దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కీర్తి దూబే
- హోదా, బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం
జాతీయ జనాభా జాబితా (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ - ఎన్‌పీఆర్)ను నవీకరించాలని భారత ప్రభుత్వ కేబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది.
కానీ, ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ (జాతీయ పౌరసత్వ జాబితా) తెచ్చే ప్రక్రియలో ఎన్‌పీఆర్ తొలి అడుగుని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం మాత్రం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతోంది. ఎన్ఆర్‌సీకి, ఎన్‌పీఆర్‌కు మధ్య ఎలాంటి సంబంధమూ లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్‌పీఆర్ కారణంగా ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని, ఒక్క మైనార్టీ పౌరుడి పౌరసత్వం కూడా దీనివల్ల వెనక్కు తీసుకోవడం జరగదని చెప్పారు.
''ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ నియమాలు భిన్నం. ఎన్‌పీఆర్ డేటాను ఎన్ఆర్‌సీకి వినియోగించలేం. ఇది 2021-జనాభా లెక్కలతో ముడిపడిన ప్రక్రియ'' అని అమిత్ షా చెప్పారు.
2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలిసారి ఎన్‌పీఆర్‌ను రూపొందించిందని, దాన్నే తాము కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మంగళవారం ఓ పాత్రికేయ సమావేశంలో చెప్పారు.
ప్రతి పదేళ్లకూ ఎన్‌పీఆర్‌ను నవీకరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రజలు ఎలాంటి పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదని, బయోమెట్రిక్ కూడా తీసుకోవడం లేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తమ ప్రభుత్వం ఇంతవరకూ ఎన్‌ఆర్‌సీ ఊసే ఎత్తలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిల్లీలో జరిగిన ఓ సభలో వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్‌సీలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ స్పష్టతనిచ్చారు.
ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీల మధ్య సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం ఉందా అన్నదానిపై బీబీసీ పరిశోధన చేసింది.
అన్ని రాష్ట్రాలూ 2020, ఏప్రిల్ 1 నుంచి 2020, సెప్టెంబర్ 30 వరకూ ఎన్‌పీఆర్ ప్రక్రియ చేపట్టాలని ఈ ఏడాది జులై 31న కేంద్ర హోంశాఖ గెజిట్ జారీ చేసింది.
2010లో తొలిసారి ఎన్‌పీఆర్‌ను రూపొందించారు. దీన్ని 2015లో నవీకరించారు. కానీ, ఎన్‌పీఆర్ 2003లో కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉనికిలోకి వచ్చింది.
వాజ్‌పేయి ప్రభుత్వం పౌరసత్వ చట్టం-1955కు సవరణ చేస్తూ, అందులో 'అక్రమ వలసదారు' అనే తరగతిని జోడించింది.
ఎన్‌పీఆర్‌పై ఆధారపడి ఎన్‌ఆర్‌ఐసీ (జాతీయ భారతీయ పౌర జాబితా) ఉంటుందని 2003, డిసెంబర్ 10న కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొంది.

ఫొటో సోర్స్, censusindia.gov.in
''జాతీయ భారత పౌర జాబితా కోసం దేశవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి సమాచారాన్ని సేకరించే ప్రక్రియ కేంద్రం మొదలుపెట్టొచ్చు. ఇందుకోసం రిజిస్టార్ జనరల్ ఆఫ్ సిటిజెన్ రిజిస్ట్రేషన్ ఓ అధికారిక గెజిట్ జారీ చేస్తారు. జనాభా జాబితాలో ఉన్న ప్రతి కుటుంబమూ, ప్రతి వ్యక్తికీ సంబంధించిన సమాచారాన్ని స్థానిక రిజిస్టార్ తనిఖీ చేస్తారు. పౌరసత్వ విషయంలో ఏవైనా సందేహాలు వస్తే, ఎన్ఆర్ఐసీలో దాన్ని సూచించే గుర్తును పెడతారు. తదుపరి విచారణ, తనిఖీ ప్రక్రియలు పూర్తైన వెంటనే ఆ అనుమానిత వ్యక్తికి సమాచారం ఇస్తారు'' అని చట్టంలోని నాలుగో నియమంలో పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐసీని రూపొందించడం ద్వారా ఎన్‌ఆర్‌పీకి అర్థవంతమైన ముగింపు ఇవ్వాలని 2014, జూన్ 18న అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, PIB/ TWITTER
''దేశంలో పౌరులైనా, కాకపోయినా అందరి సమాచారం ఎన్‌పీఆర్‌లో ఉంటుంది. ఎన్ఐఆర్‌సీ దిశగా ఇది తొలి అడుగు. ఇందులో ప్రతి వ్యక్తీ పౌరసత్వాన్ని తనిఖీ చేస్తారు'' అని కేంద్ర హోం మంత్రి కిరెన్ రిజుజు 2014, నవంబర్ 26న రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మోదీ ప్రభుత్వం తమ మొదటి దఫా పాలనలో ఎన్‌పీఆర్‌పై ఆధారపడే దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ ఉంటుందని పార్లమెంటులో కనీసం తొమ్మిది సార్లు చెప్పింది.

