జీవోల‌లో విధాన మార్పుల‌కు సంబంధించిన విష‌యాల‌ను వెంట‌నే అంద‌రికీ తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం లేన‌ప్పుడు ర‌హ‌స్య జీవోలు విడుద‌ల చేయ‌డం చాలాకాలంగా వ‌స్తోంది.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ముంగిట హైకోర్టు తీర్పున‌కు లోబ‌డి ర‌హ‌స్య జీవోలు విడుద‌ల చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. కోర్టు తీర్పుల‌కు అనుగుణంగా ఉన్న జీవోల‌ను త‌క్ష‌ణం వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం లేకుండా, ప్ర‌భుత్వం సంబంధిత శాఖ‌లు, అధికారుల వ‌ర‌కే ప‌రిమితం చేస్తూ జీవోలు విడుద‌ల చేసుకునే హ‌క్కు ఉంది" అని ఆయన వివ‌రించారు.

ర‌హ‌స్య జీవోల‌ను బ‌య‌ట‌పెట్టాలి: టీడీపీ

జ‌గ‌న్మోహన్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను వంచించే ప్ర‌య‌త్నంలో భాగంగానే ర‌హ‌స్య జీవోలు విడుద‌ల చేస్తోందని విప‌క్ష టీడీపీ ఆరోపిస్తోంది.

"గ‌తంలో బంద‌రు పోర్టును తెలంగాణకి అప్ప‌గిస్తూ ర‌హ‌స్య జీవో విడుద‌ల చేశారు. దానిని టీడీపీ బ‌య‌ట‌పెట్ట‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ర‌ద్దు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఒకే రోజు పెద్ద సంఖ్య‌లో ర‌హ‌స్య జీవోలు విడుద‌ల చేయ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఇప్ప‌టికే బీసీల‌కు అన్యాయం చేస్తోంది. ఇప్పుడు ఎన్నిక‌ల విష‌యంలో ప్ర‌భుత్వ తీరు సందేహాస్ప‌దంగా ఉంది. ర‌హ‌స్య జీవోల‌న్నీ బ‌హిర్గ‌తం చేయాల్సిందే" అని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చ‌ల అర్జునుడు బీబీసీతో అన్నారు.

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
ఫొటో క్యాప్షన్, మేం పారదర్శకంగానే వ్యవహరిస్తున్నాం: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

పార‌ద‌ర్శ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాం: బొత్స

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాల‌నా వ్య‌వ‌హారాల‌న్నీ పారద‌ర్శ‌కంగా సాగిస్తున్నామ‌ని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బీబీసీకి తెలిపారు.

"ర‌హ‌స్య జీవోల పేరుతో గ‌త ప్ర‌భుత్వం అనేక అవినీతి, అక్ర‌మాల‌కు తెర‌లేపింది. వాటిపై ఇప్ప‌టికే ప‌లు ద‌ర్యాప్తులు సాగిస్తున్నాం. మేం మాత్రం కేవ‌లం పాల‌నా విష‌యాల్లో గోప్య‌త పాటించాల్సిన స‌మ‌యంలో త‌ప్ప పూర్తిగా పారద‌ర్శ‌క విధానాలకే ప్రాధాన్యం ఇస్తున్నాం.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి కోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్నాం. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై టీడీపీ నేత‌లు పిటిష‌న్ వేయించి బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ద‌క్క‌కుండా చేశారు.

దాంతో అనివార్య ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం చ‌ట్ట‌బ‌ద్ధంగా ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాల్సి వ‌చ్చింది. దాని మీద రాద్ధాంతం చేయ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు త‌గ‌దు. సంక్షేమం విష‌యంలో మా పాల‌నా పార‌ద‌ర్శ‌క‌త ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. మున్సిపాలిటీ వ్య‌వ‌హారాల్లో కేవ‌లం విధాన‌ప‌ర‌మైన విష‌యాల‌కే కొన్ని రహస్య జీవోలు విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది" అని మంత్రి వివ‌రించారు.

రహస్య జీఓ అంటే సమాచార హక్కు చట్టం ఉల్లంఘనే

ప్రభుత్వం విడుదల చేసే జీవోలలో గోప్యత సమంజసం కాదన్నది నిపుణుల మాట. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ బీబీసీతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

దేశ భద్రత లేదా ఎవరైనా వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన విషయాల్లో మినహా ప్రతీ విషయం ప్రజలకు తెలియాలని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం అదే చెబుతోందన్న విషయాన్ని గుర్తు చేశారు.

సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వం తన విధానాలన్నీ ప్రజలకు తెలియజేయాలని, అందుకు భిన్నంగా రహస్య జీవో అంటున్నారంటే ప్రజలకు వెల్లడించకూడని లొసుగులు ఉన్నట్టు భావించాలని ఆయన వ్యాఖ్యానించారు.

అలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికే చేటు తెస్తుందని శర్మ అభిప్రాయపడ్డారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)