వెనిస్: నీటిపై తేలియాడేలా ఈ సుందర నగరాన్ని ఎలా నిర్మించారు?

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ రోమన్ సామ్రాజ్యానికి రోములస్ ఆగస్టులస్ ఆఖరి చక్రవర్తి. ఆయన్ను క్రీస్తు శకం 476లో ఒడవాకర్ పదవీచ్యుతిడిని చేశారు. అంతటితో ఆ సామ్రాజ్యం కథ ముగిసింది.
అయితే, అక్కడి ప్రజలకు విసిగోత్స్, హన్స్ రాజు అట్టిలా లాంటి శక్తిమంతమైన పాలకుల దండయాత్రల బెడద ఉంది. దీంతో తమను తాము కాపాడుకోవడానికి వాళ్లు కొత్త ప్రదేశం కోసం ప్రస్తుతం ఉత్తర ఇటలీగా ఉన్న ప్రాంతంలో అన్వేషించారు.


అలా ప్రపంచంలోనే అతిసుందరమైన నగరాల్లో ఒకదానికి క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో పునాదులు పడ్డాయి. అది కూడా అనుకోని చోట.
550 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో పెద్దగా లోతులేని సముద్ర తీర ప్రాంతం అది. అందులో సముద్రానికి కొన్ని సెం.మీ.ల ఎత్తులో ఉన్న 118 చిన్న ద్వీపాలు ఉన్నాయి.

''నిర్మించడం సాధ్యంకాని చోట ఓ నగరాన్ని నిర్మించడమంటేనే పిచ్చి. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరాల్లో ఒకదాన్ని అలాంటి చోట నిర్మించడమంటే విపరీతమైన వెర్రి అనాలేమో'' అని రష్యన్ మేధావి అలెగ్జాండర్ హెర్జెన్ 19వ శతాబ్దంలో అన్నారు.
ఆయన మాటలు నిజం. వెనిస్‌ను ఓ బురద మడుగులో కట్టారు. అక్కడ కొత్త ఇంజినీరింగ్ నైపుణ్యాలకు ఇది స్ఫూర్తినిచ్చింది.
వెనిస్ భవనాలు మనల్ని ప్రేమలో పడేస్తాయి. ఈ ద్వీపాల్లో అలాంటి అద్భుత కట్టడాలు నిలిచేలా గట్టి పునాదులు వేసేందుకు వెనిస్ నిర్మాతలు నీటి కింద అడవినే సృష్టించారు.
ప్రస్తుతం స్లొవేనియా, మోంటెనెగ్రో, క్రొయేషియా ఉన్న ప్రాంతం నుంచి వాళ్లు పెద్ద చెట్ల దుంగలను తెచ్చారు.
ఆ దుంగలు ఒక్కోటి 2 నుంచి 8 మీటర్ల పొడవు ఉన్నవి. పెన్సిల్‌లాగా ఓవైపు వాటిని నునుపుగా చేశారు. వెనిస్‌ను కట్టాలనుకున్న బురద మడుగు ప్రాంతంలో వాటిని పాతారు.

ఫొటో సోర్స్, Getty Images
దుంగలను ఒకదాని పక్కన ఒకదాన్ని పేర్చుతూపోయారు. ఇసుక, బురదను దాటుకుని మట్టి వరకూ వెళ్లేలా వాటిని పాతారు.
ఇలా పాతిన దుంగలను అడ్డంగా కోస్తూ, కృత్రిమంగా నేలను తయారుచేశారు. వాటిపై రెండు పొరలుగా చెక్క పలకలను, రాళ్లను వేసి, గట్టి నేలగా మార్చారు. భవనాలు మునిగిపోకుండా, కూలిపోకుండా ఉండేందుకు అవసరమైన ప్రాంతాన్ని సృష్టించారు.
దానిపైన పునాది గోడలు కట్టడం మొదలుపెట్టారు.
ఈ దుంగలు, చెక్క నిర్మాణాలు, కిందున్న బురదతో నేల తయారైంది సరే.
కానీ, ఆ చెక్క నిర్మాణాలు ఎందుకు దెబ్బతినలేదు?

ఫొటో సోర్స్, Getty Images
అక్కడ పాతిన వేల దుంగలన్నింటినీ నీటి మట్టం కన్నా కింద ఉండేలానే అడ్డంగా కోశారు. ఇలా వాటికి గాలి (ఆక్సీజన్) తగలకుండా చేశారు. దీంతో వాటిని పాడు చేసే బ్యాక్టీరియా, ఫంగస్, ఇతరత్రా అంశాల నుంచి వాటికి రక్షణ దొరికింది.
వీటికి తోడు ఆ బురద మడుగులో పెద్ద మొత్తంలో ఖనిజ లవణాలున్నాయి. వాటిని పీల్చుకుని దుంగలు చాలా త్వరగా గట్టిపడ్డాయి.
దీపాలను కలుపుతూ రూపొందిన ఈ ఇంజినీరింగ్ అద్భుతం ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ వెనిస్‌గా అవతరించింది.
ఎడ్రియాటిక్ సముదంపై తిరుగులేని విధంగా ఆధిపత్యం చెలాయించింది. ఫెర్టైల్ క్రెసెంట్ ప్రాంతాన్ని, యూరప్ వర్తకాన్ని నియంత్రించింది. ఎన్నో ముప్పులున్నా ఇప్పటికీ నీటిపై తేలియాడుతోంది.

ఇవి కూడా చదవండి:
- ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- అయోధ్య: వేలాది అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి
- ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
- రాయలసీమలో ‘రత్నాల’ వేట
- పంటలను నాశనం చేస్తున్న మిడతలతో ఆకలి తీర్చుకుంటున్న యుగాండా ప్రజలు
- చార్లెస్ డార్విన్కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