ఫొటో సోర్స్, PIB INDIA
ఈ ప్రకటలన్నీ తాజాగా ప్రభుత్వం చెబుతున్నదానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇంతకుముందు ఎన్‌పీఆర్‌ను ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనూ ఎన్ఆర్ఐసీతోనే దాన్ని ముడిపెట్టారు.
ఎన్‌పీఆర్ కోసం పేరు, పుట్టినతేదీ, లింగం, తల్లిదండ్రుల పేర్లు, జన్మస్థలం లాంటి సమాచారాన్ని అడుగుతున్నారు. జనాభా లెక్కల్లోనూ ఇవే అడుగుతుంటారు.
కానీ, పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌పీఆర్ ప్రశ్నావళిని బీబీసీ పరిశీలించినప్పుడు, అందులో 'తల్లి జన్మించిన స్థలం' కాలమ్ కూడా కనిపించింది.
దీంతో ప్రభుత్వ ప్రకటనలు, ఉద్దేశాల మధ్య తేడా ఉన్నట్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశం గురించి పశ్చిమ బెంగాల్‌లోని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ సంస్థ సభ్యుడు రంజీత్ సుర్‌తో బీబీసీ మాట్లాడింది.

''కేంద్ర హోం మంత్రి దేశ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారు. 2003 పౌరసత్వ (సవరణ) చట్టంలో ఎన్ఆర్‌సీలో ఎన్‌పీఆర్ మొదటి ప్రకియ అని స్పష్టంగా ఉంది. నిజానికి, జనాభా లెక్కల సమాచారాన్ని ప్రభుత్వం కేవలం ప్రజా విధానాల కోసమే ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడు, దేశవ్యాప్తంగా నిర్వహించే 'ఎన్ఆర్‌సీ'కి ఎన్‌పీఆర్ కింద సేకరించిన సమాచారాన్నే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్‌పీఆర్ రెండు దేశల్లో జరుగుతుంది. మీరే సమాచారం ఇవ్వండని, తమకు ఏ రుజువులూ అక్కర్లేదని ప్రభుత్వం అంటోంది. కానీ, ఆ తర్వాత ఈ సమాచారాన్ని తనిఖీ చేసేందుకు పత్రాలు అడుగుతుంది'' అని ఆయన అన్నారు.
2010లో యూపీఏ ప్రభుత్వం తొలిసారి ఎన్‌పీఆర్ చేపట్టినప్పుడు అభ్యంతరాలు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు.. ''అప్పుడు ఎన్ఆర్‌సీ గురించి జనాల్లో పూర్తి స్థాయి అవగాహన లేదు. అస్సాంలో ఎన్ఆర్‌సీ చూశాక, జనాలకు ఇది పూర్తిగా అర్థమవుతోంది. 2015లో మోదీ ప్రభుత్వం దీన్ని డిజిటలైజ్ చేసింది. ప్రస్తుతం అస్సాంలో ఎన్ఆర్‌సీలో 19 లక్షల మంది చోటుదక్కనివారున్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో వాతావరణం మారిపోయింది. అందుకే జనాలు అప్రమత్తమై ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారు'' అని రంజీత్ సమాధానం ఇచ్చారు.
