CAA: విదేశీ నేతలు ఏమంటున్నారు... అక్కడి పత్రికలు ఏం రాస్తున్నాయి?

ఫొటో సోర్స్, PTI
- రచయిత, సప్తరిషి దత్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, దానిపై నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు... ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించట్లేదు.
పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన అణచివేతకు గురవుతున్న మైనార్టీలకు సులువుగా భారత పౌరసత్వం పొందే వెసులుబాటును పౌరసత్వ సవరణ చట్టం కల్పిస్తోంది. కానీ, ఇది అక్కడి హిందువులకే తప్ప ముస్లింలకు వర్తించదు.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర పట్టిక)పై కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. పౌరసత్వం కోసం మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం అనేది భారతీయతకు పట్టుకొమ్మలాంటి 'లౌకికవాదం' అనే సూత్రానికి తూట్లు పొడుస్తోందని విమర్శకులు చెబుతున్నారు.
పోలీసు చర్యలు, ఆందోళనల్లో అర్థం లేదని చెప్పేందుకు ప్రచార కార్యక్రమాలు, ఇంటర్నెట్ మూసివేత, ఆందోళనకారులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ లాంటి రకరకాల పద్ధతుల ద్వారా ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం అసమ్మతిని సహించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదనేందుకు నిదర్శనం అని విమర్శకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర దేశాలు ఏమంటున్నాయి?
భారత పొరుగు దేశమైన పాకిస్తాన్ ఈ పరిణామాలపై అసంతృప్తి వెలిబుచ్చింది. కానీ, అదేమంత ఆశ్చర్యకర విషయం కాదు.
కానీ, భారత విషయంలో సానుకూలంగా ఉండే దేశాలు కూడా ఈ పరిణామాలపై ప్రతికూలంగా మాట్లాడటమే కాస్త కలవరపెడుతోంది.
పౌరసత్వ సవరణ చట్టం ఇంకా బిల్లు రూపంలో ఉండగానే అమెరికా దానిపై ఆందోళన వ్యక్తం చేసింది. 'తప్పు దారిలో తీసుకుంటున్న ప్రమాదకర మలుపు అది' అని అంతర్జాతీయంగా మతపరమైన స్వేచ్ఛ కోసం పనిచేసే యూఎస్ కమిషన్ వ్యాఖ్యానించింది.
భారతీయ పౌరసత్వానికి ప్రభుత్వం మతపరమైన ముడులు పెడుతోందని, దానివల్ల లక్షలాది ముస్లింలు పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చాక అమెరికా హోం మంత్రి మైక్ పాంపేయో మాట్లాడుతూ, తాము భారత రాజ్యాంగానికి గౌరవం ఇస్తామని, అలాగే మైనార్టీలు, మతపరమైన హక్కులను రక్షించేందకు కూడా ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు.
భారత్‌లోని యురోపియన్ యూనియన్ అంబాసడర్ యుగో అస్టుటో మాట్లాడుతూ 'భారత రాజ్యాంగ ఉన్నత ప్రమాణాల'ను నిలబెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తాను ఆశించినట్లు చెప్పారు.

ఇంకొందరు రకరకాల మార్గాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అస్సామ్‌లో ఆందోళనలు మొదలయ్యాక జపాన్ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇది భారత్‌ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం. ''భద్రతా కారణాల దృష్ట్యా జపాన్ ప్రధాని తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకోవడం చాలా అరుదు'' అని జపనీస్ పత్రిక మైనిచి షింబన్ పేర్కొంది.
ఇక దక్షిణాసియా విషయానికొస్తే, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమెన్, హోం మంత్రి అసదుజామన్ ఖాన్ కూడా తమ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.
''సుదీర్ఘకాలంగా సహనశీల, లౌకిక దేశమనే పేరున్న భారత్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది'' అని మొమెన్ వ్యాఖ్యానించారు.
ఇక తూర్పు దేశాల వైపు వస్తే, మలేసియా ప్రధాని మహతిర్ మొహమద్ మాట్లాడుతూ, 'లౌకిక దేశమని చెప్పుకునే భారత్, కొందరు ముస్లింలకు పౌరసత్వాన్ని దూరం చేసే విధంగా చర్యలు తీసుకోవడం బాధాకరం' అన్నారు.

