కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?

కరోనావైరస్ వ్యాప్తి అనంతరం కంటేజియన్ సినిమాకు డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయి.

ఫొటో సోర్స్, Warner Bros

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ వ్యాప్తి అనంతరం కంటేజియన్ సినిమాకు డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయి.

2011లో విడుదలైన హాలీవుడ్ సినిమా కంటేజియన్ బాక్సాఫీసు వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేదు.

మాట్ డామన్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో, కేట్ విన్‌స్లెట్, మైఖేల్ డగ్లస్‌ లాంటి తారాగణం ఉన్నప్పటికీ, ఈ చిత్రం ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో 61వ స్థానంతోనే సరిపెట్టుకుంది.

కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికాలోని యాపిల్ ఐట్యూన్స్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన సినిమాల జాబితాలోకి కంటేజియన్ వచ్చి చేరింది. ఈ చిత్రం పేరుతో గూగుల్‌లో శోధనలు భారీగా పెరుగుతున్నాయి.

చైనాలో కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తికి సంబంధించి డిసెంబరులో మొదట వార్తలు వచ్చాయి. అప్పటికి అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సినిమాల జాబితాలో ఈ సినిమా 270వ స్థానంలో ఉండేది. కానీ, అదే సినిమా ఇప్పుడు హ్యారీ పోటర్ సిరీస్‌లోని 8 సినిమాల తర్వాతి స్థానంలోకి వచ్చేసింది.

దశాబ్దం కింద విడుదలైన ఈ సినిమా కథాంశానికి, ప్రస్తుత వైరస్ వ్యాప్తికి మధ్య సారూప్యతలు ఉండటమే అందుకు కారణం.

కంటేజియన్ సినిమా నటీనటులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కంటేజియన్ సినిమాలో కల్పిత వైరస్ దాడికి గురైన తొలి వ్యక్తి (జీరో పేషెంట్) పాత్రలో గ్వినెత్ పాల్ట్రో నటించారు

అప్పుడు... ఇప్పుడు

ఈ సినిమాలో, ఒక వ్యాపారవేత్త (పాల్ట్రో పోషించిన పాత్ర) అకస్మాత్తుగా విజృంభించిన ఓ ప్రమాదకర వైరస్ భారిన పడి చనిపోతారు. చైనా పర్యటనలో ఉన్నప్పుడు ఆమెకు ఆ వైరస్ సోకుతుంది. తర్వాత ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీస్తుంది.

ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తి కూడా చైనాలోనే మొదలైంది. కాబట్టి, ఈ సినిమా కథతో దానిని పోల్చి చూస్తున్నారు. దాంతో, గత కొన్నివారాలుగా ఈ సినిమాను వీక్షించేవారి సంఖ్య భారీగా పెరిగింది.

ఫిబ్రవరి 26న విమానంలో ప్రయాణిస్తూ ఫేస్‌మాస్క్ ధరించిన చిత్రాన్ని నటి పాల్ట్రో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సినిమాపై జనాలకు ఆసక్తి పెరగడానికి ఆ పోస్టు కూడా కొంతమేర ఉపయోగపడింది.

"నేను ఇప్పటికే ఈ సినిమాలో ఉన్నాను. అందరూ సురక్షితంగా ఉండండి. కరచాలనాలకు దూరంగా ఉండండి. తరచూ చేతులు కడుక్కోండి" అంటూ 60 లక్షల మంది ఫాలోయర్లున్న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె రాశారు.

Sorry, your browser cannot display this map