యూపీఏ సర్కారు చేపట్టిన ఎన్‌పీఆర్‌కు, మోదీ ప్రభుత్వ ఎన్‌పీఆర్‌కు చాలా తేడా ఉందని, రెండింటి స్వరూపం పూర్తిగా వేరని కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేంద్ర ఉద్దేశాలను ప్రశ్నిస్తూ.. పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్‌పీఆర్ ప్రక్రియలను ఆపివేశాయి.
కేంద్ర హోంమంత్రి ఏమంటున్నారు..
''ఈ అంశంపై మరోసారి ఆలోచించాలని ఆ రెండు రాష్ట్రాల (కేరళ, పశ్చిమ బెంగాల్) ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నా. కేరళ, పశ్చిమ బెంగాల్‌ల్లోని పేదల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమం ఇది. రాజకీయాల కోసం పేదలను అభివృద్ధికి దూరం చేయొద్దు'' అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
''ఎన్‌పీఆర్ జనాభా జాబితా. దేశంలో నివాసం ఉండే అందరి పేర్లనూ ఇందులో నమోదు చేస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వాలు పథకాలు రూపొందిస్తాయి. పౌరసత్వ నిరూపణకు పత్రాలు అడిగేది ఎన్‌ఆర్‌సీలో. దానికి, దీనికి అసలు సంబంధం లేదు. ఒకదానికొకటి ఏమీ ఉపయోగపడవు కూడా'' అని అన్నారు.
''2015లో ప్రయోగాత్మక స్థాయిలో దీన్ని నవీకరించారు. పదేళ్లకోసారి చేసే ప్రక్రియ ఇది. ఈ మధ్యలో జనాభాలో చాలా మార్పులు వస్తుంటాయి. జనాభా లెక్కలు కూడా పదేళ్లకోసారే జరుగుతాయి. 2010లో యూపీఏ ఇదే (ఎన్‌పీఆర్) చేపడితే, ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. ప్రభుత్వం ఒక ఉచిత యాప్ తెస్తోంది. ఇందులో ప్రజలు స్వయంగా తమ సమాచారం ఇవ్వొచ్చు. ఇది స్వీయప్రకటితం. ఎలాంటి పత్రాలూ అవసరం లేదు'' అని అమిత్ షా అన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ గురించి కేంద్రం ఇంకా ప్రకటన చేయలేదు.
కానీ, ప్రస్తుతం ఉన్న నియమనిబంధనల ప్రకారం.. దేశవ్యాప్త ఎన్ఆర్‌సీకి ఎన్‌పీఆర్ డేటానే వినియోగించాలి. ఒకవేళ ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వేరుచేసేలా ప్రభుత్వం నిబంధనలను మార్చితే, పరిస్థితి మారుతుంది.
అంతవరకూ ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వేర్వేరు అంశాలుగా చూడలేం.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- జోర్డాన్, ఈజిప్టులకు మా కుక్కలను ఇక పంపించం: అమెరికా ప్రకటన
- అస్సాం డిటెన్షన్ కేంద్రాలు: నరేంద్ర మోదీ చెప్పింది నిజమా.. కాదా..
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- అయిదు మైళ్ల అవతల పొరుగు దేశంలో ఉన్న భార్యను కలవాలని పన్నెండేళ్లు తపించాడు.. చివరకు నదిలో కొట్టుకొచ్చిన ఆమె శవాన్ని చూశాడు
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
- CAA: నిరసనకారుల రాళ్ల దాడి నుంచి పోలీసులను కాపాడిన ముస్లిం మహిళ
- కన్సోల్ యుద్ధాలు.. ట్రంప్ కష్టాలు.. సూపర్ హీరోల సినిమాలు.. 2020 ఎలా ఉండబోతోంది
- పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకమన్న మలేసియా ప్రధాని.. తప్పుపట్టిన సొంత దేశం నేతలు
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- CAA: కాన్పూర్ నిరసనల్లో ఇద్దరి మరణానికి ముందు ఏం జరిగింది - గ్రౌండ్ రిపోర్ట్
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