మీడియా ఏమంటోంది?
''20 కోట్ల మంది భారతీయ ముస్లింలు ఊహించినట్లే ఈ చట్టంలో వలసదారులకు సాయం చేయాలనే కోణం తక్కువ, మోదీ, అమిత్ షా తలపుల ప్రకారం ముస్లింలను దూరం చేసి భారత్‌ను హిందూ రాజ్యంగా మార్చాలనే కోణం ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు 130 కోట్ల భారతీయుల్లో 80 శాతం వాటా వారిదే'' అని 'ది న్యూయార్క్ టైమ్స్' పత్రిక, 'మోదీ మేక్స్ హిజ్ బిగోట్రీ ఈవెన్ క్లియరర్' (మోదీ తన మత దురభిమానాన్ని మరింత స్పష్టం చేశారు) అనే శీర్షికతో ఉన్న తన ఎడిటోరియల్ కాలమ్‌లో పేర్కొంది.
''ఇండియాస్ సిటిజన్‌షిప్ యాక్ట్ పుట్స్ సెక్యులరిజం ఎట్ రిస్క్'', (భారత పౌరసత్వ బిల్లు లౌకికవాదాన్ని ప్రమాదంలోకి నెట్టింది) అనే శీర్షికతో యూకేకు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఎడిటోరియల్ రాసింది.
''ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమనే పేరును భారత్ రక్షించుకోవాలంటే, సుదీర్ఘకాలంగా దేశంలో ఉంటున్న లక్షలాది ప్రజలను మత ప్రాతిపదికన దిగువ శ్రేణికి లేదా అంతకంటే కిందకు పడవేసే మార్గంలో వెళ్లకూడదు'' అని ఆ ఎడిటోరియల్‌లో ప్రస్తావించారు.
''భారత ప్రజాస్వామ్య విలువలపై దాడి'' అంటూ ఆ చట్టాన్ని ఉద్దేశిస్తూ ఫ్రాన్స్‌కు చెందిన లా క్రాయిక్స్ పత్రిక రాసింది.
''భారత ఉపఖండాన్ని జాతి నిర్మూలనా ప్రకోపం కమ్మేయకముందే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను మనం గుర్తించాలి'' అని మరో ఫ్రెంచ్ పత్రిక 'లిబరేషన్' రాసింది.
''20 కోట్ల ముస్లింలకు, లౌకికవాద ఆలోచనలున్న హిందువులకు, ఇతర మతస్థులకు భారత్ మరో అశుభ సందేశాన్ని పంపించింది'' అని సీఏఏను ఉద్దేశిస్తూ మిడిల్ ఈస్ట్‌కు చెందిన గల్ఫ్ న్యూస్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
భారత్‌తో స్నేహంగా ఉండే బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌లోని పత్రికలు కూడా ఇదే విధంగా స్పందించాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఎలా స్పందిస్తోంది?
భారత ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు, ఇతర విషయాలను పట్టించుకోనట్లే కనిపిస్తోంది.
''మేం వివిధ ఖండాల్లోని అనేక దేశాలతో మాట్లాడాం. మా ఆలోచనలను, దృక్కోణాన్ని వారితో పంచుకోమని వివిధ దేశాల్లో ఉన్న మా ప్రతినిధులకు సూచించాం'' అని భారత విదేశాంగ మంత్రి రవీష్ కుమార్ ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.
కానీ, ప్రపంచ దేశాల అభిప్రాయాలకంటే భారత్ తన అంతర్గత పరిస్థితులపైన ఎక్కువ దృష్టిపెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందనే దానికంటే భారత దౌత్యవేత్తలు తమ స్థానిక పాలసీలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత ఆర్థిక వృద్ధి నెమ్మదించిన ప్రస్తుత తరుణంలో, అంతర్జాతీయంగా తన ఖ్యాతి తగ్గిపోకుండా చూసుకుంటూ ప్రభుత్వం తన వివాదాస్పద పాలసీలను కాపాడుకుంటూ ముందుకెళ్లడం కాస్త కష్టమే.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ ప్రకటన: 'ఉక్రెయిన్ విమానాన్ని 'పొరపాటున' మేమే కూల్చాం'
- విశాఖపట్నంకు ఆ పేరు ఎలా వచ్చింది? వైజాగ్‌గా ఎలా మారింది? చరిత్ర ఏం చెబుతోంది?
- 'నోబెల్ శాంతి బహుమతి నాకు రావాల్సింది... ఎవరికో ఇచ్చేశారు' - డోనల్డ్ ట్రంప్
- దీపికా పడుకోన్: బాలీవుడ్‌కి ఒక రాజకీయ గళం దొరికిందా?
- 2019లో దేశ రాజకీయాలు, సమాజంపై లోతైన ప్రభావం చూపిన ప్రధాన ఘటనలు
- నిర్భయ దోషులకు డెత్ వారెంట్, జనవరి 22న ఉరిశిక్ష
- JNU విద్యార్థులపై హింసాత్మక దాడి వెనుక... వాట్సాప్ గ్రూప్స్ సీక్రెట్ చాటింగ్
- ఆ రెండు అమెరికా స్థావరాలపైనే ఇరాన్ క్షిపణి దాడులు ఎందుకు చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








